కన్న కడుపన్న కాంతల కెంత తీపి!
x

'కన్న కడుపన్న కాంతల కెంత తీపి!'

"పిల్లి, వితంతువు ఎదురొస్తే తిట్టుకుంటూ వచ్చి, కాళ్ళూ చేతులు కడుక్కుని, నీళ్ళు పుక్కిళించి, దేవుడికి దణ్ణం పెట్టి వెళ్ళేవాడు నాన్న.": అమ్మ చెప్పిన ముచ్చట్లు : 7


అమ్మ చెప్పిన ముచ్చట్లు -7


-రాఘవ శర్మ

మా అమ్మకు పిల్లలంటే ప్రాణం.
ఏడుగురు పిల్లల్ని కని, పెంచి, పెద్ద చేసింది.
చదువులు చెప్పించింది.
ఎన్ని కష్టాలొచ్చినా ఓర్చుకుంది.
మా అక్క తరువాత ఇంట్లో నేనే పెద్దవాణ్ణి.
పిల్లల్ని ఎలా పెంచిందో కళ్ళారా చూసిన వాణ్ణి.
పిల్లలు ఎంత అల్లరి చేసినా, ఒక్కదెబ్బ కొట్టేది కాదు.
ఒక్క తిట్టు తిట్టేది కాదు.
తన కడుపున పుట్టిన పిల్లల్నే కాదు, మనవల్ని కూడా పెంచింది.
ఎప్పుడైనా మా నాన్న పిల్లల్ని కొడుతుంటే ఆమె మనసు విలవిల్లాడిపోయేది.
ఒక్కొక్క సారి మానాన్న పిల్లల్ని కొట్టడం శ్రుతి మించితే అడ్డుకునేది కూడా.
పిల్లల్ని కొట్టనిచ్చేదికాదు.
ఒక సారి ఏమైందంటే మా చెల్లెలు కొడుకు బబ్బి (శరత్ చంద్ర) కాస్త అల్లరి చేస్తున్నాడు.
మా నాన్నకు పెద్ద వయసు వచ్చేసింది.
దాంతో చికాకేసి మనవణ్ణి కొట్టడానికి వచ్చాడు.
“పిల్లల్ని కొట్టే హక్కు మీకెవరిచ్చారు?” అంటూ మా నాన్న పైన విరుచుకుపడింది.

పసిపిల్లల్ని పెంచడంలో ఎంత జాగ్రత్తలు తీసుకునేదో!
తన పిల్లల్నే కాదు, మనవళ్ళను, మనవరాళ్ళను కూడా ఎంత ప్రేమగా పెంచిందో!
ఆడపిల్లలా, మొగపిల్లలా అన్న తేడా చూపేది కాదు.
ఉయ్యాల్లోంచి పిల్లల్ని నవ్వుతూ, పలకరిస్తూ లేపేది.
మా అమ్మ ముఖం చూడగానే పిల్లలు చిరు నవ్వుతో లేచే వాళ్ళు.
రోజులు, నెలలబిడ్డల వెన్ను కింద చేతిని నిలువుగా పెట్టి చాలా జాగ్రత్తగా ఎత్తుకునేది.
పసి పిల్లలికి నీళ్ళు పోసేటప్పుడు ఎన్ని జాగ్రత్తలు పాటించేదో! పుట్టగోచీ పెట్టుకుని, కాళ్ళు పారజాపి పీటపైన కూర్చునేది.
కాళ్ళ కింద కూడా ఒక పీట వేసుకునేది.
చంటి బిడ్డని రెండు కాళ్ళ మధ్య పడుకోపెట్టుకునేది.
అలా పీట మీద కూర్చోవడం వల్ల పోసిన నీళ్ళు కాళ్లకింద నుంచి జారిపోయేవి.
బకెట్లో గోరువెచ్చని నీళ్ళు పెట్టుకునేది.
పసిపిల్లల ఒంటికి నూనె రాసి, నలుగు పెట్టి, కాళ్ళూ చేతులూ సాగలాగదీసేది.
ముక్కు కూడా పట్టుకుని కాస్త లాగేది, చట్టి ముక్కు రాకుండా.
పసిపిల్లలకు నీళ్ళు పోసేటప్పుడు అప్పుడప్పుడూ నేను కూడా చెంబుతో నీళ్ళందించే వాణ్ణి.
నీళ్ళు పోస్తుంటే నవ్వుతూ, ఎంత ఆనందంగా పోయించుకునే వాళ్ళో!
అలాగే కాళ్ళపైన బోర్లా పడుకోబెట్టుకుని మరీ నీళ్ళుపోసేది.
దోసిలితో నీళ్ళు తీసుకుని వెన్నులో చరిచినట్టు కొట్టేది.
నోట్లో వేలు పెట్టి పాచి లేకుండా శుభ్రం చేసేది.
నీళ్ళు పోయడం అయిపోయాక ఒళ్లంతా తుడిచి, కొంగుతో ముక్కుల్లో తిరిపెట్టేది.
చెవుల్లో ఊదేది.
అలా ఊదినప్పుడు పిల్లలు చక్కలిగిలి వేసి నవ్వేవాళ్ళు.
బోసినోటితో అలా నవ్వుతుంటే ఎంత బాగుండేదో!
కొక్కానికి పాతచీర వేలాడదీసి ఉయ్యాల వేసేది.
మామూలు ఉయ్యాలకంటే గుడ్డ ఉయ్యాల్లో పిల్లలు చాలా భద్రంగా పడుకునే వారు.
గుడ్డ ఉయ్యాల్లో పడుకోబెడితే కాస్త ఒళ్ళు చేస్తారని కూడా చెప్పేది.
ఉయ్యాల్లో పడుకోబెట్టాక జోల పాడేది.

