కోటిలింగాల భైరవకోన
x

కోటిలింగాల భైరవకోన

కాకులు వాలని- వేపచెట్లు లేని- పాములు కరవని కోన


మా ఫ్రెండు31- 12-25న ఫోన్ చేసి కారులో భైరవకోన వెళ్దాం వస్తావా?అంది. భైరవకోన అనగానే బోలెడన్ని రోజులనుంచి,రోజులు కాదు సంవత్సరానించే అనుకుంటున్నాను.భైరవకోన ఉండడానికి ప్రకాశం జిల్లాలోనే ఉన్నా ఒంగోలు కు145 కిలోమీటర్ల దూరంలో, మారుమూల సి.ఎస్ (చంద్రశేఖరపురం మండలంలో)పురం కి 35 కి.మీటర్ల దూరంలో ఉంది.సి.ఎస్.పురం వరకు బస్సులున్నాయి.అక్కడ నుండి ఆటోలో వెళ్లాలి.

లింగాకారంలో ఉన్న బావి,జలపాతం, ఏకశిలపై(చిన్న కొండ)చెక్కిన గుహాలయాలు రారమ్మని పిలుస్తుంటాయి.విన్నదాన్ని బట్టి కాశీనాయని ఆశ్రమంలో పెట్టే ఫుడ్డు చూడాలని కోరిక ఉండేది.(ఈమధ్య కాశీనాయిని ఆశ్రమాల గురించి పెద్ద ఎత్తున ప్రచార మాధ్యమాల్లో ప్రచారమైంది కాని,నేను అంతకుముందే విన్న దానిని బట్టి).మగధీర సినిమాలో కాలభైరవా అన్నప్పడల్లా,నాకు భైరవకొనై వినిపించేది.ఎప్పుడు వెళ్లాలన్నా ఏదో ఒక అడ్డంకి వచ్చేది వెధవ జీవితంలో. ఇప్పుడు ఏ ప్లాను లేదు.

శివ లింగాకార బావి.

మా ఫ్రెండ్ కి ఎవరో ఒంగోలు నుంచి 35 కి.మీటర్లే అని చెప్పారట.35కి ఎడమ పక్కన ఒకటి పెట్టుకో అన్నాను.ఆ35సి.ఎస్.పురం నుండి అన్నాను.అక్కడ ఫుడ్ లాంటివి కూడా ఏమీ దొరకవు.మీరు రండి.నేను,మా ఫ్రెండు కొన్ని చేస్తామని చెప్పి రాత్రి పదింటికి హడావుడిగా అన్నం వండి పాలుపోసి తోడు పెట్టేసాను.మరో ప్రేండ్ ను పులిహార చేయమన్నాను.వస్తానన్న డ్రైవరు రాకపోవడంతో పదింటికి పోవాల్సిన వాళ్ళం 12 గంటలకు భైరవకోన చేరుకున్నాం.

మిత్రులారా!భైరవకోన గురించి కేవలం సమాచార మాత్రమే ఇస్తున్నాను.పూర్తి డీటెయిల్స్ ఇవ్వలేకపోతున్నాను.(బైరవకొనలో చాలా రహస్యాలున్నాయట)అంతా హడావుడిగా చూసినందువల్ల.

