తాజ్ మహల్ కు అంతటి అందం ఎక్కడి నుంచి వచ్చింది?
x
తాజ్ మహల్

తాజ్ మహల్ కు అంతటి అందం ఎక్కడి నుంచి వచ్చింది?

నన్ను పీల్చి పిప్పి చేశావు కదా జహాపనా..! తాజ్ సమాధి నుంచి ముంతాజ్!


జహాపనా.. అంటూ ముంతాజ్ బేగం తన సమాధి నుంచి గొంతెత్తి అరుస్తోంది. ‘‘పద్నాలుగు మందిని కని చచ్చేవరకు నన్ను పీల్చి పిప్పి చేశావు కదరా ’’ అంటూ ఆమె ఆత్మ క్షోభిస్తోంది. నీ వీరత్వం చాటున ఎంత రక్తాన్ని ఏరులుగా పారించావో ! పన్నుల సొమ్ము ఎంత కొల్ల గొట్టావో షాజహాన్ అంటూ తాజ్ మహల్ చుట్టూ ఉన్న నాలుగు మినార్లు చేతులెత్తి అరుస్తున్నాయి.

తాజ్ మహల్ అనితర సాధ్యమైన అత్యద్భుత నిర్మాణం. ముంతాజ్ బేగం పై షాజహాన్ కున్న ప్రేమకు చిహ్నం. ఏ కళా కౌశలమూ దీనికి సాటి రాదు. మొగల్ చక్రవర్తి లో మూర్తీభవించిన కళాభిమానానికి నిలువెత్తు నిదర్శనం. ఇది రాజసౌధానికే కిరీటం ఈ సమాధి.. వాస్తవమే. కాదనగలమా!?

అసలు తాజ్ మహల్ కట్టిందెవ్వరు!? దీనికి రాళ్ళెత్తిన కూలీలెవ్వరు? పాలరాళ్ళను ఇంత అందంగా చెక్కడానికి కొట్టిన సుత్తి దెబ్బలతో, ఆ పనిమంతుల చేతులు ఎంతగా నలిగిపోయాయో? ఈ మహాద్భుత వాస్తు శైలికి రూప శిల్పి ఎవరు? ఈ నిర్మాణం కోసం రైతులపై పడి, వారిని దోచి, పన్నుల రూపంలో ఎంత సొమ్ము బలవంతంగా వసూలు చేశారో కదా! ఈ నిర్మాణ సమయంలో చక్రవర్తి ఆగ్రహానికి గురై ఎందరు మరణించారో కదా! దీని కోసం ఎన్ని దండయాత్రలు చేసి ఎంత రక్తాన్ని రక్తం పారించారో కదా! షాజహాన్ కోసం పద్నాలు మంది పిల్లల్ని కన్న ముంతాజ్ బేగం అసలు ఎందుకు మరణించింది? ఈ అత్యద్భుత కట్టడం వెనుక చరిత్ర పుటల్లో చరిత్ర కారులు చెక్కని ఎన్ని విషాదాలో! ఈ విషాదాలకు సాక్ష్యంగా ప్రవహిస్తున్న యమునా నది మౌనంగా రోదిస్తోంది.

ఒక్క సారైనా తాజ్ మహల్ ను చూడాలన్నది నా చిరకాల వాంఛ. మా ఢిల్లీ పర్యటన అనగానే కళ్ళ ముందు తాజ్ మహలే కదలాడింది. ఆగ్రా రైల్వే స్టేషన్ లో (మార్చి30) శనివారం దిగి, హోటల్ లో స్నానపానాదులు ముగించుకోగానే, మా కారు తాజ్ వైపు పరుగులు తీసింది. కారు డ్రైవర్ మాకు దారి దీపమయ్యాడు. నాతో పాటు వాకాప్రసాద్, పరమేశ్వరరావు, హరీష్ ల చూపులన్నీ అతి పురాతనమైన చారిత్రక నగరం ఆగ్రా పైనే నిలిచాయి.

