పట్టపురాణి పక్కన లేకుండా దశరథుడి పుత్రకామేష్టి
x

పట్టపురాణి పక్కన లేకుండా దశరథుడి పుత్రకామేష్టి

రామాయణంలో నిరుత్తరకాండ-10: దశరథుడు అంతఃపురంలోకి ప్రవేశించి, “పుత్రులను ఇచ్చే ఈ పాయసాన్ని తీసుకో”మని కౌసల్యకు, తర్వాత ఇతర భార్యలకూ ఆ పాయసాన్ని పంచాడు.



ఆ తర్వాత16వ సర్గలోని మొదటి ఎనిమిది శ్లోకాలూ, అంతకుముందు విష్ణువుకీ, దేవతాదులకూ జరిగిన సంభాషణకు పునరుక్తులు; వాటినలా ఉంచితే-

దశరథుడి కొడుకుగా పుడతానని, రావణుని సంహరిస్తానని చెప్పి దేవతాదులకు విష్ణువు అభయమిచ్చి అంతర్ధానమయ్యాడు. అదే సమయంలో ఇక్కడ భూలోకంలో దశరథుడు యజ్ఞం చేస్తున్నాడు. అంతలో ఒక అద్భుతం జరిగింది. ఆ అగ్నికుండం నుంచి మహాభూతం ఆవిర్భవించింది...

మళ్ళీ సినిమా తరహా దృశ్యీకరణతో పోలిక తేవడం తప్పడం లేదు. ఆ భూతాన్ని అత్యద్భుతంగా మన కళ్లముందు నిలపడంలో కథకుడు అసామాన్యమైన ఊహాశక్తిని చాటుకున్నాడు...

అది సాటిలేని కాంతితో ఉంది. దాని బలపరాక్రమాలు అసాధారణాలు. అది నలుపు-ఎరుపురంగు దుస్తులు ధరించి ఉంది. ముఖం ఎర్రగా ఉంది. కంఠధ్వని దుందుభిధ్వనిలా, అంటే భేరీధ్వనిలా ఉంది. శరీరంమీది రోమాలు, మీసాలు, తలజుట్టు మెత్తగానూ సింహంజూలులానూ ఉన్నాయి. అది శుభలక్షణాలతోనూ, దివ్యాభరణాలతోనూ ఉంది. పర్వతశిఖరంలా ఎత్తుగా ఉంది. నడక పెద్దపులి నడకలా ఎంతో దర్పంతో ఉంది. ఆకారం సూర్యుని ఆకారంలా ఉంది. అది ప్రజ్వలిస్తున్న అగ్నిశిఖలా ఉంది. రెండు చేతుల్లో ఒక మేలిమి బంగారు పాత్ర , దానికి వెండి మూత ఉన్నాయి. ఆ పాత్ర మాయతో నిర్మితమైందా అన్నట్టుగా ఉంది. అందులో దివ్యపాయసం ఉంది. ఆ పాత్రను, ‘ప్రియమైన భార్యను’ రెండు చేతుల్లో పెట్టుకున్నట్టుగా ఎంతో ఆదరంగా తీసుకొచ్చాడని కథకుడు అంటాడు(పాత్రీం పత్నీమివ ప్రియాం-బా.స.16.శ్లో.15).

“ప్రజాపతి పంపగా నేను వచ్చాను” అని ఆ భూతం దశరథుడితో అంది. దశరథుడు దానికి చేతులు జోడించి స్వాగతం పలికి, “నీకోసం నేను ఏం చేయాలో చెప్ప”మని అడిగాడు. అప్పుడు ప్రజాపతి పంపిన ఆ నరుడు, “నువ్వు దేవతలను అర్చిస్తున్న కారణంగా ఇది నీకు లభించింది. ఇది దేవతలు వండిన పాయసం, సంతానాన్ని ఇస్తుంది, ఆరోగ్యాన్ని పెంచుతుంది. దీనిని తీసుకుని నీ భార్యలకు ఇవ్వు, నీకు పుత్రులు కలుగుతారు” అన్నాడు. దశరథుడు శిరసు వంచి వినయంగా దానిని అందుకున్నాడు. ఆ భూతానికి ప్రదక్షిణం చేసి నమస్కరించాడు.

