ఉక్కుపాదం: పాత పుస్తకం, కొత్త పరిచయం
x
జాక్ లండన్

ఉక్కుపాదం: పాత పుస్తకం, కొత్త పరిచయం

జాక్ లండన్ 120 సంవత్సరాల క్రితం చెప్పిన పరిస్థితులు నేడు ఇంకొంచెం పెరిగాయే కానీ తరగ లేదు.


జాక్ లండన్ (Jack London) కలం నుండి జాలువారిన "ఉక్కు పాదం"ను పరిచయం చేయాలనే సాహాస కృత్యానికి పూనుకున్నాను.చదవడం నిన్న పూర్తైనా ఈ పుస్తకం నన్ను వెంటాడుతుంది.మనశ్శాంతి లేకుండా చేస్తుంది.అందుకే ఈ సాహాసం.ఈ పుస్తకాన్ని మంగళగిరిలో జరిగిన చార్వాక మిటీoగ్ లో రు20 కికొన్నాను. చాలా పాత పుస్తకం ఇది. ఒక్కసారైన చదవవచ్చని కొన్నాను.

హైదరాబాద్ బుక్ ట్రస్ట్ సంపాదకుడుగా చేకూరి రామారావుగారున్నప్పుడు 1986 ఫిబ్రవరి లో వచ్చిన ద్వితీయ ముద్రణ ఇది. అనువాదం సహవాసి.పుస్తకాన్ని పూర్తిగా చదివిన తర్వాతనే ముందుమాటలు,మా మాటలు చదవటం అలవాటు. ఈ పుస్తకంలో చదవాలన్నా వీలుకానీ పేజీలు.‘ఉక్కు పాదం’ చదవాలనుకుంటే ముందుమాట, మామాట, వెనుకమాట ఏవీ చదవకుండా డైరెక్ట్ గా పుస్తకం చదివితే,నిజంగా జరిగిన చరిత్ర అనిపిస్తుంది.

' టైటానిక్ 'లో హీరోయిన్ కథ చెప్తున్నట్లు, ఈ పుస్తకంలో "ఎనిన్ ఎవర్ హార్డ్ " ఈ భూతలం మీద శాశ్వత శాంతిసౌఖ్యాలు స్థాపించడానికి హోరాహోరిగా పోరాడతూనే జీవిత లక్ష్యాన్ని సాధించుకుంటామని మొదలు పెడుతుంది. ఈ ఎనిన్,భౌతిక శాస్త్ర ప్రొఫెసర్, సియోరా మిల్లులో వాటాదారుడి కూతురు.భౌతిక శాస్త్ర ప్రొఫెసర్, సామాజిక తత్వశాస్త్రవేత్తగా మారి ఇంటిలో ఇచ్చే విందులకు వచ్చే "ఎర్నస్ట్ ఎవర్ హార్డ్" తో పరిచయo,ప్రేమ, పెండ్లి, ఎర్నెస్ట్ ప్రభావంతో సోషలిస్ట్ గా మారటం.

ఈ కథకు వస్తువుగా రూపొందిన న్యూయార్క్,చికాగోలో జరిగిన రెండు పోరాటాలు,అపార రక్తపాతం.దేశదేశాల వాణిజ్య వర్గాలన్నీ కోరుకున్న యుద్ధం. మన లోపాల్ని,మన మందబుద్ధిని ప్రతిబింబించే భవిష్య దర్పణాన్ని చెబుతూనే, "ఈతూరి మేం ఓడిపోయాం కానీ, ఎప్పటికీ కాదు.చాలా నేర్చుకున్నాం.ఇతోదిక వివేకంతో క్రమశిక్షణతో రేపు మళ్లీ ఉద్యమం రెక్క లిప్పుతుంది" అని "ఎర్నెస్ట్ ఎవర్ హార్డ్" మాటలతో ధైర్యo చేపుతుంది. ఎర్నెస్ట్ ఎవర్ హార్డ్ గుండెనిండా ధైర్యం, అపారతెలివి,కండబలం,రచయిత.సున్నితమైన మనస్తత్వం,పోరాటపటిమ కలవాడు.పోరాటమంతా కనిపిస్తాడు. భౌతికశాస్త్ర ప్రొఫెసర్ ' అధోజగత్ సహోదరుల'(నిర్భాగ్య జనం)పక్షాన పాల్గొనడం వలన ప్రాపెసర్ ఉద్యోగాన్ని,సియోరా బట్టలమిల్లులో వాటాను,బ్యాంకు నిల్వలను,సొంత ఇంటిని అల్పసంఖ్యాక పెట్టుబడి పాలకపక్షాలు లాగేసుకుంటాయి.చివరికి మనిషే మాయ(o చేస్తాయి)మైపోతాడు. ప్రేమ పాత్రుడైన 'బిషప్ మోర్ హౌస్' క్యాథలిక్ చర్చ్ లో చేసిన ఉద్బోదలకుగాను,పిచ్చి పట్టిందని హాస్పిటల్ లో చేర్చి అనేక హింసలు పెడతారు.కోట్ల విలువ చేసే ఆస్తులను రహస్యంగా అమ్ముకొని మాయమై చివరి వరకు ఉద్యమాల్లో పాల్గొంటాడు.