లింగాకారంలో ఉన్న బావి కొత్తూరులో ఉందనడంతో ఆ కొత్తూరు కోసం సి.ఎస్.పురం నుండే అన్ని గ్రామాల బోర్డులు చూస్తున్నాం.దారిలో అడుగుతున్నాం.దట్టమైన అడవులు కాదు కాని చిట్టడివి.వరిపొలాలు,కందిచేలు,దానిమ్మ,పొగాకు మరికొన్ని తోటలు రోడ్డుకి ఇరుపక్కల కనిపిస్తున్నాయి.కొత్తూరులో బావి కోసం నలుగురై దుగురిని అడిగాం.రోడ్డుకు అడ్డుగా రెండు డోర్లు లాoటివి పెట్టి హిజ్రాలు డబ్బులు అడుగుతున్నారు. అక్కడ అడిగితే పక్కనే ఉన్న బావిని చూపించారు. బావి శివలింగాకారంలోనే ఉంది.కాని కొంత నిరాశ పడ్డాను.యూట్యూబ్లో చూసినంత పెద్దదిగా లేదు. కొంచెం చిన్నగానే ఉంది.(మా ఊరి చుట్టూ చూడడానికి భయంకరంగా ఉండే అతి పెద్ద బావులు పది వరకు ఉండేవి.ఆ బావులు ఎంత భయంగా ఉండేవంటే దాని పక్క నుంచి వెళ్లాల్సి వస్తే దానివైపు చూడకుండా,అది దాటిందాకా పరిగెత్తే దాన్ని.ఒక్కొక్క బావి ఒక్కొక్క పేరుతో ఒక్కొక్క ప్రయోజనం కోసం ఉండేవి)బావిలోకి దిగడానికి మెట్లు ఉన్నాయి.నీరు తెల్లగా చాలా స్వచ్ఛంగా ఉంది.బావిలో చిన్నమోటారు పెట్టి పక్కనే చెట్టు కింద ఉన్న పెద్ద తొట్టిలోకి నీళ్లు నింపారు. మేతమేసి వచ్చే పోయే ఆవులన్నీ ఆ తొట్టిలో నీళ్లు తాగుతున్నాయి.మా ఫ్రెండు సుశీల వదిన పది మెట్లు వరకు దిగింది.మెట్ల రాళ్లు కదిలిపోయేటట్లున్నాయి వద్దు,మాకెవ్వరికి ఈత రాదు అని గోల పెట్టాను.బావి దగ్గర చాలా ఫోటోలు దిగాం.ఈ గ్రామానికి ఐదు కిలోమీటర్ల దూరంలో భైరవకోన ఉంది.

సోనా వాన జలపాతం.

భైరవకోన ఆర్చి వచ్చింది.అమ్మయ్య అనుకున్నాo.ఫోటో తీయాలని కూడా తోసలేదు. కొద్దిగా ముందుకు వెళ్ళగానే పెద్ద ఆంజనేయ విగ్రహం.ప్రతి ఊరి ఎంట్రెన్స్లో ఉంటున్నాయిగా ఆసక్తిగా అనిపించలేదు.సత్రాలు కనిపించాయి. పెద్దగా పట్టించుకోలేదు.సి.ఎస్. పురం మలుపులో కాశినాయని బోర్డ్ చూసారు మావాళ్ళు.దాటిపోయాం.వచ్చేటప్పుడు చూద్దాం అనుకున్నాం.వచ్చేటప్పుడు చూస్తే అది కడప లోని కాశినాయని సత్రంలో జరగబోయే షెడ్యూలు. (కాశినాయనని సత్రం కూడ అక్కడే ఉందని తరువాత తెలసింది)టైం సాలదన్న ఆత్రుతలో.

జలపాతంలో స్నానం చేసి గుడిలోకి వెళదామా?గుడిలోకి వెళ్లి వచ్చి జలపాతం కు వెళదామా?మా వాళ్ళల్లో పెద్ద ప్రశ్న.అందరం స్నానాలు చేసేగా కారెక్కింది గుడికి వెళ్దాం అన్నాను. నాకు చూడాలన్న ఆసక్తి తప్ప భక్తి లేదుగా. జలపాతంకి వెళితే తొందరగా రాలేo అని సరే అన్నారు.ఎంట్రన్స్ దగ్గర టిక్కెట్ ₹10.అర్చన టిక్కెట్టు ఇద్దరికి కలిపి 150 రూపాయలు. పూజారులు భోజనానికి వెళతారు తొందరగా వెళ్ళమన్నారు.

శశినాగ లింగం.