ఆ పాయసం లభించగానే ధనం లభించిన నిరుపేదలా దశరథుడు సంతోషించాడని కథకుడు అంటాడు(తతో దశరథః ప్రాప్య పాయసం దేవనిర్మితం/బభూవ పరమప్రీతః ప్రాప్య విత్తమివాధనః-బా.స.16.శ్లో.23)

ఆ వెంటనే ఆ భూతం అంతర్ధానం చెందింది. పాయసం లభించగానే దశరథుని అంతఃపురంలో ఎలా సంతోషం నిండిందో కథకుడు చక్కని ఉపమానంతో ఇలా చెబుతాడు:

హర్షరశ్మిభిరుద్ద్యోతం తస్యాన్తఃపుర మాబభౌ

శారదస్యాభిరామస్య చంద్రస్యేవ నభోంశుభిః(బా.స.16.శ్లో.25)

శరత్కాలంలో మనోహరుడైన చంద్రుడి కిరణాలతో ఆకాశం ప్రకాశించినట్టుగా దశరథుని అంతఃపురం సంతోషపు కాంతులతో వెలిగిపోయిందని ఈ శ్లోకానికి అర్థం.

దశరథుడు అంతఃపురంలోకి ప్రవేశించి, “పుత్రులను ఇచ్చే ఈ పాయసాన్ని తీసుకో”మని చెప్పి కౌసల్యకు ఇచ్చాడు. ఆ తర్వాత తనే ముగ్గురు భార్యలకూ ఆ పాయసాన్ని పంచాడు. ఎవరెవరికి ఎంత పంచాడన్న విషయంలో వ్యాఖ్యాతల మధ్య పెద్ద చర్చే జరిగింది. పుల్లెల శ్రీరామచంద్రుడు గారు కూడా తన వ్యాఖ్యలో దాని గురించి విపులంగానే రాశారు. అదలా ఉంచితే, వేరొకచోట పుల్లెలవారి వివరణలో దొర్లిన ఒక అస్పష్టత గురించి ఇక్కడ ప్రస్తావించుకోవడం అవసరం.

దశరథుడు అగ్నిగుండంనుంచి ఆవిర్భవించిన ఆ భూతానికి మొక్కి, “నీకోసం ఏం చేయాలో చెప్ప”మని అడిగినప్పుడు, ఆ భూతం ఏమందో పైన చెప్పుకున్నాం. కథకుడు అప్పుడు చెప్పిన శ్లోకం ఇదీ:

అథో పునరిదం వాక్యం ప్రాజాపత్యో నరో zబ్రవీత్

రాజాన్నర్చయతా దేవా నద్య ప్రాప్తమిదం త్వయా (బా.స.16.శ్లో.18)

ఇందులో ఆ భూతాన్ని ఉద్దేశించి కథకుడు అన్న మాట ‘ప్రాజాపత్యో నరః’, అంటే ప్రజాపతి పంపిన నరుడని! దాంతో నరుడనే మాట మనిషికి పర్యాయపదం కనుక, వాస్తవానికి ఆ పాయసం తెచ్చింది ఒక మనిషేనన్న భావన కలుగుతుంది. నిఘంటువు కూడా నరుడనే మాటకు అర్జునుడు, ఆ పేరుగల ఒక ఋషి అనే అర్థాలతోపాటు మనిషి, మగవాడనే అర్థాలే ఇచ్చింది. అయితే, పుల్లెలవారు తమ ప్రతిపదార్థంలోనూ, తాత్పర్యంలోనూ కూడా ఈ ‘నరః’ అనే మాటను ‘పురుషుడు’గా అనువదించేసరికి మూలంలో స్పష్టంగా ఉన్న అర్థంలో అస్పష్టత ప్రవేశించింది. నేరుగా ‘ప్రాజాపత్యనరుడు’ అని అనడానికి అవకాశమున్నా ఈ సందిగ్ధార్థాన్ని ఎందుకిచ్చారో తెలియదు. నరుడనే మాట కేవలం మనుషులకే వర్తించేదైతే, పురుషుడనే మాట దేవతలతో సహా ఎవరికైనా వర్తించవచ్చు.

అంతకన్నా విశేషంగా ఇక్కడ గమనించాల్సింది ఒకటుంది! పుత్రులకోసం దశరథుడు ఆ యాగం చేస్తున్నప్పుడు, వాస్తవంగా పుత్రుల్ని కనాల్సిన భార్యలు అతని పక్కన లేరు!!!

