
చెరిగిపోని ఎమర్జెన్సీ గాయాల గుర్తులు
భూమయ్య, కిష్టయ్య గౌడ్ లను ఉరి తీసి నేటికి యాభై ఏళ్ళు
భూమయ్య, కిష్టయ్య గౌడ్ లు రెండు సార్లు మృత్యు ముఖంలోకెళ్ళి బైటపడ గలిగినా, మూడవ సారి బైటపడలేకపోయారు. వారిరువురి ఉరిని నిలుపుదల చేయాలని, దేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది మేధావులు చేసిన విజ్ఞప్తిని ఎమర్జెన్సీ పాలకులు పెడచెవిన పెట్టారు. భూమయ్య, కిష్టయ్య గౌడ్ లను ముషీరా బాద్ జైల్లో 1975 డిసెంబర్ ఒకటవ తేదీ తెల్లవారు జామున ఉరితీశారు.
చరిత్రలో ఈ సంఘటన ఎమర్జెన్సీ గాయాల గుర్తుగా నిలిచిపోయింది. అది ఎమర్జెన్సీ కాలం కాకపోయినట్టయితే, వారి ఉరి శిక్ష యావజ్జీవ కారాగార శిక్ష గా మారే అవకాశం ఉండేది.
అసలు ఎవరీ భూమయ్య, కిష్టయ్య గౌడ్ లు !? వీరి ఉరికి ఇంత ప్రాధాన్యత ఎందుకు లభించింది !? వీరిరువురూ ఎలా ఉంటారు? అన్నవి ఈ తరం వారికి అంతులేని సందేహాలు. భూమయ్య బట్టతలతో కుదుమట్టంగా ఉంటాడు. కిష్టయ్య గౌడ్ ఉంగరాల జుట్టుతో నల్లగా ఉంటాడు. వీరిరువురు కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన సాధారణ కుటుంబీకులు.
భూమయ్య జంగమ కులస్తుడు. కిష్టయ్య గౌడ్ కుల వృత్తి కల్లుగీత. భూమయ్యకు భార్య బిడ్డలు ఉన్నారు. కిష్టయ్య గౌడ్ కు పెళ్ళైనా ఉద్యమం కోసం కుటుంబాన్ని పరిత్యజించాడు. తెలంగాణాలో నిజాం నిరంకుశత్వానికి, ఫ్యూడల్ దోపిడీకి వ్యతిరేకంగా సాగిన మహత్తర తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటంలో భాగంగా ఇరువురూ గట్టుపల్లి మురళి దళంలో చేరి పోరాడిన యోధులు. ఆ పోరాటంలో కిష్టయ్య గౌడ్ తొడకు తూటాతగి లి గాయ మైన్ ది.
పశ్చిమ బెంగాల్ లో నక్సల్ బరీ ఉద్యమం 1967లో మొదలైంది. దాని ప్రకంపనలు తెలుగు నాట కూడా కనిపించాయి. ఆ వసంత మేఘ ఘర్జనకు భూమయ్య, కిష్టయ్యగౌడ్ లిద్దరూ స్పందించారు. ఇద్దరూ దామోదర రావు నాయకత్వంలోని దళంలో చేరారు. జంగమ పూజారి వారసత్వంగా భూమయ్యకు వచ్చిన భూమని భూస్వామి ఆక్రమించుకున్నాడు.
నాటి పార్టీ చేపట్టిన ‘వర్గశత్రు నిర్మూలన’ కార్యక్రమంలో భాగంగా గిన్నెదరి భూస్వామి లచ్చుపటేల్ ను చంపేశారు. రహస్య జీవితం గడుపుతున్న ఇరువురూ గోదావరిలో స్నానం చేస్తుండగా పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు.
ఇద్దరినీ తొలుత వరంగల్ జైలు లుకు తరలించారు. ట్రైల్ కోర్టు వీరికి ఉరిశిక్ష విధించింది. ‘‘వీరిరువురూ వ్యక్తిగత పగ, ద్వేషంతో చేసిన హత్య కాదిది. రాజకీయ విశ్వాసంతో చేసిన హత్య’’ అని పేర్కొంటూ హైకోర్టులో జస్టిస్ చిన్నప రెడ్డి ఉరి శిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మారుస్తూ తీర్పునిచ్చారు. హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేస్తో, సుప్రీం కోర్టు వీరికి ఉరి శిక్షను ఖరారు చేసింది. దాంతో వారిని ముషీరాబాద్ జైలుకు తరలించారు.
