తొలినాళ్ల స్కూల్ నుంచి ఒక వెంటాడే జ్ఞాపకం
x

తొలినాళ్ల స్కూల్ నుంచి ఒక వెంటాడే జ్ఞాపకం

బడి వొడిలో... ఒక టీచరమ్మ ‘యథానికలు' : 6


-కాంతి నల్లూరి

దుర్గా.....దుర్గా.... ఎన్ని తీపి గుర్తులు, చేదు జ్ఞాపకాలు. రెండవ తరగతిలో మా స్కూల్లో చేరింది. అప్పటికే తండ్రి చనిపోయాడు. తల్లికి బాగాలేదు అన్నారు. తల్లి మేనమామ గారి ఇంట్లో పక్క ఊర్లో ఉండేది. వాళ్ళ అమ్మమ్మ తీసుకొచ్చి మా స్కూల్లో చేర్చింది. అమ్మమ్మ దోబీ పనిచేస్తూ దుర్గను సాకుతుండేది. చాలా మృదువైన అమ్మాయి. పిల్లలందరితో చాలా ఫ్రెండ్లీగా ఉండేది. ఒక్కరితో కూడా గొడవ పడటం ఆ నాలుగేళ్లలో మేం చూడలేదు. చాలా హుషారుగా ఉండేది. బొమ్మలేసేది. బొమ్మలు తయారు చేసేది. కథలు చెప్పేది. అందమైన చేతివ్రాత. అందమైన నవ్వు. దుర్గ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ దుర్గని బంధువులు, ఊర్లో వాళ్ళు మర్చిపోవచ్చు. కానీ నేను, మా టీచర్ ఎప్పటికీ మర్చిపోలేము. తలుచుకుంటే కళ్ళల్లో కన్నీటి చలమలు ఊరతాయి.

అది కొత్తగా కట్టిన డిపిఇపి స్కూల్. సింగిల్ టీచర్ గా నేనొక్కదాన్నే ఉండేదాన్ని మొదట్లో. స్కూలు ఒంగోలు, చీరాల నేషనల్ హైవే కి పక్కనే ఊరికి కొద్దిగా దూరంగా ఉండేది. 30 మంది వరకు విద్యార్థులు ఉండేవారు. పిల్లలందరినీ, పాఠశాల ఊరికి దూరంగా ఉండటం వల్ల, నేషనల్ హైవే అవటంవల్ల, నేనొక్కదాన్నే ఉండటం వలన ఎప్పుడు వాళ్లతో నేను, నాతో వాళ్ళు ఉండేవాళ్ళు.

అప్పటికి ఇంకా పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం మొదలు కాలేదు. విద్యార్థులు కూడా బాక్సులు వాటర్ బాటిల్స్ తెచ్చుకునే వాళ్లు. అందరం రూమ్ లో గుండ్రంగా కూర్చుని జోక్ లు వేసుకుంటూ కూరలపేర్లు చెప్పకుండా క్లూ యిస్తూ కనుక్కునేటట్లు తినేవాళ్ళం. దీనివల్ల కానీ, లేదా నేను నేర్పిన అలవాట్ల వలన కాని పిల్లల దగ్గర ఏమున్నా (దుర్గా పెద్దపెద్ద లంగాలు వేసుకొచ్చేది) పాస్ బెల్లుకు గోడ నీడన చేరి దుర్గా ఒడిలో వేసి అందరూ పంచుకొని తినేవాళ్లు.

ఐదు తరగతులు. సింగిల్ టీచర్ అవడం వల్ల పిల్లల సహాయం తీసుకునే దాన్ని. నేను చెప్పిన తర్వాత, అర్థం కాని పిల్లలకు నేనెలా చెప్పానో అలానే దుర్గ చెప్పేది. నేను ఎక్కడి గీత గీసానో అక్కడే గీసేది. నేనెక్కడ బెండ్ అయ్యానో అక్కడ బెండ్ అయ్యేది. ఊర్లో అంకమ్మరావు అని ఒకే ఒక అబ్బాయి డిగ్రీ చదువుతున్నాడు. (ఈ అంకమ్మరావు ఇప్పుడు పోలీసు సిఐ గా చేస్తున్నాడు.) తను ఎప్పుడన్నా స్కూల్ కి వస్తే ఏదో ఒక తరగతికి పాఠం చెప్పమనేదాన్ని.

ఓ రోజు అంకమ్మరావు వచ్చి గోడలను మీద చార్టులను నల్లబల్లపై ఉన్న గుణింతాలను నిదానంగా చూస్తున్నాడు. నేను మామూలుగా పరిశీలిస్తున్నాడు అనుకున్నాను. అంకమ్మరావు వెళ్లిపోయిన తర్వాత “మేడం, అన్న బోర్డులను ఎందుకు చూశాడో తెలుసా మీకు,” అన్నాడు ఓ స్టూడెంట్.

