ఆ రోజుల్లో నిడదవోలు రాదారి పడవ ప్రయాణం గొప్పగా ఉండేది...
x
ప్రతీక చిత్రం

ఆ రోజుల్లో నిడదవోలు రాదారి పడవ ప్రయాణం గొప్పగా ఉండేది...

ఆ రోజుల్లో ఆ నిడదవోలు కాలువ రవాణా మార్గం. పడవల్ని రహదారి (రాదారి) పడవలు అనేవాళ్ళు. వాటిల్లో మనుషులు ప్రయాణం అదొక అందమయిన అనుభవం. కవిటం కబుర్లు - 6


కవిటం కబుర్లు - 6


మాది ఉమ్మడి కుటుంబం. మా నాన్నగారి కి ఇద్దరు తమ్ముళ్ళు. మా నాన్నగారి ఉద్యోగ రీత్యా మేము విజయవాడలో కాపురం వుండేవాళ్ళం. మా చదువులు కూడా విజయవాడలోనే సాగేవి. కానీ వేసవి సెలవలు వచ్చినా, పండుగ సెలవులు వచ్చినా మేము రెక్కలు కట్టుకుని కవిటంలో వాలేవాళ్ళం. కవిటంలో మాది 12 గదుల మేడ. కాలువ ఒడ్డున ఎంతో ఠీవీగా రాజసం వుట్టిపడుతూ వుండేది. మా ఇంటికి ఎదురుగా నిడదవోలు కాలువ.

మా చిన్నతనాల్లో పొద్దున్న పూట ఆ కాలువ గట్టుదగ్గరే పడివుండేవాళ్ళం.ఈ గట్టునుంచి అవతలి గట్టుకి ఈదుకుంటూ వెళ్ళి మళ్ళీ వెనక్కి రావడం మా రోజూవారి పందెం.అప్పట్లో ఆ మాకో పెద్దగ్యాంగ్ వుండేది." వురేయ్, వెధవల్లారా ఇంక చాలు ఇంట్లోకి తగలడండి , రొంపలు, జబ్బులు పట్టుకుంటాయి" అని మా పెద్దవాళ్ళు అరిచాకాగానీ ఇంటికి చేరుకునే వాళ్ళం కాదు. కాలువ గట్టు పక్కనే పెద్ద రావి చెట్టువుండేది, ఇప్పటికీ వుంది. దాని ఒక కొమ్మ కాలువ మీదకు వుండేది, దాని మీదకు ఎక్కి నీళ్ళలోకి దూకడం అప్పట్లో మాకో పెద్ద ఆట అది.

ఆ రోజుల్లో ఆ నిడదవోలు కాలువ రవాణా మార్గం.పడవులు వెడుతూ వుండేవి. వాటిని రహదారి పడవలు అనేవాళ్ళు. వాడుకలో " రాదారి పడవలు" అని పిలిచేవాళ్ళు.వాటిల్లో మనుషులు ప్రయాణం చేసేవాళ్ళు. సరుకుల్ని రవాణా చేసే పడవలు కూడా తిరుగుతూ వుండేవి.

ఆ రోజుల్లో ఆ నిడదవోలు కాలువ రవాణా మార్గం.పడవులు వెడుతూ వుండేవి. వాటిని రహదారి పడవలు అనేవాళ్ళు. వాడుకలో " రాదారి పడవలు" అని పిలిచేవాళ్ళు.వాటిల్లో మనుషులు ప్రయాణం చేసేవాళ్ళు. సరుకుల్ని రవాణా చేసే పడవలు కూడా తిరుగుతూ వుండేవి.

