నాడు అడవిలో సాయుధ పోరాటం, నేడు తిరుపతిలో జీవన సమరం
x
చంద్రశేఖర్ రెడ్డి, వెంకట లక్ష్మీ దంపతులు

నాడు అడవిలో సాయుధ పోరాటం, నేడు తిరుపతిలో జీవన సమరం

-చత్తీస్ ఘర్ జైల్లో అతను పదిన్నరేళ్ళు ! ఆమె పన్నెండేళ్ళు ! -అతనిపై 38, ఆమెపై 159 రుజువుకాని కేసులు!


కొందరి జీవితాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. అంతులేని దుఃఖాన్ని నింపుతాయి. రేపెలా గడుస్తుందో ఆలోచించరు. తమ కోసం తాము జీవించరు. ప్రాణాన్నిసైతం లెక్క చేయరు. పోలీసులన్నా, కేసులన్నా, కోర్టులన్నా అసలు పట్టించుకోరు. ప్రజలకోసమే బతుకుతారు. వార్ధక్యమొచ్చినా తమ శ్రమతోనే జీవిస్తారు.

చిత్తూరు జిల్లాలో తొలితరం నక్సల్ బరీ నాయకుడతను. విద్యార్థిగా, 1969 నుంచే విప్లవోద్యమంలో చురుకైన పాత్ర. ఎమర్జెన్సీ అంతా జైల్లోనే. ఎమర్జెన్సీకి ముందుకూడా జైలు జీవితం. ఛత్తీస్ ఘర్ లో అరెస్టు చేసి, 38కేసులు పెట్టారు. ఒక్కటంటే ఒక్క కేసులో కూడా నేరం రుజువు కాలేదు. ఫలితంగా పదిన్నరేళ్ళు జైల్లోనే జీవితం గడపాల్సి వచ్చింది. ఎనిమిదేళ్ళ క్రితం నిర్దోషిగా విడుదలయ్యారు. ఆయనే డి.చంద్ర శేఖర్ రెడ్డి, అలియాస్ జయపాల్. ఇప్పుడతని వయసు 78 ఏళ్ళు.

తిరుపతి ఎస్పీడబ్ల్యు కాలేజీలో బిఎస్పీ విద్యార్థినిగా 1989లో అదృశ్యమైన ఆమె పీపుల్స్ వార్ దళాల్లో తేలారు. పజ్జెనివిదేళ్ళ తరువాత ఛత్తీస్ ఘర్ లో అరెస్టు చేసి, ఆమెపై 159 కేసులు పెట్టారు. ఏ ఒక్క కేసులోనూ నేరం రుజువు కాలేదు. అయినా, పన్నెండేళ్ళు జైలు జీవితం గడిపారు. ఆరేళ్ళ క్రితం విడుదలైన సి.వెంకట లక్ష్మి, ఉరఫ్ నిర్మలక్క వయసిప్పుడు అరవైఏళ్ళు.

జీవితంలో కీలకమైన సమయాన్నంతా విప్లవోద్యమం కోసమే వెచ్చించిన చంద్ర శేఖర్ రెడ్డి, వెంకటలక్ష్మి దంపతులు, వార్దక్యంలో కూడా పరాధీనులు కాదు. తిరుపతిలోని కొర్లగుంటలో ఉంటున్న ఆ చిన్న ఇంట్లోకి అడుగు పెట్టగానే, రెండు కుట్టు మిషన్లు కనిపించాయి. గూళ్ళలో చీరల ఫాల్స్ గా కుట్టే కొత్త గుడ్డలు, కుట్టవలసిన జాకెట్ గుడ్డలు, చీరలు కనిపించాయి. అయిదేళ్ళుగా బట్టలు కుట్టుకుంటూ ఇద్దరూ జీవనం సాగిస్తున్నారు. తిరుపతిలో జరిగే సభలు, సమావేశాల్లో ఇద్దరినీ చూస్తూనే ఉన్నాను. ‘మీతో మాట్లాడాలి’ అంటే, ‘‘పగలంతా పనుల్లో ఉంటాం. రాత్రి ఏడుగంటలకు రాగలరా’ అన్నారు చంద్రశేఖర్ రెడ్డి చాలా వినయంగా. ఆదివారం రాత్రి వారితో నా సంభాషణ ఇలా సాగింది.

