నోరు పెట్టుకోకపోతే అసలు బతకనివ్వరు కదా!?
x

నోరు పెట్టుకోకపోతే అసలు బతకనివ్వరు కదా!?

"ఎప్పుడూ కలిసి జీవించకపోయినా, విడాకులు తీసుకున్నా, చెప్పు తడిపి మరీ కొట్టినా, రామ శేషమ్మ మాత్రం నరసింహారావునే భర్తగా భావించేది. అమ్మచెప్పిన ముచ్చట్లు -10



అమ్మ చెప్పిన ముచ్చట్లు -10


-రాఘవ శర్మ

ఇది వందేళ్ళ నాటి మాట.

"ఈ గయ్యాళి పీనుగ నా కొద్దు" అన్నాడు నరసింహారావు.

అప్పుడాయన వయసు పజ్జెనిమిదేళ్ళు.

మా శేషమ్మత్తయ్య వయసు పదకొండేళ్ళు.

అప్పటికే వాళ్ళకు పెళ్ళై ఆరేళ్ళవుతోంది.

ఇంతకూ ఈ తప్పెవరిది?

వీళ్ళ కీ బొమ్మల పెళ్ళిచేసిన పెద్దవాళ్ళదా?

బాల్య వివాహాలు జరిగే ఆనాటి వ్యవస్థదా?

ఇది నా సందేహం.

మా శేషమ్మత్తయ్యను నేను బాగా ఎరుగుదును.

అయినా ఆమె గురించి మా అమ్మను అడిగాను.

ఇలా చెప్పడం మొదలు పెట్టింది.

“మా ఆడపడుచు బాపట్ల రామశేషమ్మ గయ్యాళి గంప.

అటు కొన్ని తరాలు, ఇటు కొన్ని తరాలు గుర్తు పెట్టుకునేంత పేరు సంపాదించుకుంది.

మొహం ఎప్పుడూ ధుమధుమలాడుతుండేది.

అక్షరం ముక్క రాదు.

మా అమ్మ కున్నంత తెలివితేటలు కూడా లేవు.

అందరినీ అదిలిస్తూ, బెదిరిస్తూ, ఇంట్లో అందర్నీ తన గుప్పెట్లో ఉంచుకోవాలని చూసేది.

ఎవరికీ భయపడని మా ఆయనకు అక్కంటే చచ్చేభయం.

ఆమెనోటికి భయపడి ఎవరూ నోరెత్తే వారు కాదు.

బాపట్ల రామ శేషమ్మ అంటే 'అమ్మో.. అమా!' అనే వాళ్ళు." అని చెప్పింది.

మా శేషమ్మత్తయ్య ఎందుకిలా వ్యవహరిస్తుంది!?

మా అమ్మలాగా ఎందుకుండ కూడదు?

ఎవరైనా సరే పుట్టుకతోనే మంచి వాళ్ళగానో, చెడ్డ వాళ్ళగానో ఉండరు కదా!

ఆమె ఇంటి పరిసరాలేమిటి?

సమాజ వాతావరణమేమిటి?

నన్ను కాస్త ఆలోచింప చేసి, గతంలోకి చూసేలా చేశాయి.

ఆమె పెరిగిన ఇంటి వాతావరణం, సమాజ పద్ధతులు ఆమె ప్రవర్తనకు ఒక రూపునిచ్చాయనుకుంటా.

ఇద్దరు మగపిల్లల మధ్య ఆమె ఒకే ఒక్క ఆడబిడ్డ.

"శేషమ్మత్తయ్య గురించి చెప్పమ్మా" అన్నాను.

మళ్ళీ ఇలా చెప్పడం మొదలు పెట్టింది.

"మా ఆడపడుచు రామశేషమ్మగారికి పెళ్ళి నిశ్చయమైంది.

పెళ్ళికొడుకు ఎవరో కాదు మేనమామ నరసింహారావే.

వాళ్ళ ఇష్టాయిష్టాలతో సంబంధమే లేదు.

ఇక పెళ్ళి చూపులేమున్నాయి!

చిన్నప్పటి నుంచి ఒకరి నొకరు చూసుకుంటున్న ముఖాలేగా!

మా ఆడపడుచు వయసు అయిదేళ్ళు.

ఆమె మేనమామ నరసింహారావు వయసు పన్నెండేళ్ళు.

వీళ్ళిద్దరికీ పెళ్ళి చేసేయాలని పెద్ద వాళ్ళనుకున్నారు.