మామూలుగానే చూసాడు కదా అన్నాను. “కాదు మేడం, మా మేడం గారికి గుణింతాలు రావని, మ,య కు ఓత్వం, ఓత్వం పల్లు మొ,మో ,యొ యో రాశారని, కొ కో,గొ గో,చొ,చో అన్ని గుణింతాలు ఇలా ఉంటాయని దుర్గ చెప్పింది ఊర్లో. అందుకని అంకమ్మరావు అన్న చూడటానికి వచ్చాడు,” అన్నాడు.

“అవునా! మరి నన్ను ఏమి అడగలేదు గా,” అన్నాను.

“ఏం దుర్గా, ఏం తప్పు ఉంది?” అని అడిగాను.

నల్లబల్లపై నేను రాసిన ఓత్వం,ఓత్వం పల్లు గుణింతాలను చూపిస్తూ మ, య గుణింతాల తేడాను చూపింది. మిగతా పిల్లలకు రాని అనుమానం దుర్గకురావడం చాలా గ్రేట్. చాలా ఆశ్చర్యం కూడా. అప్పటికి మేమందరం గుణింతాలను అలాగే చెప్తున్నాం. ఎక్కడా ఈ ప్రశ్న ఎదురవ్వలేదు. విద్యార్థులు చెప్పింది పాటించడం, లేదా మిగతా గుణింతాలు రాసుకున్నట్టు రాయడం జరుగుతూ ఉండేది. మిగతా గుణింతాలకు మ య గుణింతాలకు తేడా ఉంది. కానీ అది నేను రాసింది కాదు పుస్తకాలలో కూడా అలాగే ఉంటుంది చూడండి అని పుస్తకాలలోని గుణింతాలు చూపించాను. ఎందుకు ఇలా తేడాగా ఉన్నాయి. నాక్కూడా అనుమానం లేపింది దుర్గ.

ఆదికవి నన్నయ్య ఇలాగే రాశాడు అని చెప్పాను అప్పటికి. కానీ నా అనుమానం తెలుగు పండిట్ల వరకు తీసుకెళ్లాను. స్కూల్ కాంప్లెక్స్ లలో చెప్పేను. మాకు యాకు ఓత్వo, ఓత్వం పల్లు అన్ని గుణింతాలలో రాసినట్లు రాస్తే బాగుండదని నన్నయ్య ఉద్దేశమై ఉంటుందన్నారు.

ఇంక అప్పటి నుంచి మ,యలకు భాష పుస్తకీకరించిన నన్నయ్య అలాగే వ్రాసాడని అది మనమెవ్వరం రాసినది కాదని చెప్పడం మొదలుపెట్టాము. ప్రింటెడ్ గుణింతాల చార్ట్ గోడకు తగిలించి తేడా చూపిస్తూ చెప్పడం జరిగింది. ఇలా దుర్గ అనుమానం మా అందరినీ ఆలోచింపజేసింది.

దుర్గ వేసిన చక్కటి బొమ్మలను, తయారుచేసిన ముచ్చటైన బొమ్మలను స్కూలుకు ఎవరు వచ్చినా వీడియోలు, ఫోటోలు తీసుకునేవాళ్లు.

దుర్గకు ఎప్పుడు జ్వరం వస్తుండేది వాళ్ళ అమ్మమ్మ ఆర్ఎంపి దగ్గర ఇంజక్షన్లు చేయిస్తూ ఉండేది. ఆ ఇంజక్షన్లు చేసిన దగ్గర లొట్టలు పడుతూ ఉండేవి. ఒంటికి ఎలర్జీలు వస్తుండేవి. సరైన ఆహారము లేకపోవడం వలన అలా వస్తుండేవి అనుకునే వాళ్ళం. ఫోర్త్ క్లాసులో ఉండగా హాస్పిటల్స్ నుండి స్కూల్ విజిట్ కు నర్సులు వచ్చినప్పుడు దుర్గను చూపించాం. ఆ నరుసుకు అనుమానం వచ్చి బ్లడ్ తీసుకెళ్లింది. అనుమానం నివృత్తి కోసం ఒంగోలు గవర్నమెంట్ హాస్పిటల్ కు దుర్గను, నేను ఆ నర్స్ తీసుకువెళ్లాం. హెచ్ఐవి అనే ధ్రువీకరించారు. అంత తెలివైన పిల్లలకు ఈ బాధలు ఏంటా అని ఇద్దరము నిరాశపడి కూర్చుండిపోయాం. వాళ్ళ అమ్మమ్మకు విషయము చెప్పాము. నర్సు వాళ్ళ అమ్మమ్మను అన్ని విషయాలు అడిగి దుర్గ తండ్రి నుండి తల్లికి వచ్చిందని తల్లి కూడా చనిపోయిందని, వారి నుండి దుర్గకు వచ్చిందనింది.

