‘తాకట్టులో రఘనాథ్’ నవల  సమీక్ష
x

‘తాకట్టులో రఘనాథ్’ నవల సమీక్ష

కాశీనాథ్ సింగ్ హిందీ నవల ‘రెేహన్ పర్ రఘ్గూ’ తెలుగు అనువాదం ‘తాకట్టులో రఘనాథ్’ ఈ ఉదయం రాజమహేంద్రవరంలో ఆవిష్కరణ.



-డాక్టర్ గూటం స్వామి

ఆధునిక యుగంలో బహు జనాదరణ పొందిన వాఙ్మయ ప్రక్రియ నవల. పాశ్చాత్యుల నుంచి సంక్రమించిన ఈ సాహిత్య ప్రక్రియలో ఎంతోమంది లబ్ధ ప్రతిష్ఠులైన రచయితలు చారిత్రక, సాంఘిక, పౌరాణిక, రాజకీయ, డిటెక్టివ్ నవలలను రాసి మెప్పించారు. కందుకూరి నుంచి యండమూరి వరకు ఎంతోమంది తెలుగు నవలా ప్రపంచాన్ని ఒక ఊపు ఊపారు. ఇప్పటికీ నవలలకు ఏమాత్రం ఆదరణ తగ్గలేదని రూఢీగా చెప్పవచ్చు. అందుకు సాహిత్య అకాడమీలు ఎంతో ప్రోత్సాహం అందిస్తున్నాయి.


ఈ నేపథ్యంలో హిందీలో నవలల, చిన్న కథల, సంస్కరణ రచనల్లో ప్రసిద్ధి చెందిన భారతీయ రచయిత కాశీనాధ్ సింగ్ రాసిన "రేహన్ పర్ రఘూ’ (Rehan Par Ragghu) నవలను ప్రముఖ రచయిత, అనువాదకులు దక్షిణ భారత హిందీ. ప్రచార సభ విజయవాడలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న డాక్టర్ పేరిశెట్టి శ్రీనివాసరావు గారు తెలుగులో 'తాకట్టులో రఘునాథ్" పేరుతో అనువాదం చేశారు. దీనిని కేంద్ర సాహిత్య అకాడమీ ముద్రించింది. హిందీ మూలానికి 2011 లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చింది. అలాంటి అవార్డు నవలను అంతే క్వాలిటీతో అనువాదం చేశారు. చదువుతున్నంత సేపు ఇది అనువాద నవల అని పాఠకుడికి ఎక్కడ అనుమానం రాదు.


నేటి ఆధునిక యుగంలో మనిషి ఆలోచనలు, మానవ సంబంధాలు, మారిన జీవన విధానాలు, లోపిస్తున్న మానవ విలువలు, చుట్టూ అల్లుకున్న కధాంశంతో రూపుదిద్దుకున్న ఈ ‘తాకట్టులో రమునాధ్’ సేవల చదువుతున్నంత సేవు ఎవరికి వారు ఆయా పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసేస్తారు. ఆ పాత్ర తమదిగా భావిస్తారు.


ఈ పాత్ర ఎక్కడో, ఎవరిలోనో చూశాను అనే భావన స్ఫురిస్తుంది. సగటు మనిషి జీవన శైలి పాఠకుడిని గట్టిగా పట్టుకుంటుంది. మూడు విభాగాలుగా అల్లుకున్న ఈ నవల చదవరుల్లో ఉత్కంఠ రేవుతుంది. ఉక్కిరిబిక్కిరి చేస్తుంది.




కధాంశంలోకి వెళితే, మొదటి భాగం వర్షంతో ప్రారంభమవుతుంది. వర్షం వచ్చేముందు ఆకాశంలో కనిపించే మార్పులు, వర్షం కురుస్తున్నప్పుడు ప్రకృతి చేసే అట్టహాసం, పరిసరాల్లో నెలకొనే పరిస్థితులు, అన్నింటిని కళ్ళ ముందు నిలపాడు రచయిత. ఈ నవల అంతా ఉత్తమ పురుషలో సాగుతంది. 70 సం.ల రఘునాథ్ తన గత్తాన్ని గుర్తు చేసుకోవడంతో కథ ప్రారంభమవుతుంది. వృద్ధాప్యంలో వర్షం లో తడవాలి, చిన్నప్పటిలా ఆడుకోవాలి అనే అభిలాషే వర్షంలోకి వెళ్లి అక్కడ స్పృహ తప్పి పడిపోతూ గతం గుర్తు చేసుకుంటాడు రఘునాధ్. గతం తాలూకు జ్ఞాపకాలు తన కుటుంబాన్ని, తన స్థితి గతులను కళ్ళ ముందు కదలాడుతున్నట్టుగా ఒక్కొక్కటిగా జ్ఞాపకం వచ్చాయి.


