
కోణార్క్ సూర్య దేవాలయం: రాతిలో సమయ గాథ
రఘురాజ్‌పూర్ కళాగ్రామం నుంచి కోణార్క సూర్య దేవాలయం వరకు మా ప్రయాణం. శిల్ప సంపద, చరిత్ర, సందేశాలతో ఓ ప్రత్యేక కథనం.
ఆరు గంటలకల్లా, నిన్నటి నుంచి అలల హొయలు పోతూ ఊరిస్తున్న బీచ్ కి 5 కల్లా లేచి,సూర్యోదయాన్ని చూద్దామని వెళ్ళాం.7 గంటలైనా సూర్యుడు కనిపించనంత మంచు. సముద్రపు ఒడ్డున, అలంకరించి,ధీమాగా నడుస్తున్న ఓ ఒంటె,ఒడ్డున వంటి స్తంభoలా ఓ పడవ భలే ఉన్నాయి.హోటల్లో శాయశక్తులా తిని 'రఘురాజ్ పూర్' ఆర్ట్ విలేజ్ కి బయలుదేరాం. పూరికి 11 కిలోమీటర్ల దూరంలో భార్గవి నది ఒడ్డున ఉంది.
ఒరిస్సాలో,సహజ రంగులతో చిత్రాలు వేసే (మురల్) వారసత్వ కళల గ్రామం.ప్రతి ఇంటి వారు వంశపారంపర్యగా వస్తున్న పటచిత్ర లేఖనంలో నిపుణులు.గుడ్డపై సహజ సిద్ధమైన రంగులతో పురాణ గాధలను వీరు అద్భుతంగా చిత్రీకరిస్తున్నారు.
మాస్కులు,పటచిత్రాలు,గోటిపువా(ఓడిస్సీ నృత్యానికి పునాది నృత్యం)నృత్యానికి సంబంధించిన దుస్తులు,గొడుగులు, తాటాకు (తాళపత్రాలు(palf leaf)కొబ్బరిబొండాలపై చిత్రణలు ఇక్కడ ప్రత్యేకత.(పూరి జగన్నాథ రథయాత్ర 'అనాసర' లో విగ్రహాల బదులు ఇక్కడి పట చిత్రాలనే పూజిస్తారు)ప్రతి ఇంటి గోడలపైన, గుడి,బడి, గ్రామ టాయిలెట్ల పై కూడా ఎంతో అందంగా ఎరుపు తెలుపు రంగుల చిత్రాలతో గ్రామం గ్రామమే ఓ ఆకర్షణీయమైన కాన్వాస్ లా ఉంది.2000 సంవత్సరంలోనే "యునిస్కో" ఈ గ్రామాన్ని వారసత్వ గ్రామంగా (హెరిటేజ్ విలేజ్) ప్రకటించింది.
అంతే కాదు ప్రఖ్యాత ఓడిస్సీ నృత్య కళాకారుడు 'గురు కేలు చరణ్ మహాపాత్రో' జన్మించిన ఊరు కూడా. కనుకనే ఒడేసి నృత్యానికి అవసరమైన పేపర్ మాష్ (papier mache) బొమ్మలకు నిలయం.ప్రతి ఇంటి ముందు అమ్మకాలతో పాటు,చిత్రాలు గీస్తున్న కళాకారులు కనిపిస్తారు.
మా అందరికీ రఘురాజ్ పూర్ భలే నచ్చింది. కొనేవాళ్ళు కొంటుంటే,చూసేవాళ్ళు చూస్తున్నారు. ఫోటోలు తీసుకుంటున్నారు.నేను కళాకారుల్ని ఇంటర్వ్యూ చేయగా....
