కాశ్మీర్ ను ఒకసారి  సందర్శిస్తే చాలా భ్రమలు తొలగిపోతాయి
x

కాశ్మీర్ ను ఒకసారి సందర్శిస్తే చాలా భ్రమలు తొలగిపోతాయి

వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి కాశ్మీర్ యాత్ర విశేషాలు: కాశ్మీర్ లో లౌకిక అద్భతం కనిపిస్తుంది. దానిని హిందూదేవాలయాల దారిలో చూడవచ్చు. అదేంటంటే...


-వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి


కాశ్మీర్ లో ప్రకృతి అందాలు సైన్యం కాపలాలే కాదు, విచిత్రంగా లౌకిక తత్వం కూడా కనిపిస్తుంది. కాశ్మీర్ ను సందర్శించాక మనకున్న చాలా భ్రమలు తొలగిపోతాయి. అందుకే కాశ్మీర్ ను ఒక సారి సందర్శించాలి.అక్కడి జీవితాలను కళ్లారా చూడాలి.




అక్కడ ప్రజలు పర్యాటకుల పట్ల ఎంతో ఆదరణ, గౌరవ అభిమానాలను అందించటం గమనార్హం. వేలాది మంది డ్రైవర్లు, ఎత్తైన కొండలపై ఘాట్ రోడ్ లో వాహనా లను నడుపుతున్నా ఎలాంటి ఘర్షణలు గొడవలు లేకుండా క్రమశిక్షణలతో వారి బాధ్యతలను నిర్వహించడం మేము గమనించాము. మా పర్యటనలో అద్భుతమయిన దృశ్యం వందలాది మంది ముస్లింలు హిందూ భక్తులను ఎత్తయిన కొండ మీద ఆలయానికి చేర్చడం. అందుకే జీవితంలో ఒక్కసరైన కాశ్మీర్ అందాలను, సాంఘిక అద్భుతాలను తిలకించటం మంచిదని భావిస్తున్నాము.


కాశ్మీర్ లోయలో మినహా మరి ఎక్కడ వ్యవసాయం చేయటం కనపడలేదు. ప్రధాన ఆదాయ వనరులు టూరిజంగా భావిస్తున్నాము. మేకలు, గొర్రెల పెంపకం, యాపిల్, వాల్ నెట్స్ ఉత్పత్తి వస్త్రాల తయారీ పై అత్యధిక ప్రజలు ఆధారపడి జీవిస్తున్నారు. సైనిక బలాలుశాంతి భద్రతల విషయమే కాకుండా ట్రాఫిక్ సమస్యను పరిష్కరిస్తూ పర్యాటకులకు అందుబాటులో ఉంటూ, సలహాలు ఇస్తూ కాశ్మీర్ ను సురక్షితంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.




కమేము 12 మంది మిత్రబృందంతో కలిసి కాశ్మీర్ అందాలను ఆస్వాదించడానికి ఈనెల 5వ తేదీన గుంటూరు నుండి బయలుదేరాము. జూన్ 6వ తేదీన జమ్ము పట్టడానికి చేరుకుని సైనిక అమర వీరుల జ్ఞాపకార్థం 2009లో నిర్మించిన బలిదాన స్తూపాన్ని సందర్శించి అమరు లైన 4575 వీర సైనికుల త్యాగాలను స్మరించుకొని, నివాళులు అర్పించాము.

జూన్ 7వ తేదీన ప్రముఖ శక్తి పీఠమైన వైష్ణవి దేవి దేవాలయాన్ని సందర్శించాము. 5200 అడుగుల పైన ఉన్న వైష్ణవి మాతను సందర్శించుకోవడానికి హెలికాప్టర్, డోలీలను, గుర్రాలను ఉపయోగించుకున్నాము. వందలాది ముస్లింలు హిందూ భక్తులను డోలీలపై మోయట గుర్రాలపై తీసుకుని వెళ్ళటం భారతదేశ లౌకికత్వానికి నిదర్శనంగా కనపడింది.



జూన్ 8న కాశ్మీర్ లోయ ముఖద్వారం అయినా పహల్ గామ్ ను సందర్శించి అతి శీతలమైన, ఎత్తయిన సింటన్ టాప్ అందాలను తిలకించాము. జూన్ 9న అమర్ నాథ్ యాత్ర ప్రారంభమయ్యే చందన్ వాడిని సందర్శించి ఆ తర్వాత బెతబ్ వ్యాలీని తిలకించాము.