మొదట్లోనే చిన్న గుడిలో కాలభైరవ విగ్రహం.గుహాలయాలన్నింటికీ,8 దిక్కులకు క్షేత్ర పాలకుడు ఈ బాలభైరవుడే కనుక భైరవకోన అని, ఒకప్పుడు ఈప్రాంతాన్ని కాలభైరవుడు అనే రాజు పాలించడం వలన భైరవకోన అని,ఇక్కడ ప్రధాన దైవం భర్గేశ్వరుడు కనుక భైరవకోన అని,ఆ రోజులలో దారి తప్పినవారికి ఓ కుక్క దారి చూపుతూ ఉండేదట.భైరవుడు అంటే కుక్క కనుక భైరవకోన అనే పేరు వచ్చిందని అంటారు.ఈ భైరవకోన(బైరవకోనపేరుతో మావోయిస్టుల దళం కూడా ఉండేదట)ఆంధ్ర ప్రదేశ్,ప్రకాశం జిల్లాలోని తూర్పు కనుమలలో బ్రహ్మ విష్ణు రుద్ర అనే పేర్లు కలిగిన మూడు పర్వతాల మధ్య ఉంటుంది.ఆరు- పదకొండు శతాబ్దాల మధ్య పల్లవుల,చోళుల కాలంలో ఈ గుహాలయాలు చెక్కబడినవని కొన్ని ఆధారాలను బట్టి చరిత్రకారుల అంచనా.

హరిహర, నటరాజ విగ్రహాలు.

ఈ కాలభైరవునికి ఎదురుగా పై వరసలో అష్టాలయాలు ఉంటే కింద వరసలో శ్రీ త్రిముఖదుర్గాoబ భర్గేశ్వర ఆలయం ఉంటుంది. మధ్యలో పెద్దకళ్ళతో మహాలక్ష్మి, ప్రసన్న వదన రూపంలో ఉంటుంది.కుడివైపు దక్షిణ దిశగా మహాకాళి,కళ్ళు చాలా పెద్దగా నోటిలో నుండి జ్వాల వస్తున్నట్లు ఉంటుంది.దక్షిణ కాళి అని కూడా అంటారట.ఎడమవైపు ఉత్తర ముఖంగా సరస్వతి దేవి ఉంటుంది.ముగ్గురిని కలిపి ఆదిశక్తి,శక్తి స్వరూపం అంటారట.ఈ ముగ్గురు దేవతలున్న విగ్రహం చాలా అరుదట.మనదేశంలో ఎక్కడో ఉందట.ముగ్గురమ్మలకు ముందుగా శివలింగం (భర్గేశ్వరుడు)ఉంది.ఇది ప్రధాన దేవాలయం.గుహా లయము,లోపలి విగ్రహము అన్ని ఏకశిలలో చెక్కినవే.ఆలయం ఎదురుగా నీటి గుండం ఉంది. కార్తిక పౌర్ణమిరోజు ముందున్న నీటిలో చంద్ర కిరణాలు పడి ఆ రిఫ్లెక్షన్ అమ్మవారి ముఖం మీద పడుతుందట.దీనిని చూడడానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తారట.ఏడు-పది గంటల మధ్య ఇది జరుగుతుందట.కార్తీకమాసoలో చంద్ర కిరణాలు పడటానికి వీలుగా గుడి పైన ఉన్న రేకులను తొలగిస్తారట.మిగిలిన పౌర్ణమి రోజులలో చంద్ర కిరణాలు పడవట.ఆలయం ఎదురుగా తలలేని నంది ఉంది.

శివలింగాకార బావి.

భైరవకోనలో అష్ట (8) ఆలయాలు, చిన్నవి పెద్దవి కలిపి నూట ఎనిమిది శివలింగాలు ఉన్నాయట.అసలు భైరవకోన కొండలలో మొత్తం కోటి ఒక్క శివలింగం,101 కోనేర్లు ఉన్నాయి అంటారు.