ముఖ్యంగా వుప్పు బస్తాలు, గుల్లసున్నం బస్తాలు,కొబ్బరి కాయలు రవాణా చేసే వాళ్ళు. ఉప్పు పడవ గ్రామానికి చేరుకోగానే పడవలో వాళ్ళు "ఉప్పు పడవవచ్చిందని వూళ్ళో డప్పు వేసేవాళ్ళు. కావిళ్ళతో ఉప్పు మోసుకుని అమ్మే వాళ్ళు కూడా. ఒకసారి మా నాన్న మమ్మల్ని నిడదవోలు నుంచి ఆ రహదారి పడవలో కవిటం తీసుకువచ్చారు. అలాగే ఒకసారి మా బుల్లిఅబ్బాయి బాబయ్య పిల్లలు కవిటం నుంచి రాదారి పడవలో నిడదవోలు పెళ్ళికి వెళ్ళినట్టు సోదరుడు పాణి జ్ఞాపకం చేసుకున్నాడు .


అటువంటి ప్రయాణాలు తలుచుకుంటే ఇప్పటికీ ఎంతో త్రిల్లింగ్ గా అనిపిస్తుంది. మేము రాత్రి అంతా పడవలోనే ప్రయాణం చేసాం. లోపల గదుల్లా వుండేవి వాటిల్లో పొడవాటి బల్లలు వుండేవి. తెలతెలవారుతూండగా పడవ కవిటం చేరుకుంది. మరి పడవ లోంచి దిగి గట్టు మీదకు రావాలి కదా. పడవ మీదనుంచి గట్టు మీద వరకూ పెద్ద గట్టి చెక్క బల్ల లాంటిది పరిచేవాళ్ళు. దాని మీద బ్యాలెన్స్ చేసుకుంటూ నడిచి గట్టుకు చేరుకునే వాళ్ళం.

పడవకు బాగా పేనిన పెద్ద లావుపాటి తాడు కట్టి నలుగురైదుగురు పడవ వాళ్ళు లాగుతూ వెళ్ళేవాళ్ళు. కాలువ గట్టు దారి నడవడానికి వీలుగా వున్నంత వరకూ అలా లాగుతూ వెళ్ళేవాళ్ళు. వాళ్ళ భుజాల మీదుగా రెండు చేతులతో ఆ మోకును లాగుతూ వూపు కోసం హైలెస్సా లాంటిదేదో అరుస్తూ వెళ్ళేవాళ్ళు. అది వాళ్ళ వృత్తి. వాళ్ళ జీవనాధారం. గట్టుదారి సరిగ్గా లేని చోట పడవ మీద నిలబడి పెద్దపెద్ద గడకర్రల్ని నీటిలో కిందకంటా దింపి బలంగా నొక్కి పడవని తెడ్లు వేస్తున్నట్టుగా ముందుకు నడిపేవాళ్ళు.అదంతా మాకుఎంతో వింతగా అనిపించేది.

మా కాలువలో బల్లకట్టు కూడా వుండేది.అది ప్రవాహానికి కొట్టుకు పోకుండా దానికి ఒక ఇనప తీగ బిగించి దానిని కాలువలో అడుగున పాతేవాళ్ళు. బల్లకట్టు మీద పడవవాడు వెదురు కర్ర సాయంతో ఈ ఒడ్డునుంచి అవతలి ఒడ్డుకు మళ్ళీ వెనక్కి వచ్చేవాడు. బడిపిల్లలు ,అర్జెంటుగా వెళ్ళవలసిన వాళ్ళు బల్లకట్టు మీదవెళ్ళేవాళ్ళు . దాన్ని నడిపే వాడికి డబ్బు ఇచ్చేవాళ్ళు.మా మేడ కట్టిన కొత్తల్లో అంతా దాని కేసి ఎంతో అబ్బురంగా చూసేవాళ్ళట. అప్పట్లో అంత పెద్ద మేడ మాదేట.


పరకాల వారి భవంతి


మా ఇంట్లో మా చిన్న తాతయ్య పరకాల అప్పారావు(ఆయన పెళ్ళి చేసుకోలేదు)మా పెద్ద బాబయ్య పరకాల రమణరావు, ఆయన సతీమణి పిన్ని సుశీలపిన్నీ, వాళ్ళ పిల్లలు, మా ఆఖరి బాబయ్య పరకాల రామచంద్రమూర్తి, ఆయన భార్య బులిచిన్న పిన్ని, వాళ్ళ పిల్లలు , మా పెద్దత్తయ్య గోపరాజు సీతా దేవి వుండేవాళ్ళు.

