పరాటా భారతీయ వంట కాదా..!
x

పరాటా భారతీయ వంట కాదా..!

పరాటా.. దక్షిణా భారతదేశంలో పుట్టిందా? ఉత్తరాదిలోనా? అసలు భారతదేశంలోనే పుట్టిందా? వ్యాపారస్తుల ద్వారా విదేశాల నుంచి వచ్చిందా?


శంకర్ దాబా.. చాలా రద్దీగా ఉంది. ఎక్కడ చూసినా టేబుల్స్ ఫుల్‌గా ఉండటమే కాదు.. వాళ్లు లేస్తే తాము కూర్చుందామని వెనకాలే వేచి చూస్తున్నవారూ ఉన్నారు. అప్పుడే బుల్లెట్ బైక్‌ వేసుకుని దాబాలోకి ఎంట్రీ ఇచ్చారు.. మణికంఠ, సతీష్. ఇద్దరూ చాలా మంచి ఫ్రెండ్స్. వీరిద్దరూ ఫుడీసే. వీరిని చూడగానే దాబాలోని వెయిటర్ వచ్చి.. డైలీ కస్టమర్స్ కావడంతో లోపలికి వెళ్లమన్నాడు. వెయిటర్ చెప్పినట్లే మణి, సతీష్ ఇద్దరూ లోపలికి వెళ్లి కూర్చుని.. తమకు చాలా ఇష్టమైన పరాటా ఆర్డర్ చేశారు. వీళ్లు చెప్పిన రెండు నిమిషాల్లో వెయిటర్ వేడివేడి పరోటాపై ఇంకా పొగలుకక్కుతున్న షార్వాను పోసి అలా తీసుకొచ్చి వారి ముందు పెట్టాడు. అసలికే ఫేవరెట్ ఫుడ్, అందులోనూ వేడివేడిగా ఉండటంతో మణి, సతీష్ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా పరోటాల పనిపట్టడంలో నిమగ్నమయ్యారు. తింటుండగా సతీష్‌కు ఒక సందేహం వచ్చింది. అసలు పరోటా ఎక్కడిది? అనేదే ఆ ప్రశ్న. ఈ విషయంలో వీరిద్దరి మధ్య చిన్నపాటి వాగ్వాదం మొదలైంది. సతీష్ ఏమో.. ఇది పక్కాగా ఉత్తరభారతదేశం వంటకం అని అన్నాడు. మణికంఠ ఏమో కాదు.. ఇది కచ్చితంగా ఇతర దేశాల నుంచి వచ్చిందే అయి ఉంటుందని తన అభిప్రాయం చెప్పాడు.

వాగ్వాదం ఎందుకనుకున్నారో ఏమో కానీ తమకు తెలిసిన విషయాలను పంచుకోవడం స్టార్ట్ చేశారు సతీష్, మణికంఠ. ముందుగా సతీష్ చెప్తూ.. పరోటా అనేది మైదాతో తయారు చేస్తారు. అది భారతదేశ ఉపఖండంలోని ప్రస్తుతం పంజాబ్‌లో విరివిగా అందుబాటులో ఉంటుంది. దక్షిణాది రాష్ట్రాల్లో పంటలు విస్తృతంగా పండేవి కాబట్టి వీళ్లు మైదాతో వంటకాలు తయారు చేయడంపై కంటే కూరగాయలు, మాంసం వంటి వాటితో కొత్త రుచులను సృష్టించడంపైనే ఆసక్తి చూపారు. అంతేకాకుండా 1968లో నిజ్జర్ రాసిన ‘పంజాబ్ అండర్ ద సుల్తాన్ 1000-1526ఏడీ’ పుస్తకంలో కూడా పరోటాల ప్రస్తావన ఉంది. ఆ పుస్తకం ప్రకారం పరోటాలు రాచరికం, ధనికుల్లో సాధారణమైన ఆహారంగా ఉండేదని చెప్పబడింది. అదే విధంగా 2010లో విడుదలైన ఒక నివేదిక కూడా పరోటా అనేవి పంజాబ్, ఉత్తర భారత్‌దేశం వంటల విధానంలో భాగంగానే ఉండేదని చెప్పబడింది. భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా చూసుకున్న మైదా పిండితో కొత్త వంటకాలు తయారు చేయాల్సిన అవసరం దక్షిణ భారతీయులకు అంతగా లేదు. అంతేకాకుండా పరోటాల గురించి 12వ శతాబ్దంలోని సంస్కృత స్క్రిప్ట్స్‌లో కూడా వీటి ప్రస్తావన ఉంది. పరోటా అన్న పేరు కూడా సంస్కృతం నుంచి వచ్చిందే. పర అంటే పొరలు, ఆటా అంటే పిండి. ఈ రెండు పదాలు కూడా ఆనాటు ఆర్యులుగా ఉన్న నార్త్ ఇండియన్స్ నుంచి వచ్చిన పదాలు. కాబట్టి పరాటాలు కచ్చితంగా నార్త్ ఇండియావే. ఇక్కడ పంటలు విరివిగా పండేవి. ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లేవి. విదేశాలతో కూడా కూరగాయలు, సుగంధ ద్రవ్యాలను వర్తకం చేసేవారు. కాబట్టి పరోటా అనేది ముమ్మాటికీ నార్త్ ఇండియా వంటకమే అని సతీష్ గట్టిగా చెప్పాడు.