వీరిరువురికి ఉరిశిక్ష అమలు చేయడానికి 1974 నవంబర్ 24వ తేదీని ఖరారు చేశారు. ఉరిని ఆపడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరిగాయి. ముఖ్యంగా పత్తిపాటి వెంకటేశ్వర్లు ఈ బాధ్యతను బుజానికెత్తుకున్నారు. ఢిల్లీలో జరుగుతున్న సిపీఐ కేంద్ర కమిటీ సమావేశంలో ఉన్న చండ్రరాజేశ్వరరావుకు ఫోన్ చేసి, ఉరిని ఆపడానికి ప్రయత్నం చేయమని కోరారు. చండ్ర రాజేశ్వరరావు సూచన మేరకు రాజ్య సభ సభ్యులుగా ఉన్న భూపేష్ గుప్త చేసిన ప్రయత్నంతో ఉరి శిక్ష తత్కాలికంగా నిలిచిపోయింది.
ఉరి శిక్షకు రెండవ సారి తేదీ ఖరారైంది. పత్తిపాటి వెంకటేశ్వర్లుతో పాటు పౌరహక్కుల సంఘం నాయకులు కన్నాభిరాన్, న్యాయవాది కె.ఎస్.చలం, ఓపిడిఆర్ అధ్యక్షులు సి.వెంకట కృష్ణ, న్యాయవాది వెంకటరెడ్డి మళ్ళీ ప్రయత్నాలు మొదలుపెట్టారు. వారి ప్రయత్నఫలితంగా రెండవ సారి కూడా ఉరిశిక్ష అమలు తాత్కాలికంగా నిలిచిపోయింది. అయినా, దాని వెనుక ఎంత మానసిక క్షోభను అనుభవించి ఉంటా రో వీరిద్దరూ!
పౌరహక్కుల్ని కాలరాచిన ఎమర్జెన్సీ
ప్రధాని ఇందిరాగాంధీ 1975 జూన్ 26వ తేదీన ఎమర్జెన్సీ విధించారు. సిపిఐ మినహా, సిపీఐ(యం), ఇతర ఎంఎల్ పార్టీల నాయకులందరూ అ జ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. కొందరు అరెస్టయ్యారు. విరసం కార్యవర్గ సభ్యులు వరవరరావు, కె.వి. రమణా రెడ్డి, త్రిపురనేని మధుసూదన రావు, కాశీపతి సహా 30 మంది విరసం సభ్యులు కూడా అరెస్టయ్యారు. కన్నాభిరాన్ మినహా పౌరహక్కుల సంఘం అంతా జైల్లోనే ఉండిపోయింది. దేశంలో లక్షన్నర మందిని జైల్లో కుక్కారు.
రాష్ట్రపతికి ప్రముఖుల విజ్ఞప్తి
పత్తిపాటి వెంకటేశ్వర్లు కన్వీనర్ గా ‘భూమయ్య, కిష్టయ్య గౌడ్ ఉరి రద్దు కమిటీ’ ఏర్పడింది. కన్నాభిరాన్ కన్వీనర్ గా డిఫెన్స్ కమిటీ ఏర్పడింది. అది ఎమర్జెన్సీ కాలం. ఉరి రద్దు కమిటీ దేశ విదేశాల్లోని అనేక మంది ప్రముఖులను కలిసి వీరిరువురి ఉరి రద్దుకు పాటుపడింది. నాటి కాంగ్రెస్ ఎమ్మెల్యే జైపాల్ రెడ్డి అసలు ఉరి శిక్షను పూర్తిగా రద్దు చేసేలా రాజ్యాంగ సవరణ తీసుకు రావాలని అభిప్రాయ పడ్డారు. సీపీ ఐ నాయకులతో పాటు, జార్జి ఫెర్నాండజ్ , వాజ్ పాయ్, జయప్రకాష్ నారాయణ్ వంటి రాజకీయ ప్రముఖులు, జీన్ పాల్ సార్త్రే, నోమ్ చామ్ స్కీ వంటి తత్వవేత్తలు, శాస్త్ర వేత్తలు కూడా భూమయ్య, కిష్టయ్య గౌడ్ ఉరి రద్దు చేయాలని నాటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ కు విజ్ఞప్తి చేశారు.
