భారతీయ యువ ప్రతినిధి బృందానికి చైనా యాత్ర
పది మంది యువకుల బృందమొకటి ఒక వారం పాటు చైనా డాక్టర్ కోట్నిస్ కుటుంబ సభ్యుడు అభిషేక్ నాద్ కర్ణి నాయత్వంలో లో సౌహార్ద్ర యాత్ర జరిపింది.
-డాక్టర్. యస్. జతిన్ కుమార్
వేలాది సంవత్సరాలుగా అత్యంత స్నేహపూర్వక మైన ఇరుగుపొరుగు సంబంధాలు కలిగి వున్న భారత్ చైనాల మధ్య ఇటీవల సంబంధాలు దిగువ స్థాయికి చేరుకున్నాయి . గతంలో కూడా 1962 లో జరిగిన సరిహద్దు వివాదం తరువాత దౌత్య సంబంధా లు తెగి పోయాయి కాని 1976 నుండి ఈ సంబందాలు పునరుద్దరించబడ్డాయి. అవి క్రమంగా ఉచ్చ స్థితిని చేరుకున్నాయి. అనేక రంగాలలో స్నేహం విస్తరించింది. ఇరు దేశాల మధ్య 100 నుంచి 130 బిలియన్ డాలర్ల విలువ గల వాణిజ్య వ్యాపార సంబంధాలు నెలకొన్నాయి. ఈ స్థితిలో వివిధ కారణాలకు తోడు వాస్తవాధీన రేఖ వద్ద వివాదాలతో, జూన్ లో జరిగిన గల్వాన్ సంఘర్షణతో 2020 నుండి సంబందాలు దిగ జారటం ఆరంభమయ్యింది. అక్టోబర్ 2022 లో అప్పటి చైనా రాయబారి సన్ వి డాంగ్- తన పదవీ కాలం పూర్తవటంతో బీజింగ్ కు తిరిగి వెళ్లిపోయారు. ఆ తరువాత 18 నెలల కాలం చైనారాయబారి నియామకం జరగ లేదు.
అయితే ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. మిలిటరీ అధికారుల మధ్య దాదాపు 21 పర్యాయాలు చర్చలు జరిగాయి, ఉన్నత స్థాయి అధికారులు, రాజకీయ నాయకుల చర్చలు జరుగుతూనే వున్నాయి. సహకార యంత్రాంగాల కృషి కొనసాగుతున్నది. ఇదంతా ఇద్దరి మధ్య ఉద్రిక్తతలు తగ్గటానికి, సరిహద్దులలో మిలిటరీ మోహరింపును తగ్గించటానికి, ఉపసంహరించటానికి తోడ్పడ్డాయి. భారత చైనా కలిసి వ్యవహరిస్తే మొత్తం ప్రపంచ ఆభిప్రాయాన్ని ప్రభావితం చేయగలమని,ఆధిపత్య శక్తులకు, వారి ఆర్ధిక దోపిడికి వ్యతిరేకంగా అభివృద్ది చెందుతున్న దేశాల గొంతు గట్టిగా వినిపించవచ్చని చైనా అభిప్రాయ పడుతున్నది.
అయితే సరిహద్దు ల వద్ద సామరస్యం నెలకొననిదే ఇరు దేశాల మధ్య సాధారణ సంబంధాలు సాధ్యం కాదని మన పాలకులు అంటున్నారు. రాజకీయంగా “బాయ్ కాట్ చైనా” నినాదం దేశంలో వ్యాపింప జేస్తూనే- నేటి ప్రపంచీకరణ మార్కెట్ విస్తరణ ప్రభావం వల్ల, తప్పనిసరి పరిస్థితులలో చైనాతో వ్యాపారం మాత్రం కొనసాగిస్తున్నది. ప్రస్తుతం ఒక్క వ్యాపార వాణిజ్య రానగం లో తప్ప మరే ఇతర రంగం లోను ఇద్దరి మధ్య అంత సయోధ్య లేదు. వ్యాపార బృందాలు తప్ప ఇతరుల పర్యాటకం దాదాపు ఆగిపోయి వుంది. ఈ వాతావరణంలో కొత్తగా నియమితులైన చైనా రాయబారి జు ఫీహోంగ్ ఈనెల 10 వ తేదీన ఢిల్లీకి చేరుకున్నారు.
