మల్లమ్మ-మనెమ్మ హోటళ్ల జ్ఞాపకాలు ఎంత రుచి కరమో !
x

మల్లమ్మ-మనెమ్మ హోటళ్ల జ్ఞాపకాలు ఎంత రుచి కరమో !

నా నుంచి నా వరకు...15


మా ఊరిలో జంట హోటళ్లు ఉండేవి. అవి మల్లమ్మ ,మణెమ్మ హోటళ్లుగా ఆ రోజుల్లో ప్రసిద్ధి చెందాయి. ఇప్పటి వలే ఆ రోజుల్లో హోటళ్లకు బోర్డులు వేలాడదీసే వారు కాదు. అయినప్పటికీ రెండు మూడు వేల జనాభా కలిగిన మా ఊరిలో మల్లమ్మ మణెమ్మ హోటల్ అంటే ఫేమస్ అయ్యాయి. ఎంత ఫేమస్ అంటే ఎవరైనా అడిగితే చిరునామా కళ్ళు మూసుకొని చెప్పేవారు.ఆ హోటళ్లు కూడా గూన ఇంట్లో ఉండేవి. వారిద్దరూ అక్క చెల్లెండ్లు కూడా. అయిదు ఆరు టేబుళ్లూ వాటి చుట్టూ రెండువైపులా రెండేసి చొప్పున నాలుగు కుర్చీలు ఉండేవి. ఇవి చాలవు అన్నట్లు గోడకు రెండు మూడు బెంచీలు ఉండేవి.తెల్లారి లేస్తే జనం చాయ్ లు తాగేవారు టిఫిన్ చేసేవారు. అప్పుడే కొత్తగా మా ఊరిలోకి వచ్చిన ఇడ్లీ వడ సాంబారు, పూరి ఆలుగడ్డ కర్రీ ఎంతో రుచికరంగా ఉండేవి . మరీ ముఖ్యంగా ఉడిపి మసాలాతో ఎంతో రుచికరంగా చేసేవారు. ఇడ్లీ వడ తినేవారు కొసరి కొసది సాంబారు రెండు మూడు గిన్నెలు తాగేవారు. గౌడ కులస్తులు ఉదయం తాడి చెట్లు ఎక్కి వచ్చి ఆకలాకలిగా ప్లేట్ పూరి తినేవారు.

మా ఊరి మార్కెట్ ప్రాంతంలో ఈ రెండు హోటళ్లు ఉండేవి. కూరగాయలు, పొయ్యిల కట్టలు ఒకవైపు, మటన్ షాపులు అనే ఇండ్లు ఉండేవి. మార్కెట్ మూల మీద సబ్బని గాలయ్య కిరాణా దుకాణం ఉండేది. ఎడమ వైపు ఇంటి గోడకు మంగలి వారు కూర్చొని ఉండేవారు. వారి పక్కన తోలుతో అరలు అరలుగా చేసిన కల్ప తోలు సంచి ఉండేది. వారు ఒక కట్టు రౌతు మీద కూర్చొని ఉంటే, వారి ముందు కట్టు రౌతులు వేసి ఉండేవి. ఎవరైనా గడ్డం తీసుకోవడానికి క్షవరం తీసుకోవడానికి అక్కడికి రావాల్సిందే. ఆ కట్ట రౌతుల మీద కూర్చుంటే మంగలి బడే లింగం ,రాజలింగం ,నాంపల్లి కావాల్సిన వారికి గడ్డం గీసేవారు.క్షవరం చేసేవారు. మొత్తానికి మార్కెట్లో అరొక్కటి దొరికేవి.

ఎట్టెం రాజయ్య , బుచ్చమ్మల బిడ్డలే మల్లమ్మ మణెమ్మలు ఉండేవారు. వారికి అందరూ బిడ్డలే. బుచ్చమ్మ పొద్దుగాల తడిపిన శనగపిండి పావులో వేసి దొడ్డు పూస గుండ్రంగా చేసేది. మంచి రుచికరంగా కరకరలాడుతుండేవి. ప్రతిరోజు మధ్యాహ్నం తర్వాత బుచ్చమ్మ ఒక మేదరి బుట్టలో వాటిని సర్దుకొని తాటి మండువా లో కల్లు తాగే వారికి అమ్మడానికి పోయేది. ఏకానకు (ఆరు పైసలు) ఒకటి చొప్పున అమ్మేది. పొద్దుగూకే జాముల ఆరు ఏడు గంటలకు నేను మా నాయనమ్మ మా ఇంటి గద్దల మీద కూర్చుని బుచ్చమ్మ కోసం ఎదురు చూసేవాళ్ళం బుచ్చమ్మ మేదరి బుట్టను పట్టుకొని అమ్మగా మిగిలిన పూస బిల్లలు తీసుకొని వస్తుండేది. మా నాయనమ్మ బుచ్చమ్మతో బేరమాడి పది పైసలకు రెండు పూసల చొప్పున కొనేది. బుచ్చమ్మతో ఆ ముచ్చట ఈ ముచ్చట పెట్టి చివరికి చారాణా (25 పైసలు)కు ఆరు కొని, రెండు ఉంచుకొని పిల్లలకు మనిషికి ఒకటి ఇచ్చేది. భలే రుచిగా ఉండేది నేను తిని మా నాయనమ్మను మల్ల కొంచెం ఇమ్మని గోస గోసోలే అడిగే వాడిని . మా నాయనమ్మ అడుగగా అడుగగా కొంచెం ఇచ్చేది. ప్రతిరోజు మా నాయనమ్మకు మాకు అదో మహా వైభోగం అని చెప్పాలి.

