కౌపీన సంరక్షణార్ధం !

వారం తిరక్కుండా సన్యాసి మళ్ళీ మొహం వేలాడేసుకొని వుండటాన్ని చూసిన పశుల కాపర్లు ఉండబట్టలేక సన్యాసిని వాకబు చేశారు. అప్పుడు మొదలైంది అసలు కథ


కౌపీన సంరక్షణార్ధం !
x
సంస్కృత సామెత

జి.రమేశ్ చంద్రబాబు


కౌపీన సంరక్షణార్థం.. ఇదో సంస్కృత సామెత. ఎందరికో తెలిసిందే. అయినా గోచీ గుడ్డ నుంచి మొదలైన అంతులేని మహా సంసార సాగర ప్రయాణపు కథ పునరావృత్తం కావించవలసిందే!ఒకానొక వూరు! పాడీ పంటలతో, ధన ధాన్యాదులతో, చెట్టూ చేమలతో హాయిగా, ఆనందంగా ఉంది! ఆ ఊరును ఆనుకొని వూరికండగా, కొండగుర్తుగాఉందో కొండ. ఆ కొండమీద ఉంది జీర్ణావస్థలో ఓ దేవాలయం. ఎక్కడి నుంచో.. ఎప్పుడొచ్చాడో గానీ, ఓ సన్యాసి, ఆ గుళ్ళో ఓ గూడు ఏర్పరుచుకున్నాడు. పశుల కాపరులు కొండమీదికెళ్ళినప్పుడు, వాళ్లు వెంట తీసుకుపోయే సద్దిమూటల్ని విప్పి ఓ ముద్ద పెడితే తింటాడు. పెట్టకపోయినా చేయి చాచడు. వచ్చినవారే దయతలచి ఓ పండో, కాయోఇచ్చిపోయే వారు.

వంటి మీదిదే బట్ట.. దండెం మీదదే గుడ్డ...