పహార్ పూర్ గ్రామానికి చెందిన రఘునాథ్ గ్రామం మొత్తం మీద చదువుకున్న ఏకైక వ్యక్తి. కాలేజీలో లెక్చరర్. అందమైన వాడు. ఆయన భార్య పేరు శిల. ఆయనకు ముగ్గురు సంతానం. కూతురు పేరు సరళ. కొడుకు పేరు సంజయ్. సాఫ్ట్వేర్ ఉద్యోగి అమెరికాలో, ఇంకో కొడుకు పేరు ధనంజయ్ చిరు ఉద్యోగి.


కాశీనాథ్ సింగ్

ఈ ముగ్గురు పిల్లలు కూడా వారి వారి అభీష్టాల ప్రకారం పెళ్లిళ్లు చేసుకున్నారు. అది రఘునాథ్ కి నచ్చలేదు. అందువల్ల పిల్లల్ని దూరం పెట్టాడు. వాళ్లను దగ్గరికి తీసుకోలేదు. ఎంతసేపు తన మాట నెగ్గాలని చూసే స్వభావం కలవాడు రఘునాథ్. దాంతో అతను కుటుంబానికి దూరమయ్యాడు. చివరికి భార్య ప్రేమ పొందడంలోనూ విఫలమయ్యాడని చెప్పవచ్చు. కొడుకు సంజయ్ తను చూసిన సంబంధం కాకుండా వేరే సంబంధం చేసుకుని అమెరికా వెళ్లిపోయాడని కోపం! ధనుంజయ్ కూడా పెళ్లయిన అమ్మాయిని ప్రేమించాడని కోపం! కూతురు సరళ ఒక తక్కువ కులం వాడిని ప్రేమించిందని అసహ్యం! పెద్ద కొడుకు పెళ్లి తన ఉద్యోగానికి ఎసరు పెట్టింది. ఇంకా కొంత సర్వీస్ ఉండగానే ఉద్యోగం మానేసి తన సొంతూరు వెళ్లిపోవడంతో మొదటి భాగం పూర్తవుతుంది.


ఇక రెండో భాగంలో ఉద్యోగం మానేశాక తన సొంతూరు వెళ్లిపోతాడు. రఘునాథ్. అక్కడ తన పూర్వీకుల నుంచి సంక్రమించిన ఇంట్లో ఉంటూ గ్రామంలో యాక్టివ్ గా తిరుగుతూ చిన్ని చిన్ని తగాదాల్లో తల దూరుస్తూ ఉంటాడు. అప్పుడప్పుడు దళిత కులాల పక్షాన మాట్లాడటం, తన కులం వారి చేత ద్వేషించబడటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. తన ఇంటి దగ్గర చిన్న జాగా విషయంలో దాయాదులతో జరిగిన తగాదాలు. రఘునాధ్ దెబ్బలు కూడా తినవలసి వస్తుంది.


ఈ విషయం అమెరికాలో ఉన్న పెద్ద కొడుకు సంజయ్ కి చెబితే ఆ ఊల్లో ఎందుకు పట్నం వెళ్ళిపో.. అని ఉచిత సలహా ఇవ్వడంతో కొడుకు పై కోప్పడతాడు. రెండో కాదుకు ధనుంజయ్ కి చెబితే అక్కడి నుంచి అదే సమాధానం. ఇలా సంకట స్థితిలో ఉన్నప్పుడు సంజయ్ భార్య సోనాల్ ఇండియా వచ్చేయడం, తన తండ్రి సెక్సేనా ఆశోక్ వివాహార్ అనే కాలనీలో కట్టించిన చిన్న బంగ్లాలో ఉండడం, ఆ ఇంట్లో సోనాల్ ఒంటరిగా ఉండటానికి భయపడి తన మామగారు రఘునాథను అత్త శీల ను తమ వద్దకు తెచ్చుకోవడంతో ఈ భాగం ముగుస్తుంది.


