రీఫిళ్లు లేని కలాలు.. తూటాలు లేని తుపాకులు..
(జి. రమేశ్ చంద్రబాబు)
ఎంత దుబారా చేసే ఎదవకైనా! వాడి పొదుపు పద్ధతులు వాడికుంటాయంటే ! ఏమో అనుకున్నా! ఇప్పుడర్ధమైంది. నా పొదుపు పద్ధతి. రీఫిల్ ఐన పెన్నుని పారేయడం, తూటాలైపోతే తుపాకి పారేస్తారా! ఎవరైనా! అనే లాజిక్కును పాటించడంతో ఈ నాలుకలు లేని నోర్లలా కనిపిస్తున్న రీఫిల్స్ లేని పెన్నులు పోగయ్యాయి.
ఇన్ని పెన్నులున్నా, అప్పుడప్పుడు ఎండలకి కరిగిపోయో, ఎండిపోయో చేతికి దొరికిన పెన్ను రాయకుండా మొరాయిస్తే ' చదువు చారెడు! బలపాలు దోసెడు! ' అన్నసామెతలా - ఇన్ని పెన్నులు పోగేసుకున్న నాకు ఎక్కడ కాల కూడదో అక్కడ కాల్తుంది.
అలా కాలడంతో ఈరోజు మిలటరీ పెరేడ్ డేలా - ఇంట్లో ఉన్న పనికొచ్చేవి, పనికి మాలినవి అయిన కలములనే శరములు వెతికి చూస్తే - రీఫిల్స్ వేద్దామని దాచి పెట్టినవి ఓ డజనుమ్ముప్పాతిక లెక్క తేలినవి.
ఇక రెండో చిత్రంలోనివి ఆరిపోయిన తూటాల్లాంటి కాళీ ఐన రీఫిల్స్, పారేయడమే మేలైన కొన్ని పెన్నులూను,
ఇక చివరాఖరిది - పనికొస్తాయని రుజువైన గంటములు.
ఇవన్నీ చూస్తే బ్రమ్మానందం అన్నట్లు
' ఏదో తేడాగా ఉందే ' - వీడిలో అని అనిపించడంలా!
అనిపించడం లేదు మాస్టారూ.. అని మొహమాటానికి నసిగితే ! అప్పుడూ బ్రహ్మానందమే ఆదుకుంటాడు
" నేను అంత ఎదవలా! కనిపిస్తున్నానా! ఓ మాదిరిగా.., ఐనా కనపడటల్లేదా! "
అనే డైలాగును తిరగేసి రాసుకోండి - తమరూ గంటం దొరఏగా!
ఏగా .., అనగానే ' ఒక ఏగానికి .., ' అని మొదలయ్యే తిరుపతి వేంకట కవుల గమ్మత్తైన పద్యం గుర్తొచ్చింది.. దాంతో మిమ్మొదిలేస్తా 😁.. ఇంకోణ్ణి తగులుకోవస్లిగా.. వాళ్ళూ వైటింగు ..
' దీన్నే చామంచిపూల రోకలి ' అనే జాతీయంతో పోల్చొచ్చు. ఈ చేవంచి పూల రోకలి కథ తెలుసుకోవాలంటే ., ఎప్పుడైనా పులుసులో కూర్చున్నప్పుడడగండి. సెలవిస్తా. ఇంతకీ పద్యం ..,
ఒక ఏగానికి చిన్నికుర్రనికి ఆయుష్కర్మ చేయించి దా
నికినై కాని యొసంగి తక్కు సగమున్ తెమ్మన నాచేత లే
వకటా యనన్ నాకును క్షౌరంబున్ భృతికి తానంగీకృ
తికిన్ తెల్పు లేభ్యకులాయంబగు ముద్దరాలి చాలించితే తిరపతీ !
ఈ పద్యానికి నేపథ్యం : తిరుపతి వేంకట కవులు నానారాజ స్సందర్శన భాగంలో ఓ మోస్తరు రాజో, జమీందారో దగ్గరివెళ్ళి ఏవో నాలుగు పాండిత్యంతో కూడిన పద్యాలూ, ఒకటో రెండో ఆరాజుని ఉబ్బేసేవి చెప్పి ; చేతులు నలుపుకుంటూ తెల్లబోయిన మొహాల్తో , తమరేమైనా ఇప్పిస్తే ., సెలవు దీసుకుని మరో వూరు దయచేస్తాం అనగానే
ఆ రాజు ఓ వెయ్యనూట పదార్లు తీసుకోండని ఓ పన్నెండొదలు ఇచ్చి, మిగతా చిల్లర ఉందా అని మన కుర్రాళ్ళనడిగితే! పుచ్చుకోవడమేగానీ ఇచ్చుకోవడం తెలియని గడుగ్గాయలైన జంటకవులులలో నోరేసుకు పడే చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి గారు తనకన్నా పెద్దైన దివాకర్ల తిరుపతి శాస్త్రి గారితో జనాంతికంగా చెప్పిన పద్యమట ఇది.