పెళ్ళంటే పాపం వాళ్ళిద్దరికీ ఏం తెలుసు కనుక!

వాళ్ళకు తెలిసిందల్లా పెళ్ళంటే ఇంటి ముందర పెద్ద పందిరి, చుట్టాల రాక, సన్నాయి మేళం, కొత్త బట్టలు, పిండి వంటలు, వేద మంత్రాలు, చదివింపులు, భోజనాలు ; ఇంతే!

ఆ పిల్లలకు ఎంత సరదా!

అదో బొమ్మల పెళ్ళిలా జరిగిపోయింది.

పెళ్ళి కొడుకు వాళ్ళు బాపట్ల వారు.

పెళ్ళి కూతురి ఇంటి పేరు అలూరైనా, పెళ్ళై పోయాక ఆమె పేరు బాపట్ల రామ శేషమ్మగా మారిపోయింది.

రెండు కుటుంబాలుంటున్నదీ బాపట్లలోనే.

సంవత్సరాలు దొర్లిపోతున్నాయి.

తరుచూ వారి మధ్య రాకపోకలు సాగుతున్నాయి.

ఇద్దరు అన్నదమ్ముల మధ్య రామశేషమ్మ ఒక్కతే కూతురు.

తండ్రికి భయపడి ఇద్దరు కొడుకులు దూరదూరంగా తిరుగుతున్నా, కూతురు మాత్రం తండ్రికి దగ్గరైంది.

ఆయనకు చేదోడు వాదోడుగా ఉంటోంది.

తండ్రి పూజ చేసుకుంటుంటే అన్నీ అందిచ్చేది.

తండ్రి వ్యవహారాలన్నీ చూసేది.

చదువులేదు.

తండ్రిలా నోరు పెట్టుకుని నెట్టుకు రావడం కూడా అలవాటైపోయింది.

మా ఆడపడుచుకు చిన్నప్పటి నుంచి ఇల్లే లోకం, కడుపే కైలాసం.

“వీడు నీ మొగుడే” అన్నారంతా.

“అహా నా మొగుడా” అనుకుంది రామశేషమ్మ.

“ఇది నీ పెళ్ళాంరా” అన్నారంతా. “అహా నా పెళ్ళామా!” అనుకున్నాడు నరసింహారావు.

సంవత్సరాలు దొర్లిపోతున్నాయి.

ఇప్పుడతని వయసు పజ్జెనిమిదేళ్ళు.

శేషమ్మ వయసు పన్నెండేళ్ళు.

నూనూగు మీసాల యవ్వనంలో "నేనేమిటి! నా ఒడ్డూపొడుగూ ఏమిటి! ఈ గయ్యాళిది నాకు పెళ్ళామేమిటి!” అనుకున్నాడు నరసింహారావు.

ఓ రోజు అందరి ముందర ధైర్యం చేసి "ఈ గయ్యాళి పీనుగ నాకొద్దు" అనేశాడు.

వీర రాఘవరావుకు కోపమొచ్చేసి అల్లుడిపై వీరంగమేశాడు.

నరసింహారావు మాత్రం తక్కువతిన్నాడా! అతనికీ కోపమొచ్చేసింది.

మావగారిపైన శివతాండవమాడాడు.

రెండు కుంటుంబాలూ ఎడమొహం పెడమొహం.

మా మావగారు, అంటే ఆయనే వీర రాఘవ రావుగారు, చాలా పట్టుదల మనిషి.

అల్లుడిపైన కోర్టులో కేసు వేశాడు.

ఇరువురూ చెరొక పెద్ద పెద్ద లాయర్లను పెట్టుకున్నారు.

నాకు తెలిసి మా మావగారు కాళిదాసు అనే లాయరు ద్వారా కేసు నడిపించాడు.

నరసింహారావు మరొక మంచి లాయరును పెట్టుకున్నాడు.

ఇరువురి మధ్య కోర్టులో కేసు చాలా ఏళ్ళు హెూరా హెూరీగా నడిచింది.

ఏళ్ళు గడిచిపోతున్నాయి.

శేషమ్మకు అర్థమైపోయింది.

ఇహ తన జీవితం పుట్టింట్లోనేనని.

తండ్రి చెప్పుచేతల్లో పెరిగిన శేషమ్మ ఆయన అడుగు జాడల్లోనే నడుచుకుంటోంది.