ఈ పర్యటనలో లక్షలాది పొడవైన ఫైన్ వృక్షాల అందాలను తిలకించి ఆనందపడ్డాము. వేలాది అడుగుల ఎత్తులో అక్కడక్కడ చిన్నచిన్న ఇళ్లలో జీవిస్తూ మేకలను, గొర్రెలను పెంచుకుంటూ జీవనం గడిపే పేద ముస్లింలను చూడగలిగాము. జూన్ 10న అవంతిపురలోని ఎయిర్ ఫోర్స్ క్యాంపు ఆఫీసును సందర్శించి అక్కడ వింగ్ కమాండల్ గా పనిచేస్తున్న సజ్జ చైతన్య అతిద్యాన్ని స్వీకరించి వారి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపాము. ఎయిర్ ఫోర్స్ కార్యకలాపాలను, సరిహద్దు భద్రతా దళాల పనితీరును గమనించగలిగాము.




జూన్ 11న జమ్మూ కాశ్మీర్ వేసవి రాజధాని అయిన శ్రీనగర్ చేరుకుని అతి పురాతనమైన అష్టభుజి ఆకృతిలో ఉన్న శంకరాచార్య దేవాలయాన్ని సందర్శించాము. క్రీ:శ 936లో నిర్మించిన ఈ దేవాలయాన్ని తొమ్మిదవ శతాబ్దంలో శంకరాచార్య శ్రీనగర్ ను సందర్శించి ఒక గుహలో తపస్సు చేశారని తద్వార శంకరాచార్య దేవాలయంగా ప్రసిద్ధి చెందిందని భావిస్తారు. 250 మెట్లు ఎక్కి వెయ్యి అడుగుల ఎత్తులో గల దేవాలయాన్ని చేరుకున్న తర్వాత అచ్చట నుండి శ్రీనగర్ దృశ్యాలను చూడటం ఆనందదాయకం.





జూన్ 12వ తేదీన గుల్ మార్గ్ ను సందర్శించి కేబుల్ కార్ లో 9వేల అడుగుల పైకి చేరి పశ్చిమ హిమాలయాలలోని పీర్ పంజాల్ పర్వత శ్రేణులను సందర్శించాము. రాజా హరి సింగ్ చే పూర్తి చెక్కలతో నిర్మించబడిన మహారాజా ప్యాలెస్ ను సందర్శించాము. జూన్ 13న గురేజ్ ను సందర్శించి కిషన్ గంగా నది పరివాహక ప్రాంతంలో బండిపుర జిల్లాలలోని పర్యాటక ప్రదేశాలను వీక్షించాము. కిషన్ గంగా నది ఒడ్డున ఐదు టెంట్ లలో 12 మంది మి దగ్గరకు రెండు రోజులపాటు ఉండి పరిసర ప్రాంతాలను పరిశీలించాము. జూన్ 15న గురేజ్ నుండి బయలుదేరి కిషన్ గంగా డ్యాం, రాజధాన్ పాస్ లను ,పీర్ బాబా దర్గాను సందర్శించాము. పీర్ బాబా దర్గా సర్వ మతాల దేవుళ్లను ప్రతిష్టించి భక్తుల అభిమానాన్ని చోరగన్నది.





శ్రీనగర్ కు 30 కిలోమీటర్లు దూరంలో గల శక్తిపీఠమైన కీర్ భవాని ఆలయాన్ని సందర్శించి జేష్ఠ మాసంలో శుక్రవారం నాడు భవాని మాత భారీ ఉత్సవంలో పాల్గొన్నాము. వేలాదిమంది భక్తులు ఈ ఉత్సవంలో భాగస్వామ్యులైనారు. విజిల్ వుడ్ గెస్ట్ హౌస్ కు చేరుకుని సి0ద్ నది ప్రవాహాన్ని చూస్తూ గడిపాము. జూన్ 16న ఉత్తరభాగాన ఉన్న హిమాలయాలను సందర్శిస్తూ సోన్ మార్గ్ ను తిలకించాము. అచట గల గ్లేషియార్ ను చూసి ఆనందించాము.


అనంతరం రాతి కొండల మార్గం ద్వారా జోజిల పార్కును సందర్శించాము. ఆ తరువాత డ్రాస్ మీదు గా కార్గిల్ మెమోరియల్ వార్ ను సందర్శించి 1999 జూన్ లో పాకిస్తాన్ కు భారతదేశానికి జరిగిన యుద్ధంలో మరణించిన 500 మంది అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించాము. ఇచ్చటగల వార్ మ్యూజియం ను సందర్శించి కార్గిల్ యుద్ధంలో ప్రతి ఘట్టాన్ని వీక్షించాము.

(వ్యాసరచయిత, జనచైతన్య వేదిక, రాష్ట్ర అధ్యక్షులు, ఆంధ్ర ప్రదేశ్ )

జన చైతన్య వేదిక


Read More
Next Story