మూడు నిముషాలో మీటరు మల్లెపూలు!
x

మూడు నిముషాలో మీటరు మల్లెపూలు!

పూలు కుట్టే మిషన్‌ ఒకటి ఉందని ప్రపంచానికి ఎలా తెలపాలి?


ఒక మధ్యాహ్నం హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌ రైల్వేగేట్‌ పడటంతో రోడ్‌ పక్కన ఎండలో మల్లెపూలు అల్లుతున్న మహిళకు గిరాకీ పెరిగింది.

పూలదండల కోసం అందరూ అక్కడ మూగారు.

ఆమె చేతులు చకచకా కదులుతూ పూల మాలలు అల్లుతున్నాయి. అల్లినంత వరకు అందరికీ ఇచ్చి మరిన్ని అల్లడంలో ఆమె కంగారుగా ఉంది.

ఇంతలో ఆమె కూతురు ‘ ఆకలవుతుందమ్మా ... ’ అని అడుగుతోంది.‘ ఉండమ్మా ఈ దండ అల్లేస్తే డబ్బులొస్తాయి...’ అని హడావడిగా పూలను దారంలో పెట్టసాగింది.

ఇదంతా సమీపంలో టూవీలర్‌ మీదున్న శ్యాంబాబు చూశాడు.

దారం వత్తిడికి, ఆమె వేళ్లు వాచిపోయి ఉండటం గమనించాడు. బిడ్డ ఆకలి కూడా పట్టించుకోకుండా ఎండలో ఆమె పడుతున్న శ్రమ అతడిని కదిలించింది.

రైల్వే గేట్‌ తెరిచాక రద్దీ తగ్గిన తరువాత ఆమె దగ్గరకు వెళ్లి

‘ ఎంతకాలం నుండి ఇలా పూలు అల్లుతున్నారమ్మా ’ అని ఆ తల్లిని పలకరించాడు.

‘పదేళ్ల నుండి ఇదే పనయ్యా.అందరికీ ఇలా అల్లడం రాదు. మరి కొంత కాలం ఇలాగే అల్లితే నరాలు దెబ్బతిని చేయి పని చేయదు. మా వాళ్లకు చాలా మందికి ఇలాగే అయింది. ఈ బాధలుంటాయని తెలుసు కానీ బతుకు తెరువుకు కష్టపడక తప్పదు.’ అని కొంగుతో చెమటను తుడుచుకుంది.

అవేదన నుండి ఆవిష్కరణ!

శ్యాంబాబు రూమ్‌ కి చేరుకున్నాడు కానీ ఆ తల్లి కష్టమే కళ్లల్లో మెదలసాగింది. హైదరాబాద్‌ నగరంలోనే కాదు దేశవ్యాప్తంగా కొన్ని వేల మంది ఇలాగే పూలమ్ముకొని బతుకుతున్నారు. వారి కష్టాన్ని తగ్గించి ఆటోమేటిగ్గా మల్లెపూలు అల్లే యంత్రం ఉంటే ఎలా ఉంటుంది? అని ఆలోచించాడు. యూట్యూబ్‌,గూగుల్‌ సెర్చ్‌ చేశాడు . ఎక్కడా అలాంటి యంత్రం కనిపించ లేదు.

ఇక తానే స్వయంగా తయారు చేయాలని రంగంలోకి దిగాడు.

ఆంధ్రప్రదేశ్‌లోని నిడదవోలు యువకుడు శ్యాంబాబు. ఇంటర్‌ తరువాత ఓపెన్‌ యూనివర్సిటీలో బిఎస్సీ చదివాడు. ఇడ్లీ,పానీపూరీల యంత్రాలు తయారు చేసే ‘పాజిబుల్‌ అండ్‌ టెక్‌ ’ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. అక్కడ పనిచేస్తున్నపుడే శ్రమ తగ్గించే ఆవిష్కరణల మీద ఆసక్తి పెంచుకున్నాడు. ఇడ్లీ వెండిరగ్‌ మిషన్‌, రోటీ మోకర్‌లు తయారు చేశాడు కానీ ఆర్ధిక సమస్యల వల్ల వాటిని పూర్తి స్ధాయిలో సిద్ధం చేయలేక పోయాడు.