కూతురి జీవితం ఇలా అయినందుకు మా అత్తగారికి దిగులు పట్టుకుంది.

ఇవ్వేమీ పట్టని వీరరాఘవ రావు అల్లుడిపై కేసు గెలిచి గుణపాఠం చెప్పాలనుకున్నాడు.

వీర రాఘవరావు తన పొలంలో కొంత అమ్మేసి లాయరుకు పెట్టాడు.

నరసింహారావు కూడా కొంత పొలం అమ్మి తమ లాయరుకు పెట్టాడు.

అల్లుడిపై మా మావగారు కేసు గెలిచారు.

కానీ ఒక విచిత్రమైన తీర్పు వచ్చింది.

నరసింహారావు పేర ఉన్న పొలమంతా భార్య శేషమ్మ పేరునే పెట్టి, ఆ పంట పైన వచ్చిన ఆదాయంలో భార్యే భర్తకు భరణం ఇచ్చేలా తీర్పు ఇచ్చారు జడ్జి గారు.

కేసు గెలిచినందుకు మా మావ గారు సంతోషపడిపోయారు.

మా అత్తగారికి మాత్రం దిగులు పట్టుకుంది.

అల్లుడైన తమ్ముడు కోర్టులో కేసు ఓడిపోయినందుకు కాదు, కూతురు జీవితం ఇలా అయిపోయిందని.

నరసింహారావు మళ్ళీ పెళ్ళి చేసుకోలేదు.

కానీ ఒక విధవరాలితో జీవితాన్ని పంచుకున్నాడు.

అయినా, "మా ఆయన కులానికొక కొంప పెట్టాడు" అనేది మా అడపుడుచు.

విడాకులు తీసుకున్నా, అప్పుడప్పుడూ భార్య దగ్గరకు వెళ్ళొచ్చే వాడు.

ఎందుకంటే భార్యను కొట్టడానికి.

చెప్పు తడిపి మరీ కొట్టొచ్చే వాడు.

చెప్పు తడపడం ఎందుకంటే దెబ్బ బాగా తగులుతుందని.

ఆమె వల్లే ఆస్తి కాస్తా పోయింది.

ఒక సీనియర్ లాయర్ దగ్గర గుమాస్తాగా చేరాడు.

నరసింహారావు కూడా మావకు తగ్గ అల్లుడే.

భార్య చనిపోతే ఆస్తి తనకొస్తుందనుకున్నాడు.

ఆమెచావుకు ప్రయత్నించాడు.

రాఘవరావు మరింత గట్టి పిండం.

తాను బతికినంత కాలం కూతురికి రక్షణ కవచంగా ఉన్నాడు.

వీర రాఘవ రావు బతికున్నంత కాలం నరసింహారావు తన భార్యను ఏమీ చేయలేకపోయాడు.

వయసు పెరుగుతున్నా తండ్రి సంరక్షణలోనే శేషమ్మ జీవితం గడిచిపోతోంది.

మాకు పెళ్ళి అయిన కొన్నాళ్లకు మా మావ గారు, అత్త గారు పోయారు.

అన్న, తమ్ముడు వేరే వేరే ఊర్లలో కాపురాలు పెట్టారు.

శేషమ్మ ఒంటరిదై పోయింది.

మడికట్టుకుని వంట చేసుకోవడం, పూజలు చేసుకోవడం, పత్తితో దీపపు ఒత్తులు చేసుకోవడం, భావన్నారాయణ స్వామి గుళ్ళో పురాణ కాలక్షేపం చేయడం ; ఇదీ ఆమె దిన చర్య.

దగ్గర ఊర్లోనే స్కూలు టీచరుగా పనిచేస్తున్న అన్నదగ్గరకు పెద్దగా వెళ్ళేది కాదు.

ఎక్కడో దూరంగా వనపర్తిలో ఉంటున్న మా ఇంటికి అప్పుడప్పుడూ వచ్చి కొంత కాలం ఉండి వెళ్లేది.

బాపట్లలో కొంత కాలం, వనపర్తిలో కొంత కాలం ఆమె జీవితం అలా గడిచిపో తోంది.

అంతదూరం జటాయువులా ఒక్కతే ప్రయాణం చేసి వచ్చేది.

ఎప్పుడూ కలిసి జీవించకపోయినా, విడాకులు తీసుకుని తనను వదిలేసినా, చెప్పు తడిపి మరీ కొట్టినా, రామ శేషమ్మ మాత్రం నరసింహారావునే తన భర్తగా భావించేది.

