లాహోర్ లో 'లాస్ట్ సప్పర్', ఒక జ్ఞాపకం
చివరి భోజనాలుయ్యా యి. ఇక బయలుదేరాలి. ఇంతలో “మీతో 5 నిమిషాలు మాట్లాడాలి” అన్నాడు హనీఫ్. అతను అక్కడ వంటలు చేసే కూలీ. మాలో ఆశ్చర్యం ఆదుర్దా. ఏం చెబుతాడబ్బా...
-దివికుమార్
అతను పెద్ద చదువులు డిగ్రీలు కలవాడుకాదు. మెట్రిక్యులేషన్ చదివాడు. ప్రపంచ రాజకీయాలు ఎరిగినవాడు కాదు. మూడు పదుల వయసుకూడా లేకపోయినా (ఇరవై ఎనిమిదే) ఇద్దరు పిల్లల తండ్రి. మనం బాగా ఎరిగిన ఒకనాటి ఉమ్మడి క్రికెట్ ప్లేయర్, పాకిస్తాన్ స్టార్ బ్యాట్స్ మన్ అయిన హనీఫ్ మహమ్మద్ పేరుని తలపోసే పేరు అతనిది. ఇతను మహమ్మద్ హనీఫ్.
ఒక స్వచ్ఛంద సేవా సంస్థ (South Asia Partnership), లాహోరు కార్యాలయంలో వంటచేసి, అతిధులకు, సిబ్బందికి వడ్డన చేస్తుండే నిత్య శ్రామికుడు. ఒక అతిసాధారణ పాకిస్తానీయుడు. కరాచీలో 2003 డిసెంబరు 12నుండి 14 దాకా జరిగిన “శాంతి - ప్రజాస్వామ్యాల కోసం భారత పాక్ ప్రజావేదిక (PIPFPD)" ఉమ్మడి మహాసభలో పాల్గొని తిరిగి వచ్చే మన హైదరాబాదు ప్రతినిధి వర్గం లాహోరులో మహమ్మద్ హనీఫ్ వంటా వడ్డనలను రుచిచూసింది.
3 రోజుల లాహోరు విడిదిలో ఉదయమే వెళ్లిపోయి రాత్రికి ఏ వేళకు తిరిగి వచ్చినా పొద్దునే టిఫిన్ , రాత్రి భోజనంతో హనీఫ్ బృందం వంటకాలతో సిద్ధంగా వుండేవారు. 20వ తేదీ ఉదయానికి హైదరాబాదు బృందంలోని 7 గురు సభ్యులం అమృతసర్ చేరుకోవాలి. అంటే పాకిస్తాను, భారత కస్టమ్స్ అధికార్ల అనుమతులు పొందుతూ వాఘా - అట్టారి సరిహద్దు నడిమధ్యగా ఒక మైలు దూరం నడుచుకుంటూ రావాలి. లాహోరు-అమృతసర్ మధ్య దూరం 50 కి.మీ.లు మాత్రమే వుంటుంది. అందుకు కనీస ప్రయాణ సమయం 5 గంటలదాకా తీసుకుంటుంది. పెద్దగా సమయంలేదు. చివరి భోజనాలు పూర్తయ్యాయి. ఇంతలో “మీ అందరితో 5 నిమిషాలు మాట్లాడాలి” అన్నాడతను. అది కొంత ఆశ్చర్యాన్ని మరికొంత ఆదుర్దాను మాలో కలిగించింది. సహజంగా ఆలస్యంగా భోజనం ముగించే నేను కూడా తినటం పూర్తయ్యింది. హనీఫ్ మాటలకోసం అందరం కూర్చున్నాం. ఆంధ్రప్రదేశ్ కి చెందిన 7గురు బృందంతో పాటు అక్కడి పనివారందరూ టేబుల్ చుట్టూ చేరారు.
“మా ఆఫీసుకు అనేకమంది వచ్చివెడుతూ వుంటారు. విదేశీయులు కూడా వస్తారు. కెనడా, నేపాల్, శ్రీలంకల నుండి కూడా వస్తూవుంటారు. ఎవరు వచ్చినా వెళ్లినా ఏమీ అనిపించనిది భారత దేశంనుండి వచ్చిన మీరు వెళ్లిపోతున్నారంటే నా గుండె చాలా బరువెక్కుతోంది. తీవ్రంగా కొట్టుకుంటోంది. నా మనసు చాలా దిగులుతో, ఏదో చెప్పలేని బాధతో నిండిపోయింది. అలా ఇప్పుడే ఎందుకుందో నాకు తెలియదు. మీతో మాట్లాడితే నా మనసు ఆత్మీయులతో మాట్లాడినంతగా సంబరపడిపోయింది.
