రామాయణంలో వందల శ్లోకాల తర్వాత... కౌసల్య కనిపిస్తుంది
x

'రామాయణంలో వందల శ్లోకాల తర్వాత... కౌసల్య కనిపిస్తుంది'

రామాయణంలో నిరుత్తరకాండ-3: ‘కౌసల్యానందవర్ధను’డంటూ మొదటిసారి కౌసల్య ప్రస్తావన వస్తుంది, అదీ రాముడి గురించి చెబుతూ. ఇది కౌసల్యను తల్లిగా నేరుగా పరిచయం చేయదు.


కౌసల్య ఎవరూ...సాక్షాత్తు అవతారపురుషుడూ, పురుషోత్తముడూ అయిన శ్రీరామచంద్రుడి తల్లి! పోనీ రాముడి గురించిన అలాంటి అనేక విశేషణాలను పక్కన పెట్టి; రామాయణాన్ని ఓ మామూలు కథగా మాత్రమే చూసి చెప్పుకున్నా, కథానాయకుని తల్లి!

అలాంటి కౌసల్య ప్రస్తావన వాల్మీకిరామాయణంలో నేరుగా ఎక్కడ, ఎప్పుడు వస్తుంది?!

బాలకాండలో ఏకంగా 13 సర్గలూ, 477శ్లోకాలూ గడిచిన తర్వాత...!!!

చూడడానికి ఇదో చిన్న విషయంలా కనిపిస్తుంది కానీ, అది కలిగించే ఆశ్చర్యం పెద్దది. ఆ ఆశ్చర్యాన్ని పాఠకులతో పంచుకుంటూనే, రామాయణకథానిర్మాణంలో కథకుడు, లేదా కథకులు అనుసరించిన వ్యూహాన్ని సూచనప్రాయంగా పరిచయంచేయడానికే ఈ ప్రస్తావన. అంతేతప్ప, కథకుని, లేదా కథకులను తప్పు పట్టడానికీ కాదు, ప్రశ్నించడానికీ కాదు. కథానిర్మాణాన్ని విశ్లేషించడం, ఆ క్రమంలో ఎదురయ్యే కొన్ని ఖాళీలను ఎత్తిచూపడం, వాటిని యథాశక్తి పూరించే ప్రయత్నం ఎలాంటి విశేషాలను ముందుకు తేగలదో చూపడమే ఈ వ్యాసపరంపర ఉద్దేశమన్న సంగతిని మరోసారి గుర్తుచేసి ముందుకు వెడతాను.

బాలకాండ 1వ సర్గలో, 100 శ్లోకాలలో నారదుడు రామాయణకథను వాల్మీకికి సంక్షిప్తంగా చెబుతాడు. అది రాముడి గుణగణాలతో మొదలవుతుంది. ఆ తర్వాత అతడు ఇక్ష్వాకువంశంలో పుట్టడం గురించి చెప్పి, అతని రూపురేఖలను వర్ణిస్తుంది. ఆ తర్వాత అతని పరాక్రమం గురించి, ధర్మరక్షణ గురించి, సకలశాస్త్రపరిజ్ఞానం గురించి చెబుతుంది. ఆ క్రమంలోనే ఒకచోట(17వ శ్లోకం) ‘కౌసల్యానందవర్ధను’డనే విశేషణరూపంలో మొదటిసారి కౌసల్య పేరు వస్తుంది కానీ, అది రాముడి గురించి చెబుతుంది తప్ప కౌసల్యను అతని తల్లిగా నేరుగా పరిచయం చేయదు. ఆ తర్వాత 20వ శ్లోకంలో దశరథుని ప్రస్తావనతోపాటు కథాపరిచయం మొదలవుతుంది. కథాక్రమంలో కైక సహా ఇతర పాత్రల ప్రస్తావన వస్తుంది; కౌసల్య ప్రస్తావన మాత్రం ఉండదు.