కాన్వాస్ కోసం రెండు కాటన్ చీరలను.... చింతగింజలను ఒక రోజంతా నానబెట్టి రుబ్బి ఆ పిండితో అతికించి ఎండలో రెండు రోజులు ఆర పెడతాo.ఎలాంటి ఆర్టిఫిషియల్ రంగులు వాడము. సహజ రంగుల కోసo--- సముద్రపు షెల్స్ రుబ్బి తెల్ల రంగును,కాజాల(కాటుక)ను తామరoడ్ సీడ్స్ లో కలిపి నల్ల రంగును,ఎరుపు కోసం హేంగుల్ స్టోన్స్, బ్లూ కోసం నీల్ స్టోన్స్ ను,అన్ని కలిపి ఆకుపచ్చ రంగును తయారు చేస్తాం.ఈ స్టోన్స్ అన్ని బాలేశ్వర్ డిస్ట్రిక్ట్ నుండి తెచ్చుకుంటామని "సుకాన్" అనే కళాకారుడు ఓపిగ్గా చెప్పి,ఇంకా కావాలంటే ఫోన్ చేయండని నెంబరు 9778983138 ఇచ్చాడు.
రఘురాజ్ పూర్ నుండి కనుచూపుమేరా కళ్ళతో తాగేస్తూ సుదం(sudam sand art) ఆర్ట్ మ్యూజియంకు వేళ్ళాం.వెళ్ళక ముందు అనేక ప్రశ్నలు అనుమానాలు ఉండేవి.అంతర్జాతీయ ఇసుక కళాకారుడు 'సుదం ప్రధాన్' పేరుతో 2.5 ఎకరాల స్థలంలో ఉంది.'వరల్డ్ పీస్' సందేశాన్ని ఇస్తుంది.40 పైగానే ఇసుకతో చేసిన అద్భుత శిల్పాలు.మనుషుల జంతువుల, దేశ నాయకుల, ఏసుప్రభు,20 అడుగుల బుద్ధవిగ్రహాo,22అ.ఇసుక కోట,కోణార్క్,తాజ్ మహల్ ఒకటేమిటి, ఒక్కొక్కటి ఒక్కొక్క అద్భుత కళా సృష్టి.మాటలలో వర్ణించలేం. మీరు చూసి అనుభవించి ఆనందించాల్సిందే.వీటి కోసం దాదాపు 100 లారీల ఇసుకను తెచ్చారట.
ఇక్కడ నుండి కోణార్క్ వైపు.చరిత్ర విద్యార్థిగా నా కోరిక తీరబోతుందన్న ఉత్సాహం ఉరకలేస్తోంది.కోణార్క్ కు సంబంధించి అనేక కథలు,రహస్యాలు ఉన్నాయట.12 ఏళ్ళ 'ధర్మపద', శ్రీకృష్ణుని కొడుకు శాంభుడు కథలు.వాటి జోలికి పోను.
1250సం..రం నుండి తూర్పు గంగరాజ వంశానికి చెందిన మొదటి నరసింహదేవ రాజు నిర్మించాడని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. 1200 మంది శిల్పులు12 సంవత్సరాలు శ్రమించారనటానికి('ధర్మపద త్యాగానికి'కూడా ప్రముఖ ఒడియా కవి గోపబంద్ రాసిన'ధర్మపద కావ్యం') మౌఖిక జానపద సాహిత్యాలే ఆధారాలట.
'Hemis' మేనేజర్ పవన్ కుమార్ వెతికి వెతికి హిందీ ఇంగ్లీష్ చెప్పగల గైడ్ను తీసుకొచ్చాడు. గైడ్ చెప్పిన,నేను చూసిన వాటిగురించి.కోణార్క్ సూర్య దేవాలయం ఒరిస్సాలో పూరి (జగన్నాథ ఆలయం)కి 23 కిలోమీటర్ల దూరంలో చంద్రభాగ నది ఒడ్డున ఉంది.దేశములోని 10 అతి పెద్ద దేవాలయాలలో ఒకటి.
