‘మధుశ్రీలు చదివాక’: ఒరిజినల్ ని కాంతివంతం చేసిన విశ్లేషణ
మారుతి పౌరోహితం పుస్తక సమీక్ష...
ప్రఖ్యాత కన్నడ సాహితీవేత్త ఒకరు “సాహిత్యాన్ని మ్యూజియంగా కాకుండా, ఒక గార్డెన్ గా ఉంచాలి” అంటారు. ఆంధ్రీకుటీరం వారు తెలుగు సాహిత్యాన్ని ఒక అందమైన నందనవనంగా ఉంచడంలో తమవంతు పాత్రను నిర్వహిస్తున్నందుకు ముందుగా వారికి నా హృదయపూర్వక అభినందనలు. అదే తరహాలో “మధుశ్రీలు చదివాక” అనే పుస్తకంలో శ్రీమధునాపంతుల వెంకటేశ్వర్లు గారి కథలపై విశ్లేషణ చేయడం ద్వారా 1950 నుంచి 1972 వరకూ శ్రీ మధునాపంతుల వెంకటేశ్వర్లు గారు వ్రాసిన కథలను ఒక అందమైన నందనవనంగా మార్చారు. నిజంగా నాలాంటి పాఠకుడికి ఈ విశ్లేషణ పుస్తకం పరిచయం కాకుంటే ‘మధుశ్రీలు’ నా పరిచయ ప్రపంచంలోకి వచ్చి ఉండేదే కాదు. ఈ కారణంగా అవధానుల మణిబాబు గారికి అభినందనలు.
మనోవిజ్ఞానశాస్త్రంలో ‘గెస్టాల్ట్ వాదం’ (Gestalt) అనే ఒక సాంప్రదాయం ఉంది. “గెస్టాల్ట్” అనే పదం జర్మనీ భాషకు చెందిన పదం. జర్మన్ భాషలో ‘గెస్టాల్ట్’ అంటే ‘సమగ్రం’ అని అర్థం. ఏదైనా ఒక అభ్యసన అంశాన్ని విభాగాలుగా కాకుండా మొత్తంగా అభ్యసిస్తేనే ఆ అభ్యసనం అర్థవంతంగా ఉంటుందని ఆ సిద్ధాంతం చెబుతుంది. కోహేలర్ (Wolfgang Köhler), కోఫ్కా, వర్దేమర్ అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు ఈ వాదానికి ఆధ్యులు. నాకు మణిబాబు గారి ‘మధుశ్రీలు చదివాక‘ అన్న పుస్తకాన్ని చదివినపుడు ఈ సిద్దాంతం గుర్తుకు వచ్చింది.
ఈ పుస్తకం ద్వారా 1950 నుంచి 1972 వరకూ శ్రీ మధునాపంతుల వెంకటేశ్వర్లుగారు వ్రాసిన కథలకు ఒక నూతనత్వం వచ్చినట్లుగా నేను భావిస్తున్నాను. మధుశ్రీ గారి కథలను విశ్లేషణచేస్తూ ఈ కథలను అంతర్జాతీయ, జాతీయ, స్థానిక సాహిత్యంతో అనుసంధానం చేయడమే కాకుండా కథల్లోని వస్తువును సినిమా కథలతో అనుసంధానం చేస్తూ విశ్లేషణ చేయడం అనేది గమనంలో ఉంచుకోదగిన అంశం. “మధుశ్రీలు చదివాక”లో శ్రీ మధునాపంతుల వెంకటేశ్వర్లు గారు వ్రాసిన కథలను మణిబాబు గారు ప్రధానంగా మూడు విషయాలకు సంబంధించిన విశ్లేషణ చేసారు.
