
పూలు గుసగుసలాడేనని.. గాలి ఈలలు వేసేనని..
కడియపులంకల్లో 'పూల కల్లోలం'!
కారణం, ఇక్కడ పెరిగే మొక్కలు, పూలు. మనల్ని ఎక్కడికో తీసుకువెళ్తాయి. ఎటు చూసినా పూల సుగంధమే.
ఈ ఎవర్‌గ్రీన్ నర్సరీలలో అడుగు పెట్టగానే కనిపించేది క్రమబద్ధమైన పచ్చదనం. ఏరి కూర్చినట్టు వరుసల్లో మొక్కలు చూస్తుంటే ఔరా ప్రకృతి ఇంత అందంగా ఉంటుందా! అని ముక్కున వేలేసుకుంటాం. వేల సంఖ్యలో మొక్కలు ఉన్నా ఎక్కడా గందరగోళం ఉండదు.
చిన్న మొక్కల నుంచి పెద్ద సైజు మొక్కల వరకూ—అన్నీ ఒకే ప్రాంగణంలో... అవెన్యూ ప్లాంట్స్, బాంబూ వేరైటీస్, పండ్ల మొక్కలు, ఇండోర్–ఔట్‌డోర్ ప్లాంట్స్, పామ్స్, ఆర్నమెంటల్స్… ఒకటి కాదు, ఎన్నో ప్రపంచాలు అన్నీ ఒకేచోట.
ఈ కాలం పూల కాలం. పూల రంగుల్లో కేవలం అందమే కాదు, ఓ భావం ఉంది. కొన్ని పువ్వులు చూసిన వెంటనే చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తాయి. కొన్ని పువ్వులు మనల్ని తెలియని ప్రశాంతతలోకి తీసుకెళ్తాయి.
పూల దగ్గర మనం ఎక్కువ మాట్లాడం. మనసే మాట్లాడుతుంది.
నర్సరీ దారుల్లో నడుస్తుంటే అడుగులు నెమ్మదిస్తాయి. ఆకుల మధ్య గాలి, పూల పరిమళం.. ఇవన్నీ కలసి మనకు తెలియకుండానే ఓ భావుకతకు లోనవడం ఖాయం..
కడియం నర్సరీలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. సంవత్సరాలుగా మొక్కలు పెంచిన నైపుణ్యం ఇక్కడ కనిపిస్తుంది. నాణ్యమైన మొక్కలు, వివిధ సైజుల్లో సరఫరా చేసే సామర్థ్యం, కస్టమర్ అవసరాన్ని అర్థం చేసుకునే పద్ధతి.. ఇవన్నీ ఈ నర్సరీల ప్రత్యేకతను చాటుతాయి.
ఇక్కడ మొక్క కొనడం మాత్రమే కాదు—ఆ మొక్క ఎలా బతకాలి, ఎలా పెరగాలి అన్న ఆలోచన కూడా ఉంటుంది. ఇది వ్యాపారం కన్నా ఒక బాధ్యతలా అనిపిస్తుంది.
పచ్చదనం అంటే అలంకారం కాదు… జీవనశైలి అంటున్నారు నిర్వాహకులు.. వాళ్ల మాటలు వింటుంటే నర్సరీకి ఒకసారైనా వెళ్లి రావాలని అనిపిస్తుంది. మొక్కల కోసం కాకపోయినా మనసు కోసమైనా..
అటువైపు ఎప్పుడైనా వెళ్లినపుడు ఓ లుక్కేయండి.. మతి పోవాల్సిందే సుమండీ!!
(ఫోటోలు- కడియపు లంక నుంచి రవి పెదపోలు, ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్)