మా రమణయ్య బాబయ్యకు రెండు కిలోమీటర్ల దూరంలో వున్న మార్టేరు లో రేడియో షాపు వుండేది.రేడియోలు రిపేరు చేయడంలో మా బాబయ్య దిట్ట. చాలామంది పొరుగూళ్ళ నుంచి వచ్చి రేడియోలు రిపేరు చేయించు కునేవాళ్ళు. సాయంత్రం పూట సరదాగా ఆయన షాపుకి వెడితే షాపు నిండా రేడియోలు కనిపించేవి.ఒకసారి మా బాబయ్య నాకు సింగిల్ బ్యాండ్ పాకెట్ ట్రాన్సిస్టర్ రేడియో తయారు చేసి ఇచ్చాడు.దాన్ని చూసి ఎంత సంబరపడిపోయానో చెప్పలేను. చాలా రోజులు జేబులో పెట్టుకుని తిరుగుతూ వుండేవాణ్ణి. మా సశీల పిన్ని టీచరు. కాలువ అవతల బడిలో పనిచేసేది. ఆ తరువాత కొన్నేళ్ళకి అ స్కూల్ కి హెడ్ మాస్టార్ గా పదోన్నతి పొందారు.మా అందరికీ చదువుల్లో పునాది పడింది ఆ స్కూల్లోనే. కవిటంలో ఈనాడు మా తరం వాళ్ళంతా ఒకప్పుడు మా పిన్నిదగ్గర చదువుకున్న వాళ్ళే.ఈనాటికీ ఎంతో మంది మా పిన్నిని జ్ఞాపకం చేసుకుంటూ వుంటారు.

పెద్దత్తయ్య మా నాన్నగారి కి ఆక్కగారు. చాలా చిన్నతనంలోనే భర్తను కోల్పోయి ఇద్దరు కూతుళ్ళతో పుట్టింటికి చేరుకుంది. మా నాన్నగారి సూచనతో కవిటం గ్రామంలో మహిళా సంఘాన్ని నెలకొల్పి వారు ఆర్థికంగా నిలదొక్కుకోవడం కోసం టైలరింగ్, ప్రింటింగ్ ప్రెస్ వగైరా ఎన్నో కార్యక్రమాలను, ఇంటిలో కుటుంబ బాధ్యతల్నీ నిర్వహిస్తూ ఎంతో బిజీగా వుండేది.
మా చిన తాతయ్యా, మా బుల్లిఅబ్బాయి బాబయ్యా పొలం పనులు చూసేవాళ్ళు. మా బాబయ్య ఎంతో హస్త వాసి వున్న పశువుల డాక్టరు కూడా. పొరుగూళ్ళ నుంచి మనుషులు వచ్చి మా బాబయ్యని పిలుచుకు వెడుతూ వుండేవాళ్ళు. మా బులిచిన్నపిన్ని గృహిణి గా మాత్తమేకాక, తల్లి గోపరాజు సీతాదేవికి మహిళా సంఘం పనుల్లో ఎంతో చేదోడువాదోడుగా వుండేది.

తన పెద్ద కూతుర్ని తన తమ్ముడికే అంటే మా బుల్లిఅబ్బాయి బాబయ్యకి మేనరికం ఇచ్చారు.అంటే మా బులిచిన్నపిన్ని కి సొంత మామయ్యే మొగుడు అన్నమాట.
ఆ కాలంలో మేనరికాలు విరివిరిగా జరుగుతూండేవి. ఆ తర్వాత తర్వాత సొంత రక్త సంబంధకుల్ని చేసుకోకూడదని అలా చేసుకుంటే పుట్టబోయే సంతానంలో లోపాలు వుండొచ్చు అన్న అవగాహన ఏర్పడింది . కొన్ని ప్రత్యక్ష అనుభవాలు ఇది నిజమేనని రుజువు చేసాయి.


