తాంబూలపు పళ్లెంలో ఈ అడకత్తెర తప్పనిసరి
x

తాంబూలపు పళ్లెంలో ఈ అడకత్తెర తప్పనిసరి

భోజనాలయ్యాక బ్రాహ్మల కోసం పెద్ద పళ్ళెంలో తమలపాకులు, వక్కలు, సున్నం, వక్కల్ని ముక్కలు చేసే సాధనం ’అడకత్తెర‘ వుంచేవారు. పరకాల సూర్యమోహన్ ‘కవిటం కబుర్లు-4’



కవిటం కబుర్లు-4


-పరకాల సూర్యమోహన్

కవిటంలో మా తాతయ్య ఏదో పనిమీద అటోఇటో వెళ్ళగానే మేము మళ్ళీ రెచ్చి పోయేవాళ్ళం.

పితృదేవతలకు తద్దినాల్ని మా తాతయ్యా, మా బుల్లిఅబ్బాయి బాబయ్య ఎంతో నిష్ట గా నిర్వహించేవారు.

ఆ రోజున ఇంట్లో గంభీర వాతావరణం నెలకొని వుండేది . ఒక పక్క దొడ్లో గాడి పొయ్యిల మీద వంటలు సాగుతోంటే మరోపక్క బ్రాహ్మణుల మంత్రాలతో ఇల్లు మార్మోగేది, ఇల్లంతా పొగతో నిండి పోయేది.

కర్మకాండ అంతా ముగిసి బ్రాహ్మణులు భోజనాలు చేసి వెడితే గానీ ఇంట్లో వాళ్ళు భోజనాలు చేయకూడదు .

బ్రాహ్మణులు భోజనాలు చేసి వచ్చిన తరువాత వారికి దక్షిణ ఇచ్చి సగౌరవంగా సాగనంపేవారు. ఒక పెద్ద పళ్ళెం తమలపాకులు, వక్కలు, సున్నం, వక్కల్ని ముక్కలు చేసే సాధనం ’అడకత్తెర‘ వుంచేవారు.

కావలసిన వారు తాంబూలం వేసుకుని, దక్షిణ తీసుకుని వెళ్ళేవారు. ఇదంతా పూర్తి అయ్యేసరికి దాదాపుగా ఒంటిగంటా రెండూ అయ్యేది . పిల్లలంతా ఆకలితో నకనకలాడుతూ వుండేవాళ్ళు. అప్పటికీ పిల్లలు ఆకలి తట్టుకోలేరని ఎవరోఒకరు పొద్దున్నే కాస్త చద్దన్నాలు కలిపి పెట్టేవాళ్ళని నాకు జ్ఞాపకం.

ఇంక అంతా పక్కపక్కనే భోజనాలకు కూచునేవాళ్ళం. అందరికీ విస్తరాకుల్లోనే వడ్డించేవారు. పులుసుల వంటి ద్రవపదార్థాలను గోకర్ణంలో నుంచి వడ్డించేవాళ్ళు.



ఇదే గోకర్ణం


మా బుల్లిఅబ్బాయి బాబయ్యకి నేను అంటే చాలా ఇష్టం. నన్ను చాలా ప్రేమగా చూసేవాడు. ఇలాంటి తద్దినాల రోజుల్లో నన్ను రహస్యంగా పిలిచి ఎవరూ చూడకుండా నా జేబులో ఓ బేడ కాసు పడేసి, "వురేయ్, నువ్వు ఆగలేవుకానీ గప్ చుప్ గా కాలవ అవతల సత్యం హోటల్లో రెండు ఇడ్లీలు తినేసి చక్కారా" అనేవాడు.

ఇంతకీ ఆ సదరు సత్యం హోటల్ ఓ చిన్న పూరి పాక.


అందులో నాలుగు డొక్కు బల్లలు, వూగిసలాడే బెంచీలు వుండేవి. కదలకుండా కింద రాళ్ళు పెట్టేవాళ్ళు. ప్లేటు మీద తామరాకు వేసి నాలుగు పొతకల్లాంటి ఇడ్డెన్లు తీసుకొచ్చి వాటి మీద పలుచగా నీళ్ళలాంటి పచ్చడి ఓ గరిటెడు పోసేవాడు.

అదొక అద్భుతమైన పచ్చి మిరపకాయ పచ్చడి. దాని రుచిని నేను మాటల్లో వర్ణించలేను. అదేమి రుచో, వాడు అంత రుచిగా ఎలా చేయగలిగే వాడో నా బుర్రకి అంతుపట్టేది కాదు. ఆ రుచి ఇంకా అలా మనసులో వుండిపోయింది. తలుచుకుంటే ఇప్పటికీ నా నోరు వూరిపోతూ వుంటుంది. ఆ నీళ్ళ పచ్చిమిరపకాయ పచ్చడి వాడి స్పెషాలిటీ.

ఆ పూరిపాక ఎప్పుడూ కిటకిటలాడిపోతూ వుండేది .ఆ పచ్చడి తింటున్నప్పుడు ఎంతో రుచిగా హాయిగా వుండేది. ఆ తర్వాత గూబగుయ్ మనేలా కారం నసాళానికి అంటుకునేది. నాలిక భగభగా మండి పోయేది. అయినా ఇంకో గరిటెడు వడ్డించమంటే వాడు ".పంతులుగారు,ఇంక చాలండీ, మీకేదైనా తేడాచేస్తే నాకు మాటవస్తుంది" అనేవాడు .

అలాంటి పచ్చడి మళ్ళీ నేను ఎక్కడా తినలేదు.



