ఫంగస్‌ను ప్రాణాంతకంగా మార్చేది ఇదే !
x

ఫంగస్‌ను ప్రాణాంతకంగా మార్చేది ఇదే !

ఫంగస్ ఆకార మార్పుకు కారణమైన మెటబాలిజం రహస్యాన్ని హైదరాబాద్ శాస్త్రవేత్తలు గుర్తించారు. కొత్త యాంటీఫంగల్ చికిత్సలకు దారి.


ఫంగల్ ఇన్ఫెక్షన్లపై పోరులో కీలక బ్రేక్‌థ్రూ వచ్చింది. ఫంగస్‌ను ప్రమాదకరంగా మార్చే మెటబాలిక్ ‘స్విచ్’ను హైదరాబాద్ శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా ఫంగల్ ఇన్ఫెక్షన్లు వేగంగా పెరుగుతున్నాయి. ఆసుపత్రుల్లో చేరికలు ఎక్కువవుతున్నాయి. మరణాల సంఖ్య కూడా ఆందోళనకరంగా మారుతోంది. మరోవైపు వ్యవసాయ రంగంలో ఫంగస్ దాడులు పంట నష్టాలకు దారి తీస్తున్నాయి. ఇది ఆహార భద్రతపై ప్రభావం చూపుతోంది.

ఈ పరిస్థితుల్లో చికిత్స సామర్థ్యం తగ్గుతోంది. యాంటీఫంగల్ మందుల సంఖ్య చాలా పరిమితంగా ఉంది. కొన్ని మందులు శరీరంపై దుష్ప్రభావాలు చూపుతున్నాయి. డ్రగ్ రెసిస్టెన్స్ పెద్ద సవాల్‌గా మారుతోంది. ఈ నేపథ్యంలో CSIR–CCMBకి చెందిన డా. శ్రీరామ్ వరహన్ బృందం కీలక విషయాన్ని బయటపెట్టింది. ఫంగస్ ఆకార మార్పును నియంత్రించేది జన్యువులే కాదు, మెటబాలిజం కూడా అని పరిశోధన తేల్చింది.

ఫంగస్‌కు రెండు రూపాలు ఉంటాయి. ఈస్ట్ రూపం సాధారణంగా హానికరం కాదు. ఫిలమెంటస్ రూపమే ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది. మన శరీరంలోకి ప్రవేశించిన తర్వాత పోషకాల లోపం, ఉష్ణోగ్రత మార్పులు, ఇతర సూక్ష్మజీవుల ఉనికి ఫంగస్‌ను ఈ ప్రమాదకర రూపంలోకి మార్చుతాయి. పరిశోధనలో చక్కెర విచ్ఛిన్నం కీలకంగా మారింది.

చక్కెర వేగంగా విచ్ఛిన్నమైతే సల్ఫర్ కలిగిన అమినో ఆమ్లాలు తయారవుతాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇవే ఆకార మార్పుకు ఆన్–ఆఫ్ స్విచ్‌లా పనిచేస్తున్నాయి. ల్యాబ్‌లో చక్కెర విచ్ఛిన్నాన్ని తగ్గించగా ఫంగస్ హానికరం కాని ఈస్ట్ రూపంలోనే నిలిచిపోయింది. బయట నుంచి సల్ఫర్ అమినో ఆమ్లాలు అందించగానే మళ్లీ ప్రమాదకర రూపంలోకి మారింది. క్యాండిడా ఆల్బికాన్స్‌పై చేసిన పరీక్షల్లో కూడా ఇదే ఫలితం కనిపించింది.

మెటబాలిజం దెబ్బతిన్న ఫంగస్ ఇమ్యూన్ కణాల దాడిని తట్టుకోలేకపోయింది. ఎలుకలపై చేసిన ప్రయోగాల్లో వ్యాధి తీవ్రత గణనీయంగా తగ్గింది. ఈ పరిశోధన కొత్త యాంటీఫంగల్ చికిత్సలకు దారి చూపిస్తోంది. ఫంగస్ శక్తి వ్యవస్థను లక్ష్యంగా చేసుకుంటే ఇన్ఫెక్షన్లను నియంత్రించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. భవిష్యత్‌లో ఇది మానవ ఆరోగ్యం, ఆహార భద్రత రెండింటికీ ఉపయోగపడే అవకాశముంది.

Read More
Next Story