కోణార్క్ రాతి కట్టడం కాదు, ఒక "రాతి కావ్యం"
"కోన" అంటే 'మూల' "ఆర్క్" అంటే సూర్యుడు.ఈ రెండు పదాలు కలిపి కోణార్క్ అనే పేరు వచ్చిందట.తూర్పు ముఖంగా 24 చక్రాలతో(ఉత్తరంవైపు 12 దక్షణంవైపు12)ఏడు గుర్రాలు లాగుతున్నట్లు ఉంటుంది.గుర్రాలు చాలా వరకు శిధిలమైతున్నాయి.సూర్యుడికి అంకితం ఇవ్వటంతో కోణార్క్ సూర్య దేవాలయంగా ప్రసిద్ధి చెందింది.అయితే ఇప్పుడు ఆలయంలో ఎలాంటి విగ్రహాలు లేవు.ఆలయ గోడలపై మూడు వైపులా సూర్య భగవానుడి శిల్పాలు కనిపిస్తాయి.
ఆలయ ప్రవేశ ద్వారం (జగన్మోహన మండపం)వద్ద సింహం,దానికింద ఏనుగు,దాని కింద మనిషి 'గజ సింహ' విగ్రహం గురించి, సింహం అహంకారానికి, ఏనుగు సంపదకు చిహ్నాలని , అహంకార,సంపదల వ్యామోహాలకు మనిషి నలిగిపోతున్నాడని వివరించాడు.ఇది వాస్తవం అనిపించి,ఆనాటి శిల్పుల ఆలోచన గొప్పగా అనిపించింది.
సమయాన్ని బట్టి సూర్య శిల్పాలపై తేడా (ఉదయం'బాల',మధ్యాహ్నం'ప్రౌఢ',సాయంత్రం 'వృద్ధ') ఉంటుందని గైడ్ వివరించాడు.ఇక్కడ ఉన్న ధ్వజస్తంభాన్ని కూడా పూరి జగన్నాథ ఆలయంలో ప్రతిష్టించారు.విగ్రహాలను కూడా పూరిలోనే భద్రపరిచారట.రథచక్రాలు 24 ఆకులతో 24 గంటలను తెలియజేస్తున్నాయి.చక్రం మధ్యలో ఉండే వుబెత్తుభాగపు నీడ ఆకులపై పడేదాన్ని బట్టి సమయం తెలుస్తుందని గైడు సమయాన్ని చూపించాడు.పది అడుగుల ఎత్తులో అన్ని చక్రాలు ఒకే సైజులో ఉన్నా,వాటిపై డిజైన్లు వేరు వేరుగా ఉన్నాయి.12 ఆకులలో 8 ఆకులు పగలును, నాలుగు ఆకులు రాత్రిని సూచిస్తాయని, ఆకుల(spokes)పై ఉన్న సన్నని శిల్పాలు ఆయా సమయాల్లో మనిషి చేయాల్సిన పనులను (పని,భోజనం, విశ్రాంతి)తెలుపుతాయని చాలా చక్కగా వివరించాడు.చక్రం చుట్టూ,కింద దిమ్మె ఏదో ఒక నగీషీతో కళ్ళు తిప్పుకోలేనంత గొప్పగా ఉన్నాయి.ఈ చక్రాలలో కొన్ని అక్కడక్కడ పగుళ్ళు భారీ ఉన్నాయి.చరిత్ర పట్ల,చారిత్రిక కట్టడాలు, ప్రదేశాల పట్ల మన నిర్లక్ష్యం అడుగడుగున కనిపిస్తుంది.చారిత్రికా ప్రదేశాల,కట్టడాల రక్షణ విషయాలలో 'చైనా' నుండి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉందనిపించింది.బ్రిటిష్ వారి సంరక్షణలతో ఈ మాత్రమైనా ఉన్నాయని చెప్పొచ్చు.
