
మైదాన నదీ ప్రవాహంలా హాయిగా సాగే ‘మంజరీ ద్విపద’
ప్రముఖ రచయిత శార్వరి కథల మధ్య తరగతి మనస్తత్వ విశ్లేషణ
బహుముఖ ప్రజ్ఞాశాలి, కథారచయిత ‘శార్వరి’ కళలకు, కళాకారులకు కాణాచియైన తెనాలిలో 1929 లో పుట్టారు. శ్రీ శార్వరి అసలు పేరు రామకృష్ణ శర్మ. వీరి తల్లిదండ్రులు వాసిలి ఈశ్వరమ్మ, పార్వతీశ్వరాచార్యులు.
రామకృష్ణ శర్మ , సత్యనారాయణ రావు, నటరాజ్ ముగ్గురూ మంచి మిత్రులు. ముగ్గురూ ఒకే విషయం అనుకొని తెల్లారేసరికి కథలు రాసేవారు. సత్యనారాయణ రావు "భరద్వాజ" నటరాజన్ "శారద" రామకృష్ణ శర్మ గారికి రావూరి భరద్వాజ గారే శార్వరి అని కలం పేరు పెట్టారు. 1947 నుంచి శార్వరి రచనలు చేయడం ప్రారంభించారు .
విద్యార్థి దశలోనే వీరు కథలకు, కవితలకు శ్రీకారం చుట్టారు .ఈ కథల పిచ్చిలో పడటం వలన ఇంటర్ తప్పారు. అప్పటికే ఆయన రచయిత కావడం వలన పత్రికల నుంచి పదో,పరకో వచ్చేవి. బెజవాడ రేడియో ఆర్టిస్టుగా నాటకాలలో నటించడం వలన నెలకు నలభై,అరవై వచ్చేవి .ఆ సంపాదనతో బి.ఏ లో చేరారు .గుంటూరు ఏ.సీ కాలేజీలో బి.ఎ లో చేరేనాటికి ఆయన కథలు, నవలలు ప్రచురించబడి మంచి రచయితగా గుర్తింపు వచ్చింది.
చాలామంది రచయితలు ఒకే ప్రక్రియలో రచనలు చేసి కవిగానో కథకులు గానో పేరు పొందుతారు. కానీ కొంతమంది సాహిత్యంలో విభిన్న ప్రక్రియల్లో రచనలుచేసి పాఠకుల హృదయాలలో చెరగని స్థానం పొందుతారు అలాంటి గొప్ప రచయిత శ్రీ శార్వరి. స్వర్గసీమ, ఎర్ర భూతం, మంజరీ ద్విపద కథా సంపుటాలతో కథకునిగా గుర్తింపబడ్డారు. "రోదసి"తో వచన కవితా కవిగా, ఆరాధన"తో పద్య కవిగా పేరు పొందారు. అరవిందుని సావిత్రిని అనువాదం చేసి అనువాదకులుగా ప్రశంసింపబడ్డారు. వైతరణి పునరపి జననం, ప్రియురాలు, చరిత్ర హీన, వెన్నెల, అజంతా, మేఘ రంజని, భగ్న జీవులు, ప్రేమ పంచమి, సౌందర్యవల్లి, మోడ్రన్ గర్ల్, ఆత్మహంతకులు మ, వెన్నెల కెరటాలు, "బావా తిరిగి రావా" అతనొక్కడు- అతివలు ముగ్గురు, హేమమాలిని, హాట్ హోమ్ ఆనంద నిలయం, ప్రేమ లీలలు, వలపుల సంధ్యలో నీలినీడలు, లయ తప్పిన హృదయాలు, చీకటి దేవతలు మొదలగు నవలలు రచించి సాటిలేని నవలా రచయితగా' సాగరిక,' 'నాగార్జున' పిల్లల నవలలతో బాలల రచయితగా తెలుగు సాహిత్యంలో తనదైన ముద్రను వేసారు. చాణక్య, సామ్రాట్ అశోక మొదటి భాగం ప్రియదర్శి రెండవ భాగం తైమూర్ ఖాన్,క ర్ణ మహాభారతం చారిత్రక నవలలు రాసారు. ఆంధ్రప్రభ దిన,వార పత్రికలలో ఉపసంపాదకులుగా, సంపాదకులుగా మాగజైన్ ఎడిటర్ గా తెలుగు సాహిత్యానికి ఎంతో సేవ చేసారు.
