
తెలంగాణలో డాగ్ కిల్లింగ్స్ అంశం హైకోర్టు దృష్టికి...
తెలంగాణలో 1500 వీధి కుక్కల హత్య
విషపు ఇంజెక్షన్లతో వీధి కుక్కల హత్యలు: తెలంగాణను కుదిపేస్తున్న అమానుషం
తెలంగాణ గ్రామాల్లో మూగజీవాలపై అమానుషం హద్దులు దాటుతోంది. మూగజీవాలైన వీధి కుక్కలకు విషపు ఇంజెక్షన్లు ఇచ్చి, గుంతలు తవ్వి పూడ్చిపెట్టే సంఘటనలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. గత నెల రోజుల వ్యవధిలోనే 1500కు పైగా వీధి కుక్కలు దారుణంగా హతమయ్యాయని జంతు హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఎన్నికల హామీల పేరుతో, చట్టబద్ధమైన ఏబీసీ (జంతు జనన నియంత్రణ) విధానాలను పక్కనపెట్టి, గ్రామీణ ప్రాంతాల్లో కొనసాగుతున్న ఈ కుక్కల ఊచకోత ఇప్పుడు హైకోర్టు మెట్లెక్కే స్థాయికి చేరింది.
డాగ్ కిల్లింగ్స్ ఆగే దాకా పోరాడుతాం
తెలంగాణ రాష్ట్రంలో గత నెల రోజులుగా వరుసగా వీధికుక్కలను చంపుతున్న ఘటనలు సంచలనం రేపుతున్నాయి. పలు జిల్లాల్లోని పలు గ్రామాల్లో 1500కు పైగా వీధి కుక్కలను చంపినట్లు వెల్లడైంది. కాగా వాస్తవానికి పలు గ్రామాల్లో వందలాది వీధి కుక్కలను చంపుతున్నా అవి వెలుగులోకి రావడం లేదని స్ట్రే ఎనిమల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన ఎనిమల్ క్రూయాలటీ ప్రీవెన్షన్ అసిస్టెంట్ మేనేజరు మొదావత్ ప్రీతి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. తెలంగాణలో వీధి కుక్కల కిల్లింగ్స్ ఆగేదాకా తాము పోరాడుతామని ప్రీతి హెచ్చరించారు.
వీధి కుక్కల కిల్లింగ్స్ పై హైకోర్టులో పిల్
తెలంగాణలోని గ్రామాల్లో వరుసగా సాగుతున్న వీధి కుక్కల కిల్లింగ్స్ పై త్వరలో తాము హైకోర్టులో పిల్ దాఖలు చేయనున్నట్లు స్ట్రే ఎనిమల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన ఎనిమల్ క్రూయాలటీ ప్రీవెన్షన్ మేనేజరు గౌతం ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. మూగజీవాలైన వీధికుక్కల పట్ల క్రూరత్వం చూపించవద్దని ఆయన కోరారు.గ్రామాల్లో వీధి కుక్కలకు విషపు ఇంజక్షన్లు ఇచ్చి అత్యంత దారుణంగా చంపుతున్నారని, అసలు విషపు ఇంజక్షన్లు ఎక్కడ నుంచి తీసుకువస్తున్నారనేది పోలీసులు దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
చీఫ్ సెక్రటరీ, సీఎం దృష్టికి కుక్కల హత్యలు
రాష్టంలోని గ్రామాల్లో అడ్డూ అదుపూ లేకుండా సాగుతున్న వరుస వీధికుక్కలను చంపుతున్న ఘటనల గురించి తాము రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి, చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావుల దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు స్ట్రే ఎనిమల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన ఎనిమల్ క్రూయాలటీ ప్రీవెన్షన్ అసిస్టెంట్ మేనేజరు మొదావత్ ప్రీతి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. వీధికుక్కలను చంపిన ఘటనలపై తాము ఫిర్యాదు చేసినా పోలీసులు కేసులు నమోదు చేయక పోవడంతో జంతు సంక్షేమ సంస్థ జాతీయ ప్రతినిధి, మాజీ మంత్రి మనేకాగాంధీ, తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డిల దృష్టికి తీసుకువెళ్లి పోలీసులపై ఒత్తిడి తీసుకువస్తున్నామని చెప్పారు.
ఆంధ్రా నుంచి డాగ్ కిల్లింగ్ కార్మికులు
తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో వీధి కుక్కలను చంపేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి డాగ్ కిల్లింగ్ కార్మికులు వచ్చారని జంతుప్రేమికులు ఆరోపించారు. ఒక్కో కుక్కకు 500 రూపాయల నుంచి వెయ్యిరూపాయల దాకా ఇచ్చేలా కుక్కలను చంపే కాంట్రాక్టు తీసుకున్నారని జంతుప్రేమికులు పేర్కొన్నారు. కొన్ని గ్రామాల్లో వీధి కుక్కలను చంపడానికి రెండు నుంచి నాలుగు లక్షల రూపాయల దాకా ఒప్పందాలు కుదుర్చుకున్నారని స్ట్రే ఎనిమల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన మొదావత్ ప్రీతి చెప్పారు.