ముఖ్యంగా చెప్పుకోవలసినది శిల్ప సంపద గురించే.ఆలయ పునాదులకు లాటరైట్ ను, విగ్రహాలు, అలంకారాలకు ముదురు ఆకుపచ్చ లేదా నలుపు రంగులో ఉండే క్లోరైట్ రాతిని, గోడలు, చక్రాలు, క్లిష్టమైన శిల్పాలకు ఖోoడలైట్ రాతిని ఉపయోగించారని,రాళ్లను అతకడానికి ఎటువంటి సిమెంటు వాడలేదట.రాళ్ల మధ్య ఇనప మేకులు ఇనప పలకలను ఉంచి 'ఇంటర్ లాకింగ్ సిస్టం'(ఆ కాలంలోనే..చాలా గొప్పగా అనిపించింది)ద్వారా అతికించారని గైడ్ వివరించాడు.ఈ ఆలయము సముద్ర నావికులకు నల్లగా కనిపించే పెద్ద టవర్ లా ఉండటంతో "బ్లాక్ పగోడా " అని యూరోపియన్లు పిలిశారు.శిల్పాలు నాలుగు గ్యాలరీలుగా ప్రదర్శించబడుతుందని,1సూర్యుడి విగ్రహలు2 డ్రమ్మెర్ ముసలితల 3 అప్సరసలు 4సింహం వంటిది.దక్షిణ దిక్కుగా ఉన్న జంట గుర్రాలు రెవిన్యూ స్టాంప్ పై ఉందని,ఉత్తర దిక్కున జంట ఏనుగులు కాపలాగా ఉంటాయన్న అర్థములో చెప్పాడు.
వందలాది నాట్య భంగిమ,సంగీత విద్వాంసుల శిల్పాలు,మృదంగం తాళాలు వంటి సంగీత వాయిద్య పరికరాలు స్పష్టంగా,సహజంగా ఉన్నాయి.వందలాది ఏనుగులు వెళుతున్న దృశ్యాలు.గుర్రాల,ఏనుగుల,సైనికుల కవాతు శిల్పాలు.ఆకులు పువ్వులు, అలంకరణలు, అద్దాలు, నిత్య జీవిత చిత్రాలైన వంట చేస్తున్న స్త్రీలు,చెట్టు కింద భర్త కోసం ఎదురుచూస్తున్నా మహిళ ఒకటేమిటి ప్రతిఒక్కటి ఆ శిల్పుల ఉహాలకు, ఓర్పుకు సహనానికి, దీక్షకు నైపుణ్యానికి,చరిత్రకు చిహ్నాలు.జిరాఫీ శిల్పాన్ని చూసి 13వ శతాబ్దంలోనే ఎడారి దేశాలతో వాణిజ్య సంబంధాలు ఉన్నాయనుకున్నాము.
మా గైడు, ఆ పై భాగమంతా సెక్స్ అని ఒక్క మాటలో చెప్పేశాడు ఇక మీరే చూసుకోండి అన్నట్లు.గోడల పై భాగమంతా శృంగార శిల్పాలు.వాత్సాయ (ఆయన ఏమి చెప్పుడో?) కామసూత్ర భంగిమలన్ని ఉన్నాయనవచ్చు.కళ్ళు ఎత్తుకొనో,కళ్ళు దించుకొనో,వంకర టెంకరగానో, చూసి చూడనట్లు యాత్రికులు ఓ చూపు వేస్తున్నారు.విశ్వామిత్రుడు చేయి మేనక చాతిపై ఉన్న శిల్పం చూసి విశ్వామిత్రుడు కదా!అని అక్కడున్న నలుగురం నవ్వుకున్నాం.ఏమైతేనేమి? రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పిన "ఇక్కడ రాతి భాష మానవ భాషను అధిగమించింది" మాటలు గుర్తొచ్చాయి.
జీవితంలో ఒక్కసారి వీలు చూసుకొని ఓ రాత్రి ప్రయాణం చేసి,ఉదయాన్నే పూరి జగన్నాథ టెంపుల్ లో భక్తిని,వెంటనే కోణార్క్ శిల్ప సంపదను చూసి ఆహా!ఓహో! జీవితం అనుకుంటారని హామీ ఇస్తున్నాను.కాని భక్తి పేరుతో గుళ్లను,ప్లాస్టిక్ చెత్తలతో,పిచ్చి రాతలతో పురాతన కట్టడాలను మురికి కూపాలుగా మార్చవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను.

