
నాయర్లు, గుజ్జర్ల మధ్య పేగుబంధం?
ప్రముఖ సినీనటి ఐశ్వర్యారాయ్ వంశమూలాలకీ కేరళకి సంబంధం ఉందని తేల్చేశారు..కేరళ నాయర్లకు.. రాజస్థాన్ గుజ్జర్లకు మధ్య పేగుబంధం ఉందని నిగ్గుతేల్చారు..
- జర్మనీ యూధులకు.. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెం యూధులకు చుట్టరికం ఉందని ఆమధ్య బయటపడింది...
ఇప్పుడేమో కేరళ నాయర్లకు.. రాజస్థాన్, పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతాల్లోని గుజ్జర్లకు మధ్య పేగుబంధం ఉందని నిగ్గుతేల్చారు..
అంతేకాదు మన ప్రముఖ సినీనటి ఐశ్వర్యారాయ్ వంశమూలాలకీ కేరళకి సంబంధం ఉందని తేల్చేశారు..
మామూలుగా ఎవరన్నా చెబితే నమ్మలేం గాని చెప్పింది సాక్షాత్తు సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ). ఒక్క నాయర్లు మాత్రమే కాదు.. కేరళలోనే ఉండే థియ్యాలు, ఎళవ తెగలు కూడా ఒకప్పుడు దేశంలోని వాయవ్య ప్రాంతం నుంచి వచ్చిన వారేనని చెబుతోంది సీసీఎంబీ.
అందరూ వలస వచ్చిన వారే...
భారత దేశ నైరుతి ప్రాంతంలో ఉండే కేరళ, కర్ణాటక, తమిళనాడు దక్షిణ ప్రాంతాలు జీవ వైవిధ్యానికే కాదు.. జన్యువైవిధ్యానికి కూడా పెట్టింది పేరు. వేల సంవత్సరాలుగా ఎక్కడెక్కడి నుంచో ప్రజలు ఇక్కడకు వలస వచ్చి స్థిరపడ్డారని చెబుతారు. యూదులు, పార్సీలు, రోమన్ కేథలిక్కులు కొన్ని ఉదాహరణలు మాత్రమే. అయితే ఈ ప్రాంతంలోనే ఉన్నప్పటికీ నాయర్లు, థియ్యాలు, ఎళవ తెగల వారు ఎక్కడి నుంచి వలస వచ్చారన్న విషయంపై భిన్నాభిప్రాయాలు ఉండేవి. చరిత్రకారుల అంచనాల ప్రకారం వీరందరూ గంగా తీరంలోని అహిఛాత్ర (ఇనుప రాతి యుగం) ప్రాంతం నుంచి వలస వచ్చిన వారని చారిత్రక, లిఖిత దస్తావేజుల సాయంతో వాదిస్తున్నారు.
వాయువ్య ప్రాంతం నుంచి వచ్చారా?
మరోవైపు ఇతరులు మాత్రం వీరందరూ ఇండో సిథియన్ వర్గం వారని, దేశ వాయువ్య ప్రాంతం నుంచి వలస వచ్చారని అంటున్నారు. ఈ నేపథ్యంలో జన్యుపరంగా వీరి వలస ఎలా సాగింది? వీరు ఏ ప్రాంతానికి చెందిన వారై ఉండవచ్చో నిర్ధారించేందుకు సీసీఎండీ సీనియర్ శాస్త్రవేత్త కుమారస్వామి తంగరాజ్ నేతృత్వంలోని బృందం ప్రయత్నించింది. నాయర్లు, థియ్యాలు, ఎళవ వంటి భూస్వామ్య, యుద్ధ వీరుల తెగలకు చెందిన 213 మంది జన్యుక్రమాలను సేకరించి అటు తల్లివైపు నుంచి మాత్రమే అందే మైటోకాండ్రియల్ డీఎన్‌ఏ గుర్తులు, ఇటు జన్యుక్రమం మొత్తమ్మీద ఉండే ఆటోసోమల్ గుర్తులు (మన మునుపటి తరాల గురించి తెలిపేవి-ఆటోసోమల్ గుర్తులు)
క్రోమోజోముల్లో మార్పులు...