1 శశినాగలింగం.ఉత్తర దిక్కు ముఖంగా ఉంటుంది.దర్శిస్తే సర్ప,కుజ దోషాలు పోతాయట. శిరస్సునందు మణి ఉంటుందని రాత్రి వేళలో ప్రకాశవంతంగా ఉంటాడని ప్రసిద్ధి.ఈ మణిని దొంగలు ఎత్తుకుపోయారని,అందువలన లింగంపై ఒకవైపు తక్కువగా ఉంటుందట.2రుద్ర లింగం. పక్కనే దేవ నాగరిక లిపిలో శాసనం ఉంది. స్పష్టంగా కనిపించడం లేదు.కొద్దికిందిగా దిక్కులను దారిని తెలుపుతూ ఓ పటం(map) కూడా ఉంది.3కాశీవిశ్వేస్వర లింగం.కాశీలో ఉన్న లింగాన్ని పోలి ఉంటుందట.4అష్టకాల ప్రచండ లింగం.8దిక్కులకు ఎనిమిది భైరవ శివలింగాలు అని అర్థమట.5 పక్షఘాత లింగం.పక్ష అంటే శత్రువు.ఘాత అంటే సంహరించడం.మన లోపల ఉన్న చెడులను మద,మాత్పర్య,లోభాలను చంపటం.ఈ లింగము యొక్క మరొక ప్రత్యేకత పానపట్టం కింద సన్నటి నీటి ఊట ఉంటుందట.పానపట్టం కింద పది అడుగుల లోతున ఉండే ఈ ఊట,కొండమీద ఊటకు అనుసంధానమై ఉందట.కనుక జలలింగం అని కూడా అంటారు.6 శ్రీశైల మల్లికార్జునలింగo. శ్రీశైలంలో ఉన్న లింగాన్ని పోలి ఉంటుంది.ఆ లింగాన్ని దర్శించుకున్నంత ఫలితం ఉంటుందట.7 నగరేశ్వర లింగం.శివలింగాకారంతో సహా ఏకశిల లోనే చెక్కబడింది.ఈ లింగం తప్ప మిగతా ఏడు లింగాలు(నల్ల గ్రానైట్ రాతి లో చెక్కి) ప్రతిష్టించబడినవి.పానపట్టాలు మాత్రం ఏకశిలలోనీవే.8రామేశ్వర లింగం.రామేశ్వరంలో ఉన్న శివలింగాన్ని పోలి ఉంటుంది.లింగం ఎరుపువర్ణంలో ఉంటుంది.సైకత (ఇసుక) లింగం. రామేశ్వర లింగం దర్శించుకున్నంత పుణ్యం ఉంటుందట.

శ్రీ పక్ష ఘాత లింగం.

అష్టాలయాలు మొత్తం మెత్తటి (soft schist) శిలయందు నిర్మింపబడినది. అడుగడుగునా పల్లవ శిల్పకళ కనిపిస్తుంటుంది. వీరి నిర్మాణ రీతి ప్రకారం,మొదటి నాలుగు తొలి దశకు,మిగిలిన నాలుగు మలిదశకు చెందినవి.ఒక పెద్ద గుర్రపునాడ ఆకారంలో గల ఏకశిలా గుట్ట యొక్క ఏటవాలు ముఖ భాగాన చెక్కబడినది. మొదటి నాలుగింటిలో చతురస్రాకారపు గర్భ గృహం.ముందు భాగాన మంటపాలు లేవు,పై భాగంలో అలంకరణ అంతగా లేదు.మిగిలిన నాలుగు చతురస్రాకారపు మండపం,మండపం నందు రెండు కుడ్య స్తంభాలు కలిగి,స్తంభాల పాదాల యందు ఆసీన సింహాలున్నాయి.కపోతo పై లింగాలు,కొన్ని అలంకరణలు న్నాయి.

అష్టలింగాలు దేశంలోని ప్రధాన ఆలయాల లింగాలను పోలి ఉండటం,ఆలయాలు ఏకశిలలో ఉండటం భైరవకోన ప్రత్యేకత.ఈ అష్టలింగాలన్ని బ్రహ్మసూత్ర లింగాలట.ఒక లింగాన్ని దర్శించుకుంటే 1000 లింగాలు దర్శించుకున్నంత పుణ్యం ఉంటుందట.అష్టలింగాలకు,పద్మ(లట.నాకు తెలియదు)లింగాలకు తేడా మా ఫ్రెండ్ చెప్పినది.