గృహస్థు ఒక యాగం కానీ, వ్రతం కానీ, ఇంకేదైనా శుభకార్యం కానీ చేసేటప్పుడు పక్కన భార్య ఉండాలని సాంప్రదాయికంగా వస్తున్న అవగాహన. విచిత్రం ఏమిటంటే, దశరథుడు అశ్వమేధం చేస్తున్నప్పుడు భార్యలు ముగ్గురూ పక్కనున్నారు. అందులో పట్టమహిషి చేయవలసిన తంతుతోపాటు ఇతర భార్యల పాత్ర కూడా ఉన్నట్టు ఇంతకుముందు చెప్పుకున్నాం. నిజానికి అశ్వమేధయాగంలో రాజు ఇతర రాజులపై తన ఆధిక్యాన్ని చాటుకోవడం ప్రధానంగా ఉంటుంది. ఆవిధంగా అది పురుషుడికి సంబంధించినది. అశ్వమేధంవల్ల పుత్రసంతానం కూడా కలుగుతుందని నమ్మితే అది అదనపు ఫలితం మాత్రమే. దశరథుడి అశ్వమేధంవల్ల అది నెరవేరలేదు కనుకనే పుత్రకామేష్టి కూడా చేయవలసివచ్చిందని చెప్పుకున్నాం. అలాంటిది, వాస్తవంగా పుత్రులను కనాల్సిన భార్యలు పక్కన లేకుండానే దశరథుని పుత్రకామేష్టి జరగడం వింతగానే అనిపిస్తుంది.

***

మిగతా యాగాల్లో భార్య పక్కనుండాలికానీ, పుత్రకామేష్టిలో అక్కర్లేదనే నియమం ఏమైనా ఉందేమో తెలియదు. పుత్రుడి కోసం యాగం చేసిన ఇలాంటి ఉదాహరణే మహాభారతం, ఆదిపర్వంలో కనిపిస్తుంది. క్లుప్తంగా దాని పూర్వరంగం ఇదీ: ద్రుపదుడు, ద్రోణుడు సహాధ్యాయులు. తండ్రి తర్వాత ద్రుపదుడు పాంచాలరాజ్యానికి రాజవుతాడు. ద్రోణుడు కుటుంబాన్ని పోషించుకోలేని స్థితిలో సాయం కోసం ద్రుపదుని కలుస్తాడు. అంతస్తుల తేడా తెచ్చి ద్రుపదుడు అతన్ని అవమానిస్తాడు. ద్రోణుడు ఆ తర్వాత కురుపాండవులకు గురువుగా కుదురుకొని విద్యాభ్యాసం ముగిశాక గురుదక్షిణగా ద్రుపదుని బంధించి తెమ్మంటాడు. అర్జునుడు ఆ పని చేస్తాడు. దాంతో ద్రోణుడిపై పగబట్టిన ద్రుపదుడు అతణ్ణి వధించే పుత్రునికోసం యాగం తలపెడతాడు. యాజుడు, ఉపయాజుడు అనే అన్నదమ్ములు అతనితో ఆ యాగం చేయిస్తారు.

పుత్రుడు కలగడానికి అనువైన యజ్ఞకర్మను ద్రుపదుడికి ఉపయాజుడు ఉపదేశించాడని మహాభారతం చెప్పింది కానీ(తతస్తస్య నరేంద్రస్య ఉపయాజో మహాతపాః /ఆచఖ్యౌ కర్మ వైతానం తదా పుత్రఫలాయ వై-ఆధిపర్వం, 166వ అధ్యాయం, 33వ శ్లోకం), రామాయణంలో పేర్కొన్నట్టుగా దానిని ‘పుత్రీయేష్టి’ అని కానీ, అంతకన్నా ఎక్కువ ప్రాచుర్యంలో ఉన్న ‘పుత్రకామేష్టి’ అని కానీ అనలేదు. ఆ మొత్తం ఘట్టంలో ఆ రెండు మాటలూ ఎక్కడా లేవు.

