ఎద్దుల బండిపై ఊరేగుతున్న మునసబుగారు
x
మునసబు వేమవరపు వెంకటేశ్వరరావు గారి ఒకప్పటి మండువా ఇల్లు ఉన్న ప్రాంతం

ఎద్దుల బండిపై ఊరేగుతున్న మునసబుగారు

"పొద్దున్నే ఇంట్లో దిబ్బరొట్టె చేసుకుని ఎద్దుల బండి ఎక్కితే ...అన్నట్లు దిబ్బరొట్టెలోకి ఆవకాయ వేసుకుని తింటే ఎంత బాగుండేదో"


అమ్మ చెప్పిన ముచ్చట్లు - 4



-రాఘవ శర్మ

“మా అమ్మ రోజూ చల్ల చిలికేది.

వెన్న తీశాక వచ్చిన మజ్జిగని ఊళ్ళో వాళ్ళు ఎవరడిగితే వాళ్ళకు పోసేది." అంటూ ఆనాటి సంగతులను మా అమ్మ చెపుతోంది.

“మండువా ఇంట్లో ఒక స్తంభానిక తాడు కట్టి, దాంట్లో కవ్వం పెట్టి, ఆ కవ్వం కింద పెరుగు కుండ పెట్టి నిలుచుని తాడుతో లాగుతూ చిలికేది.

చల్ల చిలుకుతుంటే వచ్చే శబ్దం భలేగుండేది.

'చల్లా చిలుకు గొల్లా భామ..ముడ్డి తిప్పు ముసలి భామా..” అంటూ మా అమ్మ సరదాగా పాడేది.

కవ్వం తాడులా పిల్లల రెండు చేతులూ పుచ్చుకొని ఆ పాట పాడుతూ అలాగే తిప్పేది.

వెన్న తీశాక ఆ జిడ్డు చేతులను మా కాళ్ళకు, చేతులకు రాసేది.

తనూ రాసుకునేది.

దాంతో కాళ్ళూ చేతులు నున్నగా తయారయ్యేవి" అంటూ వివరించింది.

“మా నాన్న చాలా మెతక.

పంట పండాక, కోత కోసి, కుప్ప వేసి నూర్చాక, ధాన్యం బస్తాలకెత్తించి ఎద్దుల బండిలో ఇంటికి తెచ్చేవాడు.

మా నాన్న ఎద్దుల బండిలో ధాన్యం బస్తాల పైనెక్కి కూర్చునే వాడు.

‘మునసబుగారేంటి ధాన్యం బస్తాల పైన కూర్చుని ఊరేగుతున్నారు!?' అని ఊళ్ళో జనం నివ్వెరపోయేవారు.

చెల్లెలి ఇంటి దగ్గరకొచ్చేసరికి కాలితో కొన్ని ధాన్యం బస్తాలను అలికిడి రాకుండా నిదానంగా కిందకు తోసేసేవాడు.

చివరికి బండితోలే పాలేరుకు కూడా తెలియకుండా ఆ పని జరిగిపోయేది.

ఎక్కడా చలీచప్పుడూ ఉండేది కాదు.

బండి వెళ్ళిపోయాక మా అత్తయ్య ఆ ధాన్యం బస్తాలను ఇంట్లోకి తరలించేసేది.

పాలేరుకు తెలిసినా మా అమ్మకు తెలిసిపోతుందని భయం.

తెలిస్తే ఇంకేమైనా ఉందా!

మానాన్నపైన విరుచుకుపడేది మా అమ్మ.

అందుకుని అలా చేసేవాడు.

మా అమ్మ తన సొంత తమ్ముణ్ణి ఎంత చేరదీసినా, ఆయన ఎంత దుబారా చేసినా నోరెత్తేది కాదు.

తమ్ముడే అల్లుడవడం వల్ల!

తాను ఎంత దుబారా చేసినా ఆడపడుచులకు మాత్రం వీసమెత్తుపోనిచ్చేది కాదు.

మా అమ్మమ్మ వాళ్ళింట్లో ముగ్గురు మగపిల్లల కంటే ముందు పుట్టింది మా అమ్మ సీతమ్మ.

