కుడుముల్ని చింతకాయ పచ్చడితో ఎపుడైనా తిన్నారా… భలే కాంబినేషన్
కుడుము అంటే ఓ పేద్ద సైజు పలుచని ఇడ్లీ అని చెప్పవచ్చు. కొన్నిచోట్ల దీనినే తట్ట ఇడ్లీ అని పిలుస్తారు.
కొన్ని చిన్ననాటి సంఘటనలు మనసులో ఎంతో బలంగా నాటుకు పోయి వుంటాయి.దశాబ్దాలు గడచినా అవి చెక్కు చెదరవు. మన మెదడు గొప్ప తనం అలాంటిది.ఇప్పుడు నా వయస్సు 75. నా ఐదారేళ్ళ వయసులో జరిగిన కొన్ని సంఘటనలు ఇప్పటికీ నాకు బాగా జ్ఞాపకం వున్నాయి. తలుచుకుంటే నా కళ్ళముందు ప్రత్యక్ష మవుతాయి.
ఇవి చదువుతోంటే పాఠకులకు ఆనాటి కాల పరిస్థితులు అర్థం అవుతాయి.
నేను పుట్టింది గుడివాడలో.కానీ నా చిన్నతనం అంతా మా వూరు కవిటంలో గడిచింది. అందుకనే కవిటంతో నాకు ఎంతో అవినాభావ సంబంధం వుంది. ఆ నాటి నా జీవితంలో ఎన్నో మరుపురాని ఘటనలు అక్కడే సంభవించాయి. అందులో ఎంతో ఆసక్తికరమైన కొన్నింటిని ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటాను.
నాకు చిన్నప్పుడు అంటే బహుశా ఐదారేళ్ళ వయసులో కడుపులో బల్ల వుండేదట. కరెక్టుగా ఇంగ్లీషులో ఏమంటారో తెలియదుకాని అది సిరోసిస్ ఆఫ్ లివర్ అనుకుంటాను.
70ఏళ్ళ క్రితం చాలామంది చిన్నపిల్లలకి ఈ వ్యాధి వుండేదని మా అమ్మా నాన్న చెబుతూ వుండేవారు . ఏది కనిపిస్తే అది తినేసేవాణ్ణట! అంటే తిండి రంథి దాని లక్షణం అయివుండాలి. నా గొడవ భరించలేక నన్ను మా కవిటంలో మా ఇంటి సావిడిలో వున్న ఎత్తైన బల్ల మధ్య లో కూచోబెట్టేవాళ్ళట. మా అమ్మగారి పేరు అహల్య . నన్ను బల్ల మీదనుంచి దింపమని అస్తమానూ “ఆల్యో” “ఆల్యో” అని అరిచేవాణ్ణటఅది చాలా ఎత్తైన బల్ల. నా అంతట నేను దిగలేను.కాళ్ళు అందేవికావు. ఒక్కో సారి అరిచి అరిచి శోషవచ్చి ఆ బల్లమీద బల్లిలా అతుక్కొని పడుకునే వాడినిట.
ఇంతలో మా అమ్మ కంచం పట్టుకువచ్చి ఆ బల్లమీదే నాకు అన్నంపెట్టేది. ఓ గంట అవగానే ఆకలేస్తోందని గోలపెట్టెవాడినట. అటుకేసి ఎవరువెళ్ళినా బతకనిచ్చేవాణ్ణి కాదట.
“వురేయ్ అబ్బిగా (నన్ను చిన్నప్పుడు అంతా అబ్బిగాడు అని పిలిచేవాళ్ళు),మీ అమ్మ ఇప్పుడే అన్నంతిని కాస్త నడుం వాల్చింది. నోరుమూసుకుని పడుకో “అని మా బులిచిన్న పిన్నో , మా పెద్దత్తయ్యో ఒక్క కసురు కసరగానే పిల్లిలా పడుకుండి పోయేవాడినట.
ఒకసారి అంతు ఎత్తు బల్ల మీదనుంచి ఎలా దిగగలిగానో నాకు తెలియదు. మధ్యాహ్నం అంతా నిద్రపోతున్నప్పుడు చడీచప్పుడూ చేయకుండా వంటింట్లో దూరి వుట్టి మీద పెట్టిన సత్తుగిన్నెను కిందికి దింపి దాన్నిండా వున్న కందపులుసు పట్టుకుపోయి శుభ్రంగా తినేసి ప్రాణం మీదకు తెచ్చుకున్నానట.
హుటాహుటిన నన్ను పొరుగున వున్న పోడూరులో డాక్టరు పోడూరు రామారావు గారి ఆసుపత్రిలో చేర్పించారు. ఓ పూరిపాకలో నులక మంచం నా బెడ్. కనీసం రెండుమూడు రోజులైనా వుండి వుంటాను. ప్రతిరోజూ పొద్దున్నే మా అమ్మ వేసిన కుడుములు వేడివేడిగా మా నాన్నగారు కారియర్లో పట్టుకువచ్చేవారు. ఓ గిన్నెలో చింతకాయ పచ్చడి పంపేది. అదొక అద్భుతమైన కాంబినేషన్. మాహా స్పీడ్ గా వేపపుల్లతో పళ్ళు తోముకుని ఆబాబగా ఆ కుడుములు లాగించేవాణ్ణి. ఈ కాలం కుర్రాళ్ళకి ఈ కుడుములు ఎంతమందికి తెలుసో నాకు తెలియదు.
కుడుము అంటే ఓ పేద్ద సైజు పలుచని ఇడ్లీ అని చెప్ప్పవచ్చు. కొన్నిచోట్ల దీనిని తట్ట ఇడ్లీ అని పిలుస్తారు.
ఇప్పటి ఇడ్లీ గుత్తెలో కనీసం నాలుగు ఇడ్లీలు వేస్తారు. కానీ అప్పట్లో ఒక్కొక్క గుత్తె ఒక ప్లేటు అంతండేది. ముందుగా తడిపిన గుడ్డ ఆ ప్లేటు మీద పరిచి దానిమీద ఇడ్లీ పిండి వేసేవారు. ప్రతి ఇత్తడి పాత్రలోను కనీసం నాలుగు కుడుముల ప్లేట్లు వుండేవి. ఇప్పటి మాదిరిగానే ఆవిరి మీద వుడక బెట్టేవారు. ఆ పిండిలో రవ్వ కన్నా మినపప్పుఎక్కువగా వుండేది. బహుశా త్వరగా కోలుకుంటారనేమో.
అలా రెండు రోజులు ఆసుపత్రిలో మందులతో నన్ను నయంచేసి ఇంటికి పంపించేసారు.
ఇంతకీ చెప్పవచ్చేదేమంటే ఇప్పటికీ ఆ నాటి ఆసుపత్రి మకాం, ఆ నులక మంచం, వేడి వేడి కుడుములు, చింతకాయ పచ్చడి ఇప్పటికీ నాకు బాగా జ్ఞాపకమే.