ఉపోద్ఘాతం ఎక్కువైనట్లుంది - పద్య అర్ధంలోకెళదాం
ఓ పడతి భర్త వూర్లో లేకపోవడంతో తనే వాళ్ళబ్బాయికి క్షవర కళ్యాణం చేయించడానికి ఓ నాయీ బ్రాహ్మణుని పంచకు వెళ్ళి, చేయించిన పనికి చెల్లించాల్సిన ఏగానీకి, కాణీ ఇచ్చి .., తతిమ్మా చిల్లర ఇమ్మంటే ., ఆతడు నాచేతలేవనగా., సరే ఎందుకు వూర్నే ఆ ఏగాణిని వదలాలని నాకూ కానీయండి స్ని గుండుగొరిగుంచున్నమ్మ కథ గుర్తు రావడంలా! తిరపతీ !
అని సోదర కవి చెవిలో చెప్పిన పద్యం.
మరొక్క మాట..
ఏవిఎస్ బ్రమ్మంతో ఏదో సినిమాలో
" పైకి అ. ఆ., అ ., ఏం పర్లేదని పైకంటూనే ., పొద్దున్నే అసుకుసుకున్నాడు కదరా! అని లోలోన అనుకున్నట్లు " అనుకుంటున్నారు కదూ 😁
నవ్విపోదురుగాక నాకేటిసిగ్గు
నవ్విపోదురు గాక నాకేటిసిగ్గు
నాఇచ్చయే గాక నాకేటివెరపు
కలవిహంగముల పక్షముల దేలియాడి
తారకా మణులలో తారనై మెరసి
మాయమయ్యెదను నామధుర గానమున
నవ్విపోదురు గాక నాకేటిసిగ్గు
మొయిలు దోనెలలోన పయనంబొనర్చి
మిన్నెల్ల విహరించి మెరపునై మెరసి
పాడుతూ చినుకునై పడిపోదు నిలకు
నవ్విపోదురు గాక నాకేటిసిగ్గు
తెలిమబ్బు తెరచాటు చెలిచందమామ
జతగూడి దోబూచి సరసాలనాడి
దిగిరాను దిగిరాను దివినుండి భువికి
నవ్విపోదురు గాక నాకేటిసిగ్గు
శీకరంబుల తోడ చిరుమీలతోడ
నవమౌక్తికములతో నాట్యమ్ములాడి
జలధి గర్భమ్ములోపల మునిగిపోదు
నవ్విపోదురు గాక నాకేటిసిగ్గు
పరువెత్తి పరువెత్తి పవనుని తోడ
తరుశాఖ దూరి పత్రముల జేరి
ప్రణయ రహస్యాలు పల్కుచునుందు
నవ్వి పోదురు గాక నాకేటిసిగ్గు
అలరు పడంతి జక్కిలిగింత వెట్టి
విరిచేడె పులకింప సరసను బాడి
మరియొక్క నన తోడ మంతనంబాడి
వేరొక్క సుమకాంత వ్రీడ బోగొట్టి
క్రొందేనె సోనల గ్రోలి సోలుటకు
పూవుపూవునకు పోవుచునుందు
నవ్విపోదురు గాక నాకేటిసిగ్గు
పక్షినయ్యెద చిన్నివృక్షమయ్యెదను
మధువు నయ్యెద చందమామ నయ్యెదను
మేఘమయ్యెద వింత మెరపు నయ్యెదను
అలరు నయ్యెద చిగురాకు నయ్యెదను
పాట నయ్యెద కొండవాగు నయ్యెదను
పవనమయ్యెద వార్ధిభంగ మయ్యెదను
ఏలకో ఎప్పుడో ఎటలనోగాని
మాయమయ్యెద నేను మారిపోయెదను
నవ్విపోదురు గాక నాకేటిసిగ్గు
నాయిచ్చయే గాక నాకేటివెరపు !!
- దేవులపల్లి కృష్ణశాస్త్రి