ఇది ఇలా ఉండగా , ఇక్కడ ప్రత్యేకంగా మరో విషయాన్ని ప్రస్తావిస్తేనే పూర్తిగా అర్థమవుతుంది. మా ఊరిలో పద్మశాలి కులం వాళ్ళు ఎనబై శాతం వరకు మెజారిటీగా ఉండేవారు. అంటే దాదాపు ఊరిలో వేయి, పదిహేను వందల కడప లకు ఎనిమిది నూర్ల ఇండ్ల వరకు పద్మశాలీలు ఉండేవి. ఆ ఇళ్లలోని సాపుడు మగ్గాలు ప్రతి ఇంటికి ఆరు నుండి ఎనిమిది వరకు మగ్గాలు ఉండేవి. చుట్టుపక్కల దాదాపు 20, 30 కోసుల పెట్టు అంటే 50 ,60 కిలోమీటర్ల దూరం పరిధిలోని గ్రామీణ ప్రాంతాలలోని పద్మశాలి వృత్తి నడవక కుటుంబాలు గడవక ,సిరిసిల్లకు తంగళ్ళపల్లి కి మగ్గం వేయడానికి బతక వచ్చేవారు . కొందరు భార్య పిల్లలతో వస్తే మరి కొందరు ఒంటరిగా వచ్చేవారు.

మా ఊరిలో కరెంటు లేకుండేది. అప్పుడు బొంబాయి, భీమండిల నుంచి అర్జున్ లాంతర్లు తెచ్చుకునేవారు. లాంతరు బుగ్గలను సాయంత్రం కట్టెల పొయ్యి బూడిదతో తెల్లగా కడిగి గ్యాస్ నూనె నింపి పెట్టుకునేవారు. ఆ లాంచర్ని మగ్గం మీద వేలాడదీసి దీపం ముట్టిచ్చేవారు. దాదాపు 15 వాల్టుల కాంతి వచ్చేది. ఆ వెలుతురులో మగ్గం గుంటలో కూర్చుని,లయబద్ధంగా పావుకోళ్లను తొక్కుతూ మగ్గం నేసేవారు. చిట్టర పొట్టర వింతగా చప్పుడు ఊరంతా వినిపించేది.తెల్లవారిందని మిగతా ఇళ్లలోని వారు నిద్ర లేచి ఎవరి పనులలోకి వాళ్లు వెళ్లేవారు. కొందరు చేనేత కార్మికుల వెంట వచ్చిన వారి భార్యలు ఒక చేతితో రాట్నం తిప్పుతూ మరో చేతితో గిర్రున కండెలు చుట్టేవారు. మగ్గం పక్కన చిన్న డబ్బాలో దారం చుట్టిన కండెలు ఉండేవి. అప్పుడప్పుడే కొత్తగా వచ్చిన కొన్ని మగ్గాలలో డబుల్ పేటి ఉండేది అంటే రెండు వివిధ రంగుల కండలు ఉండేవి. వేస్తున్న చీర మధ్యలో అంచులకు ఎంతో నైపుణ్యంతో కార్మికులు పువ్వులు లతలు డిజైన్లు మగ్గం మీదే వేసేవారు. రోజంతా లేవకుండా ఒక చీర నేస్తే నేత కార్మికులకి ఒక రూపాయి కూలీ వచ్చేది. కండెలు చుట్టిన మహిళలకు చిట్టెకు కూలి దొవ్వాణా ( పన్నెండు పైసలు )ఇచ్చేవారు. వారానికి ఒక రోజు సంత ఖర్చులకు ధని సేట్లు లెక్కచేసి కార్మికులకు ఇచ్చేవారు. వారు వచ్చిన కూలి డబ్బులతో ఆ వారానికి సరిపడా బియ్యం తదితర సామాను "గాసం " సిరిసిల్లకు పోయి కొనుక్కొచ్చుకునేవారు. నేత కార్మికులకు ఎంత పని చేసినా పొద్దటిది పొట్టకు మాపటిది బట్టకే సరిపోయేది. అతి కష్టం మీద వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదిపించేవారు.