ఇలా పతిపాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే.ఒక్క మాటలో చెప్పాలంటే మార్క్స్ క్యాపిటల్ ని,పెట్టుబడిదారి నిర్ధాక్షిణ్యతను- కార్మికుల పోరాటాన్ని, జరిగిన రక్తపాతాన్ని జాక్ లండన్ హృద్యంగా చెప్పాడు.శ్రమకు -పెట్టుబడికి మధ్య గల వైషమ్యం, పరస్పర ప్రయోజనాల మధ్య సంఘర్షణ, స్వేచ్ఛ వ్యాపారం అంటే ఎవళ్ళు ఎట్లా చస్తేనేo నేను కొట్టుకుతిన్నంత నాదే అనే విశృంఖల విధానం. పాతుకుపోయిన సామాజిక వ్యవస్థని పదిలంగా కాపాడటమే మత బోధకులు చేస్తున్న పనని.

కాంగ్రెస్ సెనేట్టుకు ఎన్నికైన 50 మంది సోషలిస్టు సభ్యులను,తొమ్మిది రాష్ట్రాలలో ఎన్నికైన "గ్రేంజీ పార్టీ" ని అధికారంలోకి రాకుండా(మన న్యాయస్థానాలలా) అల్ప సంఖ్యాక నిరంకుశ పాలకవర్గాల కొమ్ముకాసే న్యాయస్థానం అనుసరించిన దమననీతి. అమెరికా అల్ప సంఖ్యాక నిరంకుశ ప్రభుత్వం ప్రపంచ మార్కెట్ ని (జర్మనీతో యుద్ధానికి తలపడి) కైవసం చేసుకున్న విధానం. సోషలిజం 'దైవ ద్రోహం' అని, పచ్చినాస్తిక వాదమని' తన రహస్య చారులను (మన NIA లా) పంపి ఊరువాడ గగ్గోలు(నక్సలిజం అభివృద్ధి నిరోధకం అని మనవాళ్లు ప్రచారం చేస్తున్నట్లుగా)పుట్టించే ప్రచారం. మతాన్ని రెచ్చగొట్టి క్యాథలిక్ చర్చిని (హిందూ మతాన్ని రెచ్చగొట్టి ముస్లింలమీద దాడి చేసినట్లుగా)ఉసిగొల్పి కార్మికుల ఓట్లలో గండి కొట్టడం. ప్రజల మనసుల్లో "సోషలిజమా - అల్పసంఖ్యాక నిరంకుశ ప్రభుత్వమా" అన్న సమస్యకు బదులు "అమెరికానా- జర్మనీనా" అన్న డైలమా(సింధూర యుద్ధoలాగ )లో పడేస్తుంది.

పారిశ్రామిక వ్యవస్థకి మూలమైన ఇనుము, ఉక్కు, బొగ్గు, యంత్రాలు,రవాణా శాఖలలో నైపుణ్య (మన ప్రొఫెసర్లు,డాక్టర్లు,ఇంజనీర్లు,టీచర్లు లకు ఇచ్చినట్లు) కార్మికులకి ఎక్కువ జీతాలు, సౌకర్యవంతమైన ఇళ్ళు ఇచ్చి మిగతా కార్మిక వర్గాన్ని నోట కరుసుకోవడం. జేమ్స్ ఫార్లే,అతని దాదాల్ని(సమ్మె విచ్చినకారులు) బానిసల మీద అజమాయిషికి పెట్టి, నిర్దాక్షిణ్యంగా పనిచేయిoచటం. కెనడా,మెక్సికో,క్యూబా లలో తిరుగుబాట్లు అణచటానికి ( LTT ని అణిచివేయడానికి శ్రీలంక కు,ఇండియా ఇచ్చినట్లు) ఉక్కుపాదం సహకారం ఇయ్యటం.

ఈ వికసిత యుగం(వికసిత్ భారత్ లా). ఉక్కు పాదపు బిళ్ళ బంట్రోతుల కాషాయ రంగు బట్టలు తగిలించుకుని ఊరేగుతారు-- లాంటి అద్భుత వాక్యాలు దాదాపు 120 సంవత్సరాల నాటి ఈ పుస్తకములో కనిపించడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. బలవంతంగా నిరంకుశంగా, సైన్యంలో చేరడానికి ఇష్టపడని యువకులు కొండల్లోకి పారిపోగా 5 లక్షల సైన్యం చుట్టుముట్టి వేల మందిని (ఇప్పటి మన అంతిమ యుద్ధంలా) నిర్ధాక్షిణ్యంగా చంపివేయటాన్ని, ఆనాటి పత్రికలు (ఇప్పటి పత్రిక లాగే), పెద్ద పెద్ద కార్మికులు,మధ్యతరగతి వర్గం,సాంస్కృతిక కళా రంగం,మతాచార్యులు,గుప్త పెట్టుబడి అల్ప సంఖ్యాక నిరంకుశ ప్రభుత్వాలకు అనుకూలంగా వ్యవహరించిన తీరును జాక్ లండన్ మన కళ్ళ ముందు ఉంచాడు.