1969 లో ఆయన జీవన గమనంలో పెద్ద మార్పు వచ్చింది. యోగ మార్గం వైపు ఆయన పయనం మళ్ళింది .అప్పటినుంచి చివరి క్షణం 1986 వరకు మాస్టర్ సి .వి .వి మార్గంలో పయనించారు. హైదరాబాదులో మాస్టర్ యోగ ఆశ్రమం, యోగాలయాలను స్థాపించి ఎందరికో గురువుగా మారి మాస్టర్ శార్వరి' గా నిలిచిపోయారు. శతాధిక గ్రంథాలు రచించారు. వాటిలో చాలా పుస్తకాలు పునర్ముద్రణలు పొందాయి. అందరకు గురువుగా మారి మాస్టర్ శార్వరిగా నిలిచిపోయారు. యోగాశ్రమంలో ప్రవేశించాక శతాధిక గ్రంథాలు రచించారు. అలాంటి శార్వరి రచించిన కథాసంపుటి మంజరీ ద్విపద.
దీనిలో మొత్తం 19 కథా దీపాలు ఉన్నాయి. ఈ కథలన్నీ సామాజిక కథలు. మధ్య తరగతి జీవన చిత్రాలు. వీటిలో కొన్ని కథలపై నా విహంగ వీక్షణం.
"గాలివాన"-వర్గవైరుధ్యాలు
కవులందరూ సమసమాజం రావాలని, ధనిక, బీద, వ్యత్యాసం పోవాలని రచనలు చేస్తారు. బీదరికం, ఆకలి, నిరుద్యోగం ఉండకూడదని కలలు కంటారు. ప్రపంచమంతా ఆకలి, అనారోగ్యాలు లేకుండా పచ్చగా ఉండాలని, వసంత ఋతువులో ప్రకృతిలా ఆహ్లాదకరంగా, ఆనందకరంగా మానవ జీవితాలు పరిమళించాలని, కుబేరుల హృదయాల్లో కరుణ రసం పొంగి పొరలి ప్రవహించాలని అనుకుంటారు. కానీ ప్రపంచం దానికి పూర్తిగా విరుద్ధం. ధనికులు "పైసా మే పరమాత్మ" అన్నట్టు రూపాయినే ప్రాణప్రదంగా భావించి, పేదల చెమటచిత్తడి పునాదులపైనే తమ భవంతులు కట్టుకుంటారు. తాము నిర్మించిన కర్మాగారాల్లో పేదల శ్రమతోనే లాభాలను ఆర్జించాలని చూస్తారు. ఏ యుగమైనా అంతే. కారల్ మార్క్స్ "దాస్ క్యాపిటల్" లో ఎన్ని చెప్పినా పెట్టుబడిదారులు తమ దోపిడీ స్వభావాన్ని మార్చుకోరు. కర్మ సిద్ధాంతం వంట బట్టి మామూలు ప్రజలు కూడా తమ దరిద్రానికి, దీనస్థితికి బాధపడరు.