అసలీ విప్లవోద్యమంలోకి ఎలా వచ్చారు? అని ప్రశ్నిస్తే చంద్రశేఖర్ రెడ్డి ఇలా చెప్పుకుంటూ వచ్చారు.

‘‘మాది చిత్తూరు జిల్లా ఐరాల మండలంలో ఐలవారి పల్లె. మాది వ్యవసాయ కుటుంబం. తిరుపతి ఓరియంటల్ కలాలేజీలో చదువుకుంటున్నాను. సింగమనేని నారాయణ నా క్లాస్ మేట్. వయసులో నాకంటే పెద్దవారు. మా బంధువుల్లో కొందరు సిపిఐ, సిపియంలో ఉన్నారు. వాళ్ళ నుంచి కొంత తెలుసుకున్నాను. మా కాలేజీకి 1969-70 ప్రాంతంలో దిగంబర కవుల్ని పిలిపించాం. జ్వాలాముఖి, నిఖిలేశ్వర్, చెరబండరాజు మా రూంలోనే దిగారు. సింగమనేని నారాయణ కూడా మాతోనే ఉన్నారు. నక్సల్ బరీ ప్రకంపనలు నా వరకు వచ్చాయి. చారుమజుందార్ నాయకత్వంలో ‘ఆలిండియా కో ఆర్డినేషన్ కమిటీ ఆఫ్ రెవల్యూషనరీస్’ ఏర్పడింది.

నారాయణరావు అనే అతను ‘లిబరేషన్’ పత్రికను తెచ్చిచ్చేవాడు. ‘లిబరేషన్’ చదవడం వల్ల నక్సల్ బరీ ఉద్యమ వార్తలు తెలిసేవి. చిత్తూరు జిల్లాలో స్టూడెంట్ ఫెడరేషన్ పెట్టాలని సికె నారాయణ రెడ్డి, మహదేవన్ నా దగ్గరకు వచ్చారు. తిరుపతి బాలాజీ భవన్ లో పెట్టిన సభకు శ్రీశ్రీ, కొడవటిగంటి కుటుంబరావు, వేణుతోపాటు మహదేవన్ కూడా మాట్లాడారు. ఇది రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ వ్యవస్థాపనకు ముందు జరిగిన సభ.

పార్టీ పనుల్లో 1970 నుంచి నిమగ్నమైపోయాను. తిరుపతి యూనిట్ కు నేను బాధ్యుణ్ణి. జిల్లా అంతా సురేంద్ర చూసుకునే వారు. కోఆర్డినేషన్ కమిటీ చిత్తూరు జిల్లా కన్వీనర్ గా మహదేవన్ వ్యవహరించేవారు. జిల్లా కమిటీలో మహదేవన్ తోపాటు, సి.కె. నారాయణ రెడ్డి, నేను, ఈశ్వలాపురానికి చెందిన పురుషోత్తం, అమ్మగుంటకు చెందిన శివరామిరెడ్డి ఉండేవారం.

వజ్రవేల్ శెట్టి, కోనేటి వెంకటస్వామి తరిమెల నాగిరెడ్డి వర్గం. వజ్రవేల్ శెట్టి కొడుకు రంగనాథ్ మాత్రం చారుమజుందార్ వర్గంలోకి వచ్చేశారు.

మేం గాదంకిలో సభ పెట్టాం. కొత్తపేట దగ్గర మహాసభనిర్వహించాం. చారుమజుందార్ వర్గశత్రు నిర్మూలన కార్యక్రమం చాల జోరుగా జరుగుతున్న రోజులవి. ప్రత్యక్షంగా నేను ఏ ఒక్క చర్యలోనూ పాల్గొనలేదు. ఓరియంటల్ కాలేజీ విద్యార్థులు నాగరాజు, హమీద్, చంద్రశేఖర్ రావులను పోలీసులు అరెస్టు చేశారు.