పూలు అల్లడం ఈజీ కాదు!

పూలు అల్లే మిషన్‌ డిజైన్‌ తయారు చేసే ముందు చేతులతో అల్లుతున్న వారిని కలిసి పనిలో సాధక బాధకాలు తెలుసుకున్నాడు.

చాలా మంది పూల దండలు అల్లడం పెద్ద కష్టం కాదనే అపోహలో ఉంటారు. ఇంట్లో మహిళలు తలలో పెట్టుకోవడానికి పూలు అల్లడం పెద్దపనేమీ కాక పోవచ్చు కానీ ,

వ్యాపార పరంగా దండలు అమ్మేవారు చాలాసేపు కూర్చునే ఉండటం వల్ల వారికి నడుం నొప్పులు వస్తాయి.సంవత్సరాల తరబడి పూలు అల్లేవారు వంగిపోయి నడవడం గమనించాడు శ్యాంబాబు. పైగా వాతావరణ మార్పుల వల్ల తోటల నుండి కోసిన పూలు త్వరగా వాడిపోతున్నాయి. ఎక్కువ సేపు తాజాగా ఉండడానికి వ్యాపారులు రసాయనాలు చల్లుతుంటారు. వాటిని ఎక్కువ సేపు చేతులతో తాకడం వల్ల కెమికల్స్‌ ప్రభావంతో చేతి వేళ్లకు వాపు వచ్చి హాని కలిగే అవకాశం ఉంది. దీనికి తోడు గంటల తరబడి చేతివేళ్లు ఒత్తిడికి గురవ్వడం వల్ల నరాలు దెబ్బతినే ప్రమాదాలు కూడా ఉన్నాయి ఈ బాధల నుండి తాత్కాలిక ఉపశమనం కోసం మగవారు మద్యానికి అలవాటు పడుతుంటారు.

ఒక వృత్తిలో ఇన్ని కష్టాలున్నప్పటికీ సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందుతున్న మన సమాజంలో పూలు అల్లే యంత్రం లేకపోవడం శ్యాంబాబులో మరింత పట్టుదలను పెంచింది.

ఇలా పూల దండలో దారంలా ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న సమస్యలన్నింటికీ చెక్‌ పెట్టడానికి ఆటోమేటిక్‌ పూలు అల్లే మిషన్‌ ( జాస్మిన్‌ మిషన్‌) అవసరం చాలా ఉందని గుర్తించాడు శ్యాంబాబు.

అడుగడుగునా ఆటంకాలే

నాలుగేళ్ల క్రితమే కొన్నిడిజైన్లు రూపొందించి మిషన్‌ అయితే తయారు చేశాడు కానీ వాటిలో

కొన్ని సాంకేతిక లోపాలు ఏర్పడి దారం తెగిపోవడం, పూలు నలగడం వంటి సమస్యలు వచ్చాయి. దీని వల్ల మరింత పరిశోధన చేయాల్సి వచ్చింది. పేద కుటుంబం కావడం వల్ల దానికి తగిన ఆర్ధిక వనరుల కోసం తెలిసిన మిత్రుల దగ్గర రూ.2లక్షల వరకు అప్పు చేసి చివరికి జాస్మిన్‌ మిషన్‌ తయారు చేశాడు. అయితే దానిని మార్కెట్‌ చేయడం మరో సమస్య అయింది. అసలు పూలు కుట్టే మిషన్‌ ఒకటి ఉందని ప్రపంచానికి ఎలా తెలపాలి? అని ఆలోచిస్తున్న సమయంలో ఒక యూట్యూబ్‌ ఛానెల్‌ వారు ముందుకు వచ్చి అతడి ఆవిష్కరణను వీడియో తీసి పబ్లిక్‌ చేశారు. దాని ఫలితంగా 600లకు పైగా ఆర్డర్లు వచ్చాయి. కానీ అవన్నీ చేయాలంటే పెద్ద మొత్తంలో పెట్టుబడి అవసరం అనే మరో సమస్య ఎదురైంది. మిత్రుల ఆర్ధిక సాయంతో అతికష్టం మీద నాలుగు యంత్రాలు చేసి వారికి పంపారు. వాటి ఫీడ్‌బ్యాక్‌ తెలుసుకున్నాడు. స్పందన బాగానే ఉంది కానీ, పూలు అల్లడంలో యంత్రానికి మరింత వేగం అవసరం ఉందని వినియోగ దారులు సూచించారు. దాంతో మిగతా ఆర్డర్లు క్యాన్సిల్‌ చేసి, మరి కొంత సమయం తీసుకొని చివరికి రెండు రకాలుగా వేగవంతంగా పనిచేసే మిషన్లు తయారు చేశాడు.

