
కొన్ని క్షణాలు మిగుల్చుకుందాం (కవిత )
డాక్టర్ చెంగల్వ రామలక్ష్మి.
నువ్వూ నేనూ మనం అయ్యాక
మొదటిసారి
పోట్లాడుకున్నదెప్పుడూ అని
తేదీలను, సంవత్సరాలను
గుర్తు చేసుకునే సమయం లేదింక!
కామా లే తప్ప ఫుల్స్టాప్లు లేని నిరంతర
యుద్ధప్రవాహం లో
ఎన్నో రకాల యుద్ధాలు
చేసాం
సమానత్వం కోసం అవిశ్రాంత పోరాటం
బడ్జెట్ సర్దుబాటుకు భయంకర
యుద్ధం
వంటింటి రుచులలో హోరాహోరీ పోరు
నా కథ గొప్ప దంటే
నీ కవిత గొప్పదని
వేల వేల సాహిత్య యుద్ధాలే యుద్ధాలు
కొన్ని సార్లు నిశ్శబ్దంగా
ఎన్నోసార్లు మాటల తూటాలతో!
యుద్ధం లేనిదెపుడు?
మూడు వంతులు ముందు కెళ్ళిపోయిన బతుకులో
మురిపెంగా చెప్పుకునే ముచ్చటైన క్షణాలేవీ!
ఒక్కసారి వెనక్కి తొంగి చూసుకుంటే
కనిపించేదేమిటి?
ఎడముఖం, పెడ ముఖాల
ప్రతిబింబాలు తప్ప!
జీవితం చిన్నదైపోయింది
తలచుకుంటే
చిరునవ్వు అలలు, అలలుగా
ముఖమంతా
అల్లుకుపోయే
స్నేహ క్షణాలను
కొన్నైనా
ఇకనైనా
మిగుల్చుకుందామా!
***
‘తెలుగు వాళ్లకి ‘మరో ప్రపంచం’ పరిచయం చేసిన మహాకవి’
సాహిత్య విమర్శకుడు తెలకపల్లి రవి ‘మహా ప్రస్థానం@75’ పరామర్శ ఇక్కడ చదవండి
Next Story