భూమయ్య, కిష్టయ్య గౌడ్ ఉరి శిక్ష రద్దు కోరుతూ రాష్ట్రంలో అనేక చోట్ల సభలు, సమావేశాలు నిర్వహించారు. ఈ సభల్లో శ్రీ శ్రీ కూడా పాల్గొన్నారు. నాటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు వద్దకు వెళ్ళి ఉరి రద్దు చేయాలని కోరారు. ‘ఓరోరి వెర్రి వెంగళప్పగా, నీ పేరు వింటే నాకు కడుపు నొప్పిరా’ , ‘బానిసకొక, బానిసకొక బానిసవోయ్ బానిసా, మానిసి జన్మానికిసీ మచ్చవు నడిపీనుగా’ అంటూ శ్రీ శ్రీ అప్పటికే వెంగళరావుపైన పాట రాశారు. దాంతో ఆయన అగ్గిమీద గుగ్గిలమయ్యారు. ‘‘ఇది రాజకీయ ఉరిశిక్ష కాదు, మామూలు ఉరిశిక్ష. సుప్రీం కోర్టుతోపాటు, రాష్ట్రపతి కూడా తిరస్కరించాక నేను చేయగలిగింది ఏమీ లేదు ’’ అంటూ వారి విజ్ఞప్తిని జలగం వెంగళరావు తిరస్కరించారు.
నవంబర్ 29న చిట్టచివరి ప్రయత్నంగా సీపీఐ రాజ్య సభ సభ్యుడు భూపేష్ గుప్త నాటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ ఆలీ ఆహ్మద్ ను కలిసి వీరువురి ఉరి శిక్ష రద్దు కోరుతూ విజ్ఞప్తి చేశారు. ఆ వార్త ఆమర్నాడు పత్రికల్లో వచ్చింది. భూమయ్య, కిష్టయ్య గౌడ్ ల జీవితాలకు నవంబర్ 30 చివరి రోజు. ముషీరాబాద్ జైల్లో ఖైదీల్లో ఒకటే బాధ, ఉద్వేగం; ముఖ్యంగా విరసం,పౌరహక్కుల సంఘం వారిలో, కమ్యూనిస్టు భావజాలం ఉన్నవారిలో అంతులేని ఆవేదన.
ముషీరాబాద్ జైల్లో ఉరి
జైల్లో ఆరోజంతా ఎవరూ భోజనం చేయలేదు. ఆ రాత్రంతా వారికి నిద్ర లేదు. జైలు బైట జ్వాలా ముఖి, నిఖిలేశ్వర్, పత్తిపాటి వెంకటేశ్వర్లు, వెంకట కృష్ణ(ఓపిడిఆర్) ఆ రాత్రి చాలాసేపు ఉండిపోయారు. జైల్లో ఉన్న వారంతా పాటలు, నినాదాలతో ఉద్వేగంతో గడిపేశారు. రెండు సార్లు మృత్యు ముఖంలోకి వెళ్ళి తిరిగి వచ్చిన భూమయ్య, కిష్టయ్య గౌడ్ మూడవ సారి మృత్యు ముఖం నుంచి తిరిగి రాలేకపోయారు. డిసెంబర్ 1వ తేదీ తెల్లవారు జామున భూమయ్య, కిష్టయ్య గౌడ్ లను ముషీరాబాద్ జైల్లో ఉరితీశారు. అంతటితో వారి చరిత్ర ముగిసింది. ఉరి రద్దు కోసం చేసిన చివరి ప్రయత్నాలు కూడా ముగిసిపోయాయి. ఆజైల్లో ఉన్న వారంతా ‘భూమయ్య, కిష్టయ్య గౌడ్ అమర్ రహే’ అంటూ కాగితాలపైన రాసి, ఆ కాగితాల్లో రాళ్ళు పెట్టి జైలు గోడల బైటికి విసిరేశారు. భూమయ్య, కిష్టయ్య గౌడ్ లను ఉరి తీశాక, రాష్ట్రంలో దశాబ్దం పాటు వారి స్మారక సభలు జరిగాయి.
తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి మన న్యాయ వ్యవస్థ సామాన్యులకు అందుబాటులో లేదు. డబ్బు, రాజకీయ పలుకుబడి ఉన్న వారే ఆపని చేయగలుగుతున్నారు. దారుణమైన నేరాలు చేసిన వారు శిక్షల నుంచి తప్పించుకోగలుగుతున్నారు. కారంచేడులో ఆరుగురు దళితులను దారుణంగా చంపిన వారిలో ఏ ఒక్కరికీ భూమయ్య, కిష్టయ్య గౌడ్ లకు పడినట్టు ఉరిశిక్ష పడలేదు. అలాగే చుండూరులో ఎనిమిది మంది దళితుల ప్రాణాలు తీసిన వారిలో కూడా ఏ ఒక్కరికి ఉరిశిక్ష పడలేదు. బాబ్రీ మసీదును విధ్వంసం చేస్తున్న దృశ్యాలన్నీ టీవీ చానెళ్ళలో వచ్చినా, ఏ ఒక్కరినీ దోషులుగా మన న్యాయస్థానాలు తేల్చలేకపోయాయి.
గుజరాత్ లో జరిగిన మారణహోమంలో రెండు వేల మంది మరణించినా, ఒక్క బిల్కిస్ బాను కేసులో తప్ప, దానికి కారణమైన వారెవరినీ న్యాయస్థానాలు శిక్షించలేకపోయాయి. నిజాయితీగా నిజాలు చెప్పిన భట్ అనే పోలీసు అధికారి ఇప్పటికీ జైల్లో జీవిత ఖైదును అనుభవిస్తున్నాడు. ఒకహైకోర్టు న్యాయమూర్తి ప్రాణాలనే పోగొట్టుకున్నాడు.
ఎందుకంటే డబ్బు, అధికారం ఉన్న వారు ఏ నేరాలు చేసినా, ఏ దారుణాలకు ఒడిగట్టినా, సామూహిక హత్యాకాండకు పాల్పడినా వారిని శిక్షించే వ్యవస్థ మనకు లేదు. మన దేశంలో పేదలు, సామాన్యులకు, సామాజికంగా వెనుకబడిన వారికి మాత్రమే శిక్షలు పడుతుంటాయి. గవర్నర్, రాష్ట్రపతి క్షమాభిక్షలు కూడా రాజకీయ ప్రేరేపితమైనవి కావడం వల్ల డబ్బు, రాజకీయ పలుకుబడి ఉన్న వారికి మాత్రమే అవి పరిమితమవుతుంటాయి.
బిల్కిస్ బాను కేసులో సమూహిక అత్యాచారాలకు, హత్యలకు పాల్పడిన పద కొండు మందికి విధించ వలసిన ఉరిశిక్ష బదులు యావజ్జీవ కారా గార శిక్షపడింది. అధికార పక్ష అండదండల వల్ల, ‘సత్ప్రవర్తన’ పేరుతో ఆ దుర్మార్గులను విడుదల చేయడం గమనిస్తే, ఈ వస్థపైన సామాన్యులకున్న నమ్మకం క్రమంగా సడలిపోతున్న సూచనలు కనిపిస్తున్నాయి.
విచారణ లేకుండా ‘ఎన్ కౌంటర్లు’
భూమయ్య, కిష్టయ్య గౌడ్ వంటి వారు సామాన్యులు కనుక, వారికి రాష్ట్రపతి క్షమాభిక్షలు అందవు. కేంద్రమంత్రి మండలి సలహా మేరకే రాష్ట్రపతి క్షమాభిక్షలు మంజూరు చేస్తారు. ఆ క్షమాభిక్షలు రాజకీయ ప్రేరేపితమైనవి. సామాన్యులకు ఎట్టి పరిస్థితిలోనూ అందనివి. కోర్టులు, విచారణలు, క్షమాభిక్షల వంటి కాలయాపన ఎందుకని, ఇప్పుడు ఉరిశిక్షలు వేయడం లేదు. తన రాజకీయ ప్రత్యర్థులైన నక్సలైట్లను ‘ఎన్ కౌంటర్’ పేరుతో చంపేస్తున్నారు.