చిత్తూరు జిల్లా జైల్లో నక్సలైట్ ఖైదీలను రెచ్చగొట్టి, వారు తిరగబడే సరికి కాల్పులు జరిపి అమ్మగుంటకు చెందిన నారాయణ రెడ్డిని పోలీసులు చంపేశారు. నాగరాజును అమ్మగుంటలో పట్టుకుని, వెదళ్ళ చెరువు దగ్గర ‘ఎన్ కౌంటర్’ పేరుతో కాల్చి చంపేశారు. పల్లం కుట్ర కేసు, తిరుపతి కుట్ర కేసులో 1974లో నన్ను, సురేంద్ర రెడ్డిని అరెస్టు చేశారు. చిత్తూరు జిల్లాలో రెండు దళాలుండేవి. మాది తూర్పు దళం. పశ్చిమాన మరొక దళం ఉండేది.

దళాలుగా ఏర్పడి గ్రామాల్లో తిరిగే వాళ్ళం. అడవుల్లో సర్వే చేసే వాళ్ళం. ఆర్థికదాడులు చేయాలనుకున్నాం కానీ, చేయలేదు. ఈ దళంలో తిరుగుతున్నామనే, ఏం చేయకనే మమ్మల్ని అరెస్టు చేశారు. ఎమర్జెన్సీ ప్రకటించడంతో 1975లో నన్ను మళ్ళీ అరెస్టు చేశారు. నాతోపాటు, కృష్ణ స్వామి, త్రిపురనేని మధుసూదన రావు, శైలకుమార్, సురేంద్ర, కరుణాకర్ రెడ్డి, భూమన్ తదితరులను అరెస్టు చేశారు. ఎమర్జెన్సీ ఎత్తివేశాక మమ్మల్నందరినీ విడుదల చేశారు.

ఎమర్జెన్సీ తరువాత

ఎమర్జెన్సీ తరువాత మదనపల్లెలోనే ఉండి, సభలు, సమావేశాలు పెడుతున్నాం. అప్పుడే పెళ్ళి చేసుకున్నాను. కొడుకుకూడా పుట్టాడు. తరువాత నా భార్య, కొడుకు నాకు దూరమయ్యారు. ఎమర్జెన్సీ తరువాత ఇంటి దగ్గరే ఉండి జననాట్యమండలి కార్యక్రమాలు చూసేవాణ్ణి. మంగలి కిష్టప్ప(రెడ్డప్ప) తో కలసి రైతుకూలీ సంఘాన్ని పెట్టి, సమస్యలపై ప్రజలను కూడగట్టాం. ఎమర్జెన్సీకి ముందే కొండపల్లి సీతారామయ్యతో సంబంధాలు పెట్టుకున్నాను. కొండపల్లి క్లాసులకు వెళ్ళి వచ్చాక నన్ను అరెస్టు చేశారు.

తంబళ్ళపల్లె, చౌడసముద్రం ప్రాంతంలో పెత్తందార్లకు, ప్రజలకు మధ్య పోరాటాలు జరిగేవి. ఆసమయంలో మా మీటింగులు కూడా జరగనిచ్చేవారు కాదు. తంబళ్ళపల్లె రెడ్లకు సంబంధించిన రెడ్డప్ప అనే వ్యక్తిని ప్రజలు చంపేశారు. దాంతో నిర్బంధం పెరిగింది. టీడీపీ ఎమ్మెల్సీ ఉమాశంకర్ రెడ్డి మాకు అనుకూలంగా ఉన్నారని, రైతూలీ సంఘం పేరుతో పెత్తందార్లు అతన్ని చంపేశారు. గ్రామాలపైన దాడులు జరుగుతున్నాయి. ఒక యుద్ధ వాతావరణం అలుముకుంది.

