ఇంట్లో మనిషి పోయాక..!
x

ఇంట్లో మనిషి పోయాక..!

నేటి మేటి కవిత


ఇంట్లో మనిషి పోయాక మిగిలిన వాళ్ళు

జీవితాన్ని అన్ని మూలలకి

కొంచెం,కొంచెం సర్దుకుంటారు!

పోయిన వాళ్ల ఖరీదైన వస్తువులు, గదులు

కొట్లాడి పంచుకుంటారు.

మరీ పాడైన వాటికి మనిషికి

అంటించినట్లే నిప్పంటించి కాల్చి పడేస్తారు.

పోయిన మనిషి జ్ఞాపకాలను కూడా

మనసు మూలల్లోకి నెట్టేస్తుంటారు.

*

ఇంటికి కూడా అమ్మ నాన్నలైన వాళ్ళు

చనిపోయినప్పుడు ఇల్లు కూడా

తలుచుకుని, తలుచుకుని ఏడుస్తుంది.

కానీ మిగిలిన ఆ మనుషులకి మాత్రం

పోయిన వాళ్ళు ఎప్పటికైనా

వదిలించుకోవాల్సిన వాళ్ళే!

**

మనిషి చనిపోయాక వియోగాన్ని

ఎక్కువగా అనుభవించని మనుషులు

దుఃఖాన్నిఅంటించుకోకుండా

గురుతుల్ని కూడా వదిలించుకుంటారు.

పోయిన మనిషిని ఆరడుగుల జాగాలో సర్ది,

వాళ్ళు ఐదు వందల గజాల ఇల్లు కోసం

ప్రాణాలు పోయేదాకా కొట్టుకుంటూ ఉంటారు!

**

వాళ్ళంతే,గతాన్ని మనుషులతో సహా సమాధి చేసి,

చేతులు దులుపుకుంటూ శ్మశానాల్ని

నిశ్చింతగా వదిలి వెళుతుంటారు!

చనిపోయింది వాళ్ళు కాదు కదా అనుకుంటారు.

కానీ వాళ్ళు మనుషులుగా

చనిపోయిన సంగతి వాళ్ళకి తెలీదు!

*

అమ్మ చనిపోయిన కుక్కి మంచమో,

విరిగిన నాన్న వాలు కుర్చీ నో,

అప్పటిదాకా వార్తలు చదివే ఏకాంబరాన్ని,

బినాకా గీత్ మాలాని,

అన్నదాత కబుర్లని వినిపించిన

రంగు వెలిసిన రేడియోనో,

ముసలి చేతులకి ఊతమిచ్చిన చేతి కర్రనో,

ఏదో ఒకటి, ఇక ముసలైపోయిన

మనుషుల్లా పనికి రాదనుకుని,

వాళ్ళు వాడేసిన, వాళ్ళని ఆదుకున్న

వస్తువులనన్నింటినీ ఇంటి ముందు

చలి మంటల్లో కాల్చేస్తారు

లేదా చెత్తలో పడేస్తారు.

*

తాతయ్య,నాయనమ్మల చేతుల్లో

ఒదిగిన భగవద్గీత,ఖురాను,

బైబిల్ కూడా అటకెక్కి చెదలు పట్టి పోతాయి.

ఇంటిల్లిపాదికీ స్నానం చేయించిన

ఇత్తడి నీళ్ళ బోషాణం, అన్నం గిన్నెలు

పాత సామానుల దుకాణంలో

కాసులై జేబులో సర్దుకుంటాయి.

అమ్మ మెడలో ఇంటి దీపంలా

మెరిసిన నాను తాడు మూడు ముక్కలై

ముగ్గురి కోడళ్ల బీరువాలో

వజ్రపు నగలై జీవం కోల్పోతాయి.

*

తన దేహపు జీవశక్తితో పెంచిన పంట భూమి,

కట్టిన ఇల్లూ నాన్న హృదయంలా

విరిగి,వారసుల సొత్తు గా విడిపోతాయి

*

కానీ కొందరుంటారు!

ఋతువు, ఋతువులోనూ మొలకెత్తే

కొత్త చిగుళ్ళ లాంటి వాళ్ళు! కొడుకులో,

కూతుళ్లో,మనవరాలో మనవల్లో,

బతికున్నప్పుడు ప్రేమతో పెనవేసుకున్న వాళ్ళని

మరువలేక మమకారపు వెక్కిళ్లు పెడుతూ ఉంటారు.

జ్ఞాపకాల సందూకుని తెరుస్తూ,మూస్తూ

హృదయాన్ని కన్నీటి చిత్తడి చేసుకుంటూ ఉంటారు.

వాళ్ళు కూడా కడసారి వీడ్కోలు చెప్పి

ఇల్లు సర్దుకుంటారు. కానీ,

అమ్మ కట్టిన పాత పెళ్లి చీరనో,

అమ్మ మొఖం చూసుకున్న అద్దాన్నో,

నాన్న తొక్కిన పాత సైకిల్ నో,

చిన్నప్పుడు తామే అర్థాలు వెతుక్కున్న,

నాన్న కొనిచ్చిన బ్రౌన్ డిక్షనరీ నో,

అమ్మమ్మ చేతి వేళ్ళ మధ్య ఊయలలూగిన

జపమాలనో, తాతయ్య విరిగిన దళసరి కళ్ళద్దాలనో,

అలా వెళ్ళి పోయిన వాళ్ల వస్తువులని,

ఎంతో ప్రియంగా దేహంలో గుండెలా దాచుకుంటారు!

మరువలేని వాళ్ళ మాటలతో,

పాటలతో,కథలతో,

గోడల మీద వాళ్ల పూర్వీకుల చిత్రపటాలతో,

ఇల్లంతటినీ రాలిన శిశిరపు ఆకుల్లా

ప్రియంగా అలంకరించుకుంటారు.

వాళ్ల హృదయాల్లో మరణించిన వాళ్లు

పెంచిన తోటలుంటాయో ఏమో మరి?

మనసులో అలా

పరిమళాల పూలని పూయించుకుంటారు.

నవ్వుతున్న అమ్మ నాన్నల పటాల ముందు

దీపాలు వెలిగించుకుని

ఇంటిని కాంతితో నింపుకుంటూ ఉంటారు.

*

మనుష్యులమని మీరు అనుకుంటారు కానీ,

అందరూ మనుషులుగా ఎక్కడ మిగిలారనీ?

ముక్కలు ముక్కలై పోయి

విడి విడిగా దిక్కులన్నింటా

తమను తామే విసిరేసుకున్నారు.

మీరంతా అమానవులుగా,

అమానుషంగా రూపాంతరం చెందిన

వికృతమైన హృదయ రహిత జన్యువులు!

*

మనుషులు దొరక్కే కదా

కన్న వాళ్ళంత తొందరగా కడ తేరిపోయేది?

అందుకే హృదయం దాకా రాలేని

మనుషులు శ్మశానం దాకా మాత్రం నడిచొస్తారు.

చివరి కట్టే కాలేదాకా కూడా

ఓపిక పట్టని మనుషులు

మధ్యలోనే శవాన్ని కూడా

ఒంటరిగా వదిలేసి వెళ్లిపోతారు.

అందుకే వాళ్ళు మనుషులుగా మిగలని వాళ్ళు!

తమ కోసం కూడా ఒక రోజు శ్మశానం

ఎదురు చూస్తుందన్న సంగతి మరిచిన వాళ్ళు!

అమానవీయులు వాళ్ళు!

Read More
Next Story