వరుస డాగ్స్ కిల్లింగ్స్...
- 2026,జనవరి 5 :జగిత్యాల జిల్లా ధర్మపురి మున్సిపాలిటీలో ఈ నెల 5వతేదీన 30 వీధి కుక్కలకు విషపు ఇంజక్షన్లు ఇచ్చి చంపారని పోలీసులకు స్ట్రే ఎనిమల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన ఎనిమల్ క్రూయాలటీ ప్రీవెన్షన్ మేనేజరు గౌతం ఫిర్యాదు చేశారు.
- 2026, జనవరి 12 : కామారెడ్డి జిల్లా మాచారెడ్డి ప్రాంతంలోని ఫరీద్ పేట, భవానీపేట, పాల్వంచ, బండ రామేశ్వర్ పల్లి, వాడి గ్రామాల్లో 300కు పైగా వీధి కుక్కలను చంపారని పోలీసులకు జంతుసంక్షేమ సంఘాల ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. కామారెడ్డి జిల్లాలోని నాలుగు గ్రామాల్లో 244 వీధి కుక్కలను చంపి పూడ్చి పెట్టారని పోలీసు సబ్ ఇన్ స్పెక్టర్ ఎస్ అనిల్ చెప్పారు. ప్రభుత్వ పశువైద్యులు వీధికుక్కల కళేబరాలకు పోస్టుమార్టం చేసి శాంపిళ్లను పోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారని, ఈ కేసులో మూడు గ్రామాల సర్పంచులు నిందితులని ఎస్ఐ చెప్పారు.
- 2026 జనవరి 9 : వరంగల్ జిల్లా శాయంపేట, ఆరెపల్లి గ్రామాల్లో 300కు పైగా వీధి కుక్కలకు విషపు ఇంజక్షన్లు ఇచ్చి చంపారని స్ట్రే ఎనిమల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన ఎనిమల్ క్రూయాలటీ ప్రీవెన్షన్ మేనేజరు గౌతం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్, వార్డు సభ్యులు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామి మేరకు వీధికుక్కలను కిరాయి కార్మికులను నియమించి చంపించారని ఆయన ఫిర్యాదు చేశారు.జేసీబీల సాయంతో గుంతలు తవ్వి చంపిన వీధికుక్కలను పూడ్చిపెట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. శాయంపేట, ఆరెపల్లి గ్రామాల్లో 110 వీధి కుక్కలను చంపిన కేసులో గ్రామ సర్పంచ్ సహా 9 మందిని అరెస్టు చేశామని ఎస్ఐ జే పరమేశ్వర్ చెప్పారు.
- జగిత్యాల పట్టణంలో 40వీధి కుక్కలను గత ఏడాది డిసెంబరు 28,30 తేదీల్లో చంపారని పోలీసులకు ఫిర్యాదు అందింది.
- 2026, జనవరి 23 : జగిత్యాల జిల్లా పెగడపల్లి గ్రామంలో 300కు పైగా వీధి కుక్కలను చంపి ఆరు ట్రాక్టర్లలో శివారు ప్రాంతానికి తీసుకువెళ్లి గుంతలు తవ్వ పూడ్చిపెట్టారని పోలీసులకు స్ట్రే ఎనిమల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన ఎనిమల్ క్రూయాలటీ ప్రీవెన్షన్ మేనేజరు గౌతం ఫిర్యాదు చేశారు. ఇద్దరు మహిళలు కట్టెలకు ఇంజక్షన్ కట్టి వాటి సాయంతో వీధికుక్కలకు విషపు ఇంజక్షన్లు ఇచ్చి చంపారని వెల్లడైంది. దీని తర్వాత పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి స్థానిక అధికారులపై దర్యాప్తు ప్రారంభించారు.
- 2026 జనవరి 20 : రంగారెడ్డి జిల్లా యాచారం గ్రామంలో 200కు పైగా వీధికుక్కలను చంపి పూడ్చిపెట్టారని పోలీసులకుస్ట్రే ఎనిమల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన ఎనిమల్ క్రూయాలటీ ప్రీవెన్షన్ అసిస్టెంట్ మేనేజరు మొదావత్ ప్రీతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు వీధికుక్కల కళేబరాలను వెలికితీసి పోస్టు మార్టం చేయించి నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్ పరీక్షకు పంపించారు.
- తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వీధి కుక్కలను చంపిన ఘటనలు వెలుగు చూశాయి. సూర్యాపేట, నాగర్ కర్నూల్, కామారెడ్డి జిల్లాల్లోని పలు గ్రామాల్లో వీధికుక్కలను చంపారని స్ట్రే ఎనిమల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన ఎనిమల్ క్రూయాలటీ ప్రీవెన్షన్ మేనేజరు గౌతంకు ఫిర్యాదు అందింది.కామారెడ్డి జిల్లా అంతంపల్లిలో కోతులను కూడా చంపారని తేలింది.