మదనపల్లె ప్రాంతంలో నిర్బంధం పెరగడంతో నేను శ్రీ కాళహస్తి ప్రాంతానికి వచ్చేశాను. నేను విద్యార్థులను ఆర్గనైజ్ చేస్తున్నాను. కాళంగి దళ కమాండర్ మార్కండేయులు కూడా నా వల్లే పార్టీలోకి వచ్చారు. తరువాత అతన్ని పోలీసులు ‘ఎన్ కౌంటర్’ పేరుతో చంపేశారు. నేను 1989 వరకు చిత్తూరు జిల్లాలోనే ఉన్నాను. నేను చిత్తూరు జిల్లాలో ఉండగానే, తిరుపతిలోని ఎస్పీబబ్ల్యు కాలేజీలో బిఎస్ సి రెండవ సంవత్సరం చదువుతున్న జ్ఞాన ప్రసూన పార్టీలోకి వచ్చారు. అదే సంవత్సరం డిసెంబర్ నెలలో వెంకటలక్ష్మి(చంద్ర శేఖర్ రెడ్డి జీవిత సహచరి), ఆమె చెల్లెలు గీతాదేవి కూడా పార్టీలోకి వచ్చారు.

పీపుల్స్ వార్ సెంట్రల్ కమిటీకి వివిధ రాష్ట్రాల్లో అయిదేళ్ళ పాటు నేను వెంకటలక్ష్మి టెక్ బాధ్యతలు నిర్వహించాం. టెక్ బాధ్యతలంటే, డెన్ మెయింటెన్ చేయడం, కొరియర్ గా పనిచేయడం. సెంట్రల్ కమిటీకి కావలసిన ఏర్పాట్లు చేయడం. తరువాత దండకారణ్యంలోకి వెళ్ళిపోయాను. దండకారణ్యంలో డివిజనల్ కమిటీ సభ్యుడిగా అక్కడి ప్రజలకు రాజకీయ పాఠాలు చెప్పేవాణ్ణి. వార్తలు విని తెలుగు వాళ్ళకు తెలుగులోనూ, హిందీ వాళ్ళకు హిందీలోనూ చెప్పేవాణ్ణి.

ఛత్తీస్ ఘర్ లో 1994 నుంచి 2007 వరకు పదమూడేళ్ళ పాటు ఉన్నాను. నా ఆరోగ్యం దెబ్బ తింది. తమిళనాడులోని వేలూరు సి.యం.సి ఆస్పత్రిలో చికిత్స చేయించుకుని, తిరుగుప్రయాణమయ్యాను. ఛత్తీస్ ఘర్ తిరిగి వచ్చేయడానికి సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో, ఇన్ ఫార్మర్ల వల్ల రాయ్ పూర్ లో నన్ను, వెంకటలక్ష్మిని పోలీసులు అరెస్టు చేసి జైల్లో పెట్టారు. నాపైన 38 కేసులు పెట్టారు. పదిన్నరేళ్ళ తరువాత రాయపూర్ జైలు నుంచి 2017 డిసెంబర్ లో విడుదలయ్యాను. జైలు నుంచి విడుదలయ్యాక పార్టీ నన్ను పట్టించుకోలేదు. నేను కూడా పార్టీని పట్టించుకోలేదు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చాలా బాధకలిగిస్తున్నాయి’’ అంటూ చంద్ర శేఖర్ రెడ్డి నిట్టూర్పు విడిచారు.

అర్ధ శతాబ్దపు విప్లవ జీవితం గురించి చంద్ర శేఖర్ రెడ్డి చింతించనూ లేదు, వీరుణ్ణి శూరుణ్ణి అంటూ ఎక్కడా గొప్పలు చెప్పుకోనూలేదు. సమాజాన్ని అర్థం చేసుకోవడంలో ఎంత ఎదిగినా, ఒదిగి ఉన్నట్టే కనిపిస్తారు. తన విప్లవ జీవితం గురించి కాకుల్లా మైకుల్లో ఎక్కడా కావ్ కావ్ అ రావడమూ కనిపించలేదు.