ఈ పరిస్థితులలో డిల్లీలోని చైనా రాయబార కార్యాలయం సహకారంతో బీజింగ్ లోని “విదేశాలతో మైత్రి ని నిర్వహించే చైనా ప్రజల సంస్థ" [సీపీఎఎఫ్ఎఫ్ సి ] ఆహ్వానంతో పది మంది సభ్యుల యువ బృందం ఒకటి చైనా లో సుహృద్భావ పర్యటనకు వెళ్ళింది. ఆ బృందం లో భారత చైనా మిత్రమండలి సభ్యులు ఇద్దరు పాల్గొన్నారు. భారత చైనా మైత్రికి అత్యున్నత ప్రతీక, జపాన్ పై చైనా చేసిన ప్రతిఘటనా యుద్దంలో తన ప్రాణాలు అర్పించిన భారతీయ డాక్టర్ ద్వారకానాద్ కోట్నిస్ స్మృతిని చైనీయులు ఎంతగానో గౌరవిస్తారు. ఆ స్నేహ స్పూర్తిని గుర్తు చేస్తూ ప్రస్తుత బృందం డా. కోట్నిస్ పనిచేసిన హీబై ప్రొవిషన్సును, ఆయన స్మారక వైద్యశాలను, బీజింగ్ నగరం, ఎలక్ట్రానిక్ పరికరాలు, చిప్స్ తయారీలో ప్రపంచ ఖ్యాతి పొందిన చెంగ్డు నగరం , సిచు వాన్ విశ్వవిద్యాలయం, ఆధునిక పరిశోధనా సంస్థలు , తదితర ప్రాంతాలను 7-5-2024 నుండి 15-5-2024 వరకు సం దర్శించి తిరిగి వచ్చింది. అక్కడి ఆర్ధిక అభివృద్దికి, అద్ధునిక వికాసానికి ఏయనతో ఆశ్చర్య పోయింది. ఈ బృందానికి డాక్టర్ కోట్నిస్ కుటుంబ సభ్యుడు అభిషేక్ నాద్కర్ణి ని నాయకునిగా నియమించటం లోనే డా.కోట్నిస్ పట్ల వారి గౌరవాదరాలు ప్రస్ఫుటమవు తున్నాయని వారు అన్నారు.
మే 9, 2024 న, చైనీస్ పీపుల్స్ అసోసియేషన్ ఫర్ ఫ్రెండ్షిప్ విత్ ఫారిన్ కంట్రీస్ ఉపాధ్యక్షుడు జియాంగ్ జియాంగ్ మా ప్రతినిధి బృండానికి స్వాగతం చెబుతూ “చైనా , భారతదేశం- రెండూ ప్రధానంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు. తమ ఆర్థిక వ్యవస్థను విస్తరించడానికి, ప్రజల జీవనోపాధిని మెరుగు పరచడానికి కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నాయని, అందువల్ల ఇరు దేశాల మధ్య మంచి సంబంధాలు నెలకొన వలసిన అవసరం వుందని చెప్పినట్లు బృందం సభ్యులు పేర్కొన్నారు.
“చైనా భారతదేశాలు బలమైన సంబంధాలను కొనసాగించడం రెండు దేశాల ప్రజల మౌలిక ప్రయోజనాలకు ఉపయోగ పడు తుంది. అది ప్రాంతీయ స్థాయిలోనూ, ప్రపంచ స్థాయి లోను శాంతి, అభివృద్ధి సాధించడానికి అనుకూలంగా ఉంటుంది. "చైనా, భారతదేశాలు ఒకదానికొకటి అభివృద్ధి పంథాలో తోడ్పడగలవు. మనం ఒకరికొకరు పోటీ కాదు, పరస్పరం సహాయ కారులుగా వుండాలి. చైనా-భారతదేశ సంబంధాల బలమైన, స్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహించడానికి ఇరు పక్షాలు కలిసి పనిచేయాలి.“ అని కూడా ఆయన అన్నారు.
భారత యువ బృందం నాయకుడునడకర్ణి సిపిఎఎఫ్ఎఫ్సి ఆహ్వానానికి కృతజ్ఞతలు తెలిపారు. చైనాలో పర్యటించే అవకాశం లభించినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. “భారత చైనాల మధ్య సుదీర్ఘ కాలంగా సాంస్కృతిక బృందాల మార్పిడి, పర్యాటకుల రాకపోకల చరిత్ర వుందని , ఇది రెండు పురాతన నాగరికతలు మిళిత మవుతూ సాగిన ప్రయాణమని”ఆయన అభివర్ణించారు. డాక్టర్ ద్వారకానాథ్ కొట్నీస్ స్ఫూర్తిని వారసత్వంగా పొంది , దానిని ముందుకు తీసుకెళ్లడానికి, రెండు దేశాల ప్రజల మధ్య స్నేహాన్ని పెంపొందించడానికి సిద్ధంగా ఉన్నాము.” అని ఆయన పేర్కొన్నారు.