"గాలి వానలో" యశోదమ్మ ఒక బీద స్త్రీ. ఆమె కొడుకు కిష్టిగాడు. నాలుగు రోజుల నుంచి ముసురు. వానకి పాకంతా తడిసిపోయింది. వానకి తడిసి గోడ పడిపోయింది. గాలికి పైకప్పు ఎగిరిపోయింది. కిష్టిగాడికి తండ్రి లేడు. రెండు రోజుల నుంచి జ్వరం. తల్లి యశోదమ్మ ఉన్నవాళ్ళ ఇంట్లో పని చేస్తూ కొడుకుని పోషించుకుంటుంది. ఆమె గుడిసెకు కొంచెం దూరంలోనే ఆమె పనిచేసే జానకమ్మ గారి భవనం. దానికి కాపలాగా ఒక కుక్క. ఆ నిశ్శబ్దంలో "యశోదా యశోదా ఇలా రా" అన్న పిలుపు వినిపిస్తుంది. ఆ వానలో తడుస్తూ యజమానురాలు పిలిచిందని యశోదమ్మ జానకమ్మ ఇంటికి వెళుతుంది. "మీరు పిలిచారని వచ్చాను" అంటుంది. "ఆ... బేబీ నిద్రపోవడం లేదు. అందుకే యశోదా బేబీని తీసుకుపో" అని పిలిచాను అంటూ "ఇవాళ శనివారం ఉపవాసం. ఏమీ వండలేదు. జాగ్రత్తగా వెళ్ళు" అని ఇంట్లోకి వెళ్ళిపోతుంది.
వర్షం తగ్గింది. ఇంటికి వెళ్లి కిట్టి గాడి ఒళ్ళు తాకుతుంది ఆమె. జ్వరం తగ్గింది. కానీ కదిపితే కదలడు. "కట్టెలా బిగుసుకుపోయాడు పాపం కిట్టి గాడు. యశోదమ్మ కొంప కూలిపోయింది. ఒంటి నిట్టాడి , విరిగిపోయింది. "
ఈ చివరి వాక్యాలు చదివిన పాఠకులకు కన్నీళ్లు జలజలా రాలుతాయి. కరుణ రసాత్మకమైన ముగింపు.
18 వ శతాబ్దమైనా 21 శతాబ్దమైనా సమాజంలో పేద ధనిక భేదాలు మారవు. వడ్డించిన విస్తరి కొంతమంది జీవితాలు. విస్తరీ, విస్తరిలో పదార్థాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా కొందరికి దొరకవు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా, ఎన్ని జెండాల వర్ణాలు మారినా, పేదల బతుకుల నల్లని రంగు మారదు. ఈ వాస్తవికత ఛెళ్ళున చరుస్తుంది.
ఈ కథకు గాలివాన శీర్షిక సముచితమైనది. ఈ కథలో జానకమ్మ, యశోదమ్మ, డబ్బు గల వారికీ, బీదవారికీ ప్రతినిధులు. గాలివానైనా, ప్రళయమైనా, ధనికుల జీవితాల్లో ఆ వాతావరణ ప్రభావం ఏమీ ఉండదు. పటిష్ఠమైన భవనాల్లో వెచ్చగా ఉంటారు. వేడివేడి పకోడీలు తింటూ, వెచ్చని పానీయాలు తాగుతూ, రగ్గులు కప్పుకొని పడుకుంటారు బయటికి వెళ్లకుండా హాయిగా. కానీ రెక్కాడితే గానీ డొక్కాడని పేదల బ్రతుకులు దినదిన గండం నూరేళ్లు ఆయుష్షు. గాలివీస్తే కొట్టుకుపోయే తాటాకు గుడిసెలు. వానకు నాని నాని కూలిపోయే గోడలు. వానలో తడుస్తూ కూర్చోడానికి చోటు లేక, పడుకోవడానికి స్థలం లేక, నరకాన్ని తలపించే బతుకులు. ఆ పరిస్థితుల్లోజ్వరం వచ్చి గానీ, ఆరోగ్యం బాగా లేక గానీ, ఎవరైనా రోగిష్ఠివాళ్ళు ఉంటే కాలు బయటపెట్టే పరిస్థితి ఉండదు. డాక్టర్ దగ్గరికి వెళ్లడానికి డబ్బులు ఉండవు. ఆయుష్షు ఉంటే బతుకుతారు. లేకపోతే లేదు.
