ఈ కేరళ బీడీ కార్మికుడు ద్రవిడ భాషల డిక్షనరీ కూర్చాడు... ఎలా?
x
నింజిట్యేల శ్రీధరన్

ఈ కేరళ బీడీ కార్మికుడు ద్రవిడ భాషల డిక్షనరీ కూర్చాడు... ఎలా?

తన డిక్షనరీ అవసరమయిన తెలుగు పదాలను వెదుక్కుంటూ నెల్లూరు దాకా వచ్చేవాడు.. ఎవరా బీడీ కార్మికుడు, ఎమిటా డిక్షనరీ


బి. గోపాలకృష్ణమ్మ

ఆయన వయస్సు ప్రస్తుతం 85 సంవత్సరాలు. 22 సంవత్సరాలు బీడీ ఫ్యాక్టరీలో కార్మికుడిగా పనిచేశారు. మరో 24 సంవత్సరాలు కేరళ ప్రజాపనుల శాఖలో బ్లూ ప్రింటర్‌గా పనిచేశారు. ఇపుడు నిఘంటువు రచయిత అనే కొత్త పేరు వచ్చింది. ఈ ఖ్యాతి పొందడానికి ఆయనకు పాతికేళ్ల సమయం పట్టింది. నాలుగు ద్రవిడ భాషల్లో (మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ) నిఘంటువు నిర్మాణం చేసిన ఘనతను లేటువయసులో దక్కించుకున్నారు. 'డిక్షనరీ ఆఫ్ ద్రవిడియన్ లాంగ్వేజెస్' పేరిట తాను కూర్చిన ఈ బహు భాషా నిఘంటువులో 1.25 లక్షల పదాలున్నాయి. దీంట్లో ప్రతి మలయాళ పదానికి ఇతర ఈ భాషల సమాన అర్థాలు కూర్చారు. కాకపోతే ఇవన్నీ మలయాళ లిపిలో ఉంటాయి. కేరళ ఆవిర్భావ దినోత్సవమైన నవంబర్ 1న (2020) ఈ నిఘంటువును ప్రచురించారు. ఈ మహా నిఘంటువు కర్త పేరు నింజిట్యేల శ్రీధరన్. (Njattyela Sreedharan).

ఫెయిలై బడి మానేశాడు

అలాగని ఆయన విద్యాధికుడేమీ కాదు. చిన్నతనంలో అంటే నాలుగో తరగతిలో ఫెయిలై బడి మానేశారు. జీవితం గడపటం కోసం బీడీ కార్మికుడిగా 22 ఏళ్లపాటు పనిచేసిన శ్రీధరన్, మలయాళంతోపాటు ఇతర ద్రవిడ భాషలను నేర్చుకోవడానికి సమయం వెచ్చించడం ఆశ్చర్యం గొలుపుతుంది. పాలక్కాడ్ లోని తలసేరిలో బీడీ ఫ్యాక్టరీలో పని చేసే రోజుల్లో తమిళం నేర్చుకోవడానికి ఆసక్తి చూపారు.తర్వాత ప్రజాపనుల శాఖలో కెరీర్ ప్రారంభించినప్పుడు నిర్మలగిరి కాలేజీలో ప్రొఫెసర్‌గా ఉన్న టీపీ సుకుమారన్‌తో తనకు పరిచయం కలిగింది. భాషలను నేర్చుకోవడంపై తనకున్న అభిరుచి గురించి తెలుసుకున్న సుకుమారన్ వ్యావహారిక పదాల నిఘంటువును రూపొందించమని సూచించారు.

తెలుగు కోసం నెల్లూరు వచ్చాడు...

కన్నడ, తెలుగు నేర్చుకోవడం, పత్రికలు, వార్తాపత్రికల చదవడం, ఆయా భాషలతో సంభాషించడం క్రమంగా అలవాటైంది. మరింత పరిశోధన కోసం తరచుగా కర్ణాటకలోని మైసూరుకు, ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరుకు వెళ్లేవారు. కన్నడ నేర్చుకోవడానికి రచయిత సి. రాఘవన్, గోవింద్ నాయక్‌ల నుండి ఎంతో సహాయం పొందానని చెప్పారు. అలాగే తెలుగు నేర్చుకోవడం కోసం కన్నూరు జిల్లాలోని కరింబమ్‌లోని జిల్లా వ్యవసాయ క్షేత్రంలో అధికారి ఈశ్వర ప్రసాద్ రావు, ఆయన భార్య సీతమ్మ తనకు సహాయపడ్డారు.

నాలుగు భాషల్లో నిఘంటు రచనను 1984 నుండే శ్రీధరన్ ప్రారంభించారు. అయితే 1994లో రిటైర్ అయిన తర్వాతనే పూర్తి కాలం నిఘంటువు రచనకు అంకితమయ్యారు.