నరసింహారావుకు పెద్ద వయసు వచ్చేస్తోంది.

ఆయనతో కలిసి జీవిస్తున్న ఆమె కాస్తా కాలం చేసింది.

నరసింహారావు ఒంటరైపోయాడు.

"శేషాం.. తిండికి కష్టంగా ఉందే. మా ఇంటికి వచ్చేసేయ్” అన్నాడు.

ఆ మాట కోసమే ఏళ్ళ తరబడి ఎదురుచూస్తున్నట్టుంది.

"ఏమయ్యా.. నువ్వే నా ఇంటికి వచ్చేసెయ్ అంది."

నరసింహారావే మూటాముల్లె సర్దుకుని భార్య ఇంటికి వచ్చేశాడు.

ఈ వయసులో భర్త ఇంటికి వచ్చాడని అన్ని సపర్యలూ చేసేది.

ఒక సారి భార్యాభర్తలిద్దరూ కలిసి వనపర్తికి వచ్చారు.

నాలుగు రోజులు ఇంట్లోనే ఉంచుకుని బట్టలు పెట్టి పంపించాం.

నేను నరసింహారావు గారిని చూడడం అదే మొదటి సారి.

వారిద్దరినీ భార్యా భర్తలుగా చూడడం కూడా అదే మొదటిసారి.

నరసింహారావు అజానుబాహుడు.

నోట్లో ఎప్పుడూ పొగాకు చుట్ట ఉండేది.

పాపం ఇద్దరూ తిరిగి బాపట్ల వెళ్ళిపోయారు.

వెళ్ళిన పది రోజులకే మా ఆడపడుచు రామశేషమ్మ తిరిగి వనపర్తికి వచ్చేసింది.

“అప్పుడే ఆయన్ని ఒదిలేసి ఎందుకొచ్చేశావు అక్కయ్యా" అన్నారు మీ నాన్న.

మా ఆడపడుచు ఇలా చెప్పింది.

“మా ఆయనకు కుక్కలంటే ప్రాణం.

అవంటే నాకు మహా అసహ్యం.

ఒక కుక్కను పెంచుకున్నాడు.

దాన్నెప్పుడూ తన పక్కలోనే పడుకోబెట్టుకునే వాడు.

తెల్లారి లేచి చూసే సరికి ఆ కుక్కముండ కాస్తా ఆయన పక్కలోనే ఈని చచ్చింది.

నాకు అసహ్యమేసి, అయన మంచం, పక్క గుడ్డలు బైటపడేసి, ఆయన్నికూడా బైటికి పంపించేసి, ఇంటికి తాళం వేసుకుని వచ్చేశా" అంది ఏదో ఘనకార్యం చేసినట్టు.

అలా మా ఇంటికి వచ్చిందో లేదో, రెండో రోజే టెలిగ్రాం వచ్చింది, నరసింహారావు పోయాడని.

అంతే 'పోతూ పోతూ నా నుదుట బొట్టు కాస్తా తీసుకుపోయాడమ్మా' అని మా ఆడపడుచు ఏడుపులూ సోకన్నాలు.

అలా ఏ డుస్తోనే వెంటనే బాపట్ల వెళ్ళిపోయింది.

ప్రయాణం చేసినంత కాలం నిలుచునే ప్రయాణం చేసింది.

దిగబోయే ముందు సీటు దొరికినట్టు, ప్రాణం పోయే ముందు కోమాలోంచి తెలివి వచ్చినట్టు, ఆయన పోయే ముందు ఆమె ఇంటికి వచ్చాడు.

కార్యక్రమాలన్నీ అయిపోయాక మా ఆడపడుచు బొట్టు గాజులు లేకుండా, తెల్లచీర కట్టుకుని విధవ రాలిగా మా ఇంటికి తిరిగొచ్చింది.

బాపట్ల రామ శేషమ్మకు భర్త మిగలకపోయినా, కాస్త అస్తితో పాటు బతకడానికి చిన్నప్పటి నుంచి ఉన్న నోరు మాత్రం మిగిలింది.” అని ముగించింది మా అమ్మ.

నిజమే నోరు పెట్టుకుబతక్కపోతే అసలు బతకనివ్వరు కదా!

(ఇంకా ఉంది)



ఇలాంటి ఫీచర్ అర్టికిల్స్ మరిన్ని చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

Read More
Next Story