ఈ గాలి వానలో కిష్ఠిగాడు పేదరికం కారణంగానే చచ్చిపోతాడు. వానలో తడవకుండా, మందులు వేసుకుంటే బతికేవాడే. ఆ గాలివానకు తట్టుకోలేక వానలో తడిసిపోయి ప్రాణాలు కోల్పోతాడు. గాలివాన భవనాలను ఏమీ చేయలేదు. పూరి గుడిసెలను కూల్చేస్తుంది. డబ్బున్న వారిపై తన ప్రభావాన్ని చూపలేదు. బడుగుల బతుకులను ధ్వంసం చేస్తుంది. ఈ పరిస్థితిని అద్దంలో చూపించినట్లు ఈ కథ చిత్రీకరిస్తుంది.
కాటేసిన కల-సినిమా ఊబిలో యవతరం
.తెలుగు వాళ్ళకి, తమిళులకు సినిమా పిచ్చి ఎక్కువ. హీరోలకు అభిమాన సంఘాలు ఉంటాయి. అభిమాన హీరో సినిమా విడుదలయితే మొదటి రోజు మొదటి ఆట చూడాల్సిందే. టికెట్ దొరక్కపోతే బ్లాక్ లో అయినా కొనుక్కొని చూస్తారు. హీరో పుట్టినరోజు నాడు ఇక్కడ కేక్ కట్ చేసి అట్టహాసంగా పుట్టినరోజు పండుగ చేస్తారు. ఇక తమిళనాడులో అయితే హీరోయిన్లకు గుళ్ళు కడతారు. ఈ మధ్యనే తమిళనాడులో ఒక హీరో సినిమా విడుదలైనప్పుడు మొదటి రోజు సినిమా చూడటానికి వెళ్లి తొక్కిసలాటలో ఒక మహిళ మరణించింది అన్న వార్త చూసి ఏమిటి పిచ్చి దురభిమానం అనిపిస్తుంది.
అమ్మాయిలు చాలామంది హీరోయిన్ అవ్వాలని కలలు కంటారు. ఇంట్లో చెప్పకుండా మద్రాసు వెళ్లి సినిమా ఆఫీసులచుట్టూ తిరిగి ప్రదక్షిణాలు చేస్తారు. ఇంట్లో నుంచి తీసుకువెళ్లిన డబ్బు, నగలు ఖర్చయిపోతాయి. సినిమా ఛాన్స్ మాత్రం రాదు. హీరోయిన్ కాదు కదా దాసీ వేషం కూడా దొరకదు. మోసపోతారు. ఆఖరికి తినడానికి కూడా తిండి ఉండదు. చివరకు రాత్రిపూట తెల్లచీర కట్టుకొని మల్లెపూలు పెట్టుకొని బస్ స్టాప్ లో బేరాలు వెతుక్కుంటారు. అలాంటి అమ్మాయి కథే కాటేసిన కల. ఈ కథ చదివితే రావూరి భరద్వాజ గారి "పాకుడు రాళ్లు" నవల గుర్తుకొస్తుంది. ఒక హీరోయిన్ కావాలంటే కెమెరామెన్ దగ్గర నుంచి దర్శకుడు, రచయిత, నిర్మాత ఇలా అందరినీ తృప్తి పరచక తప్పని పరిస్థితి. ఇవేమీ సినిమా హీరోయిన్ కావాలని కలలుకనే కన్నెపిల్లలకు తెలియదు. వాల్ పోస్టర్ల మీద హీరోయిన్ అందమైన ఫోటోలు చూసి మద్రాసు వెళ్తే చాలు హీరోయిన్ ఛాన్స్ వస్తుందని నమ్ముతారు. ఆఖరికి ఛాన్స్ రాక, తిరిగి ఊరికి, ఇంటికి వెళ్లలేక, వేషాలు లేక, తిండి లేక, రోగాలతో మట్టిలో కలిసిపోయిన అభాగ్యులెందరో.