కాకపోతే, దశరథుడి యాగానికీ, ద్రుపదుడి యాగానికీ పోలికలతోపాటు ఆసక్తికరమైన తేడాలూ ఉన్నాయి. ఒక తేడా ఏమిటంటే, దశరథుడి యాగంలో భార్యలు పక్కన లేరుకానీ; గీతా ప్రెస్, గోరఖ్ పూర్ వారు ప్రచురించిన మహాభారతం ప్రకారం, ద్రుపదుని యాగంలో భార్య యజ్ఞవేదికకు దగ్గరగానే ఉంది. యాగం పూర్తి కావస్తున్న ఘట్టంలో, “ఓ ద్రుపదరాజ్ఞీ, నా దగ్గరనుండి త్వరగా హవిస్సును స్వీకరించు. నీకు ఒక కొడుకూ, ఒక కూతురూ జన్మిస్తా”రని యాజుడు ఆజ్ఞాపిస్తాడు(యాజస్తు హవనస్యాంతే దేవీం ఆజ్ఞాపయత్ తదా/ప్రేహి మాం రాజ్ఞి పృషతి మిథునం త్వాం ఉపస్థితం- ఆధిపర్వం, 166వ అధ్యాయం, 36వ శ్లోకం).

అప్పుడు ద్రుపదునిభార్య, “నా నోట తాంబూలరాగం అంటుకుని ఉంది. దివ్యగంధాలు నా శరీరాన్ని కప్పి ఉన్నాయి. ఇప్పుడు పుత్రుడికోసం రాలేను. నాకు ప్రియమైన ఈ కార్యం కోసం కొంతసేపు ఆగండి”(అవలిప్తం ముఖం బ్రహ్మన్ దివ్యాన్ గంధాన్ బిభిర్మి చ/సుతార్థే నోపలబ్ధాస్మి తిష్ఠ యాజ మమ ప్రియే-37వ శ్లోకం) అంటుంది.

కప్పగంతుల లక్ష్మణశాస్త్రిగారు అనువదించిన మహాభారతంలో, ద్రుపదుని భార్య అన్న పై మాటలే ఇలా ఉంటాయి: ‘బ్రహ్మన్! ఇంకను నా నోటిలో తాంబూల లేపము రంగు నున్నది. నా అవయవములందు దివ్యసుగంధితములైన అంగరాగములు అలదుకొనుచున్నాను. కనుక, ముఖము కడుగుకొనక, స్నానము చేయక పుత్రదాయకమైన హవిష్యమును స్పృశించుటకు అర్హత లేకయున్నాను. కాబట్టి, యాజమహామునీ! నాకు ప్రియమైన ఈ కార్యము కొరకు కొంచెముసేపు ఆగి యుండుము.”

ద్రోణుడిపై పగతో రగిలిపోతున్న ద్రుపదుడు ఆ యజ్ఞం చేయడానికి ఎంత తపించాడో, ఎంత శ్రమించాడో తెలుసుకున్నప్పుడు అతని భార్య మాటలు మామూలు ఆశ్చర్యాన్ని కాదు, దిగ్భ్రాంతిని కలిగిస్తాయి. ద్రోణుడివల్ల కలిగిన అవమానాన్ని ద్రుపదుడు మరవలేకపోయాడనీ, దుఃఖంతో చిక్కిశల్యమయ్యాడనీ, ప్రతీకారం తీర్చగల సమర్థులైన పుత్రులు తనకు లేకపోయినందుకు రాత్రింబవళ్లూ విచారించాడనీ, అలాంటి పుత్రుడికోసం తగిన యాగం చేయించే ఋత్విక్కును వెతుకుతూ మున్యాశ్రమాల చుట్టూ తిరిగాడనీ, చివరికి పదికోట్ల గోవులను దక్షిణగా సమర్పిస్తానని చెప్పి యాజుని కుదుర్చుకున్నాడనీ మహాభారతం చెబుతోంది. అలాంటిది, అతని భార్య యజ్ఞవేదికకు దగ్గరగా ఉండి కూడా ముఖం కడుక్కోలేదనీ, స్నానం చేయలేదనీ, కనుక హవిస్సును తాకలేనని అనడం దిగ్భ్రమనే కలిగిస్తుంది.

ఇంకా ఆశ్చర్యమేమిటంటే, ద్రుపదుని భార్య మాటల్లోని అసంబద్ధతను గోరఖ్ పూర్ వారు ప్రచురించిన మహాభారత అనువాదకులు కానీ, కప్పగంతుల లక్ష్మణశాస్త్రిగారు కానీ కనీసం అధోజ్ఞాపిక(ఫుట్ నోట్)లో నైనా ఎత్తిచూపకపోవడం!