ఇక మూడో భాగానికి వస్తే ఇందులో పట్టణానికి గ్రామానికి మధ్య ఉండే వ్యత్యాసాలు రఘునాథ్ గుర్తు చేసుకుంటాడు. మహానగరాల సంస్కృతిని మననం చేసుకుంటాడు. తన కోడలు ఇల్లు, అశోక విహార్ లోని పరిస్థితులను, అక్కడి మనుషుల స్థితిగతులను, ఆ కాలనీ మొత్తం వృద్ధులతో నిండి ఉండటాన్ని. రచయిత చాలా చక్కగా చెబుతాడు.


పిల్లల కోసం పుట్టిన ఊరు వదిలి ఇలాంటి నగరంలోకి వచ్చే వృద్ధ తల్లిదండ్రుల స్థితిగతులను రచయిత కళ్ళ ముందు ఉంచుతాడు. వారి మానసిక స్థితిని విడమర్చి తెలుపుతాడు రఘునాథ్ పాత్ర ద్వారా. ఇక తన కోడలు సోనల్ తన అత్త గారితో కొన్ని విషయాల్లో విభేదించడంతో పొరపచ్చలు ఏర్పడి శీల తన కూతురు సరళ ఇంటికి వెళ్లి పోతుంది. అయితే రఘునాథ్ లౌక్యం తెలిసినవాడు. కాబట్టి కోడలు దగ్గరే ఉండిపోతాడు. ఇలా రోజులు జరుగుతుండగా తనే ఊర్లో తన పొలం చూసుకుంటున్న సనేహి ఒకసారి ఫోన్ చేసి ఎవరో ఇద్దరు వచ్చి తమరు వివరాలు అడిగారని చెప్పడంతో ఆలోచనలో పడ్డ రఘునాథ్ తన దాయదులు తనను చంపడానికి మనుషులను కిరాయికి పెట్టారేమో అని అనుమానం పడతాడు.


తన అనుమానించింది నిజమైంది. ఒకరోజు ఇద్దరు వ్యక్తులు బొలెరో జీపులో వచ్చి రఘునాథ్ ని బెదిరించి తన ఊర్లో పొలాలకు ఇంటికి సంబంధించిన ఆస్తులపై హక్కు కోసం బెదిరించి కాగితాలపై సంతకాలు పెట్టమని బలవంతం చేయగా పరిస్థితిని అర్థం చేసుకున్న రఘునాథ్ తనని చంపడానికి డబ్బులు ఇచ్చిన వాళ్ళ కంటే రెట్టింపు ఇస్తానని వాళ్ళని ఒప్పించి తనను ఎవరైతే చంపమని పురమాయించారో వారిని చంపితే మీకు ధనం ముట్ట చెప్తానని వారిని తన మాటలతో ఒప్పిస్తాడు.


దానికి ఇద్దరు వ్యక్తులు అంగీకరిస్తారు. అంగీకరించి రఘునాథ్న వేరే ప్రాంతానికి తీసుకెళ్తారు. ఇలా వెళ్లడంతో నవల ఇతివృత్తం ముగుస్తుంది.


నూటడభ్భైరెండు పేజీల ఈ నవల చదువుతున్నప్పుడు అడుగడుగునా ఉత్కంఠ కలిగిస్తుంది. ఎన్నో జీవిత సత్యాలు మనకు అందిస్తుంది. రచయితకు వందలాది కథలు, నవలలు, రాసిన అనుభవం ఉండడంతో తన అనుభవ సారాన్ని మొత్తం ఈ నవలలో పొందుపరచి పాఠకులను మెప్పించాడు. ఆలోచింపజేశాడు. వర్షం పడుతున్నప్పుడు "వర్షపు బిందువులు ఒంటిపైన గాజు గోలీల్లా తగులుతున్నాయి" అంటాడు రచయిత.” జీవనానుభవం కంటే జీవితం చాలా గొప్పది.


అసలు జీవితమే లేకపోతే అనుభవం ఎవరికోసం?" అంటూ అనుభవానికి, జీవన అనుభవానికి గల వ్యత్యాసాన్ని రచయిత చక్కగా నిర్వచించడం కనిపిస్తుంది. పిల్లల కోసం తను ఎంత కష్టపడింది చెబుతూ "తన శక్తినంతటినీ, బుద్ధిని, పెట్టుబడి మొత్తాన్ని పిల్లల్ని తీర్చిదిద్దడానికి వెచ్చించాడు" అని చెప్పడం వల్ల బాధ్యతలను విస్మరించిన తండ్రిగా రఘునాథ్ పాత్రని కళ్ళ ముందు నిలపాడు.