వెంటనే అందుకున్న మణికంఠ ఏమాత్రం వెనకడుగు వేయలేదు. విదేశాల నుంచి వర్తకం కోసం వచ్చిన ఆసియా, అరబ్ వ్యాపారుల నుంచి ఈ వంటకాన్ని కేరళ వారు నేర్చుకున్నారని చెప్పాడు. పురావస్తు శాస్త్రవేత్త, పాకశాస్త్రవేత్త కురుష్ ఎఫ్ దలాల్ చెప్పిన విషయాలను గుర్తు చేశాడు మణికంఠ. కురుష్ ప్రకారం.. పురాతన పశ్చిమ ఆసియా, అరబ్ వ్యాపారులతో మలబార్‌కు పరోటా వచ్చి ఉంటుంది. ‘కేరళ వారు.. పూర్వకాలం నుండే ఇస్లామ్ దేశాలతో పాటు పలు ఇతర దేశాలతో కూడా వాణిజ్య సంబంధాలు కలిగి ఉన్నారు. కాబట్టి అలా వచ్చిన వ్యాపారుల దగ్గర నుంచే పరోటా రెసిబీని కేరళ వారు గుర్తించారు. ఆ తర్వాత అది మలబార్ వంటకాల్లో ఒకటిగా నిలిచి ఉండాలి’ చెప్పారని మణి వివరించాడు. అంతేకాకుండా ముస్లిం వ్యాపారులు, ప్రస్తుత శ్రీలంక నుంచి అప్పట్లో వలసలు వచ్చిన కార్మికులు ఈ పరోటాలకు ఆగ్నేయాసియాలో ప్రజాదరణను వ్యాప్తి చేశారని కూడా పలువరు పాకశాస్త్రవేత్తలు చెప్తుంటారు. బ్రిటీష్ ఇండియా నుంచి వచ్చిన కార్మికులు ఈ బ్రెడ్‌ను కరేబియన్‌కు పరిచయం చేశారు. వారు దానిని ‘‘బస్ అప్ షట్ రోటీ’ అని పిలిచేవారు. అంటే బాగా కాల్చిన తర్వాత ‘బస్ట్ అప్ షర్ట్’ లాగా కనిపించేలా పరోటాలను కొట్టడాన్ని సూచిస్తుంది. అదే విధంగా శ్రీలంకలోని తమిళ జనాభా ఎక్కువగా ఉన్న జాఫ్నా ప్రాంతంలో పుట్టింనది పాకశాస్త్రవేత్తలు చెప్తున్నారు. అక్కడి నుంచే ఇండియాలోని టుటికోరిన్ ఓడరేవులో పనిచేసే వలస కార్మికుల ద్వారా పరోటా వంటకం తమిళనాడులోకి వచ్చిందని, తమిళనాడులో ఇది మరింత చిన్న రొట్టెలుగా పాపులర్ అయిందని చెప్తారు అని మణి తన సైడ్ వాదనను వినిపించారు. దీంతో సతీష్, మణి వాగ్వాదం మళ్ళీ మొదలుకొచ్చింది.

వీరి వాగ్వాదం అంతా వింటున్న వెయిటర్ శశాంక్.. కలుగ జేసుకుని ఇద్దరికీ సర్ది చెప్పాడు. అంతేకాకుండా మీరు ఇద్దరూ చెప్పిందాంట్లో తప్పు లేదని అన్నాడు. దాంతో సతీష్, మణికంఠ.. శశాంక్‌ వెళ్లి చూసి నువ్వు చెప్పేది ఏంటి అని అడిగారు. అప్పుడు శశాంక్ మాట్లాడుతూ.. పరోటా అనేది ఒక రకం కాదు. అనేక రకాలుగా ఉంది. ఇది ఒక్కొక్క చోట ఒక్కోలా ఉండేది. చాలా ప్రాంతాల్లో ‘లేయర్‌డ్ ఫ్లాట్ బ్రెడ్’ అంటారు. కానీ ఇప్పుడు మనం చేసే చపాతీలు కూడా పొరపొరలుగా వస్తుంటాయి. అదే విధంగా శ్రీలంక వలసదారుల ద్వారా తమిళనాడుకు వచ్చిన వంటకం కానీ, వ్యాపారుల నుంచి కేరళకు వచ్చిన వంటకం కానీ, పంజాబ్‌లో పుట్టిన పరోటా కానీ అన్నీ కూడా పరోటానే.. కాకపోతే వేరువేరు వేరియేషన్స్ అంతే. పంజాబ్‌లో వండిన పరోటాలు.. కూరగాయల ముక్కలు, బంగాళదుంప మసాలా వాడి చేసేవారు. అదే విధంగా కేరళలో తయారు చేసిన పరోటాలు తొలుత స్వీట్‌గా తయారయ్యాయని, ఆ తర్వాత కాలక్రమేణా అవి కూరతో తినే ఆహారంగా మారాయని కూడా వినికిడి ఉంది. పరోటా ఎక్కడ పుట్టింది అనడానికి సరైన ఆధారాలు ఏమీ లేవు. బ్రెడ్ ఎక్కడ పుట్టింది అంటే ఏం చెప్తారు. పశ్చిమ దేశాలు అన్నీ బ్రెడ్‌ను తింటాయి. ప్రతి దేశం కూడా తానంతట తానే రకరకాల బ్రెడ్‌లు తయారు చేసుకుంది. పరోటా కూడా అంతే. ప్రతి ప్రాంతం వారు తమకు రుచికి అనుగుణంగా మైదాతో పొరపొరలు వచ్చే వంటకాన్ని సిద్ధం చేసుకున్నారు. అదే పరోటాగా ప్రసిద్ది చెందింది. అని చెప్పాడు. శశాంక్ మాటలతో వాగ్వాదం వల్ల లాభం లేదనుకున్న మణికంఠ, సతీష్ మరోసారి తమ ప్లేట్‌లో ఉన్న పరోటాలపైకి దృష్టి మళ్లించారు.

Read More
Next Story