నిజం,  ఇది కమ్యూనిస్టు మేధావులకోసం  ఏర్పాటు చేసిన రిసార్ట్
x

నిజం, ఇది కమ్యూనిస్టు మేధావులకోసం ఏర్పాటు చేసిన రిసార్ట్

నార్త్ సీ బ్యాక్ డ్రాప్ లో ఉన్న ఈ రిసార్ట్ లో మార్క్సిజం,సోషలిజం ప్రపంచయుధ్దాల, సిద్ధాంతాల గురించి కమ్యూనిస్టు మేధావులు పరిశోధన చేసుకోవచ్చు, తర్కించుకోవచ్చు,



స్వీడెన్ లో లెనిన్‌ల్యాండ్: ఫాంటసీ కాదు, వాస్తవం


-కొవ్వూరి గణపతి రెడ్డి

(స్వీడెన్ నుంచి)


ఈ రోజు లెనిన్ వర్ధంతి. ఈ సందర్భంగా స్వీడెన్ దేశంలో కనిపించే ఒక విచిత్రం చెప్పాల్సి ఉంది. ఇలాంటి విచిత్రం ప్రపంచంలో ఎక్కడా ఉండదేమో.

లాస్సే గున్నార్ డిడింగ్ స్వీడిష్ హోటల్ వ్యాపారి. సక్సెస్ ఫుల్ బిజినెస్ మన్. సెలబ్రిటీ కూడా. ఆయనకు నైరుతి స్వీడెన్ లోని వర్బెర్గ్ లో హోటెల్ గాస్టిస్ (Hotel Gästis), హోటెల్ హవానా అంటూ రెండు హోటళ్లున్నాయి. తొందర్లో ఆయన వర్బెర్గ్ లో ఒక ఫుట్ బాల్ స్టేడియం కూడా కట్టాలనుకుంటున్నారు. ఇందులో పైకి విశేషమేమి కనిపించదు. అయితే, స్వీడెన్ లో ఇతగాడు ఒక అరుదైన హోటల్ యజమాని. కారణం, ఆయన రష్యా విప్లవనేత వ్లాదిమిర్ లెనిన్ వీరాభిమాని. లెనిన్ ని ఆరాధిస్తాడు. ఆయన హోటెల్ లోని ఒక స్పా (Lenin Spa) కు లెనిన్ పేరు పెట్టాడు. అంతేకాదు లెనిన్ పేరుతో స్వీడెన్ రచయితల కోసం ఒక మార్క్సిస్టు సాహిత్య అవార్డును కూడా ఏర్పాటు చూశాడు. తాను కట్టబోయే పుట్ బాల్ స్టేడియం కు కూడా ఆయన లెనిన్ పేరే పెడుడుతున్నాడు. వీటన్నింటి కంటే ముఖ్యంగా వామ పక్షరచయితలు, మేధావులు, కళాకారులు స్వీడెన్ కు వచ్చి ప్రశాంతంగా తమరచనా వ్యాసంగం కొనసాగించేందుకు వీలుగా ఒక ఫెలోషిప్ ఏర్పాటు చేశాడు. వారంతా వచ్చి మేధోమధనం జరుపుకునే స్థలం పేరు లెనిన్ ల్యాండ్ (Leninland).



పుస్తకాల మీద ఆటోగ్రాఫ్ చేస్తున్న లాస్సే


లెనిన్ (1870-1924) ఎవరనుకుంటున్నారు! శతాబ్దాలుగా రష్యాలో పాతుకుపోయిన జార్ పాలనా నిరంకుశ వ్యవస్థను కూలదోసి సోషలిస్టు రష్యాను స్థాపించిన విప్లవకారుడు. పెట్టుబడిదారీ వ్యవస్థకు పరమశత్రువు. మార్క్సిజం తాత్విక దృక్పథంతో పని చేసే కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో ఏర్పడిన తొలి ప్రభుత్వం ప్రపంచంలో అదే. ఆ మార్క్సిజం కొనసాగింపే లాస్సే విశ్వసిస్తున్న లెనినిజం. ప్రపంచంలో కమ్యూనిస్టుల ఆరాధ్యుడయిన లెనిన్ 1924 జనవరి 21న మరణించాడు. రష్యా రాజధాని మాస్కోలోని రెడ్ స్క్వేర్ సమాధిలో ఆయన భౌతిక దేహాన్ని భద్రపరిచారు.

