
అదిగదిగో మొహమ్మద్ బిన్ అబ్దుల్లా మసీదు!
అట్టడుగున పడి కాన్పించని కధలన్నీ కావాలిప్పుడు! ఇవన్నీ దాచేస్తే దాగని సత్యాలే..అంటారు మహాకవి శ్రీ.శ్రీ. ఆ కనిపించని సత్యమేమిటంటే..
మహాకవి శ్రీ.శ్రీ. చెప్పినట్టు అట్టడుగున పడి కాన్పించని కధలన్నీ కావాలిప్పుడు! ఇవన్నీ దాచేస్తే దాగని సత్యాలే. అయోధ్యపై సుప్రీంకోర్టు తీర్పు ఏమి చెప్పిందో చాలా మంది మర్చిపోయుంటారు. హిందూ దేశం గనుక అందరి మనసుల్లో అయోధ్య అంటే రామమందిరమే గుర్తుంది. కూలిన బాబ్రీ మసీదు నామరూపాలు లేకుండా పోయింది. ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని ఆకర్షిస్తున్నది అద్భుత రామ మందిరమే. జనవరి 22న జరుగనున్న రామమందిరం ప్రారంభోత్సవమే.. అయితే అనూహ్యంగా ఇప్పుడు అయోధ్య మరో అద్భుత కళాఖండానికి వేదిక కాబోతోంది. అదే మొహమ్మద్ బిన్ అబ్దుల్లా మసీదు.
అయోధ్య.. మరో అద్భుతానికి వేదిక కానుంది. కళ్లు మిరిమిట్లు గొలిపే రీతిలో మసీదు నిర్మాణానికి ప్రణాళికలు తయారవుతున్నాయి. ఇండో ఇస్లామిక్ సంప్రదాయ రీతిలో నిర్మించే కసరత్ జరుగుతోంది. ఇండో-ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ ట్రస్టు.. మసీదు నిర్మాణానికి సంబంధించిన ఏర్పాట్లను చూసుకుంటోంది. తాజ్‌మహల్ కన్నా అద్భుతంగా ఈ మసీదును తీర్చిదిద్దాలని భావిస్తోంది. దీనికి మొహమ్మద్ బిన్ అబ్దుల్లా మసీదుగా నామకరణం చేశారు. అయోధ్య వివాద కేసుకు సంబంధించిన తీర్పును అనుసరించి భారతదేశ సుప్రీంకోర్టు నిర్దేశించిన స్థలంలో ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య జిల్లాలోని ధన్నిపూర్‌లో మహమ్మద్ బిన్ అబ్దుల్లా మసీదు లేదా అయోధ్య మసీదు నిర్మిస్తున్నారు
అయోధ్యకు 25కిలోమీటర్ల దూరంలో...
సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు అయోధ్య నగరానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధన్నీపూర్‌లో మసీదు నిర్మాణానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం స్థలాన్ని కేటాయించింది. మసీదు నిర్మాణానికి 'మక్కా మసీదు' ప్రధాన ఇమామ్ శంకుస్థాపన చేయనున్నారు. భారత్‌లోనే అతిపెద్ద ఖురాన్ పుస్తకాన్ని ఈ మసీదులో ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పుస్తకం 21 అడుగుల ఎత్తు, 36 అడుగుల వెడల్పు ఉంటుంది.
ఐదు మినార్లతో నిర్మాణం...
ఈ మసీదులో ఐదు మినార్లు నిర్మించనున్నారు. ఇదే మసీదులో ఆసుపత్రి, కమ్యూనిటీ కిచెన్, లైబ్రరీ, రీసెర్చ్ సెంటర్‌ను నిర్మించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొత్తం 4 వేల 500 చదరపు మీటర్లలో ఈ మసీదు నిర్మాణం జరగనుంది. ఇక, ఈ మసీదు కనుక నిర్మితమైతే భారతదేశంలోనే అతిపెద్ద మసీదుగా రికార్డులకెక్కనుంది.
డిజైన్ చేసిందెవరంటే...
జామియా ఇస్లామియా యూనివర్సిటీ డీన్ అఖ్తర్ ఈ మసీదు డిజైన్ రూపొందించారు. అయితే ఈ డిజైన్‌లో తాజాగా మార్పులు చేశారు. కర్బన ఉద్గారాలు లేకుండా మసీదు నిర్మాణం చేపడుతామని, ఈ నిర్మాణాన్ని పుణేకు చెందిన ఆర్కిటెక్చర్ ఇమ్రాన్ షేక్ ఆధ్వర్యంలో చేపడుతున్నారు.