'బోజ్ఞా నిండా పాలు పోసిన పడుకోవైతివి
లాలించి నిను జోలాపాడిన నిదురపోవగా!
రామా లాలి మేఘశ్యామా లాలి
తామరాస నయనా దశరథ తనయా లాలీ' అంటూ పాడేది.
మా అమ్మ అలా పాడుతున్నంత సేపూ ఆమె ముఖమేచూస్తూ బోసినోరు పెట్టుకుని నవ్వుతూ ఉండే వాళ్ళు.
ఒక్కొక్కసారి కళ్ళు మూతలు పడుతున్నా, బలవంతంగా తెరుచుకుని మరీ పిల్లలు నవ్వుతూ చూసేవారు.
విసుగెత్తి “ఎంత సేపు పాడేది. ఛ వెధవా పడుకో” అనేది. వాళ్ళకేమర్థమయ్యేదో కానీ, దానికి కూడా నవ్వేవాళ్ళు.
ఉయ్యాల్లో ఆ దృశ్యం చూస్తుంటే ఎంత ఆహ్లాదంగా ఉండేదో!
పిల్లలు ఏడుస్తున్నప్పుడు లాలించేది.
జోలపాటలే కాదు, లాలి పాటలూ పాడేది.
చందమామను చూపిస్తూ అన్నం పెట్టేది.
చెట్లను, పూలను చూపిస్తూ వాళ్ళతో కబుర్లు చెపుతుంటే ఊ కొట్టే వాళ్ళు.
మాచిన్నప్పుడు తల్లి పాలు తప్ప, 'సెర్లాకులు' వంటి డబ్బా తిళ్ళు లేవు.
మెత్తగా అన్నం వండి, అందులో ఉత్తిపప్పు, కాస్త ఉప్పు వేసి మెత్తగా కలిపి, నెయ్యేసి పెడితే పిల్లలు ఆవురావురు మంటూ తినేవాళ్ళు.
సరిగా తినకపోతే చందమామను చూపిస్తూ గోరుముద్దలు తినిపించేది.
"చందమామ రావే జాబిల్లి రావే
కొండెక్కి రావే, గోగుపూలు తేవే
మా అబ్బాయి(అమ్మాయి) కియ్యవే" అంటూ పాడేది.
పిల్లలు తినగా చేతిలో మిగిలిన అన్నాన్ని దిష్టి తీసినట్టు బిడ్డ తలచుట్టూ తిప్పి కుక్కకో, పిల్లికో పెట్టేది.
పిల్లలకు అయిదారేళ్ళవయసొస్తే చందమామలో చూపించి ఒక కథ ఇలా చెప్పేది.