ఆరేళ్లు వేధించిన పదం 'సీమంతరేఖ'

'సీమంతరేఖ' అనే పదం (పెళ్లయిన స్త్రీలు సింధూరం పూసేందుకు జుత్తును రెండుగా విడదీసే పాపిడి) వాస్తవానికి ఇది సంస్కృత పదం కాగా మలయాళ పదం అని తప్పుగా భావించేవారు. సీమంతరేఖకు కన్నడలో 'బయితలే' అని, తెలుగులో 'పాపిడి' అని సరిసమాన పదాలున్నాయి కానీ తమిళంలో, మలయాళంలో దీనికి సరిసమాన పదాలు లేవని శ్రీధరన్ చెబుతారు.






ఈ పదం గుట్టు తెలుసుకునేందుకు ఆయన తమిళనాడు వెళ్లి ప్రొఫెసర్లు, ఉపాధ్యాయులు, గృహిణులను మరెందరినో కలిశారు. కానీ సీమంతరేఖకు సరైన పదం కనుగొనలేకపోయారు. చివరకు కొన్ని నెలల శోధన తర్వాత తన ఇంటినుంచి చెత్తను సేకరించడానికి వచ్చిన ఒక తమిళ మహిళ, శ్రీధరన్ వెతుకుతున్న పదాన్ని అతడికే బహుమతిగా ఇచ్చింది. ఆ పదం పేరు 'వాకీడు' మలయాళంలో కూడా ఇదే పదం వాడుకలో ఉందని తెలిసింది. ద్రావిడ భాషలు అనేక సారూప్యతలను కలిగి ఉంటాయి. కానీ వాటి అన్వేషణను మనం పెద్దగా పట్టించుకోమని శ్రీధరన్ విచారం వ్యక్తం చేశారు.

ఇలా 'నాలుగు భాషల్లో ఖచ్చితమైన పదం కోసం వెతకడం అంత సులభం కాదు; దీనికి నెలలు, సంవత్సరాల సమయం పట్టవచ్చు. కానీ నాలుగు భాషల్లోనూ సరిసమానమైన పదాన్ని కనుగొనకపోతే చేసిన పని మొత్తం వృధా అవుతుంది.కొన్నిసార్లు, అలాంటి పదం కలలో స్ఫురిస్తుంది, నేను అర్ధరాత్రి నిద్రలేచి వెంటనే దానిని కాగితంపై రాసేవాడు.

డ్రీమ్ ఆఫ్ వర్డ్స్

శ్రీధరన్ జీవితం, నిఘంటు రచనపై కేరళ చిత్ర దర్శకుడు నందన్ 'డ్రీమింగ్ ఆఫ్ వర్డ్స్' (పదాల కోసం కలగనడం) అనే గంట నిడివి గల డాక్యుమెంటరీ తీశారు.నందన్ స్వయంగా మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ నిఘంటువు కోసం చాలా కాలం క్రితమే వెతికి వెతికి వేసారిపోయారు. శ్రీధరన్ గురించి ఒక వార్తా క్లిప్పింగ్ ద్వారా తెలుసుకున్న నందన్ ఎంతో ఆసక్తితో తనను కలిశాడు. ఆయన ఉత్సాహాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. 'ఈ నాలుగు భాషల నిఘంటువును శ్రీధరన్ మొత్తంగా చేతితో రాశారు. అయితే అధికారికంగా కావలసిన విద్యాపరమైన ఆధారాలు లేనందున శ్రీధరన్ కూర్చిన ప్రత్యేకమైన డిక్షనరీని గుర్తించి సమాదరించే వారే లేకుండా పోయారు' అని నందన్ విచారం వ్యక్తం చేశారు.

రాతప్రతినే మాయం చేశారు

సంవత్సరాల తరబడి సాగించిన కఠిన శ్రమ తర్వాత, శ్రీధరన్ తన స్నేహితుడి ఒత్తిడి మేరకు, చేతితో రాసిన తన నిఘంటువు రాత ప్రతిని పలువురు ప్రచురణ కర్తల వద్దకు తీసుకెళ్లారు. కానీ వారు తన కృషిని తిరస్కరించారు. తర్వాత కేరళ భాషా సంస్థను సంప్రదించారు. ఈ ప్రాజెక్టుపై ఆసక్తి ఉన్న సంస్థ డైరెక్టర్ పీకే పోకర్ అతనికి సహాయం చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే ఈ నిఘంటు రచనను సరిదిద్దడానికి ప్రూఫ్ రీడర్లు లేక కేరళ భాషా సంస్థ దాన్ని అట్టేపెట్టి ఉంచింది. కొంతకాలం తర్వాత, చేతితో రాసిన నా రాతప్రతి కేరళ భాషా సంస్థ కార్యాలయం నుండి కనిపించకుండా పోయిందని నాకు చెప్పారు. ఇది రెండున్నర దశాబ్దాలకు పైగా నేను సాగించిన కృషి. పైగా దానికి సంబంధించి ఇతర కాపీలు కూడా నా దగ్గర లేవు,” కేరళ భాషా సంస్థపై దావా వేశాక, తన రాత ప్రతిని ఆయన 2014లో తిరిగి పొందారు.