తాజ్ మహల్ సింహద్వారం

తాజ్ మహల్ చుట్టూ ఎత్తైన కోటగోడ. మూడు వైపులా సింహ ద్వారాలు. ఎత్తైన సింహ ద్వారమే ఎంతో అందంగా ఉంది. పైన అర్ధ చంద్రాకారంగా ఉంది. గుమ్మటం లోపల, దాని పైన ఎన్ని అందమైన నగిషీలో! సింహ ద్వారమే ఇంత అందంగా ఉంటే, దూరంగా కనిపిస్తున్న తాజ్ ఇంకెంత అందంగా ఉండాలో! పై నుంచి కాపాలా కాసేందుకేమో, సింహ ద్వారానికి ఇరు వైపులా బురుజులు!

సింహద్వారం లోప ల గుమ్మ టాని కి చెక్కిన నగిషిలు

మూడు వైపులా ద్వారాలు. వెనుక ప్రపహిస్తున్న యమునా నది. నలభై రెండెకరాల మధ్యలో ఒంటరిగా నిలబడిన 240 అగుల ఎత్తైన తాజ్ మహల్. దాని ముందు పొడవాటి కొలనులో నిత్యం నీటిని ఎగజిమ్ముతున్న అందమైన ఫౌంటెన్ లు. చుట్టూ పరుచుకున్న పచ్చిక బయలు. వారాంతం కావడంతో పెద్ద ఎత్తున వస్తున్న పర్యాటకులు. ఎండకు తళతళా మెరిసిపోతున్న ఆ పాల రాతి నిర్మాణాన్ని సమీపిస్తున్న కొద్దీ, పరికిస్తూ రెప్ప వాల్చని మా చూపులు. సింహ ద్వారం దాటాక తాజ్ మహల్ గుమ్మటం కొసను పట్టుకుంటున్నట్టు వాకా ప్రసాద్ చాలా తమాషాగా మమ్మల్నందరినీ ఒక్కో ఫొటో తీశారు

తాజ్ మహల్ గుమ్మటం చివర న పట్టుకున్నట్లు లేదు!?

తాజ్ దరి చేరాం. అక్కడే అమ్ముతున్న ప్లాస్టిక్ కవర్లను బూట్లకు తొడుక్కుని, తాజ్ మహల్ లోకి ఎడమ వైపు నుంచి ప్రవేశించాం. మొత్తం పాలరాతితో నిర్మించారు. గోడలపై నగిషీలకు కూడా పాలరాతిని పలకల కింద కచ్చితమైన సైజులో కోసి, ఆయా చోట్ల ఇరికించడంతో ఏర్పడిన డిజైన్లు. ఒక పక్క ఎండ మాడ్చేస్తోంది. మరొక పక్క అందంగా తాజ్ తళతళా మెరుస్తోంది. దాని దరి చేరుతున్న కొద్దీ అణవణువూ చూడాలన్న కూతూహలం.

నలుగురం కలిసే నడుస్తున్నాం. నలుగురం కలిసే దాని అందాలను వీక్షిస్తున్నాం. అందాల గురించిన అనుభూతులను పరస్పరం పంచుకుటున్నాం. నలుగురం ఫొటోలు తీస్తున్నాం. తాజ్ అందాలను చూస్తే ఎవరు ఎక్కడ తప్పిపోతారోనని గమనించుకుంటూనే ఉన్నాం. పరమేశ్వర రావు అడుగడుగునా సెల్ఫీలు తీసుకుంటూ ఆగిపోతున్నారు.