శివుని కోసం చెక్కిన ఈ గుహాలయాలలో శివుడు లింగరూపంలో గర్భగుడిలో పూజలు అందుకుంటుంటే,ప్రతి ఆలయ ప్రవేశ గోడమీద కుడి ఎడమల వైపుగా బ్రహ్మ(ఎక్కడ బ్రహ్మకు రూపం ఉండదట.ఇక్కడ గుహాలయాలన్నింటిలో బ్రహ్మ ఉంటారు)విష్ణు రూపాలు,శివ పరివారంగా పిలవబడే శృంగి,భృంగి(ఈ విగ్రహాలకు తలపాగాలు ఉంటాయి)విగ్రహాలు చెక్కబడినవి.ప్రతి ఆలయానికి ముందు ఎడమవైపు వినాయకుడు,కుడివైపు చండీశ్వరుడు,ప్రతి ఆలయం ముందు నంది ఉంటాయి.ఏకశిలా గుహాలయాలే కాక ఏకరూపత ఉండటం కూడా ఇక్కడ ప్రత్యేకత అని చెప్పాలి.

అష్టాలయాలలో కాశివిశ్వేశ్వరలింగం ఆలయం ఎదురుగా ఓకే విగ్రహంలో శివ కేశవులు(హరిహారులు),ప్రక్కనే నటరాజ లింగం చాలా అందంగా కనిపిస్తున్నాయి. శంఖు,చక్రాలు, ఆయుధాలు,మెడకు,చెవులుకు,చేతులకు పెట్టిన నగలు,చేతుల వంపులు,పిడికిలి,నాట్య ఒంపులు చాలా స్పష్టంగా,అందంగా కనిపిస్తున్నాయి.

విగ్రహాల వెనుక బిల మార్గం.

ఇక్కడున్న మరో ప్రత్యేకత కాకి వాలదట.కాకి శనేశ్వరుని వాహనమట.ఇక్కడ శనీశ్వరుని ప్రభావం లేదు కనుక కాకి వాలదట.కాకి లేదు కాబట్టి వేప చెట్టు మొలవదట.వేపకాయలను కాకులు తిని రెట్టల వేయడం ద్వారా విత్తనాల సరపరా ఉంటుంది.కాలసర్పాలు,విషనాగులు ఉన్నా ఎవరిని ఏమీ చేయవట.కాటేసినట్టు వినలేదు అంటారు.సర్పాల గురువు శేషముని శాపం వల్ల కరవని అంటారు.

అష్టాలయాలకు మూలగా (ఈశాన్యం అనుకుంటా)కొంచెం ఎత్తుగా చిన్నకొండ మీద అన్నపూర్ణదేవి,అష్టలక్ష్మిదేవి విగ్రహాలు,కొంచెం వెనుకగా అఖండ జ్యోతి వెలుగుతున్న బిల(సొరంగ)మార్గం ఉంది.ఇది భలే నచ్చింది.ఈ అఖండ జ్యోతి భక్తులిచ్చిన కానుకలతో ముప్పై మూడు సంవత్సరాలుగా వేలుగుతూనే ఉందట. అక్కడున్న కాషాయబట్టల యోగి ఉదయం 5 గంటలకు,సాయంత్రం ఐదు గంటలకు అఖండ జ్యోతిలో నూనె పోస్తాడట.ఆరిపోయే ప్రసక్తే లేదు అని గట్టిగా చెప్పాడు.బాగా తలవంచి, ఫోన్లో టార్చ్ లైట్ వేసి చూస్తేనే ఈ అఖండజ్యోతి వెలుగుతున్న గుహ స్పష్టంగా కనిపించింది.గాలి వెలుతురు లేని చీకటిలో కొండ చెక్కడం మహా అద్భుతంగా అనిపించింది నాకు.విగ్రహాలకు కుడివైపున తలుపు ఉన్న మరొక గుహభాగం కనిపించింది.పామూరు నుండి అనుముల కొండ వరకు ఈ సొరంగమార్గం ఉందట.