“చందమామలో ఒక పేదరాసి పెద్దమ్మ ఉండేది.
ఆ పేదరాసి పెద్దమ్మ ఒక సారి బావి పైన నులక మంచం వేసుకుని చీర కుట్టుకుంటోంది.
చేతిలో ఉన్న సూది కాస్తా జారి బావిలో పడిపోయింది.
సూది ఎట్లా వస్తుంది?” అని ప్రశ్న వేసేది.
'ఊహూ రాదు' అన్నారనుకోండి.
'ఊహూ రాదు' అంటే వస్తుందా? అని రెట్టించేది.
'అహా' అన్నారనుకోండి, 'అహా' అంటే వస్తుందా? అనడిగేది.
ఇలా పిల్లల్నిరెట్టిస్తూ ఆ సూది ఎలా వస్తుందో వాళ్ళను ఆలోచనలోకి పడేసేది.
కాసేపటికి అమ్మమ్మా మనవడు నవ్వేసే వాళ్ళు.
అదొక సరదా.

చిన్ని మనవడితో ఆలూరు విమాలాదేవి



"నేనీ ముగ్గురు పిల్లల్తోనే వేగలేక చస్తున్నా, ఇంతమందిని ఎట్లా పెంచారత్తయ్యగారు” అనేవాడు మా బావ.
ఎప్పుడెప్పుడు సెలవలు వస్తాయా అని మా అక్కపిల్లలు ఎదురు చూసేవాళ్ళు.
సెలవలొస్తే చాలు అమ్మమ్మ వాళ్ళింటికి వెళదామని ప్రాణంతీసే వాళ్ళు.
వాళ్ళపోరు పడలేక పిల్లల్ని తీసుకుని మా అక్కాబావ తిరుపతికి వచ్చేసే వాళ్ళు.
చిన్నప్పుడు మా తమ్ముడి పిల్లలు కూడా బామ్మదగ్గర చాలా చనువుగా ఉండే వాళ్ళు.
పిల్లలొచ్చారంటే ఇల్లంతా సందడిగా ఉండేది.
మా చెల్లెళ్ళపిల్లలంతా పూర్తిగా మా అమ్మ దగ్గర పెరిగిన వాళ్ళే.

వనపర్తిలో నేను ఒకటవ తరగతి చదువుతున్నాను.
ఒకసారి ఏమైందంటే..
పిల్లలందరూ బూర(బెలూన్) కొనుక్కుంటుంటే నాకూ కొనుక్కోవాలనిపించింది.
అప్పుడు నా వయసు అయిదేళ్ళు.
జీవితంలో బూర చూడడం అదే తొలి సారి.
ఇంట్లో ఉన్న అయిదు నయాపైసలు తీసుకెళ్ళి, సాయంత్రం స్కూలు నుంచి వస్తూవస్తూ పెద్ద బూర కొనుక్కున్నాను.
బూర ఎక్కడిదని మా అమ్మ అడిగింది.
అక్కడ ఉండే అయిదు పైసలు తీసుకెళ్ళి కొనుక్కున్నానని చెప్పాను.
మా నాన్న అడిగినా అదే చెప్పాను.
అంతే మా నాన్నకు కోపం వచ్చేసింది.
మర్నాడు పొద్దున్నే బరబరా నన్ను లాక్కెళ్ళి ఒక గదిలో వేసి తాళం వేసేశాడు.
ఆ గదికి చిన్న కిటికీ, చిన్న వెంటి లేటర్ మాత్రమే ఉన్నాయి.
ఏడుస్తున్నా వినిపించుకోలేదు.
మా అమ్మ ఎంత మొత్తుకుందో, మా నాన్న కాళ్ళ వేళ్ళాపడినా ఏ మాత్రం కనికరించలేదు.
తాళం చెవి చేబులో వేసుకుని కాలేజీకి వెళ్ళిపోయాడు.
మా బాబాయి, మావయ్య కళ్ళప్పగించి చూస్తున్నారేతప్ప, మా నాన్నను వారించే ధైర్యం చేయ లేదు.
గదిలో నేను, గది బయట మా అమ్మ ఏడుస్తూనే ఉన్నాం.
తాళం వేసిన గది ముందే కాలు కాలిన పిల్లిలా తిరుగుతోంది మా అమ్మ.
నన్ను సముదాయిస్తో నాకు ధైర్యం చెపుతోంది.
లోపల మంచి నీళ్ళుకూడా లేవు.
మధ్యాహ్నం మా నాన్న రాగానే, 'ముందు తాళం తీయండి. పిల్లాడేమైపోయాడో చూసుకోరా!?' అంటూ మా నాన్నను అరిచింది.
తాళం తీయగానే నాకు మంచి నీళ్ళు పట్టి, వెంటనే అన్నం పెట్టింది.
మా అమ్మ కళ్ళలో నీళ్ళు గిర్రున తిరుగుతున్నాయి.