తన కొడుకు సంజయ్ సోనాల్ ను ప్రేమ గురించి చెబుతూ" ప్రేమ ఎంత లోతయిందో అంత విశాలమైంది" అని రచయిత ప్రేమ గురించిన అభిప్రాయాన్ని రఘునాథ్ తో పలికించి ఇక సంజయ్ ఆడపిల్లల గురించి చెబుతూ “ఆడపిల్లల్లో ఎంత తేడా అంటే ప్రేమించిన అమ్మాయిని, భార్యను ఒకే విధంగా చూడలేము. ప్రేమించిన అమ్మాయిలు రూపం, రంగు, హావభావాలు, తీరు తెన్నులు చూస్తాం కానీ భార్యలో కాదు" అని పలికించడం రచయిత పరిణితిని స్పష్టం చేస్తుంది.


సంజయ్ తండ్రి వేరే అమ్మాయిని సంజయ్ కోసం కుదిర్చి ఉంచాడు. అదే విషయం సోనాల్ తండ్రి సక్సేనాకు సంజయ్ చెబుతాడు అప్పుడు సోనాల్ తండ్రి పలికిన మాటలు సంజయ్ ఆలోచనలని మార్చివేస్తాయి. అంత గొప్పగా రచయిత అక్కడ మాట్లాడతాడు "తల్లిదండ్రులను భూమితో పోల్చడం వారి ఆకర్షణలో పడితే ఎత్తుకు వెళ్లలేమని నువ్వే ఆలోచించు"అని చెప్పడంతో ఆ దెబ్బకు బుర్ర తిరిగిన సంజయ్ తండ్రి తెచ్చిన సంబంధం కాకుండా తన ప్రొఫెసర్ కూతురైన సోనాల్ ని పెళ్లి చేసుకుంటాడు.


ఈ విషయం తెలుసుకున్న రఘునాథ్ "తల్లిదండ్రుల గౌరవం నిలపలేనివాడు మరణించిన వారికింద లెక్క,” అని అంటాడు. ఆరోజు నుంచి సంజయ్ ని దూరం పెట్టడం సహజంగా చిత్రీకరించి పాఠకుల్ని ఆలోచింపచేసాడు.


అలాగే కూతురు ఒక దళితుడిని ప్రేమిస్తే రఘునాథ్ తీవ్రంగా వ్యతిరేకిస్తాడు. ఆ దెబ్బతో తన కూతురు సరళ ఇల్లు విడిచి వెళ్ళిపోతుంది. ఇక సరళ స్నేహితురాలు ఉపదేశంతో జీవితం పై ప్రేమ, పెళ్లిపై ఒక నిశ్చితాభిప్రాయానికి వస్తుంది. అంతకంటే ముందు సరళ ఒక లెక్చరర్ తో ప్రేమకలాపాలు సాగించే సన్నివేశాలు కూడా ఈ నవలలో చూడొచ్చు. అలాగే ముసలి వయసులో రఘునాథ్కు తన భార్యపై కలిగిన శృంగార భావనలను రచయిత కాస్త మోతాదుకు మించి చెప్పడం జరిగింది. ఇది నవల కాబట్టి కాస్త మసాలా అవసరం అని రచయిత భావించి ఉండవచ్చు.


కట్టుబాట్లు, సాంఘిక జీవనం, ప్రజల మధ్య ఉండే సంబంధాలు, కుల మతాల గందరగోళం రచయిత కళ్ళకు కట్టినట్లు చెప్పడం అందరిని ఆలోచింపజేస్తుంది. పల్లెల్లో ఉండే ఆధిపత్య పోరు, కులాల కుమ్ములాటలు గురించి రచయిత చెప్పిన తీరు వాస్తవ పరిస్థితులకు పడుతుంది.


ఇక మూడో భాగానికి వస్తే రఘునాథ్ తన కోడలు ఇంట్లో ఉండడం, వృద్ధాప్యపు బాధల్ని కళ్ళకు కట్టినట్లు చిత్రించి పాఠకులను ఆలోచింప చేస్తాడు రచయిత. ఓ చోట రచయిత ‘‘నిశ్శబ్దానికి కూడా తనదైన స్వరం ఉంటుంది ఈ స్వరాలు వినడం కాదు. కనిపిస్తాయి" అని చెప్పడం బాగుంది. "పార్కులో జీవం లేని ఎండుటాకులు గాలికెగురుతున్న నవ్వడి" అని వృద్ధులు పార్కులో సేదతీరడం గురించి చెప్పడం రచయిత అనుభవ జ్ఞానాన్ని తెలుపుతుంది.