సాహిత్యంలో చోటు
తెలంగాణా సాయుధ పోరాటంలో కిష్టయ్య గౌడ్ తొడకు తూటా తగిలిన గాయం గుర్తు ఉంది. ఆ గాయం గుర్తు ఆధారంగానే ‘ తోటరాముడి తొడకు తూటా తగిలిందాని, చిలుక చీటీ తెచ్చెరా ఓ విలుకాడా మైనా మతలబు చేసేరా ఓ విలుకాడా’ అంటూ శివసాగర్ పాట రాశారు. భూమయ్య, కిష్టయ్య గౌడ్ ఉరి కి స్పందనగానే శివసాగార్ ‘ఉరికంభం ఎక్కి నేను ఊహాగానం చేసెద’ అంటూ ఉరిపాట రాశారు. అలాగే వరవరరావు ‘వరికంకుల లాల్ సలాం’ అంటూ రాశారు. జ్వాలా ముఖి ‘పూల కబేళాలో డిసెంబర్ గులాబీలు’ అన్న సుదీర్ఘ కవితను కూడా రాశారు. ఇలా భూమయ్య, కిష్టయ్య గౌడ్ ల ఉరి సంచలనమై సాహిత్యంలోనూ చోటు చేసుకుంది.
భూమయ్య, కిష్టయ్య గౌడ్ లను ఉరి తీయడానికి ముందు వారు తమ కళ్ళను దానం చేశారు. దీని ఆధారంగా మృళాల్ సేన్ ‘మృగయా’ అన్న సినిమా తీశారు. బెంగాల్ కు చెందిన ఒక దర్శకుడు వీరి ఉరిపై ‘ఆంఖేబోలే’ (ఆకళ్ళు చెపుతాయి) అనే డాక్యుమెంటరీని తీశారు. నెహ్రూ పాలనా కాలంలో కయ్యూర్ కామ్రెడ్ ల లాగానే, ఇందిరా గాంధీ పాలనాకాలంలో భూమయ్య, కిష్టయ్య గౌడ్ ల ను కూడా ఉరి తీయడం వల్ల , ఈ సంఘటన ఎమర్జెన్సీ చీకటి చరిత్రలో ఒక అధ్యాయం గా మిగిలి పోయింది. సమాజానికి కాలం పెట్టిన అప్పును భూమయ్య, కిష్టయ్య గౌడ్ లు తమ ప్రాణాలతో తీర్చుకున్నారు.
పూల కబేళాలో డిసెంబర్ గులాబీలు
-జ్వాలాముఖి
చీకటి చిరస్థాయిగా నిలవడానికి
దట్టంగా ముట్టడి చేసే కాంతిని నేలమట్టం చేసిన
కర్కోటకపు కాళరాత్రి ఇష్టారాజ్యం
కసినింపిన చలి కనిపించని కొరడాలా
చరుస్తూ కురుస్తూన్న ‘అభినవ కళాకేళి’
మదించిన కోర్కెలు
విచ్చల విడిగా విహరిస్తున్న దృశ్యాలు
విజిళ్ళు లేని విశృంఖలత
కిరాయి గజళ్ళ రాసకేళి
సుఖశాంతులు, శరీరాల సంతలో
పడుపుకూడు రతిశ్రాంతలు
‘ఆనందం అమ్ముడుపోయిన కళాఖండం
ధర్మం, దూడ చచ్చిన పాడియావు-
నిజం నిసుగును పిసికేసిన అభినేత్రి-అబద్ధం
ఆశను చీల్చి చెండాడిన చరమరాత్రి-నిరాశ
పాపం! ఆకలి!