ఇలాంటి వ్యక్తి సిద్ధాంతంతో లాస్సే ప్రభావితుడయ్యాడు. తనను నమ్మిన సిద్ధాంతాన్ని మరింత ముందుకు తీసుకుపోయేందుకు కృషి చేస్తున్న వాళ్లకు తనదైన శైలిలో చేయూత నివ్వాలనుకుంటున్నాడు. తన విలాసవంతమైన వందేళ్లనాటి విల్లాకు వామపక్ష రచయితలను మేధావులను ఆహ్వానిస్తున్నాడు. రండి, ఇక్కడిప్రశాంతవారణంలో నార్త్ సీ అలల సవ్వడి వింటూ, కమ్యూనిస్టు మేధావులు, రచయితలు కళాకారులు మీ పని కొనసాగించండి అంటున్నాడు. మా విల్లాకు వచ్చి మీ సృజనాత్మక రచనా వ్యాసంగం, పరిశోధనలను కొనసాగించుకోవచ్చని చెబుతున్నడు. అంతేకాదు, ఆయన ‘ఇండియా వెయిట్స్’ రచయిత జాన్ మిర్డాల్ (Jan Myrdal) పేర ఏర్పాటు చేసిన ఒక సంస్థకు కూడా మద్దతు నిస్తున్నారు. ఈ సంస్థకొక ఒక లైబ్రరీ కూడా ఉంది.


లాస్సే తో ఈ వ్యాసరచయిత గణపతి రెడ్డి


లెనిన్‌ల్యాండ్ విల్లా లో ఉమ్మడిగా వాడుకునేందుకు వీలుగా సకల సౌకర్యాలుంటాయి. అక్కడ లైబ్రరీ ఉంది. కిచెన్ ఉంది. మ్యూజిక్ సెలూన్, గార్డెన్ బార్, బిలియర్డ్స్, టేబుల్ టెన్నిస్ రూమ్ లున్నాయి. ధ్యానం చేసుకునేందుకు ప్రశాంతత దొరుకుతుంది. తీరుబడిగా సిగరెట్, సిగార్ కాల్చేందుకు గెజిబో (నికోటిన్) ఉంది. విదేశాలనుంచి వచ్చే సేమ్ సెక్స్ ప్రేమికులు కూడా సరదాగా కబుర్లాడుకునేందుకు ప్రేమించుకునేందుకు, మద్యం సేవించేందుకు కూడా వీలుంది. ఈ విల్లాని వందేళ్ల క్రితం నిర్మించారు. లెనిన్ మరణించిన తదుపరి సంవత్సరం దీని నిర్మాణం పూర్తయింది. అలన్ బెర్గ్‌లండ్ ఈ విల్లాను డిజైన్ చేశాడు. అట్లాంటిక్ మహాసముద్రంలోని నార్త్ సీ ఒడ్డున ఉన్న ఒక కొండ చరియ మీద వర్బెర్గ్ కోటకు ఎదురుగా ఒక దట్టమయిన పచ్చ బొట్టులాగా ఉంటుందీ విల్లా.

చిత్రమేమిటంటే లెనిన్ ల్యాండ్ విల్లా వర్ధిల్లుతున్నది ఎక్కడ? పెట్టుబడి దారి వ్యవస్థకు బలమయిన కేంద్రమయిన స్వీడెన్ దేశంలో.