ఇలా చెప్పుకుంటూ పోతే నవల మొత్తంలో ఎన్నో ఆలోచింపచేసే విషయాలు ఉన్నాయి. అనుభవాల రసాలు ఉన్నాయి. ప్రేమ గురించి, పెళ్లి గురించి, మానవ సంబంధాల గురించి, అత్తా కోడలు మధ్య ఉండవలసిన సంబంధాలు గురించి, కన్నబిడ్డల పట్ల ప్రవర్తించవలసిన తీరు గురించి, వృద్ధాప్యంలో వృద్ధుల మనసులోని భావాలు, పల్లె వాతావరణం గురించి, పల్లె మనుషులు అంతరంగాలు గురించి, వయసులో చేసే తప్పులు, వారు వాటిని సరిదిద్దుకునే తీరు గురించి, పగలు, ప్రతీకారాలు, పట్టింపులు గురించి, ఎదుటివారితో మాట్లాడే విధానం గురించి, జీవిత సత్యాలు, జీవన సరళ గురించి, ఎన్నో విషయాలు ఈ నవల ద్వారా తెలుసుకోవచ్చు.


డాక్టర్ గూటం స్వామి

నవలా రచయిత కాశీనాథ్ సింగ్ తన అనుభవం మొత్తాన్ని రంగరించి తీర్చిదిద్దిన నవలగా భావించవచ్చు. ఈ నవలను తెలుగులోకి అనువదించిన డాక్టర్ పేరిశెట్టి శ్రీనివాసరావు మూల రచనకు ఏమాత్రం తీసుపోని విధంగా అనువదించి పాఠకులను ఆశ్చర్య పరుస్తారు. ఈ నవల డైరెక్ట్ తెలుగు నవల లాగే కనిపిస్తుంది. ఇక్కడి నేటివిటికి దగ్గరగా అనువదించడం అనువాదకుని యొక్క గొప్పతనం. తెలుగులో ఉండే వద్ద గుంపనలు, సామెతలు, జాతీయాలు, అనేకం అనువాదకుడు శ్రీనివాసరావు ప్రయోగించి మెప్పించాడు. మాండలికాలు సందర్భానుసారంగా ప్రయోగించడం తెలుగు అనువాదంలో మరో విశేషం. కొంకర్లుపోతూ, ఉల్లిపాయలు నంజుకోవడం, నీరు దహనం అయిపోవడం, నవ్వుతూ తులుతూ, అల్లాటప్ప, కర్యనస్వరం, కూరలు, నారలు, లెగవచ్చు. దుష్ట సంతోషం, ఆగ్రీ దోస్త్ "ఇలా ఎన్నో వ్యవహారిక, గ్రామ్య గ్రాంధిక, పడిగొట్టు పదాలు ప్రయోగించి తెలుగు భాష పై శ్రీనివాసరావు కు ఉన్నపట్టు ఈ నవల ద్వారా తేటతెల్లమవుతుంది.

అనువాద సాహిత్యలో శరత్ బాబుకి మంచి పేరు ఉంది. నవలలను అనువార చేయడం ద్వారా శరత్ కు ఎంత పేరు వచ్చిందో డాక్టర్ పేరిశెట్టి శ్రీనివాసరావు అనువాదానికి అంత పేరు వస్తుందని ఈ నవల అనువాదం ద్వారా నిరూపితమైంది. వెంకటపార్వతీశం కవులు, తల్లావజ్ఝుల శివశంకర శాస్త్రి, జొన్నలగడ్డ సత్యనారాయణమూర్తి, పులుకుర్తి లక్ష్మీ నరసమాంబ, చాగంటి శేషయ్య, వంటి అనువాద రచయితలు ఎంత పేరు సంపాదించారు. డాక్టర్ పేరిశెట్టి శ్రీనివాసరావు ఈ నవల అనువాదం ద్వారా వారి సరసన చేరాడు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. శ్రీనివాసరావు మరిన్ని అనువాదాలు చేసి తెలుగు కళామతల్లి సిగలో కలికితురాయిగా భాషించాలని ఆశిస్తున్నాను.


Read More
Next Story