కొండ మీదున్న సన్యాసికి వంటిమీద ఓ గోచీగుడ్డ, కొమ్మమీద ఆరేసుకున్న మరో గోచీగుడ్డ తప్ప ఇంకెలాంటి ఆస్థిపాస్థులు లేవు. ఉండాలనికోరుకోనూలేదు. కాలం అలా గడిచిపోతుంటే కాలం ఎందుకవుతుంది? ఆరేసుకున్న గోచిని ఎలుకలుకొరకడంతో సన్యాసికి ఎక్కడలేని కష్టాలు మొదలయ్యాయి. సర్వసంగ పరిత్యాగి ఈవిషయంపై లోలోన సతమతమైపోతున్నాడు.
ఓ శుభసమయంలో తనగోడును పశువుల కాపరులతో వెళ్ళబోసుకున్నాడు. అయ్యా స్వామీ ఇదా మీబాధ! అందుకేనా ఈ మధ్య దిగాలుగా ఉంటున్నారు. మీబాధ మేం తీరుస్తాం. రేపు కొండకొచ్చేప్పుడు ఓ పిల్లిని తెచ్చి వదిలిపోతాం. మీ సమస్య కు శాశ్వత పరిష్కారం దొరుకుతుందన్నారు. అన్నట్లే ఉదయాన్నే ఓ పిల్లిని చంకనబెట్టుకొని వచ్చారు. సన్యాసి రెండు రోజులు గమనించాడు. ఎలుకలు మాయం. గోచీ భద్రం.
చివుక్కుమన్న సన్యాసి మనస్సు
అయితే కొండమీద సరైన ఆహారం దొరక్క పిల్లి మూడో రోజుకు కళ్ళు తేలేసింది. సన్యాసి మనసు చివుక్కుమంది. తిరిగి సన్యాసి పశువుల కాపర్లనే ఆశ్రయించాడు. ఒంటరి పిల్లి బిక్కు బిక్కు మంటుంది, పైగా పాలుకూడా పోయాలి అని రెండో పిల్లిని కూడా జతచేసారు. పాలక్యానులు, గిన్నెలు, పళ్ళేలు అన్నీ ప్రత్యక్షమైనాయి. వారం తిరక్కుండా సన్యాసి మళ్ళీ మొహం వేలాడేసుకొని వుండటాన్ని చూసిన పశుల కాపర్లు ఉండబట్టలేక సన్యాసిని వాకబు చేశారు. జంట పిల్లులు మ్యావ్, మ్యావ్ మని నా దుంప తెంపుతున్నాయి అని బాధపడ్డాడు సన్యాసి. ఇంకేం, మర్నాడే రెండు ఆవులు, తోడుగా రక్షణకు రెండు అడవి కుక్కలూను తెచ్చి ఓ గుడిసె, పందిరి వేసి పెట్టారు.
దారి తప్పిన మనసు
ఇవన్నీ చూసుకోలేక సన్యాసి తపస్సు దారితప్పుతుందని గ్రహించి, ఊళ్ళో ఈ పనులన్నీ చక్కబెట్టగల ఓ అనాథ యువతిని ఆశ్రమంలో ప్రవేశ పెట్టారు. ఒకానొక కారుచీకటి కమ్మిన రాత్రి ఆ యువతిలో సన్యాసికి కాంతిరేఖ కనిపించింది. అంతే పెళ్ళి కాని పెళ్ళి జరిగిపోయింది. విషయం తెలుసుకున్న ఊరి పెద్దలు పంచాయితి పెట్టి శాస్త్రోక్తంగా మళ్ళీ పెళ్ళి జరిపించారు. ఇంత సంసారంతో ఈ కొండమీద వుండలేను, కొండదిగి ఊర్లోకి వచ్చేస్తాను అని సంసారిగా మారిన సన్యాసి చేసిన విన్నపాన్ని మన్నించిన ఊరి జనం అందుకు కావలసిన వసతులు ఏర్పాటు చేసుకోవడంలో సహకరించగా, సువిశాలమైన గృహస్తాశ్రమం ఏర్పాటుచేసుకొని పిల్లా పాపా గొడ్డు గోదలతో హాయిగా కాలం గడుప సాగాడు సంసారిగా మారిన సన్యాసి.
అసలు అర్థం ఇదన్న మాట
ఈ సన్యాసి సంసారిగా ఎందుకు మారాడని అడిగితే... ‘కౌపీన సంరక్షణార్ధం‘ అనే జవాబు వచ్చేది. అంటే దానర్ధం విడమర్చి చెప్పాల్సిన పని లేదు. కౌపీనం అంటే ’ గోచి’, సంరక్షణార్ధం అంటే ’ కాపాడుకోవడం’. వెరసి గోచిగుడ్డను కాపాడుకోవడంలో సన్యాసి సంసారిగా మారిన పరిణామ క్రమం ఈ కథ.
ఈ కథని తిరగేసి అల్లితే గోచి కన్నా గొప్ప దరిద్య్రం ఏముందని కూడా చెప్పవచ్చు. సిగ్గుబిళ్ల మాదిరి మిగిలిందదే అయినప్పుడు ఇక పోయేది ఏముంటుంది చెప్పండి..
కొసరుగా ఓ కథ విసురుతా....
ఒక కన్ను కన్ను కాదు , ఒక బిడ్డ బిడ్డా కాదు ! అన్న సామెతకు ఇంకొకటి చేర్చి; ఓకథ కథాకాదు అని పునరావృత్తం అనే మాట లోని త కింద త వత్తు కథను వివరిస్తాను కొసరుగా!
‘పునరావృతం‘ అనే మాటలో ’త’ కింద ’త’ వత్తు ఉండకుండా ఉండటమే. నూటికి నూరు శాతం మనకి అచ్చులో కనపడేది. మరి నేనెందుకు ’ త్తం ’ అని వత్తి పలికాను.గజ్జల మల్లారెడ్డిగారి కుమారుడు, మిత్రుడు గజ్జెల అశోక్ రెడ్డి గారు వివరించారు... వృతం, వృత్తం ల వృత్తాంతం.
ఈ ’ పునరావృతం’ అనే మాట ఏ అర్ధంలో వాడుతున్నాము? రిపీట్ అయ్యింది అనే కదా?వృత్తము (సర్కిల్) లో త కింద త వత్తు ఉంటుందా? ఉండదా? లేక ఉండాలా? ఉండకూడదా?
నూటికి నూరు శాతం ఉండాలనే చెపుతాము. మరి ’పునరావృతము’ లోని త కింద త వత్తు ఎక్కడికిపోయింది!’ఆవరించినది’ అనే మాట ఒకటుందికదా! ఈ పదాన్ని ఎక్కడ ఉపయోగిస్తారు?
’ ఆకాశము మేఘావృతమైనది ’ ఇక్కడ త కింద త వత్తు ఉండదు.ఈ వాక్యంలో ’ ఆవృతము ’ అనే మాటకు అర్ధమేమిటి? ఆకాశమంతా మేఘాలు ఆవరించినవి.
ఈ కాంటెస్ట్ లో ’ మేఘావృత్తమైనది ’ లో వత్తు త ఎలా తప్పు పద ప్రయోగంగా భావిస్తామో! అలానే
’ పునరావృతము’ లో వత్తులేని త ని అలానే భావించాలి.
పదుగురాడు మాట పాడియై ధర చెల్లు
ఒక్కరాడు మాట ఎక్కదెందు
వూరకుండు వాని నోరెల్ల మోపదు
విశ్వదాభి రామ వినురవేమా! ’
’ తొంభైతొమ్మండుగురు చేసిన తప్పు ఒప్పౌతుందా! ’
అనీ మన పెద్దలే చెప్పారు.
తెలుగు భాషాసక్తులు ఎవరికి వారు తర్కించుకుని ఈ విషయములో గజ్జెల అశోక్ గారి తర్కం రైటో! వాడుకలోని పద ప్రయోగం రాంగో! నిర్ణయించుకోవాలి. నామటుకు నాకు ’ పునరావృతం ’ లో త కింద త వత్తు ఉండటమే సబబు అని అనిపించింది.
Next Story