‘మహాభారతతత్త్వకథనము’ అనే రచనలో వారణాసి సుబ్రహ్మణ్యశాస్త్రి గారు ఉటంకించిన పాఠం కూడా గోరఖ్ పూర్ ప్రచురణలో ఉన్నట్టే ఉంది కానీ, ఆయన దానికి భిన్నమైన అన్వయాన్ని ఇచ్చారు. దాని ప్రకారం, హవిస్సును స్వీకరించడానికి త్వరగా రమ్మని ద్రుపదుని భార్యకు యాజుడు కబురు పంపాడు. అప్పుడు ఆమె పైన చెప్పిన మాటలే అంది కానీ, ఆ మాటలకు, “నేను రజస్వలనై అస్పృశ్యురాలినై యుంటిని. స్నానపర్యంతము నిరీక్షించవలసిన”దని ఆమె యాజునికి కబురు పంపినట్టు వారణాసివారు అర్థం చెప్పారు. ఈ విధంగా, ద్రుపదుని భార్య యజ్ఞవేదిక దగ్గర ఉందా లేదా అనే విషయంలో రెండు కథనాలు తయారయ్యాయి; ఒకదాని ప్రకారం ఉంది, ఇంకోదాని ప్రకారం లేదు.

ఆ తర్వాత ఏం జరిగిందో మహాభారతం ఇలా చెబుతోంది:

ద్రుపదుని భార్యనుంచి ఆ సమాధానం అందుకున్న యాజుడు-

“ఇది యాజుడు(అంతటివాడు)సిద్ధం చేయగా, ఉపయాజుడు(అంతటివాడు)అభిమంత్రించిన హవిస్సు. నువ్వు రా, రాకపో, ఈ హవిస్సే యజమాని కోరికను నెరవేర్చగలుగుతుంది”(యాజేన శ్రపితం హవ్య ముపయాజా zభిమంత్రితం/కథం కామ న సందధ్యాత్సా త్వం విప్రేహి తిష్ఠవా-38వ శ్లోకం)- అంటూ హవిస్సును హోమం చేశాడు.

యాజుడు అన్న పై మాటలకు ప్రసిద్ధ మహాభారత టీకాకర్త, భాష్యకారుడు అయిన నీలకంఠుడు ఇచ్చిన వివరణను కూడా యాజుని మాటలుగానే చెబుతూ వారణాసి సుబ్రహ్మణ్యశాస్త్రిగారు ఇలా అనువదిస్తారు: “యాజునిచే సిద్ధపరుపబడి ఉపయాజునిచే అభిమంత్రితమై యున్న యీ హవ్యము సంకల్పసిద్ధిని గావింపకుండునా? నీవెట్లున్నను సరియే, ప్రయోగవిధి విలంబమును సహింపదు. శుక్ల శోణితసంబంధముతో పనిలేకయే మా సామర్థ్యముతో స్త్రీపురుషయుగ్మ ముద్భవింపగలదు”

యాజుడు హవిస్సును హోమం చేయగానే, కిరీట, కవచాలను, ఖడ్గ, ధనుర్బాణాలనూ ధరించి జ్వాలావర్ణంలో ఉన్న ఒక పురుషుడు గర్జిస్తూ అగ్నిగుండం నుంచి అవతరించాడు. అదే సమయంలో ఒక అసమానసుందరి యజ్ఞవేదికమీద ప్రత్యక్షమైంది. వారే ధృష్టద్యుమ్నుడు, ద్రౌపది!

శుక్ల(పురుషుడి వీర్యం), శోణిత(స్త్రీ సంబంధమైన నెత్తురు)సంబంధం, అంటే స్త్రీపురుషుల కలయిక లేకుండానే సంతానాన్ని సృష్టించగలమని యాజుడు అన్నట్టు చెప్పడమే చూడండి. ఇంత ఆర్భాటంకానీ, భార్యను ముగ్గులోకి లాగి మరీ తిరస్కరించడం కానీ లేకపోయినా రామాయణంలోని పుత్రకామేష్టి తంతు కూడా చెబుతున్నది ఇదే.

రామాయణంలో ఈ మహాభారతమేమిటని దయచేసి అనుకోవద్దు, రెండింటితోనూ ముడిపడిన విషయాలు కనుకనే ఇంతగా ప్రస్తావించాల్సివచ్చింది. దీనికి కొనసాగింపుగా వచ్చేసారి మరికొన్ని విశేషాలు చెప్పుకుని ఈ అంశానికి స్వస్తి చెబుదాం.



Read More
Next Story