మీరు యిపుడు వెళ్లిపోతున్నారు. అందుకే చెప్పలేని దిగులు నాలో! అదే నన్ను మాట్లాడనీయకుండా చేస్తోంది. మిమ్ములనందర్నీ మాయింటికి తీసుకువెడదామనుకున్నాను. నాలాంటి పేదవాడి యింటికి ఎవరొస్తారు? అయినా నాకు చెప్పుకునే అవకాశం కూడా రాలేదు. అవకాశం వచ్చేసరికి మీరు వెళ్లి పోయే హడావుడిలో వున్నారు”. హనీఫ్ చాలా ఉద్వేగంతో మాట్లాడుతున్నాడు.
నాకు అతని భాష (ఉర్దూ) బాగా అర్థం కాకపోయినా గుండెచప్పుడు తెలుస్తోంది. కళ్లు చెమ్మగిల్లేంత ఉద్వేగంతో వాతావరణం నిండిపోయింది. హనీఫ్ కీ మనకీ ఏమిటి సంబంధం?
హిందీ, ఉర్దూ భాషల్లో ఎంతో సామ్యం వుంది. అసలు ఆ రెండూ పుట్టినది మన ఉత్తర భారతంలోనే! ఎంతో విస్తారమైన ప్రాంతంలో ఎన్నో తెగల సమ్మేళనం నుండి అవి పుట్టాయి. నేటి హిందీ - ఉర్దూలకు ఒకనాటి మూలాలు హిందూస్తానీలో అందునా ఖడీబోలీ అనే ప్రజల వ్యావహారికంలో వున్నాయంటారు. వాటన్నిటికీ మూలమైన జీవన వైవిధ్యం, పంటలు, పొలాలు, వృత్తులు, పట్టణాలు,ఆటలూ, పాటలూ... అంతా ఎంతో సామ్యం గలవే! వైవిధ్యంతో తొణికిసలాడేవే!
ఢిల్లీ, లక్నోలకు-లాహోరుకు తేడా ఏముంది? హిందీ లేక ఊర్దూలలో మన దగ్గర వ్యవహారాలు చక్కదిద్దుకున్నట్టే, లాహోరులోనూ చేసుకోవచ్చు. అదే పంజాబీలకయితే లిపి (Script) తేడానే తప్ప భాష వొకటే. మిగిలిన తేడా అల్లా ఢిల్లీ-లాహోరు ఒకదేశం కాకపోవటమే!!
ఇవే జవాబుగా తలా ఒక మాటగా హైదరాబాదు ప్రతినిధులు చెప్పారు. అందరిలో ఉర్దూ అసలు రానివాడినో లేక తక్కువ వచ్చిన వాడినో నేనొక్కడినే. అక్కడ జమ అయిన వాళ్లల్లో ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాదు నివాసిని కానివాడిని కూడా నేనొక్కడినే.
హనీఫ్ హృదయం భారతీయుల్ని చూడగానే అంతగా స్పందించటానికి గల కారణం నేను భిన్నరూపంలో వ్యక్తంచేయాలనుకున్నాను. ఇలా అన్నాను: “హనీఫ్ భాయికి మనపట్ల అంతగా ఉద్వేగంతో కూడిన ఆత్మీయత కలగటానికి ఒకే ఒక కారణముందనుకుంటున్నాను” అన్నాను.
సగం ఉర్దూ..... సగం ఇంగ్లీషుల్లో. ఏమి చెబుతానోనని అందరూ ఆసక్తిగా వింటున్నారు. పెద్దగా సమయంలేదు. చివరి భోజనాలు పూర్తయ్యాయి. ఇంతలో “మీ అందరితో 5 నిమిషాలు మాట్లాడాలి” అన్నాడతను.
“ఏకీఁ మా కీ దో సంతాన్ -
హిందుస్తాన్ పాకిస్తాన్”
(ఒకే తల్లికి ఇద్దరు బిడ్డలు - భారత పాకిస్తాను గడ్డలు) అన్నాను. ఒక్కసారి చప్పట్లు మోగాయి. హనీఫ్ నా కళ్లల్లోకి సాదరంగా చూశాడు. ఏదో తెలియని ఆత్మీయత! మళ్లీ తన పనిలోకి తను వెళ్లిపోయాడు హనీఫ్. అశ్రద్ధ అతని స్వభావం కాదు.
కాసేపు రవీంద్రనాథ్ టాగోర్ రచించిన “కాబూలీవాలా” కథ, బలరాజ్ సహాని అదే పేరుతోగల సినిమాలో చేసిన అద్భుత నటన, భయంకరంగా కనిపించే కాబూలీవాలాలో వెన్నలాంటి ప్రేమ హృదయం గురించి నాచారంలో వుండే నెహ్ పాల్ సింగ్ వర్మ చెప్పారు. మధ్యమధ్య నేను కొంత అందించాను. హైదరాబాద్ పాత నగరం శాలిబండ నివాసి మసూద్ ఆలీ ని పాట పాడమని హనీఫ్ తమ్ముడు సయూజీ సంసూన్ కోరాడు.