1. కథల్లోని వస్తువు గురించి :
ప్రధానంగా ఆరు శీర్షికలలో ఈ విషయాలను విశ్లేషణ చేస్తారు. అవి
1. చిన్నగా కొన్ని కథలు చెప్పుకుందాం
2. కట్నం కథలు
3. కళలు – భ్రమలు
4. గుమాస్తా కథలు
5. దెయ్యాల కథలు
6. స్వీయ అభిప్రాయ ప్రకటన కోసం వ్రాసిన కథలు
7. పురాణాలు –ప్రాచీన సాహిత్యం
8. కొన్ని సాధారణ కథలు
కథా వస్తువును విశ్లేషిస్తూ టీవీ సీరియల్లు చూసి కుటుంబ జీవితాలు నిజంగా ఇలాగే ఉంటాయి అనుకునేవారేవరైనా ఉంటే అప్పుడప్పుడు ఇలాంటి కథలు చదవాలి అని చురక అంటిస్తారు.
2. కథల్లోని శిల్పం గురించి:
“అనూహ్యం” కథను గురించి చెబుతూ మధుశ్రీ కథలలో ఇది విభిన్నమైనది అంటారు. పరిచయం, విషయం, కథాప్రారంభం , నాయికాదర్శనం , అంతర్థానం , పరిశోదన, దృశ్యం, పునర్దర్శనం అనే ఎనిమిది ఉప శీర్షికలతో కథను చెప్పడం గురించి వ్రాస్తారు. ఏడు పేజీల కథానికను ఎనిమిది విభాగాలుగా చెప్పడం ఈ కథలోని విశేషం అంటారు.
కథా శిల్పం చర్చలో ఆంగ్ల సాహిత్య పరిచయంతో విశ్లేషణ చేయడం వలన మధుశ్రీ గారి కథలకు సార్వజనీనత ఉన్నట్లు మనం గుర్తిస్తాం.
3. కథల్లోని శైలిని గురించి
శీర్షికలు, ఎత్తుగడలు, పలుకుబడులు శీర్షికలో కథాశైలి కి సంబందించిన విషయాల గురించి విశ్లేషణ చేస్తారు.
“అద్వైత మూర్తి” అనే కథాభాగాన్ని యధాతధంగా ఉంచడం ద్వారా మధుశ్రీగారి శైలి, శిల్పం, భాషతో పాఠకుడికి పరిచయం కలిగిస్తారు. ఇదే కథలో మధుశ్రీ గారు ఒక పాత్ర అంతరంగంలో “తెలుగు రచయితలు అందరూ సాధారణంగా ఉన్నవాళ్ళు కారనీ, అసలు రచయిత అనేవాడు బ్రతికి ఉన్నంతకాలం జీవితంలో పోరాడుతూ ఉండవలసిందేననీ” అనిపిస్తాడు.
పైన పేర్కొన్న మూడు అంశాలలో ఎక్కువగా కథా వస్తువు గురించిన విశ్లేషణ ఎక్కువగా చేసారు. సాధారణంగా విశ్లేషణ అంటేనే సంక్లిష్టంగా ఉంటుంది. కానీ మణిబాబు గారు సంక్లిష్టమైన విషయాలను సరళ తరంచేసి చెప్పడంలో గొప్ప నైపుణ్యాన్ని ప్రదర్శించారు.
తెలుగు సాహిత్యంలో కథల గురించిన విశ్లేషణలు నా అవగాహనమేరకు తక్కువగానే జరుగుతున్నాయి అనుకొంటున్నాను. నిజంగా కథల గురించిన విశ్లేషణలు పాఠకుడి అనుభవాన్నే కాకుండా ఆ కథలు వ్రాసిన కథకుడి అవగానా శక్తిని కూడా విస్తృత పరుస్తాయని నేను భావిస్తున్నాను. ఈ కథల విశ్లేషణల్లో మణిబాబు గారు అనేక ఇతర శాస్త్రాల సహాయాన్ని తీసుకొన్నారు. ముఖ్యంగా మనోవిజ్ఞాన శాస్త్రం, సౌందర్య శాస్త్రాల కోణంలో కథలను విశ్లేషించారు. ఇతడి విశ్లేషణల ద్వారా మధుశ్రీ గారి కథలకు ఒక విస్తృతి వచ్చిందని నేను భావిస్తున్నాను. ఈ కథలు అన్నీ 1950 నుంచి 1972 ల మధ్య వ్రాయబడినప్పటికీ మెజార్టీ కథలకు సమకాలీనత ఉన్నది. ఈ విశ్లేషణ ద్వారా ఎక్కడో ఎవరకీ కనబడకుండా ఉన్న ఒక అపురూపమైన అంశం Uncurtain చేయబడింది అని నాకు అనిపిస్తోంది.
