బందరు దగ్గిర వేమవరం : అమ్మ చెప్పిన నాటి జ్ఞాపకాలు
x
ఊరి మధ్య చెరువు, చుట్టూర ఇళ్లు

బందరు దగ్గిర వేమవరం : అమ్మ చెప్పిన నాటి జ్ఞాపకాలు

“ఊరి మధ్య పెద్ద చెరువు.దాని చుట్టూ ఇళ్ళు. ఇళ్ళ చుట్టూ కొబ్బరి చెట్లు. తాటిచెట్లు. వాటి వెనక పొలాలు. ఊళ్లో చాలా పెంకుటిళ్ళే. కొన్ని మండువా ఇళ్ళు...ఇంకా ఏముండేవి


అమ్మ జ్ఞాపకాలు - 2

-రాఘవ శర్మ

"మీ ఊరు ఎలా ఉండేదమ్మా?” మా అమ్మని అడిగానొకసారి.

"మాది వేమవరం. మాపుట్టింటివారి పేరు కూడా వేమవరమే.

బందరు గుడివాడ మధ్య రోడ్డు పక్కనే ఉండేది.” అంటూ చెప్పడం మొదలు పెట్టింది.

“ఊరి మధ్యలో పెద్ద చెరువు.

చెరువు చుట్టూ ఇళ్ళు.

ఇళ్ళ చుట్టూ కొబ్బరి చెట్లు.

వాటి చుట్టూ తాటిచెట్లు.

వాటి వెనకాల పొలాలు.

ఊళ్లో చాలా భాగం పెంకుటిళ్ళే.

కొన్ని మండువా ఇళ్ళు.

వాటితో పాటు కొన్ని పూరిళ్ళు కూడా ఉండేవి.” అంటూ చెప్పుకుంటూ పోతోంది.

మా అమ్మకు పెళ్లైన కొన్నాళ్ళకు మా తాతయ్య కుటుంబం వేమవరం వదిలేసి బందరు కొచ్చేసింది.

నేనెప్పుడూ వేమవరం చూడలేదు.

వేమవరం వదిలేశాక మా అమ్మ కూడా ఎప్పుడూ ఆ ఊరు వెళ్ళలేదు.

మా అమ్మ చెపుతుంటే మా అమ్మ పుట్టి పెరిగిన ఊరు నా కళ్ళ ముందు కదలాడుతోంది.

అసలు వేమవరం ఎలా ఉంటుంది!? చూడాలనిపించింది.

మా అమ్మ బతికుండగా చూడలేకపోయా.

కనీసం ఇప్పుడైనా చూద్దామని, బందరులో ఉండే మా పిన్ని కొడుకు చందూ (చంద్రశేఖర్)ను తీసుకుని వేమవరం వెళ్ళాను.

వేమవరం ఇప్పటికీ మా అమ్మ చెప్పినట్టే ఉంది.

ఊరి మధ్యలో చెరువు.

చెరువు మధ్యలో పైకి కనిపిస్తున్న రాతితో చేసిన పోతురాజు శిల.




చెరువు చుట్టూ ఇళ్ళు.

వాటి చుట్టూ కొబ్బరి చెట్లు.

చెరువు నీళ్ళలో కొబ్బరి చెట్లు ప్రతిబింబిస్తున్నాయి.

ఆ ఊరు ఎంత బాగుందో!

ఊరు వదిలి డెబ్భై అయిదేళ్ళు గడిచినా, తాను పుట్టిన ఊరి రూపాన్ని మా అమ్మ మనసులో అలా దాచేసుకుంది!

వేమవరం బందరుకు 17 కిలోమీటర్ల దూరం.

అక్కడి నుంచి గుడివాడ 16 కిలో మీటర్లు.

ఆ ఊర్లోకి వెళ్ళి "వేమవరం అన్న ఇంటి పేరున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా?" అని విచారించాం.

అక్కడి వారు ఒకరింటికి తీసుకెళ్ళారు.

వేమవరానిక మునసబుగా, ఆ తరువాత వీఆర్వొగా వేమవరపు గౌతం కొంతకాలం పనిచేశారు.

వారసత్వంగా వచ్చిన మునసబు గిరి.

ఆ తరువాత గౌతం రెవెన్యూ విభాగంలో చేరి, డెప్యూటీ తాసిల్దా ర్ గా రిటైరయ్యారు.

మా అమ్మకు పెదనాన్న మనుమడు.

ముగ్గురం కలిసి ఊరంతా తిరిగాం.

"మీ తాతగారి ఇల్లు ఇక్కడే ఉండేదట. ఆ స్తలాన్ని సుందరరామయ్య కొనుక్కున్నాడు.

సుందరరామయ్య ఇప్పుడులేడు.