2 గంటలు పనిచేస్తే చాలు

‘ జాస్మిన్‌ మిషన్‌ పై పనిచేయడానికి ఎలాంటి శిక్షణ అవసరం లేదు. పిల్లలు , మహిళలు కూడా ఈజీగా పూలు అల్లుకోవచ్చు. రెండు నుండి మూడు గంటలు మిషన్‌ దగ్గరుండాలి. పూలను యంత్రానికి అందించే వారి సామర్ధ్యాన్ని బట్టి రెండు గంటల్లోనే 10 నుండి 25 మీటర్ల పొడవున్న దంటలు తయారు అవుతాయి. నిలబడే మధ్యలో విరామం ఇస్తూ పనిచేసుకోవచ్చు.నడుం నొప్పులు, చేతి వేళ్లు ఉబ్బడం వంటి సమస్యలేమీ ఉండవు.’ అన్నారు ఈ యంత్రాన్ని వాడుతున్న హైదరాబాద్‌ వాసి సత్యవాణి .(ఫొటోలో ఉన్నారు )

‘ నేను మొదట్లో రూపొందించిన యంత్రానికి చాలా మార్పులు చేశాను. మల్లెలు ,సన్నజాజులకు అ మిషన్‌ అద్భుతంగా పనిచేస్తుంది.ఇది సెమి ఆటోమేటిక్‌ యంత్రం. అవసరం అయిన పూలను మిషన్‌లో పెట్టిన వెంటనే దానంతట అది అల్లుకుంటూ పోతుంది. ఇప్పటికే దేశం నలుమూలల నుండి వచ్చిన ఆర్డర్ల ప్రకారం తయారు చేసి పంపుతున్నాం. ప్రభుత్వ సంస్ధలు, ఎన్జీఓలు ఫండిరగ్‌ చేస్తే పూర్తి అన్ని రకాల పైలు అల్లే అటోమేటిక్‌ యంత్రాన్ని తయారు చేయగల టెక్నాలజీ ఉంది. అపుడు ఒక పూల బుట్టను మిషన్‌కి అనుసంధానం చేస్తే చాలు . ఎన్ని మీటర్లు అయినా దండలు చేసేస్తుంది. ’ అన్నాడు శ్యాంబాబు. ( మల్లెపూలు అల్లే మిషన్‌ పై సందేహాలున్నా, మిషన్‌ చూడాలన్నా శ్యాంబాబు ఫోన్‌ 70754 76701 )

పండుగలు శుభ.అశుభ కార్యక్రమాలన్నింటికీ మనదేశంలో పూల దండలు అవసరం ఇంతా ఇంతాకాదు. అందుకే ప్రతీ ఊరికి ఇలాంటి మిషన్‌ అవసరం ఉంది.

ఈ ఆరుదైప గ్రామీణ సాంకేతిక పరికరం వల్ల పూల వ్యాపారుల ఆరోగ్యానికి రక్షణతో పాటు వారి సమయం, డబ్బు కూడా ఎంతో ఆదా చేస్తుంది.

Read More
Next Story