కవిటం వూళ్ళో కనువిందు చేసే మరో దృశ్యం. రోడ్డు వారగా లేత మొక్కజొన్న కండెల్ని నిప్పుల మీద కాల్చి అమ్ముతున్న వ్యాపారి.


ఇప్పుడు మేనరికాలు చాలా అరుదు . దాదాపుగా లేనట్టే. బావా మరదల మధ్య మరీ ఘాటు ప్రేమ వుంటే తప్పించి ఇప్పుడు ఎవరూ మేనరికపు పెళ్ళిళ్ళకు ఇష్టపడటంలేదు.

కానీ ఆ కాలంలో పిల్లకి గానీ పిల్లాడికి గానీ బైట వూరి సంబంధాలు చూసేవాళ్ళుకాదు.వేరే వూరి సంబంధం చేస్తే పిల్లని అత్తగారు రాచి రంపాన పెట్టొచ్చు, బంధవుల్లోనే ఇచ్చి చేస్తే పిల్లా పిల్లాడు మన కళ్ళముందే పడివుంటారు, అత్తమామల , ఆడపడుచుల పోరు వుండదనీ అనుకునేవాళ్ళు. అంతేకాదు, ఆస్తులు కూడా ఎక్కడికి పోవు అన్న అభిప్రాయం కూడా వుండేదేమో కూడా.

Photo ఇది మా ఇంటికి దగ్గర కాలువ గట్టు పాములపుట్ట గుడి. నాగుల చవితి, సుబ్రహ్మణ్య షష్టి నాడు భక్తులు ఇక్కడ పూజలు చేయడం ఒక ఆనవాయితి.

సరే ఇంతకీ చెప్పొచ్చేదేమంటే , ఆ రోజుల్లో మా కవిటం ఇంట్లో కనీసం పెద్దా చిన్నా , చిన్నా చితకా అంతా కలిపి ఓ పాతిక మంది వుండేవాళ్ళు.ఇంటి వెనుక గాదె ఉండేది నాలుగు భాగాలుగా విభజించారు దాన్ని.

ఒకొక్క భాగంలో 100 బస్తాల ధాన్యం పట్టేది, సంవత్సరం పొడవునా అదే ఆ ఇంటికి బ్యాంకు. ఏడాది పొడవునా తిండికి గింజలు వుంచుకుని దేనికైనా డబ్బు అవసరమైనప్పుడు అదనంగా వున్న ధాన్యం అమ్మేవారు. ఆ గాదె వెనుక సపోటా, మామిడి, కొబ్బరి చెట్లు ఉండేవి.


ఆ గాదె దగ్గరకు పశువుల దాణా కోసం మట్టె కుండలో వులవల వుడకపెట్టేవాళ్ళు. అప్పుడప్పుడు మేము ఆ వులవల్ని తింటూ వుండేవాళ్ళం.ఎంతో కమ్మగా వుండేవి. కట్టెల పొయ్యి మీద కుండలో వులవలు వుడుకుతోంటే మేము గుమ్మిడి గింజలు తొక్క ఒలిచి వాటిని చీపురు పుల్లకి గుచ్చి కాల్చుకుతినేవాళ్ళం. అప్పట్లో మాకు బాగా తిండి రంధి వుండేది. ఒక్క గుమ్మిడి గింజలేకాదు సుమండీ చిలకడ దుంపలు, తేగలు, కర్ర పెండలం ఏది కనిపిస్తే అది కాల్చుకుని తినేసేవాళ్ళం.
దొడ్లో ఎదురుగా ఆ మూల పెద్ద నుయ్యి వుండేది..వేసవికాలంలో కొబ్బరి బొండాల గెలలు దింపి ఆ నూతిలో పడేసేవాళ్ళు. కాస్త చల్లబడగానే పాలేళ్ళు ఆ బొండాలు కత్తితో చెరిగి ఇచ్చేవాళ్ళు. తాగుతూంటే కొబ్బరి నీళ్ళు తియ్యగానేకాదు ఎంతో చల్లగా ప్రాణం లేచి వచ్చేది. గంగా బొండాలైతే ఎంత మధురంగా వుండేవో!.