"కాటేసిన కల"లో అనసూయ 'హీరోయిన్' కలగన్న అమ్మాయే. అనసూయ, బుచ్చిబాబు ఇద్దరూ ఒక ఫిలిం కంపెనీ ప్రకటన చదివి మద్రాస్ వెళ్తారు. పాతిక వేలుఖరీదు చేసే నగలు, పదివేల రూపాయలతో రైలెక్కింది. కొత్తనటిగా ప్రచారం చేశారు. సినిమా పత్రికల్లో ఆమె ముఖాన్ని రంగుల్లో ముద్రించారు. అయినా ఆమెకు హీరోయిన్ కాదు కదా, ఏ చిన్న వేషమూ రాలేదు. చివరకు తేనాంపేట సందులోకి ఆమె మకాం మారుతుంది. రాత్రి కాగానే బస్సు స్టాప్ లో తన వలలో ఎవరైనా పడతారేమోనని ఎదురుచూస్తుంది.
మామూలుగా జీవితంలో తీరని కోరికలు కలలో తీర్చుకుంటారు కొందరు. కలలోనైనా ఆనందంగా ఉంటారు. కానీ కలలు రెండు రకాలు. మంచి కలలుకొన్ని, పీడ కలలు కొన్ని. మంచి కలలు వస్తే బాగానే ఉంటుంది. పీడ కల వస్తే నిద్ర పట్టదు. భయం వేస్తుంది ఒళ్ళంతా చెమటలు పడతాయి. కల అని తెలిసినా, ఆ కల వచ్చినంత సేపు కంగారు, భయంతో ప్రతిక్షణం నరకంగా గడుపుతారు. ఇలాంటి కలలు జీవితంలో ఉన్న ఆనందాన్ని హరిస్తాయి. నిజంగాకాటేసిన కలలే అవి.
మంజరీ ద్విపద -మరొక కన్యాశుల్కం కథ పితృస్వామ్యవ్యవస్థలో వివాహం అంటేనే ఒక అసమానతల వ్యవస్థ. ఒకప్పుడు కన్యాశుల్కం, తర్వాత వర శుల్కం ఆడవాళ్ల బతుకులను అతలాకుతలం చేశాయి. గురజాడ పుత్తడి బొమ్మ పూర్ణమ్మ కరుణారసగాథ అందరికీ తెలిసిందే. బొమ్మలతో ఆడుకునే పిల్లలను డబ్బుల కోసం ఆశపడి ముసలి తాతకు ఇచ్చి పెళ్లి చేస్తారు. ఆటలు ఆడుకునేటప్పుడు తోటి పిల్లలు మొగుడు తాతా అని ఎగతాళి చేస్తే తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటుంది. ఒకప్పుడు పెళ్లి కొడుకుకి నచ్చితే చాలు పెళ్లి అయిపోయేది. అమ్మాయి ఇష్టాన్ని ఎవరు అడిగే వారు కాదు. పెళ్లి అనేది ఒక లాటరీ లాంటిది. అమ్మాయి అదృష్టవంతురాలు అయితే మంచి భర్త దొరుకుతాడు. లేకపోతే జీవితం అంతా కష్టాల కడలే.
పూర్వం స్త్రీలకు భర్తే దేవుడు అని, అతడు ఎలాంటి దుర్మార్గుడైనా, సకల సద్గుణ వరేణ్యుడైనా అతణ్ణే పూజించాలని పాతివ్రత్య పాఠాలు బోధించేవారు. స్త్రీలలో కూడా ఆ భావాలు నరనరాలో జీర్ణించకపోయి, భర్త తాగుబోతు అయినా, తిరుగుబోతు అయినా, "నా కర్మ ఇంతే"నని కన్నీటి పాటలు పాడుకుంటూ బతికేది.
