ఈ రోజు మిరాబాల్ సిస్టర్స్ ఎందుకు గుర్తుకొస్తారు, అసలు వాళ్లెవరు?
నవంబర్ 25 'అంతర్జాతీయ స్త్రీ హింసా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఈ వ్యాసం.
నవంబర్ 25, 1960...
ముగ్గురు అక్కాచెల్లెళ్ళు కారులో భర్తలను కలవడానికి బయలుదేరారు...
కాసేపట్లో వాళ్ళను కలుస్తామన్న సంతోషంతో ఉన్నారు...
కానీ డ్రైవర్ తో సహా వారు చనిపోయారు!
తర్వాతి రోజు ఓ పత్రిక కారు ప్రమాదంలో వారు మరణించారని రాసింది.
కానీ అది నిజమా?
కాదని,వారి చావు ఒక త్యాగమని...
ఆ దేశపు రక్తపు చారికలను తుడిచే శక్తి దానికి ఉందని... ఆ దేశ ప్రజలకు తెలుసు!
ఆ దేశం ఏది? చీకటి నీడలు పరుచుకున్నప్పుడు ఆ ముగ్గురు అక్కాచెల్లెళ్లు కాంతి రేఖల్లా ఎలా మెరిసారు?
వారి త్యాగానికి గుర్తుగా 'అంతర్జాతీయ స్త్రీ హింసా వ్యతిరేక దినోత్సవం ' ఎందుకు జరుపుకుంటున్నాం?
ఒక ఇంటరెస్టింగ్ స్టోరీ మీ కోసం...
నియంత నీడల్లో :
డోమినికన్ రిపబ్లిక్ (Dominical Republic) ఉత్తర అమెరికా ఖండంలో ఉన్న సొంత ప్రభుత్వం ఉన్న దేశం. అప్పటికే 30 ఏళ్లుగా రాఫిల్ ట్రూజిల్లో (Rafael Trujillo) అనే నియంత అరాచకత్వంలో మగ్గిపోతున్న దేశం అది. దేశ సంపదను దోచుకుంటూ, ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలిపోతున్న పట్టించుకోని దుర్మార్గ పాలన అది.
30 ఏళ్ళ బానిసత్వం ఆ ప్రజల్లో విప్లవ సెగలు రగిలించింది. రహస్యంగా అందరూ ఏకమై ఆ నియంత పాలనను అంతం చేయడానికి అనేక మార్గాలు ఆలోచిస్తున్నారు. ఎదురుతిరిగిన వాళ్ళని బెదిరించి, లొంగకపోతే హింసించి చంపి శత్రువులు లేకుండా చేస్తున్నాడు ట్రూజిల్లో (కింది ఫోటో).
ఈ క్రూర పాలనలో ఓ సాదా సీదా కుటుంబంలో పుట్టారు పాట్రియా, మినర్వా, మారియా, డిడే మిరాబెల్. వీరిని మిరాబాల్ సిస్టర్స్(Mirabal Sisters) అనేవారు. తల్లిదండ్రులు వ్యవసాయం చేసేవారు. దానితో పాటు వారికి ఒక కాఫీ మిల్లు కూడా ఉంది. దేశంలో జరుగుతున్న అన్యాయాల గురించి వారికి తెలుసు. కానీ ఎలా ఎదిరించాలో తెలియదు! ఈ నలుగురు చెల్లెలలో డిడోకి ఈ విషయం పట్ల ఆసక్తి లేదు.
మినర్వా లా చదువుకుంటూ ఉంది. ట్రూజిల్లో పాలన గురించి నిజాలు ఆమెకు ఆ చదువు వల్ల ఇంకా బాగా తెలుస్తూ ఉన్నాయి. ఆ చదువే ఆమెను ఆ నియంతకు ఎదురెళ్ళేలా చేసింది.
1930 లోనే ట్రూజిల్లో 30,000 మంది హైతిషియన్లను ఊచకోత కోశాడు. తర్వాత కూడా ఇంకా ఎన్నో వేల మందిని చంపాడు. ఆడ, మగ సంబంధం లేకుండా అందరూ ఈ నియంత అంతం కోసమే ఎదురు చూస్తున్నారు. దాని కోసం ఏం చేయడానికైనా వెనుకాడని ధైర్యం ఉంది వారిలో. అప్పటికే ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాల్లో చురుగ్గా ఉంది మినర్వా. 1949 నానాటికి ఆమెను అనుమానంతో అరెస్ట్ చేశారు. ట్రూజిల్లో దుర్మార్గుడే కాదు, స్త్రీలను లైంగికంగా వేధించేవాడు కూడా. మినర్వా ఆ ఖైదు నుండి బయటకు వచ్చింది. అతను ఎంతటి కామాంధుడో గట్టిగా చెప్పింది.తన పట్ల అతని ప్రవర్తనను ఎండగట్టింది!