ఉక్కు పాదంలో ప్రతి వాక్యము,ప్రతి పదo మనల్ని మెల్లిపెట్టేస్తుంది.గింగిరాలు తిప్పేస్తుంది.ఈ పుస్తకాన్ని పాఠకుల కన్నా అల్పసంఖ్యాక నిరంకుశ సామ్రాజ్యవాద పెట్టుబడిదారీ ప్రభుత్వాలే బాగా చదివేసాయానిపిస్తుంది.మన "మోడీ షా"లు ఇంకా బాగా చదివి ఆచరణలో పెడుతున్నారు అనిపిస్తుంది. ఈ పుస్తకాన్ని ముందుమాట వెనక మాట మామాట చదవకుండా చదువుతుంటే తికమక పడతాము.1907 లో పుస్తకం వెలుగులోకి వచ్చింది. కాని 1912,13,18,19 నాటి పరిస్థితులు చదువుతుంటే తికమకపడిపోమా? అంటే 'జాక్ లండన్' అంత ముందుగా రాయడం ఊహించనంత గొప్ప విషయం.

జాక్ లండన్ దగ్గరకు వద్దాం.జాక్ లండన్ విప్లవవాది.రచయిత.భవిష్యత్ దర్శనం చేసుకోగలిగిన వివేకవంతుడు.సహృదయుడు. బలాడ్యూడు.ఒక సామాన్య రైతుబిడ్డ.పొట్టకూటి కోసం పదో ఏటనే పత్రికల అమ్మటం ప్రారంభించాడు. చిన్న వయసులోనే మృత్యువుకు దగ్గరైన జాక్ లండన్ కూలినాలి జనంలోనివాడు.కాయ కష్టం చేసే కార్మిక జీవిత అనుభవం,తన మేధస్సు కలబోసి యాభై పుస్తకాలు రాచేడు.ఉక్కుపాదంలోని ఎర్నెస్ ఎవర్ హర్డ్ జాక్ లండన్ అని, ఎనిన్ ఎవర్ హార్డ్ జాక్ లండన్ భార్య పాత్రలని అంటారు. ధనస్వామ్యానికి, జాక్ లండన్ పెట్టిన సేవగల పేరు "ఉక్కు పాదం". 1905 రష్యాలో జరిగిన తిరుగుబాటు,దాని వైఫల్యాలు,రక్తపాతం. 1871లో చికాగో, న్యూయార్క్ లలో జరిగిన సంఘటనలను, పరస్పర విరుద్ధమైన రెండు వర్గాలు మధ్య జరిగే పోరాటంలో 'ధనస్వామ్యం' తాను నిరంతరం వల్లించే శాంతి, ధర్మం తుంగలో తొక్కి ప్రజలపై క్రూరమైన హింసకాండకు ఎట్లా తెగిస్తుందో చెబుతాడు.

అంతేకాకుండా దుర్భేద్యమైన ధనస్వామ్య శత్రువుల కోటల్లోకి "అదోజగత్ సహోదరులు"ఎలా ప్రవేశించించారో ఎంతో ముందుగా ఊహకల్పనలతో ఉక్కు పాదంలో అద్భుతంగా చూపించాడు, వర్ణించాడు."సహవాసి" ఇది తెలుగు పుస్తకమా! అన్నంత గొప్పగా అనువదించారు. జాక్ లండన్ 120 సంవత్సరాల క్రితం చెప్పిన పరిస్థితులు ఇంకొంచెం పెరిగాయే కానీ తరగ లేదు. నిరంకుశ ప్రభుత్వాలు "అదో జగత్ ప్రజల"ను ఇంకొంచెం క్రూరంగా అణిచివేస్తున్నాయి.

ఈ నాటి పరిస్థితులలో సహృదయులైన ప్రతి ఒక్కరూ చదవాల్సిన పుస్తకం.బ్రతుకు పోరాటంలో పరుగులెత్తుతున్న ప్రతి ఒక్కరు,సమయం లేకున్నా వీలు చేసుకొని ఖచ్చితంగా చదవాల్సిన పుస్తకం.చదువుతారు కదూ!??


ఇది కూడా చదవండి

అమెరికాలో ప్రముఖ రచయిత భూమన్ ‘జాక్ లండన్’ జ్ఞాపకాల వేట



Read More
Next Story