ఇప్పుడే.... (Sunday Poem)
ఆదివారం కవిత మూలం: లీ షూ ఫెంగ్; స్వేఛ్చానువాదం: అలజంగి మురళీధర రావు
సేవించు నీ తేనీటిని
ఇప్పుడే..ఈ క్షణమే ...
ఎవరు ఎప్పుడు వెళ్లిపోతామో ఎవరికీ తెలియదు,
జీవన రసోల్లాసానికై సమయమూ ఉండకపోవచ్చు,
కనుక
సేవించు నీ తేనీటిని
ఇప్పుడే...
మంద్రంగా, సాంద్రంగా ...!
జీవితం క్షణ భంగురం
భ్రమించకు శాశ్వతమని ...
ఏదో జరగరానిది జరిపోతున్నదని ,
చెయ్యాల్సింది ఇంకేదో మిగిలిపోయిందని
ఉన్న సమయాన్నంతా వృధా చెయ్యకు...
ఇంకా ఆలస్యం కాకముందే,
వెళ్ళిపోయే సమయం రాకముందే..
సేవించు
నీ తియ్యని తేనీటిని
నిండుగా,నిదానంగా...!
ఒక్కరో ఇద్దరో తప్ప
మిగిలిన వాళ్ళంతా మనల్ని విడిచి వెళ్ళే వారే !
మనం ప్రేమించేవాళ్ళూ ఉండబోరు తుదిదాకా!
మన పిల్లలూ అంతే
రెక్కలొచ్చి ఎక్కడకో ఎగిరిపోతారు !
కాలం ఎటు మళ్ళుతుందో
ఎవరికి తెలుసు...?!
కనుక
ఇప్పుడే సేవించు నీ తేనీటిని
ఆబగా,ఆనందంగా...!
ఈ చరాచర జగత్తులో
ప్రేమ ఒక్కటే సత్యం!
ఆదరించు,ఆరాధించు
శ్రద్ధాళు వైన ప్రేమమూర్తిని ...!
గుండె నిండా శ్వాస తీసుకో
మనసుతీరా నవ్వుకో
చింతలన్నింటిని చిదిమేయి
ఇక
సేవించు నీ తేనీటిని
కొంచెం కొంచెంగా
పసందుగా!
నేను మరణించే సమయాన
మీరు కార్చే కన్నీటి ధారలు నాకు తెలియదు
కనుక ఇప్పుడే
నా కన్నీళ్లను మీ కన్నీళ్ళుగా చేసుకోండి !
మీరు పంపే పూలను నేను చూడలేను
కనుక ఇప్పుడే
వాటిని పంపండి !
మీరు పలికే ప్రశంసా వాక్యాలు నాకు వినిపించవు
కనుక ఇప్పుడే
ప్రశంసించండి !
నేను పోతే నా తప్పులను క్షమించే మీరు
వాటిని ఇప్పుడే క్షమించండి !
నాతో ఎక్కువ సమయాన్ని గడపలేకపోయామేనని
నా మరణ సమయాన వాపోయే మీరు
అదేదో ఇప్పుడే
మీ సమయాన్నంతా నాతో గడపండి
ఇన్నేళ్ళుగా ఒక్కసారైనా మాట్లాడుకోని మనం
నేను పోయానని తెలిసి
నేరుగా నా ఇంటికి వచ్చి
మీ సంతాపాన్ని ప్రకటిస్తారు !
అదేదో ఇప్పుడే
నన్ను వెతుక్కుంటూ నా ఇంటికి రండి !!!
(Lee Tzu Pheng (b. 13 May 1946, Singapore–) is one of Singapore's distinguished poets. A retired university lecturer, she has published in anthologies and journals internationally.)