సత్యం హోటల్ ఇక్కడే ఉండేది



ఇలాగే ఇప్పటికీ జ్ఞాపకం వుండిపోయిన మరో ఐటెం గురించి కూడా నా అనుభవాల్ని మీతో పంచుకోవాలి, అది పాలకొల్లు లో బస్టాండ్ ఎదురుగా ఓ హోటల్ వుండేది.

అది వుల్లిపాయ మినపట్టుకి ఎంతో ఫేమస్. దాని నిండా వుల్లిపాయ ముక్కలే.అక్కడక్కడ కూసింత పచ్చి మిరపకాయ అల్లం ముక్కలు కూడా వుండేవనుకోండి. కాని ఆ వుల్లిపాయ ముక్కలో మినపట్టు ఎక్కడుందా అని వెతుక్కోవలసి వచ్చేది.

ఒక మినపట్టు తింటే ఇంక రోజంతా ఆకలేస్తే ఒట్టు. వాడూ ఒకరకమైన పచ్చిమిరపకాయ పచ్చడి , కొబ్బరి, గుల్ల సెనగ పప్పు పచ్చడి వేసేవాడు. కాని వాడి పచ్చిమిరపకాయ పచ్చడి గట్టిగా ముద్దలా వుండేది. కవిటం సత్యం హోటల్ పచ్చడే వేరు. దాన్ని ఎవరూ బీట్ చేయలేరు.

తద్దినం రోజున భోజనాలు, క్లీనింగ్ వగైరాలు అయిన తరువాత అలిసిపోయిన పెద్దవాళ్ళు నడుం వాల్చి సేద తీసుకునేవాళ్ళు.

మా పిల్లగ్యాంగ్ కి ఏమీ తోచేది కాదు. ఏదో కాలక్షేపం వుండాలి కదా! అందుకని అంతా పొలోమంటూ మా పలపు దొడ్డిలో ఆడుకోడానికి పోయేవాళ్ళం.

చుట్టూ ప్రహరి గోడ వుండేది. గేటు తీసుకొని లోపలికి వెళ్ళగానే కుడి పక్కన నుయ్యి వుండేది. ఎదురుగా పెద్ద పెంకుటిల్లు వుండేది. అదొక పశువుల శాల. ఆవులు గేదెల్ని అందులో ఎదురెదురుగా కట్టేసే వాళ్ళు. కనీసం పది పదిహేను ఆవులూ గేదెలు వుండేవి. మధ్యలో ఎండు గడ్డి వేసేవాళ్ళు. అవి నెమరు వేస్తూ వుండేవి.

చేలోనుంచి పచ్చగడ్డి మోపుల్ని పాలేళ్ళు కోసుకు వచ్చి పశువులకి పెట్టేవాళ్ళు. అలాగే వుడకబెట్టిన వుళవలు కూడా పెట్టేవాళ్ళు. కొంచెం సేపు వాటి దగ్గర ఆడుకునేవాళ్ళం. వాటి తల దగ్గర మెడ దగ్గరా నిమిరేవాళ్ళం. అవి మమ్మల్ని ఏమీ చేసేవి కావు. ఎవరైనా వాటి తోక పట్టుకుని లాగితే మాత్రం కొమ్ములు విసిరేవి.

ఆ పశువుల పెంకుటిల్లు దాటి వెడితే చాలా పెద్ద దొడ్డి ( back yard)వుండేది. ఒక ఎకరం పైమాటే. అందులో ఓ మూల పనస చెట్టు, ఒకటి రెండు మామిడి చెట్లు,అరటి చెట్లు, ఇంకా ఏవేవో పాదులు వుండేవి. ఓ పక్కగా రెండు పెద్ద ఎండు గడ్డి వాములు చాలా ఎత్తుగా వుండేవి. కనీసం పది పన్నెండు అడుగుల ఎత్తు. అవే పశువులకు మేత.

వాటి మీదకు కష్టపడి ఎక్కి కిందకు జారడం మా ఆట. ఎవరు ముందుగా పైకి ఎక్కి కిందకు జారితే వాళ్ళు గెలిచి నట్టు. ఒకసారి నేనూ, మా బాబయ్యగారి అబ్బాయి సుధీర్ పైకి ఎక్కుతున్నాం. వాడు నాకన్నా ముందుగా పైకి ఎక్కేస్తాడేమోనని నేను వాణ్ణి కిందికి తోసేసాను. దాంతో వాడు పట్టు జారి దభీమని నేలమీద చతికిలా పడ్డాడు. ఆ అదురికి కొంచంసేపు అలా వుండి పోయాడు. వాడికి ఏదో అయి పోయిందని భయపడ్డాను. గుండె ఆగినంత పనైంది. మేమంతా వాణ్ణి లేవదీసాం. కొంచెం సేపటికి తేరు కున్నాడు. నేను సారీ చెప్పాను. బాగా నొప్పి పెడుతోందా అని అడిగాను. ఏమీ లేదు కాస్త ముడ్డి చితికింది అన్నాడు నవ్వుతూ . ఆ తర్వాత మళ్ళీ మేము ఏమీ జరగనట్టు రెచ్చిపోయి అదే ఆట ఆడేవాళ్ళం.

మా ఆట మూలంగా గడ్డివాము చిందర వందర అయేది.బాగా చివాట్లు తినేవాళ్ళం. కానీ అలాంటి రోజులు మళ్ళీ వస్తాయా చెప్పండి?


పరకాల సూర్యమోహన్

(పరకాల సూర్యమోహన్ సీనియర్ జర్నలిస్టు. పూర్వం ఇండియన్ ఎక్స్ ప్రెస్, ది హిందూ పత్రికలలో పనిచేశారు. సొంతవూరు పశ్చిమ గోదావరి జిల్లా కవిటం. స్థిరపడింది చెన్నైలో )


Read More
Next Story