తాజ్ మహల్ ముందు భాగంలో నగిషిలు

తాజ్ మహల్ ముందు భాగం లో నిలుచున్నాం. దీని నిర్మాణంలో ఎంత ప్రతిభా కౌశలం! గోడలంతా పాల రాళ్ళే, నేలంతా పాలరాళ్ళే. హిందూ, ముస్లీం, పర్షియన్ వాస్తు శైలిలో చెక్కిన నగిషీలు. లోపలా పాల రాళ్ళు, బయటా పాలరాళ్ళు. ఆకాశాన్ని అందిపుచ్చుకోవాలన్నట్టు, నాలుగు వైపులా నాలుగు ఎత్తైన మినార్లు. వాటికీ పాలరాళ్ళే. తాజ్ ను కాపాడడం కోసం నలువైపులా ఉన్న ఎత్తైన తెల్లని అంగరక్షకుల్లా మినార్లు. తాజ్ వెనుక యమునా నది మౌనంగా ప్రవహిస్తోంది.

తాజ్ మహల్ మీనార్ వెనుక మౌనంగా ప్రవహిస్తున్న యమునా నది

తాజ్ చుట్టూ కలియతిరిగి లోనికి ప్రవేశించాం. లోపల ఫొటోలు తీయడం నిషిద్ధం. పర్యాటకులు ప్రవాహంలా వచ్చిపడుతున్నారు. ఆ ఒత్తిడిలోనే దాని అందాలను వీక్షిస్తున్నాం. లోపల ఎన్ని నగిషీలు చెక్కారో! దాని అందాలను చూడడానికి రెండు కళ్ళు చాలడం లేదు. మధ్యలో ముంతాజ్ సమాధి. అసలు సమాధి నేల మాళిగలో ఉందట! అక్కడికి ప్రవేశించనీయడం లేదు.

తాజ్ మహల్ ముందు భాగంలో చెక్కిన నగిషిలు

ఇంత అందమైన తాజ్ మహల్ వెనుక అసలు విషాదమేమిటి? మొగల్ సామ్రాజ్య నాల్గవ చక్రవర్తి జహంగీర్ 1627లో మరణించాడు. మొగల్ సామ్రాజ్యానికి అయిదవ చక్రవర్తిగా షాజహాన్(ఖుర్రం రాకుమారుడు) అధికారం చేపట్టాడు. జహంగీర్ భార్య నూర్జహాన్ సోదరుడి కుమార్తె అర్జు మండే బానును రెండవ భార్యగా షాజహాన్ వివాహం చేసుకున్నాడు. పెళ్ళి అయ్యాక ముంతాజ్ బేగంగా ఆమె పేరు మారింది.

మొగల్ పీఠం దక్కించుకున్న తరువాత ఆగ్రా బయలు దేరిన షాజహాన్, అక్కడికి చేరే లోపలే సోదరుడు సహా, తన అధికారానికి పోటీగా వచ్చే వారి కుటుంబాలలోని మగవాళ్ళనందరినీ చంపించేశాడు. మధ్య యుగాల్లో రాజ్యాధికారం కోసం సోదరులనే కాదు, ఎవరినైనా నిర్దాక్షిణ్యంగా చంపే ఆనవాయితీకి షాజహాన్ జీవితమే ఒక సాక్ష్యం.

ఏ కోణం నుంచి చూసినా తాజ్ మహల్ అందంగా నే కనిపిస్తుంది.

మధ్య యుగాల పాలకుల దండయాత్రల్లో యుద్ధ కౌశలాలు, రక్త దాహాలు, రాజ్యాధికారాలు! వారు నిర్మించిన శత్రు దుర్బేధ్య కోటలు, రాజసౌధాలు, సంగీత సాహిత్య కళా పోషణ అంతా చరిత్రలో కీర్తి కోసమే! రాజ్యాధికారం కోసం నిర్దాక్షిణంగా చంపేస్తారు. స్త్రీలు, పిల్లలు, వృద్ధులు అన్న తేడా లేదు. ధరాధిపతులంతా నరహంతకులు, రక్త పిపాసులు. చరిత్రలో వారికి కీర్తి కిరీటాలు.