విచిత్రం ఏమిటంటే, ఇదే సర్గలో 28వ శ్లోకం, “జనకుని వంశంలో పుట్టి, రామునికి భార్యా, దశరథునికి కోడలూ అయిన సీత, రామునికి ఎంతో ఇష్టురాలు, ప్రాణసమాన. ఆమె సర్వదా రామునికి హితమే చేస్తుంది. దేవమాయలా లోకోత్తర సౌందర్యం కలిగినది” అంటుంది(రామస్య దయితా భార్యా నిత్యం ప్రాణసమాహితా/జనకస్య కులే జాతా దేవమాయేవ నిర్మితా). కానీ, రామునికి జన్మనిచ్చిన తల్లి కౌసల్య గురించి మాత్రం ఒక్క మాట కూడా ఉండదు.

క్రౌంచ మిథునంలోని మగపక్షిని ఒక బోయ చంపడంతో మొదలుపెట్టి, వాల్మీకి రామాయణకథను చెప్పడం ఎలా ప్రారంభించాడో 2వ సర్గ 43 శ్లోకాలలో వివరిస్తుంది. నారదుడు చెప్పిన కథనూ, అందులోని పాత్రలనూ, ఆయా ఘట్టాలనూ ఆయన తన తపోబలంతోనూ యోగదృష్టితోనూ పునర్దర్శించాడని అంటూ; ఆ క్రమంలో కథను క్లుప్తంగా పునరుక్తం చేస్తుంది. 3వ సర్గ కూడా 38 శ్లోకాలలో ఆ సంక్షిప్త కథనాన్నే కొనసాగిస్తుంది. ఈ రెండు సర్గలలో కూడా కౌసల్య ప్రస్తావన ఉండదు.

రాముడు అరణ్యవాసం నుంచి అయోధ్యకు తిరిగివచ్చి భరతుణ్ణి కలసుకున్నాడనీ, పట్టాభిషిక్తుడయ్యాడనీ, తనతో అయోధ్యకు వచ్చిన వానరసైన్యాన్ని వెనక్కి పంపేశాడనీ, జనరంజకమైన పాలన అందించాడనీ, సీతను విడిచిపెట్టాడనీ 3వ సర్గలోని 37వ శ్లోకం చెబుతుంది తప్ప(అయోధ్యాయాశ్చ గమనం భరతేన సమాగమం/రామాభిషేకాభ్యుదయం సర్వసైన్యవిసర్జనమ్/స్వరాష్ట్రరంజనం చైవ వైదేహ్యాశ్చ విసర్జనమ్); పద్నాలుగేళ్ల సుదీర్ఘకాలం తర్వాత తల్లి కౌసల్యను(పినతల్లులు సుమిత్ర, కైకలను కూడా)చూశాడని కానీ, ఇతరత్రా వాళ్ళ ఉనికి గురించి కానీ రామాయణం చెప్పదు.

4వ సర్గకు వస్తే, వాల్మీకి రామాయణకథను మునివేషధారులు, గాయకులైన లవకుశులకు ఉపదేశించాడనీ, రాముడు వారిని తన దగ్గరకు పిలిపించుకుని కథను చెప్పించుకుని విని సంతోషించాడనీ 31 శ్లోకాలలో చెబుతుంది. ఇందులో కూడా కౌసల్య ప్రస్తావనే ఉండదు.

5వ సర్గ 23 శ్లోకాలలోనూ; 6వ సర్గ 28 శ్లోకాలలోనూ అయోధ్యానగరం గురించి, ఆ నగరవైభవం గురించి, ఆ నగరాన్ని పాలించే దశరథుడి గురించి, ఆ నగరంలోని నాలుగు వర్ణాల జనమూ ధర్మతత్పరతతో ఐశ్వర్యసమృద్ధితో సుఖసంతోషాలతో జీవిస్తూ ఉండడం గురించి చెబుతాయి. వీటిలో కూడా కౌసల్య ప్రస్తావన లేదు.