అతని వారసులెవరో ఉన్నారు.” అంటూ వివరించారు గౌతం.

మేవవరపు వారి వంశ వృక్షం గురించి కొంత చెప్పారాయన.

మా అమ్మమ్మ అప్పుడప్పుడు 'సుందర్రామిగాడు' అని చెప్పే కౌలు రైతే ఈ సుందరరామయ్య!

“మాదొక పెద్ద మండువా ఇల్లు" అంటూ మా అమ్మ చెప్పిన విషయాలు మళ్ళీ గుర్తుకు వచ్చాయి.“మా నాన్న వేమవరపు వెంకటేశ్వరరావు.

వేమవరానికి మునసబు.

మాకు వ్యవసాయం ఉండేది.

పాడి కూడా ఉండేది.

మా నాన్న చాలా మంచి వాడు.

సన్నగా, తెల్లగా, పొడుగ్గా ఉండేవాడు.

తెల్లటి పంచె కట్టుకుని, తెల్లటి పొడుగుచేతుల చొక్కా వేసుకునుండే వాడు.” అని చెపుతుంటే నాకు మా తాతయ్య లీలగా గుర్తుకు వచ్చాడు.

దాదాపు నాకు నాలుగేళ్ళ వయసున్నప్పుడు మా తాతయ్య పోయాడు.

అప్పటికే వేమవరం వదిలేసి బందరు వచ్చేశారు.

మా తాతయ్య వాళ్ళు బందరులోని పరాస్ పేట సెంటర్లో ఉండగా, నా చేయి పట్టుకుని నడిపించుకుంటూ హెూటల్ కు తీసుకెళ్ళి ఇడ్లీ పెట్టించిన దృశ్యం ఇప్పటికీ నాకు బాగా గుర్తు.

అలా మా అమ్మ చెప్పుకు పోతోంది.

“నాకు ఇద్దరు అన్నయ్యలు, ఇద్దరు తమ్ముళ్ళు.

ఇద్దరు అక్కయ్యలు, ఇద్దరు చెల్లెళ్ళు.

మధ్యలో నేను పుట్టాను.

మాది పెద్ద మండువా ఇల్లని చెప్పాను కదా!

ఇంటిపైన పెత్తనమంతా మా అమ్మదే.



ఆలూరు విమలా దేవి


మా నాన్న నోరెత్తే వాడు కాదు.

మా నాన్న వాళ్ళు నలుగురు అన్నదమ్ములు.

నలుగురూ వేమవరంలోనే ఉండే వాళ్ళు.

అందరికీ వ్యవసాయమే.

మా నాన్నకు మునసబు గిరి వారసత్వంగా వస్తోంది.

మునసబు గిరి వల్ల పెద్దగా ఆదాయమేమీ ఉండేది కాదు.

ఆదాయమంతా వ్యవసాయం పైనే.

కాకపోతే మునసబు గారంటే ఒక పెద్దరికం, ఊళ్ళో గౌరవం.. అంతే.”

"ఊళ్ళో అన్నదమ్ముల మధ్య పొలం తగాదాలుండేవి.

మా పెద్దన్నయ్య పేరు భాస్కరరావు.

మా అమ్మ 'ఒరేయ్ బాచీ' అని పిలిచేది.

మా బాచన్నయ్య చాలా మెతక.

తగాదాలంటే చచ్చే భయం.

ఎవరైనా గట్టిగా మాట్లాడినా ఒణికి పోయేవాడు.

టీచర్ ట్రైనింగ్ పూర్తి చేసి ఉద్యోగం వస్తే వేరే ఊరుకెళ్ళిపోయాడు.

మా చిన్నన్నయ్య శేషగిరి రావు అందుకు పూర్తిగా విరుద్ధం.

వాడికి చదువు అబ్బలేదు.

శేషన్నయ్యకు తగాదాలంటే మహాసరదా.

దూసుకు పోయేవాడు.

గుట్టుచప్పుడుకాకుండా చుట్టలు, బీడీలు తాగేవాడు.

మా అమ్మకు తెలిసినా తెలియనట్టే ఉండేది.”

"మా పెద్దక్కయ్య చిట్టెమ్మను మా చిన్న మేనమామ గంగుల మావయ్య(గంగరాజు)కు ఇచ్చి పెళ్ళిచేశారు.

మా చిట్టెమ్మక్కయ్యకు పెళ్ళినాటికి ఆరేడేళ్ళ వయసుంటుంది అంతే.

ఇద్దరికీ పెళ్ళంటే ఏమీ తెలియని వయసు.

నేనప్పుడు పుట్టలేదు కానీ, ఆ పెళ్ళి గురించి మా వాళ్ళు చాలా సరదాగా చెప్పుకునే వాళ్ళు.