ఈ దేశం రష్యా వ్యతిరేకి. ఈ దేశంలో కమ్యూనిస్టులు కనిపించరు. లెనిన్, లెనినిజం అనే మాటలు వినిపించవు.

లెనిన్ స్థాపించిన నాటి సోవియట్ కొనసాగింపుగా వస్తున్న నేటి రష్యానుంచి తనకు ముప్పు ఉందని స్వీడెన్ భయపడుతూ ఉంటుంది. అందుకే రష్యానుంచి తనకు భద్రత కావాలని స్వీడన్ నేటో ( NATO) సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకుంది. రష్యాకు ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం జరుగుతున్న ఈ సమయంలో ఒక స్వీడెన్ జాతీయుడు లెనిన్ ని ఇలా భుజానేసుకోవడం బాగుందా? డిడింగ్ అలాంటి వాటి గురించి ఎపుడూ అలోచించడు.

యూరోపియన్ బ్లాక్‌లోని ఇతర దేశాల మాదిరిగానే స్వీడన్ కూడా ఈ యుద్ధంలో ఉక్రెయిన్‌కు మద్దతు ఇస్తోంది. రష్యన్ బాంబుల దాడి నుంచి తప్పించుకుని దేశం విడిచిపారిపోతున్న ఉక్రేనియన్ శరణార్థులకు ఆశ్రయం ఇస్తూ ఉంది. ఇలాంటి వాతావరణంలో వామపక్షవాదిగా ఉండటం, లెనిన్ ని ఇలా బహిరంగంగా వెనకేసుకు రావడం అంత సులభం కాదు అంటాడు లాస్సే. అంతేకాదు, విప్లవం, సోషలిజం సిద్ధాంతాలకు మద్ధతుగా రచనలు సాగించేందుకు, మార్క్సిస్టు చర్చలు కొనసాగించేందుకు, మార్క్పిజం మీద పరిశోధన చేసేందుకు ఇలా ఒక బహిరంగ వేదిక కల్పించడం మరీ కష్టం అని ఆయన ఒప్పుకుంటారు.




ఉక్రెయిన్‌పై రష్యా చేసిన దాడి ని సమర్థించడం ఎలా అన్నపుడు ఉక్రెయిన్ కు లెనిన్ మంచి స్నేహితుడని మన అందరికి తెలుసు. దానికి లెనిన్ విముక్తి కలిగిస్తాడు,’ అని జవాబిస్తాడు.

వామపక్ష రచయితలకు ఈ రిసార్ట్ ఎందుకు?

'నాకు పెద్ద భవంతి ఉంది. నాలాగే వామపక్షభావాలున్న వారితో ఇందులో కొద్ది రోజులు గడపాలనుకుంటున్నాను,' లాస్సే చెప్పారు.

లెనిన్‌ల్యాండ్ ఒక ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడుస్తుంది. లెనిన్‌ల్యాండ్‌లో వామపక్ష రచయితలు కళాకారులు ఎవరైనా తమ సృజనాత్మక కార్యక్రమాలను నిరాటంకంగా ప్రశాంతంగా కొనసాగించేందుకు ఇక్కడ రెండు వారాలపాటు నివాసం ఉండవచ్చు.

హోటల్ వ్యాపారంలో ఉన్న లాస్సే స్వేఛ్చాలోచనను ప్రేమిస్తాడు, ప్రోత్సహిస్తాడు. వామపక్ష భావాలనున్న జర్నలిస్టులు ఇక్కడి కొచ్చి తమ ఆలోచనలను పదునుపెట్టుకోవచ్చని ఆయన కోరుకుంటారు. లెనిన్ మీద ఆయనకు ఉన్న ఈ వల్లమాలిన ప్రేమ వల్లే వామపక్ష జర్నలిస్టులకు, రచయితలకు ఒక విడిది ఏర్పాటుచేయాలనుకున్నారు.