ముంతాజ్ బేగంకు ఎనిమిది మంది మగపిల్లలు, ఆరుగురు ఆడపిల్లలు. మొత్తం పద్నాలుగు మందికి జన్మనిచ్చింది. చివరి ఆడ శిశువు గౌహరి బేగంకు జన్మనిచ్చాక, పోస్ట్ పార్టమ్ హెమరేజ్ తో మరణించింది. శిశువుకు జన్మనిచ్చాక అధిక రక్త స్రావం జరిగి, రక్తపోటు ఎక్కువయ్యి, గుండె వేగంగా కొట్టుకుని, చూపు కనిపించక, చలి చంపేసి, తల తిరుగుతూ, మత్తుగా, బలహీనంగా మూర్చపోతున్నట్టనిపించి, ప్రాణాలు ఒదిలేసింది ముంతాజ్ బేగం.

తాజ్ మహల్ లా షాజహాన్ దృష్టిలో ముంతాజ్ బేగం కూడా ఒక అందమైన పాలరాతి బొమ్మ. ఎంత అందంగా ఉంటే మాత్రం పద్నాలుగు మంది పిల్లలకు జన్మనిచ్చేవరకు ఆమెను పీల్చి పిప్పి చేయాలా!? ముంతాజ్ బేగం మరణించాక, ఆమె కోసం అందమైన తాజ్ మహల్ కట్టిం చాడు. చచ్చిపోయాక తాజ్ మహల్ కట్టి ఏం లాభం! ఆగ్రా కోట నుంచే రోజూ తాజ్ మహల్ ను చూస్తూ గడిపేశాడు.

పర్షియా, భారత్, ఇస్లాం వాస్తు శైలిలో తాజ్ మహల్ నిర్మించడానికి పజ్జెనిమిదేళ్ళు పట్టింది. దాని చుట్టూ నిర్మించిన కోటగోడలతో పాటు మూడు మహాద్వారాలను నిర్మించడానికి, లోపల ఉన్న ఇతర నిర్మాణాలను పూర్తి చేయడానికి మరో ఐదేళ్ళు పట్టింది. అంటే తాజ్ మొత్తం నిర్మాణం పూర్తి చేయడానికి ఇరవై రెండేళ్ళు పట్టింది.

ఇంత కాలంపాటు ఇంత మంది పనివారిని, శిల్పులను, కళాకారులను, రక్షణగా ఉండే సైన్యాన్ని, జీతాలిచ్చి పోషించడానికి ఎంత వ్యయమైంది? ఎక్కడెక్కడి నుంచో పాల రాళ్ళను తరలించడానికి ఎంత ఖర్చయింది? ఈ డబ్బంతా రైతుల నుంచి, వస్త్రాలను నేసే చేనేత కార్మికుల నుంచి, ఇతర చేతి వృత్తుల వారి నుంచి పన్నుల రూపంలో వసూలు చేసిందే కదా!

తాజ్ మహల్ ఇక శెలవా మరి

ముంతాజ్ బేగం చేసిన నేరం ఏమిటి? అందంగా ఉండడమేనా ఆమె చేసిన నేరమా? చక్రవర్తి షాజహాన్ దృష్టిలో పడడమే నేరమా? షాజహాన్ మాత్రం ఏం బావుకున్నాడు. ఔరంగా జేబు తన తండ్రి షాజహాన్ ను ఆగ్రా కోటలో 1658లో బంధించి, యావజ్జీవ కారాగార శిక్ష విధించాడు. షాజహాన్ 1666లో తన 74వ ఏట కారాగారంలోనే మృతి చెందాడు.

పద్నాలుగో సంతానానికి జన్మనిచ్చి మృతి చెందిన ముంతాజ్ బేగం ఆత్మ తన సమాధి తాజ్ మహల్ లోంచి గొంతెత్తి అరుస్తున్నట్టుంది. నాలుగు మినార్ల చేతులెత్తి తాజ్ మహల్ కూడా అరుస్తున్నట్టే ఉంది; పన్నులేసి ఎంత కొల్ల గొట్టావని ఎంత మందిని బలితీసుకున్నావని. అంతులేని విషాదంగా మిగిలిపోయిన అందమైన నిర్మాణం తాజ్ మహల్ నీకిక వీడ్కోలు.

Read More
Next Story