1955 లో తన సహాధ్యాయిని పెళ్ళి చేసుకుంది. భర్తతో సహా ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమంలో చేరింది. పాట్రియా, మేరియా కూడా భర్తలతో సహా దీనిలో సభ్యులయ్యారు.
అవకాశం కోసం ట్రూజిల్లో ఎదురుచూస్తున్న రోజుల్లో....
1960 మొదటి రోజులు అవి. ట్రూజిల్లోకి వ్యతిరేకంగా ఉద్యమాలు జరుగుతున్నాయి. దానికి ఈ మిరాబాల్ సిస్టర్స్ మద్దతు ఇచ్చారు. ట్రూజిల్లా ఎవ్వర్నీ వదలకుండా దొరికిన ఉద్యమకారులను హతమారుస్తూనో, నిర్భంధిస్తునో ఉన్నాడు
అసలే మిరబెల్ సిస్టర్స్ మీద గుర్రుగా ఉన్నాడు. అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ అవకాశం 25 నవంబర్ 25,1960 న దొరికింది.
ఆ రోజు మిరాబాల్ ముగ్గురు సిస్టర్స్ (మినర్వా, పాట్రియా, మేరియా )భర్తలను కలవడానికి కారులో వెళ్తున్నారు. డ్రైవర్ తో సహా వారిని దారుణంగా హింసించి, చంపించాడు. తర్వాత ఏమి ఎరగనట్టు తను నడిపే పత్రిక ఎల్ కరిబే లో అది కారు ప్రమాదం అని రాయించాడు. కానీ ప్రజలు నమ్మలేదు.
ట్రూజిల్లో చేసిన ఒక పిచ్చి పని వల్ల అమెరికాతో ఉన్న మంచి సంబంధం కూడా దెబ్బ తింది. అదే వెనిజులా ప్రెసిడెంట్ ను చంపే ప్రయత్నం. తర్వాత మే 30,1961 న కొందరు దుండగులు ట్రూజిల్లో కారులో వెళ్తూ ఉంటే అతన్ని హతమార్చారు. అలా ఆ నియంత యుగం ముగిసింది.
మట్టిలో కలిసిపోయినా మిరబెల్ సిస్టర్స్ త్యాగాన్ని ఆ దేశం మరువలేదు. అలాగే ప్రపంచం కూడా ఆ వీరత్వాన్ని ప్రశoసించింది. ఆ త్యాగానికి నివాళి గానే నవంబర్ 25 ని 'అంతర్జాతీయ స్త్రీ హింసా వ్యతిరేక దినోత్సవం' అయ్యింది అప్పటి నుండి.
నిర్భయ, దిశ, శ్రద్దా వాకర్...
మారేవి పేర్లు.. అంతే!జరిగేది మాత్రం ఒకటే లైంగిక హింసా తర్వాత హత్య.
వీటికి వ్యతిరేకంగా జరిగే నిరసనల సెగలు దేశాన్ని కదిలించినా, హంతకులను మాత్రం కరిగించలేవు. ఇవి ఊహించని ఉపద్రవాలు.
ఇక తెలిసి, ఊహించి కూడా హింసకి బలయ్యే సంఘటనలు వరకట్న హత్యలు. ఇక సోషల్ మీడియా ట్రోలింగ్ కు లెక్కే లేదు.ఇది డొమినీకన్ రిపబ్లిక్ సమస్యో లేకా అమెరికా సమస్యో కాదు ప్రపంచం అంతటా ఉన్న సమస్య.
రేపో, హత్యో.... జరగాల్సిన అవసరం లేదు.
ఒక అందమైన అమ్మాయి రోడ్డు మీద వెళ్తుంటే,'ఈ లంజ ఎంత బావుందో' అని చేసే అవమానం కూడా హింస కాదా!
ఇలా చేసేవాళ్ళు మన చుట్టూనే ఉంటారు..మన మిత్రులు అయ్యి ఉండొచ్చు...చదువుకున్న వాళ్లు అయ్యి ఉండొచ్చు!
విద్య-చైతన్యం అనే ఆశాకిరణాలతో స్త్రీలు దీనిపై పోరాడుతూనే ఉండాలి. ఇది ఈ రోజో, రేపో, ఒక సంవత్సరానికో సమసిపోయే సమస్య కాదు. ఈ యుద్ధం సుదీర్ఘమైనది.అందుకే...
The fight must go on..