ఎంతో ఎత్తుకెదిగినా మూలాలు మరువని మలయాళీ సాహిత్య శిఖరం ఎంటీ!
x

ఎంతో ఎత్తుకెదిగినా మూలాలు మరువని మలయాళీ సాహిత్య శిఖరం ఎంటీ!

20వ శతాబ్దంలో కేరళ సాహితీ యాత్రను తన అద్భుత ఆలోచనాశక్తి, కళాత్మకతతో ప్రతిబింబించిన ఓ సాహిత్య శిఖరాన్ని కోల్పోయింది. ఆయనే ఎంటీ వాసుదేవన్ నాయర్.


ఎంటీ వాసుదేవన్ నాయర్ - మలయాళీల ఆత్మను ఆవిష్కరించిన గొప్ప సాహితీవేత్త. మలయాళం సాహిత్యం ఒక రచయితను మాత్రమే కాకుండా, 20వ శతాబ్దంలో కేరళ సాహితీ యాత్రను తన అద్భుత ఆలోచనాశక్తి, కళాత్మకతతో ప్రతిబింబించిన ఓ సాహిత్య శిఖరాన్ని కోల్పోయింది.
మలయాళ పాఠకులు, సినిమా ప్రేమికులు ముద్దుగా పిలుచుకునే ఎంటీ ('MT') అసలు పేరు ఎంటీ వాసుదేవన్ నాయర్. ఫ్యూడల్ సమాజం నుంచి ఆధునిక సమాజానికి మారిన కేరళ సామాజిక పరివర్తనను తన సుస్పష్టమైన రచనలతో అద్భుతంగా ఆవిష్కరించిన వారిలో ఎంటీ ఒకరు. అటువంటి ఎంటీ క్రిస్మస్ రోజు (డిసెంబరు 25) కోజికోడ్‌లో తన 91వ ఏట కన్నుమూశారు.
మలయాళం సాహిత్య పితామహులగా పరిగణించే తరంలో చివరివాడు ఎంటీ. కేరళ నాటకీయ సామాజిక పరివర్తన కాలానికి సాక్షీభూతం ఆయన. ఆయన మరణంతో ఒక శకం ముగిసినట్లయింది.
ఎంటీ ప్రస్థానం ఇలా..
1933లో పాలక్కాడ్ జిల్లా కుడల్లూరు గ్రామంలోని నాయర్ కుటుంబంలో జన్మించిన MT, ఫ్యూడల్ వ్యవస్థ పతనాన్ని, ఓ సరికొత్త సామాజిక వాస్తవ ఆవిర్భావాన్ని స్వయంగా చూసినవారు. ఈ పరివర్తనే ఆయన సాహిత్య కృషికి అంకరమని చెప్పవచ్చు. సొంతవ్యక్తిత్వాన్ని రాజకీయాలతో, పురాణాలతో, ఆధునికతతో సమ్మిళితం చేసి అద్భుత కళాఖండాలు సృష్టించారు. తనకు తానే సాటి అని నిరూపించారు.
సృజనాత్మక ప్రస్థానం..
1950లలో చిన్న చిన్న కథలతో MT తన రచనా ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఫ్యూడల్ వ్యవస్థ ఆఖరి గడియలను, సాంప్రదాయ వర్గాల పతనాన్నితన కథలలో ప్రతిబింబించారు. ఆయన అద్భుత రచన 'నాలుకెట్టు' (1958) కేరళ సాహిత్య అకాడమీ అవార్డును గెలుచుకుంది. తాను బాలునిగా ఉన్నప్పటి నుంచి కళ్లారా చూసిన నాయర్ కుటుంబ వ్యవస్థ విచ్ఛినాన్ని ఆవిష్కరించిన ఈ నవల సార్వజనీన అనుభూతులకు అద్దం పట్టింది. తన వ్యక్తిగత జ్ఞాపకాలను అనుసంధానించిన రచయితగా నిలిపింది.
పురాణాలకు తనదైన శైలిలో భాష్యం...