22 శ్లోకాలున్న 7వ సర్గకు వద్దాం. దశరథుని మంత్రులలో ప్రధానులైన ఎనిమిదిమంది మంత్రులూ ఎంత ప్రజ్ఞావంతులో ఎంత వ్యవహారదక్షులో, ఎంత శీలవంతులో మొదటి నాలుగు శ్లోకాలలో చెప్పి వాళ్ళ పేర్లు ఇస్తుంది. ఆ తర్వాత ఒక శ్లోకంలో వసిష్ఠుడు, వామదేవుడు దశరథునికి ప్రధాన ఋత్విక్కులుగా ఉన్నట్టు; పై ఎనిమిదిమందేకాక మరికొందరు మంత్రులు కూడా ఉన్నట్టు చెప్పి, వాళ్ళ కార్యదక్షత గురించి, గుణశీలాల గురించి 15 శ్లోకాల్లో వివరిస్తుంది. ఆ తర్వాత ఒక్క శ్లోకంలో దశరథుని శత్రుసంహారం గురించి, అతని మిత్ర, సామంతరాజుల గురించి చెబుతుంది.

అంటే ఏమిటన్నమాట! ఈ 7సర్గలలోనూ రాముడు, రామాయణకథాఘట్టాలు, ఇక్ష్వాకువంశం, దశరథుడు, అయోధ్య , దాని వైభవం, ఆ నగరవాసులు, దశరథుడి మంత్రులు, ఋత్విక్కులు, మిత్రసామంతరాజుల గురించి ఉంది తప్ప దశరథుని పట్టపురాణి, రాజమాత అయిన కౌసల్య గురించి ఒక్క మాట లేదు.

8వ సర్గను చూద్దాం. 24 శ్లోకాలున్న ఈ సర్గ దశరథుడు పుత్రసంతానం కోసం అశ్వమేధయాగం చేయడానికి సంకల్పించుకుని, అందుకు ఉపక్రమించినట్టు చెబుతుంది. చివరిలో 23వ శ్లోకంలో మాత్రం, దశరథుని ‘మనసుకు చాలా ఇష్టులైన పత్నుల’ ప్రస్తావన మొదటిసారి వస్తుంది. దశరథుడు వారి దగ్గరికి వెళ్ళి “నేను యాగం చేస్తున్నాను; కనుక మీరు దీక్ష వహించం”డని చెప్పినట్టు ఆ శ్లోకం చెబుతుంది(తతః స గత్వా తాః పత్నీర్నరేంద్రో హృదయప్రియాః/ఉవాచ దీక్షాం విశత యక్ష్యేహం సుతకారణాత్). ఇందులో కూడా ‘ఇష్టపత్ను’ల సమూహంలో కలిపి చెప్పడమే తప్ప పట్టమహిషి అయిన కౌసల్య పేరు నేరుగా లేదు.

ఇక 9(18 శ్లోకాలు), 10(31 శ్లోకాలు), 11(30 శ్లోకాలు ), 12(21 శ్లోకాలు) సర్గలు ఋష్యశృంగుని కథను, దశరథుడు తను చేయబోయే యాగానికి ఋష్యశృంగుని, అతని భార్య అయిన శాంతను అయోధ్యకు రప్పించడాన్ని, యాగానికి కావలసినవి సమకూర్చమని దశరథుడు ఋషులకు చెప్పి, మంత్రులను ఆదేశించడాన్ని చెబుతాయి. ఆ తర్వాత 13వ సర్గ(37 శ్లోకాలు)యాగం ప్రారంభించవలసిందిగా దశరథుడు వసిష్ఠుని కోరినట్టు, అందుకోసం సేవకులను ఆజ్ఞాపించినట్టు, వివిధదేశాల రాజులకు ఆహ్వానాలు పంపవలసిందిగా మంత్రి అయిన సుమంత్రునితో వసిష్ఠుడు చెప్పినట్టు, వచ్చిన రాజులకు ఆదర సత్కారాలు జరిగినట్టు, భార్యలతోపాటు దశరథుడు యజ్ఞదీక్ష వహించినట్టు చెబుతుంది. ఈ మొత్తం అయిదు సర్గల్లోనూ ఋష్యశృంగుడు, అతని తండ్రి విభాండకుడు, మామ రోమపాదుడు, భార్య శాంత వగైరా ఎవరెవరి పేర్లో వచ్చాయి కానీ; సాక్షాత్తు దశరథుడి పట్టమహిషి అయిన కౌసల్య పేరు నేరుగా లేదు.