"కోహినూర్” సినిమాలో *“మధువనమే... రాధికా” పాటను మసూద్ పాడాడు. తక్కువ శృతిలో అతను పాటలు బాగానే పాడతాడనిపించింది. ఆ పాటకు నైట్ వాచ్ మన్ ముషావలీ భోజన బల్లమీదే గమకాలు చెడకుండా దరువుకొట్టాడు. బహుశా అతనికి తబలా పరిచయం వున్నట్టుంది. తర్వాత హైదరాబాదు హిమాయత్ నగరవాసి డా. ఆనందరాజవర్మ “హకీకత్” సినిమాలో కైఫీ అజ్మీ పాట వినిపించారు. నన్ను బలవంతంగా పాడమని కోరితే పాడటం రాదనీ అయినా వినిపిస్తాననీ యిలా అన్నాను.
"మందిర్ మస్జిద్ గురుద్వారోం నె
భాంట్ లియా భగవాన్ కో
ధర్తీ భాంటీ సాగర్ భాంటా
మత్ భాంటో ఇన్సాన్ కో"
(మందిరాలు మసీదులు గురుద్వారాలు, భగవంతుణ్ణి 'ముక్కలు' చేశాయి. భూమి ముక్కలయింది. సముద్రాలు ముక్కలయ్యాయి. మానవత్వాన్ని మాత్రం ముక్కలు కానీయకండి!)
హనీఫ్ మాట్లాడిన విషయాన్ని నాకు పూర్తిగా అర్థమయే విధంగా మళ్లీ మళ్లీ చెప్పమని అడిగాను. చెబుతానన్నాడు. నా పెన్నే తీసుకుని గబగబా కాగితం మీద ఏదో రాశాడు. పుస్తకంలోని ఆ పేజీ చింపి మడిచి నా చేతిలో పెట్టాడు. ఆ ఉత్తరం తెరిచివున్నా
మడిచివున్నా అందులో వున్న అక్షరాల స్వరూపం నాకు తెలిసే అవకాశం లేదు. భావం తెలీదు. కారణం అది ఉర్దూభాష. అనగా పర్షియన్ లిపిలో వుంటుంది. తెలుగు పాఠకులతోపాటు దాని అనువాదాన్ని నేను కూడా పత్రికల్లోనే చదువుకుందామని... ఇదిగో పత్రికల
ద్వారా ఉర్దూ ఉత్తరాన్ని తెరుస్తున్నాను. మీతోపాటు నేను కూడా హనీఫ్ ఉత్తరాన్ని తెలుగులో చదువుకుంటాను.
మొహమ్మద్ హనీఫ్ రాసినది
అన్నయ్యా!
మీరు ఇక్కడికి (లాహోరు)కి వచ్చి మీ విలువయిన సమయంలో కొన్ని నిమిషాలు మాతో వెచ్చించినందుకు మీకు కృతజ్ఞతలు. మీరు ఎల్లప్పుడూ నవ్వుతూ వుండాలని మేం కోరుకుంటున్నాం. మీకోసం పాకిస్తాన్ తలుపులు ఎల్లప్పుడూ తెరిచే వుంటాయి. మీరు ఎప్పుడయినా
యిక్కడికి రావచ్చు. మీరు మమ్మల్ని జ్ఞాపకం వుంచుకుంటారని ఆశిస్తున్నాం. మీరు మాతో టెలిఫోన్ ద్వారాగానీ, వుత్తరాలు ద్వారాగానీ సంభాషిస్తూ వుండండి. మీరూ, ఇండియా ఎల్లప్పుడూ సుఖసంతోషాలతో వుండాలని అల్లాని కోరుకుంటున్నాం. రాత్రింబవళ్ళు మీ దేశం అభివృద్ధి చెందుతూనే వుండాలి. ఇండియా పాకిస్తాన్ మధ్య శాంతి నెలకొనటం కోసం ప్రయత్నించే వారి ప్రయత్నాలు ఫలించాలని మేం అల్లాని ప్రార్థిస్తున్నాం.
- మొహమ్మద్ హనీఫ్, నాసీరాబాదీ
లాహోర్
19-12-2003)
(20 సంవత్సరాల కిందట ఒక పత్రికలో అచ్చయిన ఈ వ్యాసాన్ని నేటితరం పాఠకుల కోసం పునర్ముద్రణ)
Next Story