దుర్గకు హాస్పిటల్ నుండి గోధుమపిండి, బియ్యం, మందులు అలాంటివి వచ్చేవి. నేను మా టీచర్ గారు అనేక జాగ్రత్తలు తీసుకునేవాళ్ళం. దుర్గా లంగాలో అవన్నీ వేసి పంచుకోవద్దని చెప్పాము. దుర్గకు తను తింటున్నవి ఎవరికి పెట్టవద్దని చెప్పాము. మధ్యాహ్న భోజన పథకంలో ప్లేట్లకు గ్లాసులకు నంబరింగ్ ఇచ్చాం. ప్రతి ఒక్కళ్ళు నంబర్ ప్రకారము ప్లేటు గ్లాసు తీసుకుని సోప్ తో కడుక్కోవాలని, కాళ్లు చేతులు కూడా సోప్ తో కడుక్కోవాలని చెప్పాము. అప్పటికి ప్రభుత్వ పాఠశాలలో హ్యాండ్ వాష్ డేలు, హ్యాండ్ వాష్ లు రాలేదు. 10 నిమిషాలు ముందుగా ఒకటి రెండు తరగతుల విద్యార్థులను వదిలి, రెండు మూడు బకెట్లలో బావిలో నీళ్లు తోడించి కడుక్కోమనేవాళ్ళం. ఇవన్నీ వెంకటేష్ అనే విద్యార్థి చూసేవాడు. ఈ జాగ్రత్తలన్నీ లోపల దుఃఖాన్ని ఆపుకుంటూ చెప్పేవాళ్ళం.

నరహరి అని ఒకామె వచ్చి, మీకు తెలుసు అంట కదా, స్కూలుకు ఎందుకు రానిస్తున్నారు, మీగతా పిల్లలకు వస్తుంది కదా! మాకెందుకు చెప్పలేదు, మా పిల్లలకు మధ్యాహ్న భోజనం పెట్టొద్దు అని నిలదీసింది. మేము తీసుకుంటున్న జాగ్రత్తలు చెప్పి మధ్యాహ్న భోజన పథకంలో పిల్లల పాటిస్తున్న జాగ్రత్తలు చూసి కొంత తృప్తి పడింది. మీకు చెప్పకూడదు ,అది నేరము అవుతుందని, ప్రభుత్వం కేసు పెడుతుందని చెప్పాము. దుర్గ కొన్ని రోజులు బాగుంటుంది. కొన్ని రోజులు నీరసిస్తుంది. చదువులో మాత్రం శ్రద్ధ పెడుతూనే ఉంది.

దుర్గ అమ్మమ్మ స్కూలుకు వచ్చి, పెళ్లయిన వారికి ఈ జబ్బు వస్తుందట కదా అమ్మమ్మ నాకెందుకు వచ్చింది. నేను చిన్నపిల్లనే కదా అని అన్నదట. (వేరే సంబంధాలు ఉన్నా వస్తుందట కాదా!) ఈ విషయం చెప్పి దుర్గ అమ్మమ్మ ఏడ్చింది. మా టీచర్ నేను వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ ఆమెను ఓదార్చాము. దుర్గ ఉషారుగా నే ఉంటుంది. కానీ తెలియని దిగులు దుర్గలో ఉండేది. దుర్గ ఐదవ తరగతిలో ఉండగా సంక్రాంతి సెలవులు ఇచ్చారు. రీఓపెన్ రోజు స్కూల్ కి వెళ్ళగానే దుర్గ చనిపోయిందని పిల్లలందరూ దిగులు ముఖాలాతో చెప్పారు. దుర్గ అమ్మమ్మను పలకరిద్దామని ఇంటికి వెళితే తలుపుకు తాళం వేసి ఉంది. పక్క ఊరిలో ఉన్న కొడుకు దగ్గరకు వెళ్లిందని చెప్పారు. తండ్రులు చేసిన తప్పులకు పసిపిల్ల బలయిందనుకున్నాం సెలవులవల్ల చివరి చూపు కూడా చూడలేకపోయమని బాధపడ్డాం. ఇప్పటికీ దుర్గ గుర్తు వస్తే దిగులు మేఘాలు కమ్ముకుంటాయి. దుర్గ వేసిన బొమ్మలు నాతోపాటు ప్రతి స్కూలుకు తీసుకెళ్లాను. బొమ్మల గురించి వేసిన దుర్గ గురించి విద్యార్థులతో పాటు స్కూల్ కి వచ్చిన ఆఫీసర్లకు కూడా చెప్పినప్పుడు వాళ్లు అయ్యో అంటూ బాధపడేవారు. దుర్గ ఉంటే ఇప్పుడు ఏం చేస్తూ ఉండేది? ఈ ప్రశ్న కు నాకు ఎప్పటికీ జవాబు లేదు. దుర్గ గురించిన తీపి, చేదు జ్ఞాపకాలు, దిగులు మేఘాలు నేను ఉన్నంతవరకు నాతో పాటే ఉంటాయి.

Read More
Next Story