అదిగో అటువంటి వాతావరణంలో మా ఊరి లో ప్రతి కులం వారు ఎవరి వృత్తిని వారు ఆశ్రయించి అయిదు వేళ్లు నోట్లోకి పోయేవి. . ముందే చెప్పినట్టు చేనేత కుటుంబాలు ఎక్కువగా ఉండేవి. ధని ఇండ్లలోనే పక్కకు చిన్న రూములు కొటీర్లు కట్టేవారు. ఆ చిన్న ఇల్లు అనే గదిలోనే కార్మికులు భార్యా పిల్లలు ఉండి, ఇంటిల్లుపాదీ మగ్గం పని చేసేవారు. తెట్టన తెల్లారిన తర్వాత కార్మికులు పిడుక బొగ్గుతో పళ్ళు తోమి మొకాలు కడుక్కొని , సంత ఖర్చులు పోగా మిగిలిన రూపాయో రెండు రూపాయలో మిగిలితే చాయ్ పానీలకు భార్యకు తెలియకుండా చాటుకు ఖర్చు పెట్టేవారు.

ఒకవైపు మార్కెట్ మంగలి వాళ్లు అటువైపు మటన్ కొట్టేవాళ్ళు ఆ మూలకు పెద్ద కిరాణం దుకాణం దాటితే ఎడమ వైపు మల్లమ్మ హోటల్ ఉండేది. తెల్లారి లేస్తే నేత కార్మికులు, ఊరి బర్లను జంగిడికి తోలుక పోయి వచ్చే రైతులతో వెరసి చాయ్ తాగే వాళ్లతో టిఫిన్ చేసే వాళ్ళతో మల్లమ్మ హోటల్ గడిదిగా ఉండేది . కానీ దగ్గర దగ్గర 40 ఏళ్ల వయసు ఉన్న మల్లమ్మకు పెళ్లి ఎందుకు కాలేదో

విషయం చెప్పి ఈ వ్యాస ఈ భాగాన్ని ముగిస్తాను. బుచ్చమ్మకు నలుగురు బిడ్డలు ఉండేవారు అందులో మల్లమ్మ పెద్ద కూతురు. ఆ రోజుల్లో పొద్దంతా రెక్కలు ముక్కలు చేసుకున్నా కడుపునిండాసరిగా తిండి దొరికేది కాదు. అటువంటి పరిస్థితుల్లో మల్లమ్మ మూడో బిడ్డకు విపరీతమైన జ్వరం వచ్చింది ఇంట్లో ఒక రూపాయి లేదు. జ్వర తీవ్రత వలన ఆమె కలవరిస్తుంది. మల్లమ్మ చెల్లెను వచ్చి చూడమని బతిలాడితే మచ్చ భూపతి ఆర్.ఎం.పి డాక్టర్ను తోలుక వచ్చి చూసి పది గోలీలు రాశాడు. ఎంతైతుంది డాక్టర్ సాబ్ అంటే పది రూపాయలు అన్నాడు.

ఇంట్లో చూస్తే ఒక పెద్ద పైసా లేదు ఎటూ పాలుపోలేదు మల్లమ్మకు ఎలా చెల్లె ఆరోగ్య పరిస్థితి చూస్తే బాధగా ఉంది . వాళ్ళ ఇంటి ఎదురుగా కోడం చినమల్లయ్య ఇల్లు ఉండేది. ఆయన అప్పటికే పది మగ్గాలు నడుపుతున్నాడు. ఎర్రగా బుర్రగా ఉన్న మల్లమ్మ మీద ఇప్పటికే మల్లయ్య ఒక కన్నేసి ఉన్నాడు. తీరా మల్లమ్మ వచ్చి మల్లయ్య సేటు మా చెల్లెకు బాగా జ్వరం వచ్చింది భూపతి డాక్టర్ పది రూపాయల మందులు రాసి ఇచ్చాడు. ఒక పది రూపాయలు బదులు ఇవ్వమని గీమాలి బతిమిలాడింది.

మల్లయ్య నవ్వుకుంటూ పెద్ద చార్మినార్ సిగరెట్ ముట్టించి రింగు రింగులుగా పొగ ఊదుతూ ఆమె వైపు అదో మాదిరిగా చూసాడు. ఇస్తాను గాని నేను అడిగింది నువ్వు కూడా ఇవ్వాలె అన్నాడు. అడిగింది ఇస్తే తిరిగి పది రూపాయలు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు అన్నాడు. మల్లమ్మ సరే అంది అంతే మల్లయ్య ఆమె చేయి పట్టుకొని చీరల గోదాం గదిలోకి తీసుకుపోయాడు. పని అయిపోగానే ఎప్పటినుంచో మల్లమ్మ మీద ఉన్న కోరిక తీరింది అనే సంతోషంతో 10 రూపాయలు చేతిలో పెట్టాడు. కాలం గడిచిన కొద్దీ మల్లయ్య కోరిక కలిగినప్పుడల్లా తీరుస్తూ, చివరికి చిన మల్లయ్య పేరు మీదే ఆమె పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా మిగిలి పోయింది.

Read More
Next Story