ఇండియా నుంచి లండన్ కి బస్ సర్వీసు ఉందా! ఉంటే దాని రూటెటు?
ఇండియా టు లండన్ బస్ సర్వీసు ఉందా, ఉంటే అదెటు వెళ్లేది? ఎంత ఖర్చు అయ్యేది? ఏమేమీ సౌకర్యాలు ఉండేవీ.. ఈప్రశ్నలకుసమాధానమే ఈ ఆర్టికల్..
ఇండియా నుంచి ఇంగ్లండ్‌కు వెళ్లేందుకు ఆకాశ మార్గం, సముద్ర యానం తెలుసు గాని రోడ్డు మార్గం ఉండేదా? కోల్‌కతా నుంచి నేరుగా లండన్ వెళ్లేందుకు బస్సు ఉండేదా? అవును, నిజమే మన దేశం నుంచి బ్రిటన్ రాజధానికి బస్సులు నడిచేవి. ఈ రూట్ ను హిప్పీ రూట్ అనే వారు. సుమారు పది వేల మైళ్లు ఈ బస్సులో పోయి వచ్చేవారని తెలిసినపుడు కాస్తంత ఆశ్చర్యం అనిపించినా అది నిజంగా నిజం.
లండన్ నుంచి కలకత్తా (కోల్‌కతా)కి ఈ బస్సు సర్వీసు నడిచేది. ప్రపంచంలోనే అతి పొడవైన బస్సు రూట్ అది. మనకు స్వాతంత్య్రం వచ్చిన పదేళ్ల తర్వాత అంటే 1957లో ప్రారంభమైంది. అల్బర్ట్ ట్రావెల్స్ ఈ బస్సులను నడిపేది.
బస్సు ఎలా వెళుతుందంటే...
బ్రిటన్ నుంచి మొదట వలస వచ్చిన వారు ఎక్కువ మంది కోల్‌కతా చేరేవారు. అందువల్లే ఈస్టిండియా కంపెనీకి కోల్‌కతా ఓ వ్యాపారకేంద్రంగానే కాక వాళ్ల తొలి రాజధానిగా కూడా ఉండేది. అందుకే అక్కడ ఇంగ్లీష్ వాళ్లు ఎక్కువగా ఉండేవాళ్లు. దాంతో ఈ అల్బర్ట్ ట్రావెల్స్ వాళ్లు బస్సులు నడిపారు. కోల్‌కతా నుంచి బయలుదేరే ఈ బస్సు పశ్చిమ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, యూగోస్వియా, టర్కీ, ఇరాన్ ఇరాన్, బెల్జియం, యూరప్ మీదుగా లండన్ వెళ్లేది. భారతదేశంలోకి ప్రవేశించిన తరువాత న్యూఢిల్లీ, ఆగ్రా, అలహాబాద్, బెనారస్ అంటే కాశీ మీదుగా కోల్‌కతా చేరుకునేది.
ఎంతకాలం పడుతుందంటే...
బస్సు లండన్ నుంచి కలకత్తా చేరుకోవడానికి దాదాపు 50 రోజులు పట్టేది. ఈ రెండు నగరాల మధ్య దూరం దాదాపు 10 వేల మైళ్లు. కిలోమీటర్లలో చెప్పాలంటే (16,100 కిమీ. అంటే ఒక్కసారి పోయి రావాలంటే దాదాపు 20వేల 300 మైళ్లు (32,669 కిమీ). ఈ బస్ సర్వీసు 1976 వరకు ఉండేది.
ఎంతఖర్చంటే...
ట్రిప్ వన్–వే ఖర్చు 1957లో 85 పౌండ్లు. అంటే ఇప్పటి మన రూపాయల లెక్కలో చెప్పాలంటే దగ్గరదగ్గర 9 వేల రూపాయలు. 1973 వచ్చేనాటికి వన్ వే ట్రిప్ కోసం సుమారు 145 పౌండ్లు ఖర్చు పెట్టాల్సివచ్చేది. చిత్రమేమిటంటే ఈ మొత్తంలోనే ఆహారం, ప్రయాణం, వసతి ఉండేవి. ఆల్బర్ట్ ట్రావెల్ బస్సు తొలి ప్రయాణం 1957 ఏప్రిల్ 15న లండన్ నుంచి బయలుదేరింది. 50 రోజుల తర్వాత జూన్ 5న కలకత్తా చేరుకుంది. ఇంగ్లాండ్ నుంచి బెల్జియం, అక్కడి నుండి పశ్చిమ జర్మనీ, ఆస్ట్రియా, యుగోస్లేవియా, బల్గేరియా, టర్కీ, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, వాయువ్య భారతదేశం మీదుగా ఇండియా చేరింది. దేశంలోకి వచ్చిన న్యూఢిల్లీ, ఆగ్రా, అలహాబాద్, బనారస్ మీదుగా కలకత్తా చేరుకుంది.