ప్రజల పట్ల ప్రేమే నిఘంటువు అయింది

నాలుగో తరగతి ఫెయిలై తోటి పిల్లల మాదిరే స్థానికంగా ఉండే బీడీ ఫ్యాక్టరీలో కార్మికుడిగా చేరిన ఎన్. శ్రీధరన్ ఖాళీ సమయాల్లో అక్కడ దొరికే పత్రికలు, పుస్తకాలను విపరీతంగా చదివేవారు. పుస్తకాలపై చర్చల్లో పాల్గొనేవారు. తాను పనిచేస్తున్న బీడీ ఫ్యాక్టరీలో మలయాళంతో పాటు తమిళ పత్రికలు కూడా అందుబాటులో ఉండటంతో మెల్లగా తమిళం నేర్చుకున్నారు. అక్కడే విద్యావకాశాన్ని అందిపుచ్చుకుని ఒక పరీక్షలో ఉత్తీర్ణుడైన శ్రీధరన్, కేరళ ప్రజాపనుల శాఖలో ఉద్యోగం దొరకబుచ్చుకున్నారు.

బాలబాలికల సంస్థకు కార్యదర్శిగా పనిచేసి, చదువుమానేసిన పిల్లలకోసం రాత్రి పాఠశాల ప్రారంభించారు. ఈ క్రమంలో కమ్యూనిస్టు పార్టీలో చేరిన శ్రీధరన్ మూడుసార్లు జైలుజీవితం గడిపారు. తన జైలుజీవితంపై కథను రాసి ప్రచురించారు. పలు మలయాళీ పత్రికలు, సంచికల్లో వ్యాసాలు రాస్తున్న క్రమంలోనే నాలుగు ప్రధాన ద్రావిడ భాషల్లోని పదాలను పరిశీలించడం అలవాటుగా మారి చివరకి నిఘంటు రఛన వైపు మళ్లించిందని శ్రీధరన్ చెప్పారు.

బీడీ ఫ్యాక్టరీ సమీపంలోని బార్బర్ షాపు ఓనర్ ఆరుచామీ తనకు తొలిసారిగా తమిళం నేర్పారు. ఇతర భాషలు మాట్లాడే ప్రజల పట్ల ప్రేమే తనను బహు భాషా నిఘంటువు నిర్మాణంవైపు మళ్లించిందని చెప్పే శ్రీధరన్.. ప్రజల మధ్య, సమాజాల మధ్య విభజన రేఖలు పెరిగిపోతున్న నేటి కాలంలో భాషలు, ప్రజల మధ్య సమైక్యతను చాటి చెబుతున్న సామాన్యులలో అసమాన్యుడు.

జీవితం ఇలా మొదలైంది

బహుభాషా నిఘంటుకర్తగా పేరొందిన నింజట్టేల శ్రీధరన్ కేరళలోని తలసేరిలో 1938లో పుట్టారు. నాలుగో తరగతిలో ఫెయిలై స్కూల్ డ్రాప్ ఔట్ అయిన తాను దశాబ్దాల పాటు బీడీ కార్మికుడిగా, ప్రజాపనుల శాఖలో బ్లూ ప్రింటర్‌గా పనిచేశారు. దక్షిణాది భాషలపై ఆయన మక్కువ మలయాళ భాషలో బహు భాషా నిఘంటువు రచన వైపు పయనింపజేసింది. పాతికేళ్ల సుదీర్ఘ శ్రమ తర్వాత శ్రీధరన్ కూర్చిన 'చతుర్ ద్రావిడ భాషా నిఘండు' (డిక్షనరీ ఆఫ్ ఫోర్ ద్రవిడియన్ లాంగ్వేజెస్)ను 2020లో ప్రచురించారు.

ఈ నిఘంటువుకు ద్రవిడియన్ లింగ్విస్టిక్స్ అసోసియేషన్ స్థాపించిన ఉత్తమ నిఘంటు విభాగంలో డాక్టర్ హెర్మన్ గుండెర్ట్ అవార్డు దక్కింది. ఇకపోతే శ్రీధరన్ జీవితం ఆధారంగా కేరళ చిత్ర దర్శకుడు నందన్ 2021 సంవత్సరంలో తీసిన 'డ్రీమింగ్ ఆఫ్ వర్డ్స్' (Dreaming of Words) డాక్యుమెంటరీ చిత్రం అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా 2021లో అమెరికాతో సహా అనేక దేశాల్లో విడుదలై ఎనలేని పేరు సాధించింది. పలు అకడెమిక్ సదస్సులో ఈ చిత్రం విస్తృత చర్చలకు నోచుకుంది.


Read More
Next Story