
కొండకర్ల సరస్సు కొత్త అనుభూతికి ఉషస్సు !
దాదాపు 1,800 ఎకరాల విస్తీర్ణంలో విరాజిల్లే మంచినీటి సరస్సు. కొండల నుంచి ఊరిన ఊటనీరు, వర్షపు నీరు కలిసి తయారైన సరస్సు ఇది.
తామర ఆకులపై నెమ్మదిగా దిగుతున్న జింటంగి పిట్టలను చూపిస్తూ అక్కినాయుడు చిరునవ్వుతో ఇలా చెబుతాడు,
‘ఈ సరస్సు మా జీవితం. వందల మైళ్ల దూరం నుంచి వచ్చే పక్షుల ఆశ్రయం ఇది. ఇక్కడ ఒక్క పక్షికి హాని చేసినా యాభై వేల రూపాయల జరిమానా తప్పదు!’
మరోవైపు బోటు దగ్గర నిలబడిన మల్లి రమణ అప్పారావు హెచ్చరిస్తాడు...
‘ పర్యాటకులైనా సరే, మా బోటు కార్మికులైనా సరే, మద్యం తాగి వచ్చినా చెత్తతో సరస్సును కలుషితం చేస్తే వెంటనే వెనక్కి పంపిస్తాం. మాట వినకపోతే పోలీసులకే అప్పగిస్తాం.’
చేప పిల్లల కోసం సమీపంలో ఒక కుంటను అభివృద్ధి చేసిన రామ్‌కీ ఫౌండేషన్
వీళ్లంతా అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలంలోని కొండకర్ల గ్రామస్తులు.
తమ ఉపాధికి ఆధారమైన, పక్షులకు ఆవాసమైన, పొలాలకు తేమనిచ్చే సరస్సును కాపాడుకోవాలని గ్రామసభలో తీసుకున్న ప్రజాతీర్మానాలివి.
ఉత్తరాంధ్రలో అరుదైన మంచినీటి అద్భుతం
విశాఖపట్నానికి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండకర్ల ఆవ( Kondakarla Ava ) దాదాపు 1,800 ఎకరాల విస్తీర్ణంలో విరాజిల్లే మంచినీటి సరస్సు. ఆంధ్ర ప్రదేశ్‌లో కొల్లేరు తర్వాత రెండో అతిపెద్ద సరస్సుగా గుర్తింపు పొందింది.
‘ఆవ’ అంటే పల్లపు ప్రదేశం.
చుట్టూ ఉన్న కొండల నుంచి ఊరిన ఊటనీరు, వర్షపు నీరు కలిసి కాలక్రమంలో ఈ సరస్సుగా మారింది. శీతాకాలంలో వలస పక్షులకు స్వర్గధామంగా మారుతుంది. ఒక వైపు కొండలు, మరో వైపు కొబ్బరి తోటలు మధ్యలో నీలి అద్దంలా మెరిసే ఈ చిత్తడి నేల ఒక అరుదైన ప్రకృతిచిత్రం. ఈ సరస్సుపై ఆధారపడి వందలాది మత్స్యకార కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. కాలక్రమేణా ఆవలో చేపల ఉత్పత్తి తగ్గింది. రోజువారీ ఆదాయం పడిపోయింది. ఉపాధి కోసం యువకులు పట్టణాల వైపు వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిరది.
కొండకర్ల సరస్సులో పడవ మీద గ్రామ సభ
‘‘ఇది సహజంగా ఏర్పడిన మంచినీటి సరస్సు. కొరమేను, తెలాపియా, రొయ్యలు, బొమ్మిడం, దొందులు ఇలా ఎన్నో రకాల చేపలు ఇక్కడే పెరుగుతాయి. వాటి రుచి వేరు. ‘కొండకర్ల ఆవ చేపలున్నాయా?’ అని అడిగి మరీ కొనేవాళ్లు. ఇప్పుడు అవే తగ్గిపోతున్నాయి,’’ అని వాపోతుంది గ్రామస్తురాలు సైదు వరలక్ష్మి.
‘‘ముందు వారానికి నాలుగు రోజులు చేపలే భోజనం. ఇప్పుడు వారానికి ఒక్కసారి కూడా కష్టమవుతోంది,’’ అని కొవిరి లలిత కన్నీళ్లతో చెబుతుంది.
సమష్టి తత్వమే పరిష్కారం
ఈ బాధలు రామ్‌కీ ఫౌండేషన్ ( Ramky Foundation ) ని కదిలించాయి. కార్పొరేట్ సామాజిక బాధ్యత ( ) కార్యక్రమం ద్వారా కొండకర్ల మత్స్యకారులకు అండగా నిలిచింది.