ఏమేమి సౌకర్యాలు ఉండేవంటే...
ఈ బస్సులో చదువుకునేందుకు పుస్తకాలు, ప్రయాణికులందరికీ ప్రత్యేక స్లీపింగ్ బంక్‌లు, ఫ్యాన్లు, హీటర్లు, వంటగది ఉండేది. బస్సు పైన డెక్‌లో కూర్చుని పరిసరాలను చూసే లాంజ్ కూడా ఉండేది. ఈ జర్నీ అంతా కేవలం ట్రిప్‌గా కంటే ఓటూర్‌లా ఎంజాయ్ చేసేలా సాగేది. బస్సులోపల రేడియో, మ్యూజిక్ సిస్టమ్‌ను కూడా అమర్చారు. కాశీని చూపించడంతో పాటు ఆగ్రాకు తీసుకువచ్చి తాజ్ మహల్‌తో సహా దేశంలోని పర్యాటక ప్రదేశాలలో గడపడానికి టైం ఇచ్చేవారు. టెహ్రాన్, సాల్జ్‌బర్గ్, కాబూల్, ఇస్తాంబుల్, వియన్నాలో షాపింగ్ చేసుకునేందుకు అనుమతి ఉండేది.
హిప్పీ రూట్‌గా ప్రసిద్ధి...
హిప్పీ మార్గంగా ప్రసిద్ధి చెందిన ఈ రూట్‌లో బస్సులు 1976 వరకు తిరిగాయి. 1976 తర్వాత ఈ బస్‌లకు ఆదరణ తగ్గడం, ట్రావెల్స్ వారికి కూడా ఆసక్తి లేకపోవడంతో బస్సు సర్వీసులు ఆగిపోయాయి. తొలిసారి తిరిగిన బస్సును బ్రిటిష్ యాత్రికుడు ఆండీ స్టీవర్ట్ కొనుగోలు చేశారు. ఇప్పుడా బస్ పురావస్తు ప్రదర్శనలో ఉందంటారు.
ఎందుకు ఆగిపోయిందంటే...
ఇరాన్‌లో రాజకీయ విప్లవం మొదలైంది. పాకిస్తాన్ ఇండియా మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో 1976లో బస్సు సర్వీసు నిలిచిపోయింది. ఆల్బర్ట్ టూర్స్ వాళ్లు కోల్‌కతా లండన్ మధ్య వయా సిడ్నీ వరకు దాదాపు 15 ట్రిప్పులను నడిపారు. ఆ తర్వాత అది శాశ్వతంగా మూతపడింది.
ఇప్పుడు పంజాబ్ నుంచి ఓ ప్రైవేటు ఇండియన్ సంస్థ బస్సులు నడపాలని చూస్తోంది గాని అది హిప్పీ రూట్ లో కాకుండా సిల్క్ రూట్‌లో నడిపేలా అనుమతులు తీసుకుంది. అయితే దీని ఖరీదు దాదాపు 18 నుంచి 20 లక్షల రూపాయల మధ్య ఉంది. ఏడాది ముందుగా బుక్ చేసుకోవాలి. లండన్ ఎపిక్ జర్నీ పేరిట బస్ సర్వీసును 2020లో ప్రారంభించింది. ఈ జర్నీ 70 రోజులు. ఇండియా నుంచి లండన్ వరకు ఈ బస్ వెళుతుంది. 18 దేశాల మీదుగా సాగుతుంది. 20 వేల కిలోమీటర్లు, ఏప్రిల్ 2021లో షెడ్యూల్ అయింది. అయితే కోవిడ్–19 ఈ జర్నీని దెబ్బతీసింది.
Next Story