“లెనిన్ ఒక్కరే తొలిసారి ఒక దుర్మార్గపు వ్యవస్థకు వ్యతిరేకంగా కార్మిక ఉద్యమాన్ని నడిపిన నేత. తన విప్లవంతో ఆయన రష్యాను యుద్దాలనుంచి బయటేశాడు. మూడుశతాబ్దాలుగా పాతుకుపోయి ఉన్న జార్ వ్యవస్థను తన్ని తగలేశాడు,” అని లాస్సే తన లెనిన్ అభిమానాన్ని వ్యక్తీకరిస్తాడు. “ మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో ప్రజలంతా ఏమిచేయాలో లెనిన్ తాను చేసిచూపించాడు,” అని లాస్సే చెప్పాడు.

ఆయన హోటెళ్లలో గ్యాస్టిస్ (Hotel Gästis) అనేది నిజానికి వాళ్ల తల్లితండ్రులు నివసించిన విల్లా. దానిని హోటెల్ గా బాగా ఆధునీకరంచాడు. అందులో లెనిన్ స్నానశాలలు కూడా ఏర్పాటుచేశాడు. సెయింట్ పీటర్స్ బెర్గ్ లో లెనిన్ ఇంట్లోని స్నానశాలల్లాగానే ఆయన వాటిని నిర్మించాడు. ఇందులో కూడా కోబాల్ట్ బ్లూ టైల్స్, క్యాండిల్స్, పెయింటింగ్స్, ఇతర కళాఖండాలు ఉంటాయి. ఒకసారి పీటర్స్ బెర్గ్(లెనిన్ గ్రాడ్, పెట్రోగ్రాడ్) ను సందర్శించి వచ్చాక లెనిన్ స్నానశాలను నిర్మించాలనే ఆలోచన వచ్చింది. నిజానికి లెనిన్ స్నానశాలలలోకి వెళ్లేందుకు ఆయన అనుమతి నీయలేదు.అయినా సరే, తనకు తెలిసిన సమాచారంతో లెనిన్ స్నాన శాలలను ఏర్పాటుచేయాలనుకున్నారు. చేశారు. తన రెండో హోటెల్ కు ఆయన హవానా (క్యూబా రాజధాని) పేరు పెట్టారు.

లెనిన్ ని సాంఘిక పరివర్తనకు ఒక చిహ్నంగా లాస్సే వర్ణిస్తాడు. లెనినిజం నేటి సామాజికావసరం అని కూడా ఆయన విశ్వసిస్తాడు. “ ప్రతి సంఘటనకు చారిత్రక కారణాలను శోధించిపట్టుకోవాలి. మనమెందుకు ఇలా తన్నుకు చస్తున్నాం. నేటి సమాజాన్నిఏమి చేయాలి? ఇదెలా అర్థమవుతుంది? గతంలోకంటే ఇపుడే లెనిన్ చాలా అవసరమని నా నమ్మకం,”అని ఆయన వాదిస్తాడు.

ఆయనకు చిత్రమయిన కోరికలున్నాయి. తన కుమారుడికి ఎవరూ పలకలేనంతగా 40 అక్షరాలతో పేరుపెట్టాడు. ఇలాంటి పేర్లను రిజస్టర్ చేయడం సాధ్యం కాదని అధికారులు తిరస్కరిచండంతో పెద్ద వివాదం జరిగింది. అపుడాయన పతాక శీర్షిక లకెక్కాడు.

అదీ లెనిన్ ల్యాండ్ గురించి, దాని వెనక ఉన్న లాస్సే గురించి.

రష్యాకు కాదు, స్వీడన్‌లోని లెనిన్‌ల్యాండ్‌కు స్వాగతం, వెబ్ సైట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

(కోవూరి జి. రెడ్డి జర్నలిస్టు, కంటెంట్ రైటర్, టీచర్, గోథెన్ బెర్గ్, స్వీడెన్)

Read More
Next Story