అరటి పళ్ళ గెలలు కోసి సైకిల్ కి తగిలించుకుని సంతకు బయలు దేరిన రైతు. ఇలాంటి దృశ్యాలు మా కవిటంలో రోజూ కనిపిస్తాయి.


ఆ కాలంలో మా ఇంటికి ఇంకా కరెంటు రాలేదు. కిరోసిన్ దీపాలే ఆధారం.మా ఇంట్లో కిరోసిన్ బుడ్డి దీపాలు, హరికేన్ లాంతర్లు వుండేవి. అప్పట్లో దాదాపుగా అందరి ఇళ్ళలోనూ ఇంతే. చీకటి పడకుండా , ఇంకా వెలుతురు వుండగానే మా పెద్దత్తయ్య, మా అమ్మా , మా పిన్నిలు లేదా ఎవరో ఇద్దరు మసక బారిన గాజు దీపాల్ని నెమ్మదిగా విడదీసి వాటిల్లో ముగ్గు పోసి వేళ్ళతో శుభ్రం చేసి ఒకసారి నీళ్ళలో కడిగి ఆరబెట్టే వాళ్ళు. ఆరిపోయాకా వాటిని బిగించి , దీపాల్లో కిర్సనాయిల్ పోసి వెలిగించే వాళ్ళు.

అవి రాత్రి పూట ఎంతో వెలుతురు ఇచ్చేవి. ఆ లైట్ల లోనే చదువుకునే వాళ్ళం. రాత్రి వంటలు కూడా ఆ దీపాల వెలుతురు లోనే. మా ఇంటి సావిడి లో దూలానికి పొడవాటి కొక్కెం వుండేది.



మా కవిటంలో దూరపు బంధువులు తమ ఇంట్లో వెతికి బైటికి తీసిన కిరోసిన్ దీపాలు.ఈ వ్యాసం కోసం వాటిని యధాతధంగా ఫొటో తీసి పంపారు-


రాత్రిళ్ళు హరికేన్ లాంతరు దానికి తగిలించేవాళ్ళు. మిగతా గదుల్లో గోడలకి వున్న మేకులకి బుడ్డి దీపాలు తగిలించే వాళ్ళు. ఆరోజుల్లో కిరోసిన్ దీపాలే వీధి దీపాలు కూడా. ప్రతి వీధి మొగలో సిమెంటు స్తంభాలు వుండేవి. వాటి పైన అద్దాల బాక్స్ వుండేది.నాలుగు వైపులా అద్దాలు వుండేవి. ఒక దానికి మాత్రంకొక్కెం వున్న తలుపు వుండేది. లోపల కిరోసిన్ దీపం వుంచే వాళ్ళు. ప్రతిరోజు చీకటి పడుతూండగా పంచాయితి వర్కర్ నిచ్చెనతో వచ్చి ఆ అద్దాల బాక్స్ లో వున్న దీపం బుడ్డి నిండా కిరోసిన్ పోసి, దీపం వెలిగించి, గాజు తలుపుకి వున్న కొక్కెం బిగించి వెళ్ళేవాడు. అవే అప్పట్లో మాకు వీది దీపాలు. ఆ తరువాత వూరికి కరెంట్ వచ్చింది. మా ఇంటికీ కరెంటు వచ్చింది. అన్ని గదుల్లోనూ బల్బులు పెట్టించారు. మా సావిడి లో మాత్రం ట్యూబ్ లైట్ వుండేది. ఒక నైట్ లైట్ కూడా వుండేది. ఒక చిన్న గోళీ కాయంత బల్బు ఒక అగ్గిపెట్టెంత బాక్స్ కి బిగించి వుండేది.అందులోంచి గీయ్ మని ఒకరకమైన సౌండ్ వచ్చేది. ఆందులో చిన్న ట్రాన్స్ ఫార్మర్ వుండేదేమో మరి.


Read More
Next Story