నాలుగు గోండు భాషల వెంకటలక్ష్మి

పక్కనే కూర్చున్న చంద్రశేఖర్ రెడ్డి జీవిత సహచరి సి.వెంకట లక్ష్మిది భిన్నమైన విప్లవ జీవితం. చంద్ర శేఖర్ రెడ్డిపైన 38 కేసులు పెడితే, వెంకట సక్ష్మిపైన 158 కేసులు పెట్టారు. అంటే ప్రభుత్వం ఆమెను ఏ దృష్టితో చూసిందో అర్థం చేసుకోవచ్చు. మీ విప్లవ జీవితం ఎలా సాగింది? అని అడిగితే, వారి మాటల్లోనే ఇలా ఉంది.

‘‘మాది శ్రీకాళహస్తి. తిరుపతి ఎస్పీ డబ్ల్యు కాలేజీలో బిఎస్సీ సెకండియర్ చదువుతున్నప్పుడు 1989 డిసెంబర్ లో పీపుల్స్ వార్ లో చేరాను. మా చెల్లెలు గీతా దేవి కూడా నాతోపాటే చేరింది. జ్ఞానప్రసూన మా కంటే మూడు నెలల ముందు వెళ్ళిచేరింది. నేను చంద్ర శేఖర్ రెడ్డిగారిని పెళ్ళి చేసుకున్నాను. మా చెల్లెలు మచి లీపట్నానికి చెందిన సుబ్బారావును పెళ్ళి చేసుకుంది. సుబ్బారావు టెక్ నిర్వహకుడు. తొంభైయవ దశకం తొలినాళ్ళలో అతన్ని పోలీసులు ‘ఎన్ కౌంటర్’ పేరుతో చంపేశారు.

చంద్రశేఖర్ రెడ్డిగారితో కలిసి నేను దందకారుణ్యం వెళ్ళిపోయాను. దళ సభ్యురాలిగా, దళ కమాండర్ గా, ఏరియా కమిటీ బాధ్యురాలిగా పనిచేశాను. చివరికి డివిజనల్ కమిటీ సభ్యురాలిగా కూడా పనిచేశాను. నేను ఎక్కువగా ఫీల్డ్ వర్క్ చేశాను. చంద్రశేఖర్ రెడ్డిగారు ఫీల్డ్ నుంచి కొంత కాలం అడవిలోనే ఉండే ప్రెస్ లో చేసేవారు.

దండకారణ్యం ప్రాంతానికి 1994లో వెళ్ళాను. ప్రతి ముప్ఫై కిలోమీటర్లకు గోండు భాషలో యాస మారుతుంది. రాజకీయ తరగతులు తీసుకునే దాన్ని. గిరిజనులకు రాజకీయాలు చెప్పడం కోసం నాలుగు గోండు భాషలు నేర్చుకున్నాను. అభూజ్ మడ్ ప్రాంతంలో ఉండే మారియాగోండి, మైదాన ప్రాంతాల్లో ఉండే మురియా గోండి, ఉత్తర్ బస్తర్ లో ఉండే హల్ది, ఛత్తీస్ ఘర్ ప్రాంతంలో ఉండే ఛత్తీస్ ఘడీ. ఈనాలుగు భాషలతోపాటు హిందీ కూడా నేర్చుకున్నాను.