ఇంక వరకట్నం. అదొక దురాచారం. అమ్మాయి చదువుకున్నా, ఉద్యోగం చేస్తున్నా, వరునికి కట్నం ఇవ్వక తప్పదు. వరుడు విష్ణు స్వరూపుడు, వధువు లక్ష్మీ స్వరూపురాలు అని మాటల్లో ఎన్నో చెప్పినా వాస్తవ జీవితంలో పెళ్ళికొడుకు అంటే పెళ్లికూతురు కంటే అధికుడు, ఎక్కువ వాడు అనే భావాలు మన సంఘంలో జీర్ణించుకుపోయాయి. అందుకే ఆడపిల్ల వాళ్ళు తమకు తగిన మర్యాదలు చేయలేదని, తిండి తిప్పలు సరిగ్గా చూడలేదని, పెట్టుపోతలు సరిగ్గా లేవని ఆడపెళ్ళి వారితో పోట్లాడేవారు ఇప్పటికీ మనకి చాలామంది కనిపిస్తారు.
ఇప్పటికీ కొన్ని సనాతన సంప్రదాయాలు, మూఢనమ్మకాలు పెళ్లిళ్లలో చాలా ఉన్నాయి. అమ్మాయి కంటే అబ్బాయి వయస్సు ఎక్కువగా ఉండాలనీ, వధువు కంటే వరుని వయస్సు తక్కువ అయితే ఆయుక్షీణమనీ అని మన సంఘంలో చాలా నమ్మకాలు ఉన్నాయి. ఆధునిక యుగంలోను కొన్ని ఆచారాలు మారలేదు. వాటిలో వధూవరుల మధ్య వయసు తేడా ముఖ్యమైనది. రాముడు కన్నా సీత పెద్దది అని చెప్పుకున్నా డబ్బులు లేక పోవటం వలన ఇంకా అనేక కారణాల వలన కన్న కూతుళ్లను ముసలి వాళ్లకి ఇచ్చి చేసే తండ్రులు చాలామంది ఉన్నారు. భర్త తనకంటే చాలా పెద్దవాడు అవ్వటంతో భార్యకి భర్త అంటే చనువుగానీ, స్నేహభావంగానీ, సాన్నిహిత్యంగానీ ఉండవు. అందుకే గురజాడ "మగడు వేల్పన్నది పాత మాట. ప్రాణ స్నేహితుడు" కావలెనని ఎన్ని చెప్పినా భార్యా భర్తల మధ్య అంతరాలు ఎక్కువ. మార్జాల దాంపత్యాలే అన్నీ. ప్రతి రోజూ కాట్ల కుక్కల్లా పోట్లాడుకుంటూ సమాజం కోసం ఒకే ఇంట్లో బతికే దంపతులు చాలా మంది ఉన్నారు.
మంజరీ ద్విపద కథ కూడా ఇలాంటి వయస్సు అంతరాల గురించి రాసిన కథ. వెంకటాద్రి నాయకుడు వినుకొండ పరగణాలకు మకుటం లేని మహారాజు. ఆరు పదుల యువకుడు అతడు. నిరుపేద యువతి మంజరి అందాన్ని చూసి పెళ్లి చేసుకుంటాడు. మంజరి తండ్రి పేద రైతు. పాతికేళ్ల అందాల భరణి మంజరి సంప్రదాయాలు, ఆచారాలకు లొంగి కొంతకాలం మామూలుగా ఉన్నా మంజరి వయసు చేసే ఆరడికి తట్టుకోలేక తోటమాలి జగ్గరాజుతో సంబంధం పెట్టుకుంటుంది. ఈ విషయం నాయుడుకి తెలుస్తుంది. కానీ ఆమె మారదు. ఒకసారి దేవిడీలో అగ్ని ప్రమాదం జరుగుతుంది. మంటల్లో మంజరి కాలిపోతుంది. కానీ కొన్ని ఏళ్లు పోయినాక చిత్రంగా మంజరి భవనంలో ప్రత్యక్షమవుతుంది. పనిమనిషి యాదమ్మ ఆమెను చూసి ఆశ్చర్యపోతుంది.