బతుకు పునరావాస శిబిరంలో
గాయపడ్డ కాందిశీకుడు
కాయకష్టం, బజారులో సొమ్మసిల్లిన చెల్లని నాణెం
దుఃఖం
ఎండమావుల్నుండి కొట్టుకొచ్చిన
వేడి వేడి కంటిదుమారం
అనుభవం
ఒయాసిస్సు నుండి కసరబడిన
అస్పృశ్య వికారి బికారి
గుక్కపట్టీ ఊపిరాడక
ఉక్కపట్టీ గాలి ఆడక
చీకటి చక్రబంధంలో
చిట్లిన రాచపుళ్ళు చరిత్ర కళ్ళు
పంజాగుర్తుల మాంసల అగాధాల్లో
చెక్కడాల సొగసుల్ని చిమ్ముతూన్న
నరమేధం బలి వితర్ది నాగరికత
*
కాలెండరు చెరమాంకం చేరే తొలిచరణం
ఉగాదికి పరితపించిన తపస్వికోకిల మరణం
సాలుపొడుగునా సాగినా పాడుకలల పీడకలలు
నిర్మల నక్షత్రాల్ని వేలాడదీసిన వేకువ వికృతాకారం
కాళరాత్రి కాంతి గవాక్షాలు కన్నుమూసిన విషాద మౌనం
ఎగసిన హృదయం బద్దలైన ఉదయకాల నిశ్శబ్ద శబ్దాలు
ఆర్పబడ్డ నునులేత దీపాల కమురువాసనలు
రాలిన మంచులో కూలిన కలల కన్నీరు
వీస్తున్న పిల్లగాలిలో నేలతల్లి కడుపుకోత
వికటించిన వాతావరణం విశ్వానికి బరువుమోత
* *
‘‘ఠీక్ హై’’ హెచ్చరికల్లో ప్రతిధ్వనించిన అమంగళం
‘జాగ్తే రహో సంక్షేమ నినాదంలో పెల్లుబికిన సంక్షోభం
ఉదయ సంధ్య నెత్తురు కక్కిన మరకల ఆకాశం
కోరతోమిన కలితెలివి
తెలవారిన మందహాసం-
ఉరిప్రాణం వేలాడేసిన నాలుకలా
తలవంచుకు వచ్చిన కర్మసాక్షి
ఆత్మ అవనతాన్ని ప్రకటించిన
తూర్పుదిక్కు డగ్గుత్తిక
పగిలిన పాలలా కాంతి ముక్కలైన
ప్రకృతి దిగ్భిత్తిక
కష్టమని కాలం కళ్ళు మూసుకు వెళ్ళిపోయింది
నష్టమని చరిత్ర గుండె చెరువుచేసుకుంది
రత్నగర్భంలో రాలిన నక్షత్రాల పునర్జన్మబీజాలు
భూమి కష్టాలకు ఆకాశం నష్టాలకు అద్దం దిక్చక్రం
ఆతృప్తాత్మలా పృథ్వీమాత నిర్వేదం
‘‘వీర భోగ్య వసుంధరా!’’ జనమే జయ నినాదం.
* * *
కాళరాత్రి కన్నుమూతలో
కాంతి ధాత్రి కనువిప్పు
విరబూచిన గులాబీల వైతాళిక గీతంలో
వీర గంధ విన్యాసం
నేల నిండా రాలిన రెక్కలు
సంతాపదినాలు
గాలినిండా పలికిన ప్రాణవాయువు
రుతువపనాలు
కలలపంటల్ని కోసుకొచ్చిన కసాయిల సంత
నెత్తురు అత్తరుగా మారిన వేలం పాటల రద్దీ వింత!
‘‘ఈసారి డిసెంబర్ గులాబీలకు
ఎక్కడ లేని ఎర్రనితనం
ఈ సారి డిసెంబర్ పతాకాలకు
ఎన్నడూ లేని శౌర్య సువాసన’’
పూలకబేళాలో ఖరీదు కట్టే కసాయి పాటలు
దాగని సత్యాల్లో ధగధగమెరిసే నెత్తురు బాటలు
కండగల రోజాలు ఖండఖండాలై రాలినా
జెండాపండుగలై జాతి నిండా ఎగురుతూ
నెత్తురు చిత్తడిలో సూర్యోదయం కోరుతున్నాయి
పూలకబేళాలో డిసెంబర్ గులాబీల మతాబాలు
మదిని బావుటాలై మేలుకొలుపులు పాడుతున్నాయి
కసాయి ఓటమినే ఎలుగెత్తి చాటుతున్నాయి
రాత్రి నిర్మల నక్షత్రాలు
చరిత్రాకాశంలో నిశ్చలంగా మెరుస్తాయి
‘‘బీళ్ళకూమోళ్ళకూ దిక్సూచులై విరుస్తాయి
బిక్కు బిక్కుమనే దిక్కుల్లో
విద్యుత్ విశ్వాసం కురిపిస్తాయి!’’
(భూమయ్య, కిష్టయ్య గౌడ్ ఉరి సందర్భంగా)
రచనాకాలం : 1976