సెక్స్ క్రోమోజోములు మినహా మిగిలిన 22 క్రోమోజోముల్లో ఈ మార్పులు ఉంటాయి. వారసత్వంతోపాటు జన్యుపరమైన సంబంధాలు, నిర్దిష్ట వ్యాధులు సోకేందుకు అన్న అవకాశాల గురించి ఈ మార్పులు సూచిస్తాయి. వీటిని యూరేసియా ప్రాంతంలోని పురాతన, ప్రస్తుత తెగల జన్యుక్రమాలతో పోల్చి చూశారు. కేరళలోని నాయర్లు, థియ్యాలు, ఎళవలతోపాటు కర్ణాటకలోని బంట్స్-(ప్రముఖ సినీనటి ఐశ్వర్యరాయ్ బంట్ తెగకు చెందిన మహిళే), హొయసళ సామాజిక వర్గ ప్రజలు కూడా జన్యుపరంగా దేశ వాయువ్య ప్రాంత ప్రజలతో దగ్గరి సంబంధాలు కలిగి ఉన్నారని ఈ పరిశోధన తేల్చింది.
ఇరాన్ మూలల కన్నా ఇవే ఎక్కువ...
'నాయర్లు, థియ్యాలు, ఎళవ తెగల ప్రజలకు దేశ వాయ్యు ప్రాంతంలోని కాంభోజ్, గుజ్జర్ తెగల ప్రజలకు మధ్య జన్యుసంబంధాలు ఎక్కువగా ఉన్నట్లు ఈ పరిశోధన స్పష్టం చేసింది. వీరిలో ఇరాన్ ప్రాంత జన్యు వారసత్వం కూడా ఇతరుల కంటే ఎక్కువగా ఉంది' అన్నారు ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త డాక్టర్ కుమారస్వామి తంగరాజ్. తల్లి వైపు నుంచి అందిన జన్యు సమారాన్ని విశ్లేషిస్తే పశ్చి యురేసియా ప్రాంత వారసత్వం కనిపిస్తోంది. దీన్నిబట్టి మహిళల నేతృత్వంలో జరిగిన వలసలో వీరు భాగమై ఉంటారని చెప్పవచ్చునని నిర్దారించారు శాస్త్రవేత్తలు.
గోదావరి తీరం మీదుగా కర్ణాటకకు...
ఈ పరిశోధన ఫలితాలను 'జినోమ్ బయాలజీ అండ్ ఎవల్యూషన్' జర్నల్ ప్రచురించింది. "భారతదేశ దక్షిణ, పశ్చిమ తీర ప్రాంతంలోని వాయువ్య ప్రాంతం నుంచి గోదావరి తీరం ద్వారా కర్ణాటకకు, ఆ తరువాత అక్కడి నుంచి మరింత దక్షిణంగా కేరళకు వలస వచ్చినట్లు ఈ పరిశోధన ద్వారా తెలుస్తుంది" అంటున్నారు సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ వినయ్ నందికూరి.
జన్యు చరిత్రలు ఎందుకు కలిశాయంటే...
డాక్టర్ కె. తంగరాజన్, శాస్త్రవేత, సీసీఎంబీ
ఈ కొత్త ఫలితాల ప్రాముఖ్యత గురించి JC బోస్ ఫెలోషిప్ సాధించిన CMMB (హైదరాబాద్) సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కె తంగరాజ్ ది ఫెడరల్ ప్రతినిధితో ఏమన్నారంటే... "గత నాలుగైదు వేల సంవత్సరాలలో ఉత్తర, దక్షిణ భారతీయ ప్రాంతాల జన సమూహాలు అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు వలసలు వెళ్లి కలిసిపోయాయి. ఫలితంగా జన్యు చరిత్రలు కలగలిసి పోయాయని ఈ ఫలితాలు చూపిస్తున్నాయి " ఇంకా స్పష్టంగా చెప్పాలంటే "ఉత్తర, దక్షిణాది మధ్య జన్యు చరిత్ర పరంగా ప్రత్యేక విభజన లేదు" అని ఆయన నొక్కి చెప్పారు. మరి దీని అర్థం ఈ దక్షిణాది జనాభా పూర్తిగా ద్రావిడులు కాదా? అంటే దానికి ఆయన చెప్పే సమాధానం ఏమిటంటే "ఈ కమ్యూనిటీలు 75 శాతం ద్రావిడ పూర్వీకులు, 20 శాతం వాయువ్య భారత సంతతి, 5 శాతం ఇరానియన్‌లను కలిగి ఉన్నాయని చెబుతాను" అంటారు తంగరాజ్. పైగా అది ఏ విధంగానూ వివాదాస్పదం కాదు అని కూడా అంటారు.