ఒక కథకుడి కథలను ఆ కథలతో పోలిఉన్న లేక విభిన్నంగా ఉన్న ఇతర కథలతో పోల్చి చెప్పాలి అనుకొన్నప్పుడు అటువంటి ప్రయత్నం చేస్తున్న వ్యక్తికీ అపారమైన సాహిత్య పరిచయం ఉండాలి. నైపుణ్యం ఉండాలి. ఈ విశ్లేషణలు మనకు మణిబాబు గారికి ఉన్న అపారమైన సాహిత్య పరిచయాన్ని మనకు పరిచయం చేస్తున్నాయి. అయితే నేను గమనిచిన మరో అంశం ఏమిటి అంటే మణిబాబు గారి పారదర్శకత లేదా నిజాయితీ లేదా నిర్మోహమాటత్వం ఈ కథల విశ్లేషణలో మనకు కనిపిస్తుంది. ఈయన తన విశ్లేషణల్లో శ్రీ మధునాపంతుల వెంకటేశ్వర్లు గారి కథల్లోని తను అనుకొన్న గొప్ప విషయాలతో పాటు తనకు సరికావు అనిపించిన విషయాలను కూడా అదే రకంగా ప్రకటించడం వలన ఈ విశ్లేషణలకు సాధికారత వచ్చింది.
ఉదారణకు “శ్రేయోభిలాషి” అనే కథను విశ్లేషిస్తూ కథలో మెలోడ్రామా కాస్తా ఎక్కువయ్యింది అంటారు. “వారి జాక్షులందు” కథలో సుహాసిని అనే పాత్ర ప్రవర్తన అసమంజసంగా ఉందంటారు. “మేడ్ ఇన్ హెవెన్ “ అనే కథను విశ్లేషిస్తూ కథ ముగింపు బాగానే ఉన్నా ఒక సూచన చేస్తూ అలా ఉండిఉంటే కథ మరింత బాగా ఉండేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు. “కథ” అనే మరో కథను విశ్లేషిస్తూ “అతి వ్యాప్తి దోషం” పాఠకుడిని కాస్త ఇబ్బంది పెడుతుందని చెబుతారు. ఈ విధంగా సద్విమర్శలు చేయడం ద్వారా మధుశ్రీలకు మరింత వ్యాలిడిటీ ఈ పుస్తకానికి వచ్చింది. ఇటువంటి సద్విమర్శలను స్వీకరించడం ద్వారా “ఆంద్రీకుటీరం” సాహిత్య వికాసం పట్ల తన నిబద్దతను చాటుకొంది. ఎందుకంటే సమకాలీన తెలుగు సాహిత్యంలో విమర్శ ప్రాధాన్యత తగ్గిపోతోంది. గొప్ప విమర్శకులు ఉన్నా ‘నిష్టూరపోవడం ఎందుకు? అనుకొంటున్నారు. విమర్శలను స్వీకరించే తత్త్వం కూడా క్రమక్రమంగా లోపిస్తోంది అనిపిస్తోంది. ఇటువంటి ఈ ప్రతికూల పరిస్థితుల్లో మణిబాబు గారు విమర్శనా గ్రంధ రచనలకు పూనుకోవడం సాహసమనే చెప్పాలి.