పలు గ్రామాల సర్పంచులతోపాటు నిందితులపై పోలీసులు కేసులు నమోదు చేయడమే కాకుండా ఇప్పటి వరకు 9 మందిని అరెస్ట్ చేశారు.
వీధికుక్కల నియంత్రణకు చర్యలేవి ?
తెలంగాణలో 1500కు పైగా వీధి కుక్కలను విషం లేదా ఇంజెక్షన్లు ఉపయోగించి చంపినట్లు జంతు హక్కుల సంఘాలు చెబుతున్నాయి. గ్రామ నాయకులు ఎన్నికల హామీలను నిలబెట్టుకోవడం లక్ష్యంగా వీధి కుక్కల జనాభాను నియంత్రించడానికి చర్యలు తీసుకుంటున్నారు. జగిత్యాల, కామారెడ్డి, హనుమకొండ వంటి జిల్లాల్లో కనీసం 354 మరణాలు సంభవించాయని పోలీసులు సైతం నిర్ధారించారు. రేబీస్ వ్యాధి వల్ల ఏటా వేలాది మంది ప్రాణాలను బలిగొంటున్న వీధి కుక్కలను ఏబీసీ నిబంధనల ప్రకారం స్టెరిలైజేషన్‌పై దృష్టి పెట్టాలి కానీ వీధికుక్కలకు స్టెరిలైజేషన్లు చేయకుండా వాటిని.హతమారుస్తుండటం ఆందోళన కలిగిస్తుంది. వీధికుక్కలకు విషపూరిత ఇంజక్షన్లు ఇచ్చి చంపారని జంతు సంక్షేమ యాక్టివిస్టులు ఆరోపిస్తుండగా, ఫోరెన్సిక్ రిపోర్టులు వస్తేనే వీధి కుక్కల మృతికి అసలు కారణాలు వెలుగు చూస్తాయి.
ఎన్నికల్లో హామిలిచ్చిన ప్రజాప్రతినిధులు
తెలంగాణలోని పలు గ్రామాల్లో తమను గెలిపిస్తే వీధి కుక్కల బెడదను నిర్మూలిస్తామని పలు గ్రామాల సర్పంచులు, వార్డు సభ్యలు పంచాయతీ ఎన్నికల్లో ప్రజలకు హామిలిచ్చారు. ప్రజలకు ఇచ్చిన హామి మేరకు ఎన్నికైన గ్రామాల సర్పంచులు వీధి కుక్కలను కాంట్రాక్టు కిల్లర్లకు అప్పగించి ఒక్కో కుక్కకు 500 రూపాయల నుంచి వెయ్యి రూపాయల దాకా ఇచ్చి చంపుతున్నారని స్ట్రే ఎనిమల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన ఎనిమల్ క్రూయాలటీ ప్రీవెన్షన్ అసిస్టెంట్ మేనేజరు మొదావత్ ప్రీతి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. తెలంగాణలో వీధి కుక్కలను దారుణంగా హత్య చేశారని జంతు సంక్షేమ యాక్టివిస్టు సంజయ్ మొహపాత్ర ఆరోపించారు. ఏబీసీ (జంతు జనన నియంత్రణ)చేపట్టకుండా వందలాది కుక్కలను చంపేశారని ఆయన పేర్కొన్నారు. దేశంలో కుక్కను సాక్షాత్తు భైరవుడిగానే భావించి భక్తితో పూజిస్తుంటారని, కానీ మూగజీవాలను చంపడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.
వీధి కుక్కలపై ఇంత క్రూరత్వమా?
తెలంగాణ గ్రామాల్లో జరుగుతున్న ఈ వీధి కుక్కల హత్యలు కేవలం మూగజీవాలపై జరిగిన క్రూరత్వం మాత్రమే కాదు… ఇది చట్టంపై, మానవత్వంపై జరిగిన దాడి. ప్రజల రక్షణ పేరుతో చట్టవిరుద్ధంగా వీధికుక్కల ప్రాణాలు తీస్తే రేపు ఆ హద్దులు ఎక్కడ ఆగుతాయన్న ప్రశ్న ఇప్పుడు ఎదురుగా నిలిచింది. స్టెరిలైజేషన్ వంటి శాస్త్రీయ, చట్టబద్ధ పరిష్కారాలను విస్మరించి హత్యలకే మార్గంగా ఎంచుకున్న ఈ వ్యవస్థను ప్రభుత్వం ఎంత వేగంగా అడ్డుకుంటుందన్నదే ఇక కీలకం. మూగజీవాలకు న్యాయం జరుగుతుందా? లేక గుంతల్లో పూడ్చినట్టే ఈ ఘటనల సత్యాలు కూడా మౌనమైపోతాయా? అన్నది కాలమే తేల్చాలి.
Next Story