పెళ్ళికి అన్ని ఏర్పాట్లు చేశారు.

మా అక్కయ్యకు ముస్తాబు చేశారు.

పెళ్ళిపీటలమీద కూర్చుందువు రామ్మా అంటే 'నేను అచ్చన్నకాయలు ఆడుకోవాలి రాను పోమ్మా' అన్నదిట.

బలవంతంగా ఎత్తుకొచ్చి పెళ్ళి పీటల మీద కూర్చోబెట్టి పెళ్ళి చేశారు.

మా గంగులు మావయ్య ఏ పనీచేసేవాడు కాదు.

మా శేషన్నయ్యను వెంటేసుకుని సరదాగా తిరిగొచ్చేవాడు.

ఇద్దరూ కలిసి చుట్టలు తాగేవారు.

అసలు మా శేషన్నయ్యకు చుట్టలు అలవాటు చేసింది మా గంగుల మావయ్యే!

ఇల్లరికం కాదు కానీ, మా గంగుల మావయ్య ఇల్లరికపు అల్లుడులానే ఎప్పుడూ మా ఇంట్లో నే ఉండేవాడు.

మా గంగులు మావయ్య ఏం చేసినా అల్లుడని మా నాన్న నోరెత్తే వాడు కాదు.

కూతురిని ఎక్కడ వదిలేస్తాడోనన్న భయం.

మా అమ్మ నోటికి భయపడడం వల్ల కూడా మా నాన్న నోరెత్తే వాడు కాదు.”

"మా గంగులు మావయ్య అప్పులు చేసేవాడు. 'అప్పు కింద ఈ తాటి చెట్టు చెల్లుకట్టుకో' అనేవాడు.

అంతే వాళ్ళు ఆ తాటి చెట్టు కొట్టుకుపోయేవారు.

అలాగే కొబ్బరి చెట్లకున్న కాయలు.

అలా తాటి చెట్లు, కొబ్బరి చెట్లు ఒకటొకటిగా మాయమైపోయాయి.

ఇంటి అల్లుడుగా వచ్చిన సొంత తమ్ముడు ఏం చేస్తున్నాడో మా అమ్మ పట్టించుకునేది కాదు.

ఆమె నోటికి భయపడి మా నాన్న కూడా నోరెత్తే వాడు కాదు.”

“ఒక సారి ఏమైందంటే.. నాతో చదివే ఒకమ్మాయి 'బెల్లంగడ్డ ఇస్తాను, నోరు తెరువు' అంది.

నోరు తెరిచాను కదా, వెనుక వేపు చేతిలో దాచుకున్న మట్టిని నా నోట్లో కూరింది.

చాలా ఇబ్బంది పడిపోయా.

ఏడ్చుకుంటూ ఇంటికెళ్ళా.

ఈ విషయం మా శేషన్నయ్యకు తెలిసి వాళ్ళింటిపైకి వెళ్ళి పోట్లాడి వచ్చాడు.

వాళ్ళని నోటికొచ్చినట్టు నానా తిట్లు తిట్టాడు.”

“ఆ అర్ధరాత్రి ఏమైందంటే.. మా ఇంట్లో గేదెలను, ఎద్దులను తీసుకెళ్ళి వాళ్ళు దాచుకున్న జనుము కట్టల్ని మేపించేశాడు మా శేషన్నయ్య.

'ఇలాంటి పనులు మునసబుగారబ్బాయే చేస్తాడు' అని ఊరంతా అనుకున్నారు.

లోలోన తిట్టుకున్నా, మా నాన్న కున్న మంచి పేరు వల్ల ఎవరూ నోరెత్తే వారు కాదు.

ఊళ్ళో ఎవరిపైనైనా కోపముంటే మా శేషన్నయ్య రాత్రి పూట వాళ్ళ జనుమును, వాళ్ళ గడ్డి వాములనో ఇలాగే మేపించేసేవాడు.

అంత కచ్చి మనిషి.

నేనప్పుడు నాలుగవ తరగతి చదువుతున్నాను.

'ఎంకి పెళ్ళి సుబ్బిచావు కొచ్చింద'న్న సామెతలాగా మా అన్నయ్య ఆ వేశం నా చదువు చట్టుబండలవడానికి దారితీసింది.

మా నాన్న నా చదువు మానిపించేశాడు.

నా గొంతు బాగుంటుందని సంగీతం నేర్పించాడు.

ఆ సంగీతం మాస్టారు ఇంటికే వచ్చి నాకు సంగీతం నేర్పేవాడు. అలా పాటలు పాడడం నాకు అలవాటైంది.”

(ఇంకా ఉంది)


(రాఘవ శర్మ, జర్నలిస్టు, రచయిత, సాహితీ విమర్శకుడు)

Read More
Next Story