మన దేశం ప్రస్తుతం కొత్త కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్నుకునే దశలో వుంది. పాలక పార్టీలు దేశ అంతర్గత, అంతర్జాతీయ వ్యవహారాలలో తమ వైఖరిని మేనిఫెస్టోలుగాను, ఎన్నికల ప్రసంగాలలోనూ ప్రకటిస్తున్నారు. మన పాలక పార్టీలు ఇప్పటివరకు చైనా వ్యతిరేకతను బాగా పెంచి పోషించాయి. మనమే ఒక సూపర్ పవర్ అని చెప్పుకుంటూనే మరోపక్క చైనాను చుట్టుముట్టి దాని అభివృద్దిని దెబ్బ తీసే అమెరికా వ్యూహంలో భాగంగా మన ప్రభుత్వం పనిచేస్తున్నది. కాంగ్రెస్ లాటి ప్రతిపక్షాలు 2000 చదరపు కిలోమీటర్ల భారత భూమిని చైనా కబ్జా చేస్తుంటే మోడీ ప్రభుత్వం చూస్తూ కూర్చుందని ఆరోపిస్తున్నారు. చైనాకు ఎంత వ్యతిరేకంగా మాట్లాడితే అంత దేశభక్తుడు అన్న భ్రమ ను కల్పించారు.
మరో పక్క భారత ప్రధాని నరేంద్ర మోడీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, "మన సరిహద్దుల్లో నెలకున్న దీర్ఘకాలిక ఇబ్బందికర పరిస్థితిని మనం అత్యవసరంగా పరిష్కరించాల్సిన అవసరం ఉంది, తద్వారా మన ద్వైపాక్షిక సంభాషణలలో అసాధారణ పరిస్థితుల నుంచి బయట పడవచ్చు. భారత్, చైనాల మధ్య సుస్థిర, శాంతియుత సంబంధాలు రెండు దేశాలకే కాకుండా యావత్ ప్రాంతానికి, ప్రపంచానికి ముఖ్యమని” [ న్యూస్ వీక్ -ఏప్రియల్] పేర్కొన్నారు. ప్రజలు ఈ విషయాలను లోతుగా పరిశీలించాలి.
“మా బృందానికి ఎల్లెడలా ఆదరం, గౌరవం అక్కడి అధికారుల పూర్తి సహకారం లభించాయి. ఇండియా నుంచి వచ్చామనగానే సాధారణ పౌరులుకూడా ఎంతో స్నేహంగా, సంతోషంగా పలకరించారు. ఎక్కడ మన పట్ల తక్కువ చూపు కానీ, శతృ భావన కానీ కనపడలేదు. సానుకూల వైఖరితో, చైనా ప్రోత్సాహంతో జరుగుతున్న ఇలాటి రాకపోకలు, సదవగాహన సందర్శనలకు మనదేశం కూడా సానుకూలంగా ప్రతిస్పందించితే, అవి తిరిగి సత్సంబంధా లను నెలకొల్పటంలో తోడ్పడతాయి.” అని ఈ పర్యటనలో పాల్గొన్న భారత చైనా మిత్రమండలి సభ్యులు చెబుతున్నారు.
“భారతదేశంలోని అన్ని వర్గాల స్నేహితులను కలుసుకుంటానని, పరస్పర అవగాహనను, నమ్మకాన్ని నిజాయితీగా పెంపొందిస్తానని, వివిధ రంగాలలో మార్పిడి, సహకారాన్ని పునరుద్ధరించడానికి ప్రయత్నాలు చేస్తానని, చైనా-భారత్ సంబంధాల ఆరోగ్యకరమైన, స్థిరమైన అభివృద్ధికి అనుకూలమైన పరిస్థితులను సృష్టిస్తానని బాధ్యతలు స్వీకరించిన తరువాత చైనా కొత్త రాయబారి మీడియాకు చెప్పారు.
విభేదాలు కొనసాగుతున్నప్పటికీ, ఘర్షణలను నివారించడానికి ప్రయత్నాలు జరగాలి. ముఖ్యంగా రాబోయే ప్రభుత్వం సంయమనంతో వివేకంతో, ఆధిపత్య వాదుల ప్రపంచ వ్యూహాల నుండి బయటపడి, అభివృద్ది చెందుతు న్న గ్లోబల్ సౌత్ దేశాలతో కలిసి నడవటం, విదేశీ దోపిడి కి తావు లేని స్వాతంత్ర్య ఆర్ధిక వ్యవస్థను నెలకొల్పుకోవటం ఇరుగుపొరుగు దేశాలను, చిన్న దేశాలను కూడ తనతో సమాన స్థాయిలో ఆదరిస్తూ, వారి సార్వభౌమ అధికారాలను గౌరవిస్తూ, సత్సంబంధాలను ఏర్పరచు కోవటం అవసరం. అతి పెద్ద ఆర్ధిక శక్తిగా ఎదిగిన పొరుగు దేశం చైనాతో శతృత్వ వైఖరి వీడి సహకార పంథాను అనుసరించడం మన జాతీయ ప్రయోజనాల దృష్ట్యా నేటి చారిత్రక అవసరం.