"అప్పుడు ఇంటికి నిప్పు అంటించడానికి ఆయనే ఏర్పాటు చేశాడు. ఇల్లు కాలిపోయేలోగా నేనూ, జగ్గరాజు రహస్యంగా పారిపోవడానికి ఏర్పాటు చేసింది ఆయనే" అని చెప్తుంది మంజరి. కొంతమంది భార్య మనసును అర్థం చేసుకుంటారు. ఆమె మనసెరిగి ప్రవర్తిస్తారు. అలాంటి కథానాయకుడు వెంకటాద్రి నాయకుడు. మొదట తెలియక తనకంటే చిన్న పిల్లను పెళ్లి చేసుకున్నా ఆ తర్వాత ఆ అమ్మాయి హృదయాన్ని గ్రహించి ఆమె కోరిక నెరవేరుస్తాడు. కథ సుఖాంతం.
గుడిగంటలు _అనాధశవం ఆర్తనాదం
సోమన్న అనే రిక్షా అబ్బాయి కథ ఇది. ప్రతిరోజూ గుడికి వెళ్లి హారతి కళ్ళకు అద్దుకోకుండా బండి కట్టడు. మహా రాజు వచ్చినా, మహామంత్రి వచ్చినా అంతే. ఒకరోజు ఆలస్యంగా మెలకువ వస్తుంది . సోమన్న వెళ్లేసరికి అర్చన ముగించి పూజారి గుడి తలుపులు మూసేస్తాడు.
దేవుడి దర్శనం కాలేదని తిండి తినకుండా దిగులుగా ఉంటాడు. ఆరోజు రాత్రి తన దగ్గరకు వచ్చిన వారితో "నేను చచ్చిపోతే ఏం చేస్తారు" అని అడుగుతాడు. అందరూ సమాధి కట్టిస్తామని, ఊరంతా ఊరేగించి, సమాధి చేసి ,నీ పేర మఠం కట్టిస్తామని చెప్తారు .
చిత్రంగా తెల్లారేసరికి గుడిమెట్ల మీద సోమన్న పడిపోయి ఉంటాడు. పూజారి గుడి గంటలు మోగిస్తాడు .కానీ ,సోమన్న లేవడు .సమాధి కట్టిస్తామని ప్రగల్భాలు పలికిన వారెవరూ పట్టించుకోరు. మున్సిపాలిటీ వాహనం వస్తుంది శవాన్ని తీసుకెళ్లడానికి .
ఎప్పుడూ జీవితం ఊహించుకున్నట్లు ఉండదు .తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలచినట్లు ఏదో జరుగుతుంది .మనిషి తానేదో గొప్పవాడినని అనుకుంటాడు. కానీ ఏదీ తనచేతిలో ఉండదు. విధి చేతిలో కీలుబొమ్మ అతడు. ఏదో చేయాలని, అద్భుతంగా జీవించాలనీ, తాను మరణించాక ,జనం అంతా తనను చూడడానికి తరలిరావాలనీ తన అంతిమయాత్ర చాలా గొప్పగా జరగాలని కలలు కంటారు. సోమన్న కూడా అలాంటి కలే కంటాడు .కానీ తాను నిరుపేద అవడం వలన తన కల కూడా కల్లగా మారుతుందని ఊహించుకోడు .అందుకే పేదవాడి పెళ్ళైనా ఎవరికీ తెలియదనీ, గొప్పవాడి చావైనా పెళ్లి లాంటిదనీ అంటారు .
గొప్పవాళ్లు, రాజకీయ నాయకులు, సినిమా తారలు మరణిస్తే ఇసుక వేస్తే రాలనంత జనం వస్తారు .పూలమాలలతో, పూల గుచ్చాలతో భౌతిక కాయం నిండిపోతుంది. ఇక అధికారులైతే అధికార లాంఛనాలతో శవయాత్ర కూడా వైభవ యాత్రగా మారిపోతుంది .
సోమన్న సగటు మనిషి కాబట్టి అతని మరణ వార్త ఏ పత్రికలోనూ పతాక శీర్షిక కాదు .చుట్టాలూ, స్నేహితులూ లేరు కాబట్టి ఎవరూ చూడడానికి కూడా రారు .అనాధ శవం కనుక ఏ మున్సిపాలిటీ వాహనమో వచ్చి తీసుకెళ్తుంది .నిరుపేదల
చావుకూడా నిరుపేదగానే ఉంటుంది .ఈ వాస్తవాన్నిశార్వరి ఈ కథలో బాగా చిత్రీకరించారు.కథ చదివిన పాఠకులు చివరికి 'అయ్యో' అని జాలి పడతారు .