కుడివైపున కావడి సుబ్బయ్య బోర్డు ఉన్న మరోక రాతి శిల్పం కనిపించినది.1930-35 ప్రాంతంలో సి.ఎస్.పురం మండలంలోని 42 గ్రామాలలో బిక్షటన చేసి ఈ అమ్మవార్లకు ధూప, దీప,నైవేద్యం పెట్టుకుంటూ ఈ బిలంలోనే కావడి సుబ్బయ్యగారు ఉన్నారట.సుబ్బయ్య గారి వలనే ఈ చుట్టుపక్కల ఉన్న వారికి ఈ భైరవకోన గురించి తెలిసిందట.దార్లు రోడ్లు భవనాలు ఏమీ లేవట అప్పట్లో.సుబ్బయ్యగారు చెప్పే వరకు ఎవరికీ ఈకోన గురించి తెలియదట.ఆ పక్కనే నాగమునీంద్రస్వామి,శివరామ బ్రహ్మేంద్ర విగ్రహాలు ఉన్నాయి.ఇద్దరూ గురుశిష్యులట.ఈ గురుశిష్యులే ఇక్కడి గుహాలయాలను చెక్కారట.ఈ ఇద్దరు ఋషులట.ఆ యోగి ఈ విషయాలన్నీ చెప్పాడు. రాత్రి పగలు అక్కడే ఉంటాడట.అతని పేరు హడావుడిలో అడగడం గుర్తు రాలేదు.అందరూ స్వామి స్వామి అంటున్నారు.

భైరవకోనలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది "సోనావాన" జలపాతం గురించి. ఈ జలపాతం లో మునిగితే కొన్ని రోగాలు పోతాయట.ఆజలపాత నీరు అనేక ఔషధ చెట్లు,మొక్కలు,మట్టి నుండి ప్రవహిస్తోంది కనుక.మా ఫ్రెండ్ కరువుతీరా మునిగి,నేను ఎంత తెల్లగా వచ్చానో అనడంతో నవ్వుల పువ్వులు పూయించాం.

ఈ జలపాతం,వర్షాలు లేనప్పుడు,మండు వేసవిలో కూడా ఎండిపోదట.జలపాతానికి అడ్డుగా నీరు నిలవడానికి పెద్ద తొట్టిలా గోడ కట్టారు.ఆ గోడకు పెట్టిన జంతువుల నోటి నుండి నీరు క్రిందకు ప్రవహిస్తుంది.ఆ నీరు అష్టాలయాల ముందుగా పారుతుంది.వర్షాకాలంలో నీటి ఉద్ధృతి పెరుగుతుందే కానీ లోతు పెరగదట.నడుము లోతు ఉంది.అంత లోతులో కూడా అడుగున స్పష్టంగా కనిపిస్తుంది.మిగతా జలపాతాలాగా దూరము నుండి చూసి ఆనందిoచడం కాకుండా జలపాతం కింద హాయిగా ఎంజాయ్ చేయవచ్చు.నీటి ఉధృతి ఎక్కువ అయినప్పుడు ప్రజలను జలపాతం వైపు పోకుండా ఆపివేస్తారు.మండు వేసవిలో ఇక్కడ చెట్ల కింద చాలా చల్లగా ఉంటుందట.

ఒంగోలు నుండి పొదిలి కనిగిరి సి.ఎస్.పురం మీదగా ఒకదారి.ఒంగోలు కందుకూరు పామూరు,సి.ఎస్.పురం మీదగా మరొక దారి ఉంది. 9 గంటలకల్లా వెళితే నిదానంగా చూసుకుని తిరిగి రావచ్చు.అన్నట్లు ఇక్కడ గైడ్ వుండరు.పూజారులు, అర్చన చేసే పూజారి సుధాకరశర్మగారిని అడిగితే (భక్తుల ఒత్తిడి లేకపోతే)వివరంగా చెప్తారు.మేము కొత్త సంవత్సరం రోజు వెళ్లాం కనుక భక్తుల సంఖ్య ఎక్కువగానే ఉంది.వస్తూ దారిలో మిట్టపాలెంలోని నారాయణ స్వామి గుడి కూడా చూసి వచ్చేము.

ఒక్కసారి భైరవకోన వెళ్లి అష్టాలయాలు చెక్కిన శ్రమను,నల్లమల్ల అడవుల అందాన్ని,సోనా వాన జలపాతoలో మునిగి ఆనందాన్ని పొంది రండి.కాని మీరు తీసుకెళ్లిన పదార్థాలతో,ప్లాస్టిక్తో అక్కడి వాతావరణంను కాలుష్యం చేయవద్దు అని కోరుతున్నాను.

Read More
Next Story