13వ సర్గ దగ్గరే మరికాసేపు ఆగి, అందులో మనకు జవాబు దొరకని(నిరుత్తర)ఇంకొక చిత్రమైన ముచ్చట చెప్పుకుందాం:

యాగానికి ఎవరెవరిని పిలవాలో వసిష్ఠుడు ఎనిమిది శ్లోకాలలో సుమంత్రునికి చెబుతాడు. స్వయంగా వెళ్ళి సగౌరవంగా తీసుకురమ్మని కూడా అంటాడు. “మన రాజ్యంలోని వాళ్ళనే కాకుండా సమస్తదేశాలలోనూ ఉన్న వేలాదిమంది బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులను తీసుకుర”మ్మని చెప్పాక; రాజుల గురించి ఎత్తుకుని ముందుగా మిథిలానగరాన్ని ఏలే జనకుడి పేరు చెబుతాడు. ఆ పేరుతో మొదలెట్టడానికి కారణమేమిటో కూడా తనే వివరిస్తూ, జనకుడు దశరథుడికి ‘పూర్వసంబంధి’ అంటాడు. అంటే, వారిద్దరికీ అప్పటికే చుట్టరికం ఉందన్నమాట. అదెలాంటి చుట్టరికమో మనకు తెలియదు, నేను పరిశీలించిన పుల్లెల శ్రీరామచంద్రుడి గారి బాలానందినీవ్యాఖ్యలో కూడా దానిపై వివరణ లేదు. మనకు బాగా తెలిసినంతవరకు, జనకుడి కూతురు సీతను రాముడు పెళ్లాడిన తర్వాతే ఆ రెండు రాచకుటుంబాల మధ్య చుట్టరికం ఏర్పడింది; అది కూడా రాముడు పుట్టి పెరిగి పెద్దవాడైన తర్వాత! ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న యాగసందర్భం రాముడు పుట్టడానికి ముందుది.

ఆ తర్వాత వసిష్ఠుడు కాశీరాజును ఆహ్వానించమని చెప్పి, ఆ వెంటనే కేకయరాజు గురించి అందుకుంటాడు. “పరమధార్మికుడు, మన మహారాజుగారి మామగారు, వృద్ధుడు అయిన కేకయదేశపు రాజును పుత్రసమేతంగా తీసుకురా(తథా కేకయరాజానం వృద్ధం పరమధార్మికం/శ్వశురం రాజసింహస్య సపుత్రం త్వమిహానయ)” అంటాడు. ఆ క్రమంలో అంగదేశపు రాజైన రోమపాదుడు; తూర్పు దేశాల రాజులు, సింధుసౌవీర, సౌరాష్ట్ర దేశాల రాజులు; దక్షిణదేశరాజులు; కోసలరాజ్యంతో స్నేహసంబంధం ఉన్న భూమండలంలోని రాజులందరూ వస్తారు.

కానీ, గమనించారా? పైన, ఆహ్వానించమని చెప్పిన రాజుల జాబితాలో -కైక తండ్రితోపాటు- దిక్కుదిక్కుల రాజులూ ఉన్నారు కానీ కౌసల్య తండ్రి లేడు; ఆ మాటకొస్తే సుమిత్ర తండ్రి కూడా లేడు! ఎందుకని?

అప్పటికి కౌసల్య, సుమిత్రల తండ్రులు స్వర్గస్థులయ్యారు కనుక పై జాబితాలో లేరని అనుకోవాలా? ఒకవేళ అదే నిజమైతే ఆమేరకు సూచనైనా చేయాలి కదా? పోనీ తండ్రులు గతించారనుకున్నా కౌసల్య, సుమిత్రల అన్నదమ్ములైనా ఉండాలి కదా, వారినైనా ఆహ్వానించమని వసిష్ఠుడు ఎందుకు చెప్పలేదు? అసలు కౌసల్య, సుమిత్రల వైపు చుట్టాల ప్రసక్తే లేకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?!

రామాయణంలోని ‘నిరుత్తర’కాండలో ఇదొకటి.

మిగతా విశేషాలు తర్వాత...



Read More
Next Story