కాలాన్ని ఈనిన నేల
ఆదివారం కవిత
ఉదయాన్న ముద్ద ముద్దలుగా మంచు,
మధ్యాహ్నం చిర చిరలాడే ఎండ,
సాయంత్రాన బొద బొదా వాన !
ప్రతి క్షణం,ప్రతిదినం
మన్నెం ఒక త్రికాల సంగమం....!
ఒక ప్రతీకల గళం...!
ఏదో మూలతత్వాన్ని భుజాన వేసుకుని
ముక్కుమూసుకుని తపస్సు చేస్తున్న
మునీశ్వరుడా అనిపిస్తుంది ఈ మన్నెం!
రాక్షసుడిగా మారిన మానవుడు
మన్నెపు ఆకుపచ్చని రక్తాన్ని పీల్చేస్తున్నాడు.
మన్నెం నేలలో కొత్త వ్యాపార సంస్కృతికి అంటుకట్టాడు!
పాశ్చాత్యం,పెట్టుబడి
మతం,మందూ
చెట్టా పట్టాలేసుకుని మహా వృక్షాలై విస్తరించుకు పోతున్నాయి....
మహా వృక్షాలన్నీ మనిషి వికృత చింతనా గండ్ర గొడ్డలికి
ఎప్పుడో నేల కూలాయి!
ఇప్పుడు కొండలన్నీ విషపు పార్థీనియం మొక్కలతో
తళతళా మెరిసిపోతున్నాయి!!
ఒక అదృశ్యపు ఆధునికత మన్నెం మూల మూలలా పాకి
వికటాట్ట హాసం చేస్తున్నదిప్పుడు...
మూల (వాసీ )సంస్కృతి ఎక్కడో కొండ చివార్లో
ముక్కుతూ,మూలుగుతూ మునగదీసుకుని ఉంది !
ఒక నిరలంకార నిండు ప్రకృతీ హృదయం మాత్రం
నిత్యమూ వ్రేలాడుతూనే ఉంది
మన్నెం అణువణువునా !!
కోదు ఆధునికుడిగా మారినా....
కొండ దొర దొరబాబులా వెలిగిపోతున్నా ....
వాల్మీకి వ్యాపార రణతంత్రుడై ఎదిగిపోతున్నా
మన్నెపు ఏదో అదృశ్య ప్రాకృతిక శక్తి మాత్రం
ఎర్రని కిరణమై,ధవళ వర్ణపు పొగమంచై,
వీనుల విందైన వానై
ప్రసరిస్తూ,పరుగిడుతూ,పారుతూ
పంకిల హృదయాలకు అందనిదేదో అనంత సౌందర్యమై శబ్దిస్తూనే ఉంటుంది!
ద్వైతాద్వైత విశిష్టాద్వైతాలన్నీ ఈ శబ్ద చలనాంచలాలలోనే జనించాయని
మదిలో స్ఫురిస్తుంటుంది!!
ఋతువుల చప్పుడు రంగు రంగుల్లో వినిపిస్తూనే ఉంటుంది!
కాలాన్నీ,కమ్మని పరిమళాన్ని ఈనిన నేల ఇది !!!
Next Story