ఒక్కతే కూతురు కనుక చాలా గారాబంగా పెరిగింది.

దాంతో కాస్త గడుసుదనమూ అలవాటయ్యింది.

పెళ్ళై అత్తారింటికి వచ్చినా ఆ గడుసుదనమే సాగించుకుంది.” అంటూ ఏ మాత్రం దాపరికం లేకుండా వాళ్ళమ్మ గురించి చెప్పేస్తోంది.


ఆలూరు విమలాదేవి


'మా అమ్మా వాళ్ళది పెదగొన్నూరు.

మాజీ ఎమ్మెల్యే కాజా రామనాథం గారి ఊరది.

మా అమ్మ పుట్టింటారికి కూడా వ్యవసాయమే.

మా తాతయ్యకు ముగ్గురు మగపిల్లలు, ఒక్కతే ఆడపిల్ల.

ఆమే మా అమ్మ సీతమ్మ. మాచిన్నప్పుడు మేం అప్పుడప్పుడూ వేమవరం నుంచి పెదగొన్నూరుకు వెళ్ళే వాళ్ళం.

పొద్దున్నే ఇంట్లో దిబ్బరొట్టె చేసుకుని ఎద్దుల బండి ఎక్కితే ఏ సాయంత్రానికో పెదగొన్నూరు చేరే వాళ్ళం.

దిబ్బరొట్టెలోకి ఆవకాయ వేసుకుని తింటే ఎంత బాగుండేదో!” అంటూ పెదగొన్నూరు విషయాలు చెప్పడం మొదలు పెట్టింది.

అన్నట్టు దిబ్బరొట్టెను నా మిత్రుడు సుధీర్ 'బద్దకం రొట్టె' అనేవాడు. లావుగా ఉంటుంది కనుక.

"మా చిన్న మావయ్య గంగరాజును మా పెద్దక్కయ్య చిట్టెమ్మకు ఇచ్చి చేశారు.

మా గంగుల మావయ్య ఎక్కువగా మా ఇంట్లోనే ఉండేవాడని చెప్పానుకదా!

మా రాముడు మావయ్య, మా లక్షుడు మావయ్య ఇద్దరూ కవల పిల్లలు.

అచ్చుగుద్దినట్టు ఇద్దరూ ఒకేలా ఉండేవారు.

సన్నగా, నల్లగా, పొట్టిగా ఉండేవారు.

గంజిపెట్టి ఇస్త్రీ చేసిన తెల్లటి పంచె, తెల్లటి షర్టు వేసుకునే వారు.

తేరిపార చూస్తే తప్ప వారిద్దరి మధ్య తేడా కనుక్కోలేం.”

"మారాముడు మావయ్యకు, లక్షుడి మావయ్యకు దాదాపు ఒకే సారి పెళ్లైంది.

ఒక సారి ఏమైందంటే, 'బావగారు నా గదిలోకొచ్చేసారు బాబోయ్' అంటూ మా లక్షుడి మావయ్య భార్య గదిలోంచి పెద్దగా అరిచేసింది.

గబగబా మా లక్షుడు మావయ్య మా అత్తయ్య నోరు మూసేసి నేనే, నీ మొగుణ్ణి లక్ష్మయ్యనే తెలివి తక్కువ దానా!' అన్నాట్ట.

'అయ్యో పొరపాటు పడ్డానండి, బావగారనుకున్నా' అందట ఆ అమాయకురాలు.” అలా ఉండేవి వాళ్ళ అమాయక వ్యవహారాలు.

"మా రాముడు మావయ్య పెద్ద కూతురినే మా పెద్దన్నయ్యకు ఇచ్చిచేశారు.

మా బాచన్నయ్యకు టీచర్ ఉద్యోగం రాగానే, భార్యను కాపురానికి పంపించమంటే, మా రాముడు మావయ్య కూతురిని పంపించలేదు.

ఆప్పుడు టీచర్లకు జీతాలు చాలా తక్కువ.

'నీ జీతంలో నువ్వే బతకలేవు.' అని అల్లుడు, మేనల్లుడు అయిన మా అన్నయ్యతో కాస్త పరాచికాలాడుతూ అన్నాడు.