ఎంటీకి పురాణాలపైనా మంచి పట్టుంది. వాటిని ఆధునిక దృక్కోణంలో వ్యాఖ్యానించడంలో ఆయనకు ఆయనే సాటి. తన రెండో నవల 'రండమూజం' (Second Turn)లో ఈ ధోరణి బాగా స్పష్టంగా కనిపిస్తుంది. ఆధునిక దృక్కోణంలో పురాణాలకు భాష్యం చెప్పిన తీరు వేనోళ్ల ప్రశంసనీయంగా నిలిచింది. ఆయన ప్రతిభకు అద్దం పట్టింది. ఈ నవల భీముడి దృష్టి కోణం నుంచి మహాభారతాన్ని వర్ణిస్తుంది. పురాణాల మహత్తును సమకాలీనతతో అనుసంధానించే MT నైపుణ్యాన్ని ఇది ప్రతిబింబించింది. 'రండమూజం' వైలార్ అవార్డును గెలుచుకోగా, 'కాలం' నవలకు 1970లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.
సినిమా రచయితగానూ...
కథలు, నవలలే కాకుండా సినిమా డైలాగుల రచనలో MT అనన్యమైన ప్రతిభను చూపారు. 'తీర్థయానం', 'కడువు' వంటి చిత్రాల కోసం ఆయన రాసిన సంభాషణలు మలయాళ సినీ ప్రేక్షకులను ఉర్రూతలూపాయి. ఆయన రాసిన ఒరవడితో సినీ సంభాషణల తీరే మారిపోయిందంటే అతిశయోక్తి కాదు. ఆయన దర్శకత్వం వహించిన 'నిర్మాల్యం' (1973) సినిమా జాతీయ ఉత్తమ చిత్రం అవార్డును గెలుచుకుంది.
ఎన్నో అవార్డులు, రివార్డులు..
1980ల ప్రారంభంలో ఆయన అమెరికా వెళ్లారు. ఆ యాత్రలో MT వాసుదేవన్ నాయర్‌కు ఓ విచిత్ర అనుభవం ఎదురైంది. ఓ డ్రైవర్ ఇచ్చిన ‘One Hundred Years of Solitude’ పుస్తకం అమెరికా మహారచయిత గాబ్రియెల్ గార్సియా మార్క్వెజ్ ను కలుసుకునేలా చేసింది.
ఈ ట్రావెలాగ్ మలయాళ పాఠకులకు కొలంబియా మహా రచయిత రచనను పరిచయం చేసేందుకు తోడ్పడింది. మలయాళ సాహిత్యాన్ని ప్రపంచ సాహిత్య ఉద్యమాలతో సంభాషించగల సాహిత్య రాయబారిగా అది నిలిచింది.
ఎంటీ తన జీవితపయనంలో అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులు,రివార్డులు పొందారు. 1995లో జ్ఞానపీఠ్ అవార్డు వంటి జాతీయ, అంతర్జాతీయ గుర్తింపులున్నా ఎంటీ ఎన్నడూ తన కుడల్లూరు మూలాలను మరువలేదు. చివరి రోజుల్లో పర్యావరణ సమస్యలు, మతోన్మాద రాజకీయ మూర్ఖత్వం పెరిగిపోవడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
ఎంటీ లెగసీ ఇదీ ...
సాహిత్య అకాడమీతో పాటు వివిధ సాంస్కృతిక సంస్థల అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు నిర్వహించారు. యువ రచయితలకు మార్గదర్శకత్వం వహించారు. ఆయన రచనలు అంతరించిపోతున్న సాంప్రదాయం, ఆధునికత, భూత, భవిష్యత్, వర్త మాన కాలాలకు మధ్య వారధిగా నిలిచాయి. స్థానికత, విశ్వజనీనత మధ్య చివురించే వంతెనలుగా నిలుస్తాయి.
ఎంటీ వాసుదేవన్ నాయర్ మలయాళ సాహిత్యంలో ఓ ధృవతార. వెలుగునిచ్చిన ఓ స్టార్. ఆయన మరణంతో ఒక శకం ముగిసినా, ఆయన రచనలు మాత్రం శాశ్వతంగా మనల్ని ఆలోచింపజేస్తూనే ఉంటాయి.
Read More
Next Story