నాకు పన్నెండేళ్ళుంటాయప్పుడు.
ఉగాది వచ్చింది.
ఆరోజు మా అమ్మ పుట్టినరోజు.
మా చెల్లెళ్ళకు కొత్త గౌన్లు, మా అమ్మకు కొత్త చీర కొన్నాడు మా నాన్న.
తాను కూడా కొత్త బట్టలు కుట్టించుకున్నాడు.
నా గురించి మరిచిపోయాడో ఏమో తెలియదు.
నాకెందుకు కొత్త బట్టలు కొనివ్వలేదని మారాం చేశాను.
అందరూ కొత్త బట్టలు కట్టుకున్నారు.
నేను ఏడుస్తున్నందుకు మా అమ్మ కొత్త చీర కట్టుకోలేదు.
కొత్త చీర ఎందుకు కట్టుకోలేదని గదమాయిండాడు మా నాన్న.
“వాడు కొత్త బట్టలు లేవని ఏడుస్తుంటే నేనెలా కొత్త చీర కట్టుకోనండి!?" అంది.
ఆ ఏడాది మా ఇంట్లో ఉగాది కళ తప్పింది.
మా నాన్నకు సెంటిమెంట్లు ఎక్కువ.
తాను బైటికి వెళుతున్నప్పుడు పిల్లి ఎదురుపడ కాకూడదు.
వితంతువు ఎదురు రాకూడదు.
తిట్టుకుంటూ ఇంట్లోకొచ్చి, కాళ్ళూ చేతులు కడుక్కుని, నీళ్ళతో నోరు పుక్కిళించి, దేవుడికి దణ్ణం పెట్టుకుని మళ్ళీ వెళ్ళే వాడు.
ఇలా ఎన్నిసార్లు ఎదురు పడితే అన్ని సార్లు వెనక్కి వచ్చేవాడు.
నా చిన్నతనం నుంచి గమనిస్తున్నాను.
తాను బైటికి వెళ్ళేటప్పుడు కానీ, నిద్ర లేచినప్పుడు కానీ నా ముఖం చూస్తే పనులు కావని ఒక అచంచల విశ్వాసం.
నష్ట జాతకుడినని నమ్మకం.
“మానాన్నంటే మాకు చాలా గౌరవం. మా నాన్నను చూస్తే మేం చాలా భయపడే వాళ్ళం. ఒక వైపు నుంచి వస్తుంటే మరొక వైపు నుంచి పరిపోయే వాళ్ళం" అన్నాడొకసారి మా నాన్న.
‘‘ఎందుకు పారిపోవాలి? తప్పు చేస్తే కదా’’ అనుకున్నా మనసులో.
నన్ను ఏమైనా అంటుంటే "కడుపున పుట్టిన బిడ్డలండీ. ఎదురు పడితే పనులు కాకపోవడం అంటూ ఉండవండి. తప్పండి" అని మందలించినట్టు నచ్చచెప్పడానికి ప్రయత్నించేది మా అమ్మ.
ఇలాంటి సంఘటనలు గుర్తుకొచ్చినప్పుడల్లా కరుణశ్రీ పద్యపాదం గుర్తుకొస్తుంది.
"కన్న కడుపన్న కాంతల కెంత తీపి!"
(ఇంకా ఉంది)

(ఆలూరు రాఘవ శర్మ, జర్నలిస్టు, రచయిత, సాహితీ సౌగంధం ( ఉమ్మడి చిత్తూరు జిల్లా సాహితీ వేత్తల గురించి)కొత్త బంగారు లోకం ( చైనా పర్యటన అనుభవాలు) తిరుమల దృశ్య కావ్యం ( శేషాచలం కొండల లో ట్రెక్ అనుభవాలు) పుస్తకాలు అచ్చయ్యాయి. త్వరలో ‘వనపర్తి ఒడి లో’ విడుదల కానుంది.)


Read More
Next Story