మన ప్రాంతంకంటే ఛత్తీస్ ఘర్ గిరిజనులు రాజకీయంగా చాలా చైతన్యవంతులు. వారికి జాతీయ అంతర్జాతీయ రాజకీయాలపైన చాలా అవగాహన ఉంది. ఆ అవగాహనను కల్పించడానికి పీపుల్స్ వార్(నేటి మావోయిస్టు పార్టీ) చాలా కష్టపడాల్సి వచ్చింది. వారిని ఎంతో చైతన్యవంతులను చేసింది. వర్షాలొచ్చినప్పుడు మాత్రమే టెంట్లు వేసుకునే వాళ్ళం. అడవిలో ఆరుబయటే జీవించే వాళ్ళం. చలికాలంలో విపరీతమైన చలి. ఎండా కాలంలో విపరీతమైన ఎండ. వేసవిలో నీళ్ళు దొరికేవి కావు. పోలీసుల గాలింపు ఎక్కువగా ఉండేది.

సాయంత్రమైతే అడవిలో ఒక పిట్ట వింతగా అరుస్తుంది. ఎందుకు అరుస్తుందో మనకు తెలియదు. అది వారికి తెలుసు. మేం వాళ్ళకేదో చేస్తామని నమ్మబట్టే, వాళ్ళు మమ్మల్ని నమ్మారు. మమ్మల్ని నమ్మే నిర్బంధాన్ని ఎదుర్కొన్నారు. మన కంటే అక్కడి జనమే ఎంతో త్యాగం చేశారు. మాకు అన్నం పెట్టి, వాళ్ళు గంజి తాగారు. ఛత్తీస్ ఘర్ లో ఆ అమాయక ప్రజల మధ్య 1994 నుంచి 2007 వరకు చేశాను. ఇప్పుడక్కడ పోరాటం లేదు. దాన్నొక టూరిస్ట్ ప్రాంతంగా తయారు చేశారు.

అక్కడ ఏకోపాధ్యాయ పాఠశాలలు, ఆశ్రమాల్లాంటి పాఠశాలలు మాత్రమే ఉండేవి. అక్కడ భూస్వాములు లేకపోయినా, పటేల్, సర్పంచుల వంటి పెత్తందార్లు ఉండేవారు. మేం సహకార వ్యవసాయాన్ని తీసుకొచ్చాం. అటవీ శాఖవారు గొడ్డలిపైన పన్ను వేసేవారు. నాగలిపైన కూడా పన్ను వేసేవారు. వీటికి వ్యతిరేకంగా మేం అటవీ హక్కుల కోసం పోరాడాం. ఆ స్థితికి రావడానికి పార్టీ ఎన్నో త్యాగాలు చేసింది. ఆ త్యాగాలను తలుచుకుంటే బాధేస్తోంది. ఇప్పటి పరిణామాలపైన మేమేమీ వ్యాఖ్యానించదలచలేదు.

కేసులు, చిత్రహింసలు

రాయపూర్ బస్టాండులో నన్ను, చంద్ర శేఖర్ రెడ్డి గారిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు చంద్రశేఖర్ రెడ్డిగారిని పెద్దగా ఇబ్బంది పెట్టలేదు కానీ, నన్ను మహిళా పోలీసులే కొట్టారు, చిత్ర హింసలు పెట్టారు. ఛత్తీస్ ఘర్ రాష్ట్రంలోని రాయపూర్, దంతెవాడ, జగదల్ పూర్ జైళ్ళలో ఉంచారు. జగదల్ పూర్ జైల్లోనే ఎక్కువ కాలం గడిపాను.

నాపై తొలుత నలభై కేసులు పెట్టారు. ఒకటొకటిగా పెంచుకుంటూ, పెంచుకుంటూ పోతే, మొత్తం 159 కేసులయ్యాయి. అరెస్టు చేసిన సంవత్సరం వరకు మమ్మల్ని కోర్టుకు తీసుకు వెళుతూనే ఉన్నారు. మమ్మల్ని కోర్టుకు తీసుకెళ్ళాలంటే పోలీస్ ఫోర్స్ ఎక్కువ కావాలి. కనుక ఏ రోజు తీసుకెళతారో, ఏ రోజు తీసుకెళ్ళరో తెలిసేది కాదు. మమ్మల్ని కోర్టుకు తీసుకెళ్ళి తీసుకొస్తుండగా, అయిదు సార్లు మా వాళ్ళకు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఎవరూ మరణించలేదు. మా వాళ్ళలో ఒకతను మాత్రం గాయపడ్డాడు. పీపుల్స్ వార్ దళాలకు, పోలీసులకు తరచు కాల్పులు జరుగుతుండేవి.