దాంతో మా అన్నయ్యకు పౌరుషం పొడుచుకొచ్చేసింది.

భార్యను పుట్టింట్లోనే ఒదిలేసి వెళ్ళిపోయాడు.

అప్పటికే ఆమెకు ఒక కొడుకు.

పాపం జీవితాంతం కొడుకుతోపాటు పుట్టింట్లో పెదగొన్నూరులోనే ఉండిపోయింది మా పెద్దొదిన.”

“మా గంగులు మావయ్య వేమవరంలో అప్పులు చేయడం ఎక్కువైంది.

మా శేషన్నయ్యను కూడా వ్యసనాలకు బానిసను చేశాడు.

ఇద్దరూ కలిసి అప్పులు చేయడం మొదలు పెట్టారు.

వారు చేసిన అప్పుల కింద ఒక్కో ఎకరం ఖాళీ అయిపోతోంది.

మా అమ్మనోటికి భయపడి మా నాన్న నోరెత్తేవాడుకాదు.

కళ్ళప్పగించి చూసేవాడు.

మా పెద్దన్నయ్యకు పరిస్థితి అర్థమైపోయింది.

అసలే సుకుమారం.

ఆలోచించి ఆలోచించి మతి స్థిమితం తప్పింది.

మా బాచన్నయ్య మామూలు మనిషి కావడానికి మా నాన్న చాలా కష్టపడ్డాడు.

కాస్త వినోదం ఏర్పాటు చేశాడు.

కావలసినంత డబ్బులిచ్చేవాడు.

హరిదాసులును పిలిపించి మా అన్నయ్య కోసం ఇంట్లోనే హరికథలు చెప్పించాడు.

ఆ దెబ్బతో పిచ్చి కుదరడం కాదు కానీ, మా అన్నయ్యకు పద్యాలు, పాటలు పాడడం బాగా అలవాటైంది.

మామూలు స్థితికి వచ్చాక యధావిధిగా వెళ్ళి ఉద్యోగం చేసుకోవడం మొదలు పెట్టాడు”

"మా బాచన్నయ్య సెలవులకని వేమవరం వచ్చేవాడు.

మా అన్నయ్యకు ఏవో ఉత్తరాలు వచ్చేవి.

తనతో పనిచేసే ఆవిడ రాసేది.

మిగతా వాళ్ళ చేతిలో పడితే తీసి చదివే వాళ్ళు.

తన ఉత్తరాలను ఎవరూ తీసుకోకుండా నన్నే తీసి దాచిపెట్టమని మా బాచన్నయ్య చెప్పాడు.

నేను తీసి దాచిపెట్టి, తాను బయటనుంచి వచ్చాక ఇచ్చేదాన్ని.

వాళ్ళ ఉత్తరాలు చించి చదివే దాన్ని కాదు.

అందుకని మా అన్నయ్యకు నా పైన గురి" అంది.

తరువాత మా పెద మేనమామ ప్రేమ వ్యవహారం ఏమైందో ఇలా చెప్పింది.

"మా బాచన్నయ్యకు ప్రేమ లేఖలు రాసే ఆవిడకూడా టీచరే.

చెప్పా పెట్టకుండా ఇద్దరూ పెళ్ళి చేసేసుకున్నారు.

మాకు, ఆవిడకు శాఖా బేధాలున్నా వాళ్ళవేమీ పట్టించుకోలేదు.

కానీ మా వాళ్ళంతా బాగా పట్టింపులున్న వాళ్ళు.

ముఖ్యంగా మా అమ్మ.

తన తమ్ముడి కూతురిని కొడుక్కు చేసుకుంటే, వాళ్ళు విడిపోవడం వల్ల చాలా బాధపడిపోయింది.

శాఖా బేధాలను చూపించి వాళ్ళ దగ్గరా, వీళ్ళ దగ్గరా తరుచూ దెప్పి పొడిచేది.”

అదీ మా పెద్ద మేనమామ సంగతి.

మా రెండో మేనమామ గురించి ఇలా చెప్పడం మొదలు పెట్టింది.

"మా రెండో అన్నయ్య శేషగిరి రావుకు చదువు అబ్బలేదు.