సమస్యలు క్లిష్టమైనవి కాదు, అని గుర్తించింది సంస్థ. కావాల్సిందల్లా ప్రజల భాగస్వామ్యం.
ఆవ లోనే పడవలపై గ్రామసభలు నిర్వహిస్తూ, ఊరి పెద్దలతో కలిసి ప్రణాళికలు రూపొందించారు.
సహజసంపదకు సమున్నత సహకారం
‘‘కొండకర్ల ఆవలో మత్స్యసంపద తగ్గిపోవడంతో మత్స్యకారుల జీవనోపాధి దెబ్బతిన్న విషయం కలెక్టర్ గారి ద్వారా తెలుసుకున్నాం. గ్రామస్తులు సరస్సును ఎంతో బాధ్యతగా కాపాడుకుంటున్నారని గమనించాం. రీ సస్టెయినబిలిటీ లిమిటెడ్ ( ReSustainability lmtd ) సహకారంతో ముందుగా 15 లక్షల చేప పిల్లలను పెంచి ఆవలో వదిలాం. ప్రస్తుతం 10 లక్షల చేపలు ఆరోగ్యంగా పెరుగుతున్నాయి. మత్స్యకార మహిళలకు శిక్షణ ఇచ్చి, చేపలతో స్నాక్స్, పచ్చళ్లు తయారుచేసేలా ప్రణాళిక రూపొందించాం. ఇది బృహత్తరమైన, ఎంతో సంతృప్తినిచ్చే కార్యక్రమం.’’ అంటారు, రామ్‌కీ ఫౌండేషన్ ప్రెసిడెంట్ ఎం.వి. రామిరెడ్డి,
కొండకర్ల ఆవ అభివృద్ధికి సహకరించిన రామ్‌కీ ఫౌండేషన్ ప్రెసిడెంట్ ఎం.వి. రామిరెడ్డి,
చేపలను ఇతర ప్రాంతాలకు విక్రయించేందుకు జాలరులు 15 టీవీఎస్ ద్విచక్ర వాహనాలను కూడా అందించారు.
పర్యావరణమే భవిష్యత్తు
ఇప్పుడిప్పుడే మత్స్యకారుల జీవితం గాడిలో పడుతోంది.
కానీ వారు అక్కడితో ఆగలేదు.
‘‘చేపలు పిల్లలు పెట్టే కాలంలో మూడు నెలలు వేట ఆపేస్తాం. ఆ సమయంలో టూరిస్టులకు బోటు విహారం నిర్వహిస్తాం,’’ అంటాడు మత్స్యకార సంఘం అధ్యక్షుడు మల్లి రమణ అప్పారావు.బంగారు పాప, గడ్డిమోసె, ఎర్రమైలా, కట్లా, బిగ్‌హెడ్ వంటి జాతుల చేపలు పెరుగుతున్నాయి. ఇలా 300 కుటుంబాలకు జీవనోపాధి భద్రత లభించింది.
క్లీన్ అండ్ గ్రీన్ ఆవ
పర్యాటకులు చెత్త వేయకుండా హెచ్చరిస్తారు.
ప్రతిరోజూ ఉదయం సొసైటీ సభ్యులే శ్రమదానం చేసి శుభ్రం చేస్తారు.
సరస్సు ను కాపాడుతున్న స్వచ్ఛంద సంస్ధల బృందం
పక్షులకు హాని చేస్తే జరిమానా. మద్యం తాగితే నేరం.ఇలా
వసూలైన డబ్బంతా సరస్సు అభివృద్ధికే.
మారిన జీవితం నిలిచిన సరస్సు
ఒకప్పుడు తాడిచెట్లతో చేసిన దోనెలపై పర్యాటకులను తిప్పిన మత్స్యకారులు
ఇప్పుడు ఫైబర్ బోట్లకు మారారు. బ్రిటిష్ కాలంలో ఈ అందాలకు ముగ్ధులై సరస్సు సమీపంలో నిర్మించిన భవనం, గుర్రపు శాలల అవశేషాలు ఇప్పటికీ ఉన్నాయి అని చెబుతారు స్థానికులు.
ఈ సరస్సు ఎప్పుడు చూడవచ్చు?
నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకూ వందలాది పర్యాటకులు వస్తారు.ఈ సమయంలోనే వలస పక్షులు కూడా అక్కడికి చేరుకొని కనువిందు చేస్తాయి.
విరగబూసిన తామరలు, వలస పక్షులు, నీటిని చీల్చుకుంటూ వెళ్లే పడవలు, ప్రీ వెడ్డింగ్ షూట్లు తో ఈ కలువల సరస్సు ఒక జీవన అద్భుతం.