జైలులో తిండి చాలా అధ్వాన్నంగా ఉండేది. వారంలో ఆరురోజులు కోర్టుకు తిప్పేవారు. పొద్దున అన్నం, పప్పు నీళ్ళు, లేకపోతే రొట్టె. చంద్ర శేఖర్ రెడ్డిగారి పైన పెట్టిన కేసులన్నీ కొట్టేయడానికి పదిన్నర సంవత్సరాలు పట్టింది. నా పైన పెట్టిన కేసులన్నీ కొట్టేయడానికి పన్నెండు సంవత్సరాలు పట్టింది. దాంతో జగదల్ పూర్ జైలు నుంచి 2019 ఏప్రిల్ లో విడుదలయ్యాను. అక్కడి నుంచి ఒరిస్సా వచ్చి, అక్కడి నుంచి విశాఖ పట్నం, తిరుపతి మీదుగా చిత్తూరు చేరాను. 2000 లో మాత్రం మా అమ్మ వచ్చి నన్ను చూసిపోయింది.

ఇప్పుడు రోజుకు ఎనిమిది, తొమ్మిది గంటలపాటు డ్రస్సులు, బ్లౌజులు కుడతాను. తెల్లవారు జామున 5.30కి లేచి, రాత్రి పదిన్నరకు పడుకునే వరకు పనులుచేసుకుంటూనే ఈ కట్టుపనులు చేస్తుంటాను ’’ అంటూ చెప్పుకొచ్చారు.

ఇప్పుడెలా నిలదొక్కుకున్నారు? అన్న ప్రశ్నకు చంద్రశేఖర్ రెడ్డి సమాధానం చెపుతూ, ‘‘జైలు నుంచి 2017 డిసెంబర్ లో విడుదలవగానే, నా కొడుకు మదనపల్లెకు తీసుకెళ్ళాడు. తన దగ్గర ఆరు నెలలు ఉంచుకుని తిరుపతికి తీసుకొచ్చి, లక్ష రూపాయలిచ్చాడు. స్నేహితుల సహకారంతో నిలదొక్కుకున్నాను. భూమి అమ్మితే రెండు లక్షల రూపాయలొచ్చింది. కరుణాకర్ రెడ్డి మాకు రేషన్ కార్డు, పాపానాయుడు పేట వద్ద ఇల్లు ఇప్పించారు. సత్యనారాయణ, బల్లా రవీంద్ర అనే న్యాయవాదులు కూడా సహకరించారు. నేను కూడా చీరలకు ఫాల్స్ కుడుతుంటాను. జిగ్ జాగ్ చేస్తుంటాను. ఇప్పుడున్న పార్టీ పరిస్థితిపై మేమేమీ వ్యాఖ్యానించ దలచ లేదు.’’ అంటూ స్పష్టం చేశారు.

దేశంలో విప్లవం కోసం ఎంతో మంది ప్రాణాలను వదిలారు. లెక్కలేనంత మంది విప్లవ నిబద్దతతో జీవిస్తూ ఎన్నో త్యాగాలు చేస్తున్నారు. అలా జీవితాలను త్యాగమయంచేసిన వారికి చంద్రశేఖర్ రెడ్డి, వెంకటలక్ష్మి దంపతులు ఒక నమూన. ‘కగార్’ పేరుతో మావోయిస్టులపై ఎన్ కౌంటర్ హత్యలు, అణచివేతలు, లొంగుబాట్లు, అరెస్టులు వంటి పరిణామాలు జరుగుతున్న ప్రస్తుత సమయంలో, అవి ఎటు దారితీస్తాయో భవిష్యత్తు చెప్పాల్సిందే.

Read More
Next Story