ఊళ్ళోనే పొలం పనులు చూసుకునే వాడు.

పొలం విషయంలో తగాదాలు పడుతుండే వాడు.

రాయపల్లికి చెందిన అమ్మాయినిచ్చి మా శేషన్నయ్యకు పెళ్ళి చేశారు.

ఆమె పేరూ సీతమ్మే.

మేం సీతొదినా అని పిలిచే వాళ్ళం.

మా అమ్మ పెద్ద కోడలు పుట్టింట్లోనే ఉండిపోయింది.

అందులో ఆమె తన తమ్ముడి కూతురు.

మా బాచన్నయ్య రెండో పెళ్ళి చేసుకుని మా కుటుంబానికి దూరం అవుతున్నాడు.

ఇవ్వన్నీ మా అమ్మను బాధించాయి.

ఆ బాధనంతా రెండవ కోడలు సీత పైన చూపించడం మొదలు పెట్టింది.

ఇంటి చాకిరీ అంతా మా వదినతోనే చేయించేది.

అప్పుడప్పుడూ కొట్టేది కూడా.

అన్నం తింటున్నప్పుడు నెత్తిన మొట్టేది.

అందరం వరుసగా భోజనాలకు కూర్చునే వాళ్ళం.

మా పక్కనే మా సీతొదిన కూడా కూర్చునేది.

మా అమ్మ అందరికీ కంచంలో అన్నీ వడ్డించేది.

మా సీతొదినకు మాత్రం ఒట్టి అన్నం తప్ప ఏమీ ఒడ్డించేది కాదు.

ఒట్టన్నం తినలేక గుడ్ల నీళ్ళు గుడ్లలో కుక్కుకునేది.

అయినా తలొంచుకుని తినేసేది.

మా అమ్మ చూడకుండా అన్నంలో కూరో, పప్పో కప్పి పెట్టి మా వదిన కంచంలో వేసే వాళ్ళం.

పాపం గబగబా తినేసేది.

మా అమ్మ చూస్తే అదొక సమస్య.

మా సీతొదిన జీవితం మా అమ్మ దగ్గర అలా కొంతకాలం సాగింది.”

"తల్లి తన భార్యను ఇబ్బంది పెడుతుంటే మా శేషన్నయ్య నోరెత్తేవాడు కాదు.

బైట ఎంత పులైనా అమ్మ దగ్గర పిల్లే.

నాకు పెళ్ళైన కొత్తలు.

నేను పుట్టింటికి వెళ్ళాను.

మా వదిన పరిస్థితి ఏమీ బాగుండలేదు.

కామెర్లు వచ్చాయి.

మా సీతొదిన ఇక్కడుంటే మా అమ్మ చేతిలో ఎక్కువ కాలం బతకదని తెలిసి పోయింది.

మా వారు ఆమెను తీసుకెళ్ళి వాళ్ళ పుట్టింట్లో దించేసి వచ్చారు.

తీసుకెళ్ళి దించిన కొన్ని రోజులకే మా సీతొదిన చనిపోయింది.

దాంతో వాళ్ళకు, మాకు రాకపోకలు పూర్తిగా తెగిపోయాయి.”

దాదాపు డెబ్భై ఏళ్ళ నాటి మాట ఇది.

సంప్రదాయకుటుంబాల్లో ఎంత గృహ హింస ఉండేదో!

ఆ హింస బైటికొచ్చేది కాదు.

లోలోనే కుమిలిపోయే వాళ్ళు.

(ఇంకా ఉంది)


(రాఘవ శర్మ, జర్నలిస్టు, రచయిత, సాహితీ సౌ గంధం ( ఉమ్మడి చిత్తూరు జిల్లా సాహితీ వేత్తల గురించి) ఓ కొత్త బంగారు లోకం ( చైనా పర్యటన అనుభవాలు) తిరుమల దృశ్య కావ్యం ( శేషాచలం కొండల లో ట్రెక్ అనుభవాలు) పుస్తకాలు అచ్చయ్యాయి. త్వరలో ‘వనపర్తి ఒడి లో’ విడుదల కానుంది.)




Read More
Next Story