సోమన్న బతికున్నప్పుడు సమాధి కడతామని చెప్పిన వాళ్ళెవరూ అతని శవాన్ని పట్టించుకోరు. చివరకు సోమన్న శవం లేచిన స్థలంలో ఒక కుక్క వాసన చూసి నాకుతుంది ."గుడి గంటల మోగాయి. అదిరిపడి పరిగెత్తింది కుక్క స్మశానం వైపు -తన యజమాని కోసం "అని కథ ముగిస్తారు .మనుషులు పట్టించుకోకపోయినా విశ్వాసం గల కుక్క తన యజమాని కోసం ఆరాటపడిందని మనుష్య స్వభావాన్నీ, శునక స్వభావాన్నీ కళ్ళకు కట్టినట్లు వర్ణించారు .శార్వరి గారి కథాకథన శైలి సహజ సుందరం. ఒకొక్క చోట కనిపించే సునిశితమైన వ్యంగ్యం మన మనసులను తాకుతుంది. ఈ కథలో ఒక చోట "పూజారి భగవంతుణ్ణి గుడి లోపల బంధించి ఇంటికి వెళ్లిపోయాడు .తను తలుపులకు తాళాలు వేయకపోతే భగవాన్ కొంటెపిల్లాడిలా పారిపోగలడనే సదభిప్రాయం పూజారికి ." అంటారు.
మామూలుగా గుడి సమయం అయినాక పూజారులు గుడికి తాళం వేస్తారు. అలా తాళం వేయడాన్ని తమాషాగా వ్యంగ్యంగా దేవుడు కొంటెపిల్లాడిలా పారిపోతాడేమోనని తాళం వేసాడని అంటారు రచయిత .మాటల్లో నవ్వొచ్చేంత సునిశితమైన వ్యంగ్యం పాఠకుల్ని అలరిస్తుంది.
క్షమించలేను-మారినమనసు
జగన్నాథం కొడుకు శ్రీ గోపాల్. అతడు రజనిని ప్రేమిస్తాడు. తన కొడుకు రజనిని ప్రేమించటం తండ్రికి ఇష్టం ఉండదు. ఈ విషయంలో కొడుకుని మందలిస్తాడు. రజని తండ్రి పరమేశ్వరం ఒక హంతకుడు అని వాదిస్తాడు. పరమేశ్వరం ఆ హత్య చేయలేదని కోర్టు తీర్పునిస్తుంది. అయినా హంతకుడు హంతకుడే అని అంటాడు. చివరికి ఆ అమ్మాయిని చేసుకుంటే తన ఇంట్లో స్థానం లేదంటాడు.
శ్రీ గోపాల్ బయటకు వచ్చేస్తాడు. ఇంతలోనే తండ్రికి గుండెపోటు వచ్చిందని ఎవరో చెప్తారు. రజనీతో ఆసుపత్రికి వెళ్తాడు. రజని అతనికి సపర్యలు చేస్తుంది. జగన్నాథం కోలుకుంటాడు. చివరికి రజని మంచితనం తెలుసుకుంటాడు. తనను కోడలుగా చేసుకోవడానికి అభ్యంతరాలన్నీ తొలగిపోతాయి. "నన్ను క్షమించండి." అని రజని అంటే," ఉహు, మీ ఇద్దరినీ క్షమించను." అని ఆనందంలో మునిగిపోతాడు.
ఈ కథలో జగన్నాథం ఆవేశపరుడు. కొడుకు ప్రేమించిన అమ్మాయి అంటే ఇష్టం ఉండదు. తండ్రి హంతకుడు కనుక ఆ అమ్మాయి కూడా అలాంటి హింసా ప్రవృత్తి గల అమ్మాయని భావిస్తాడు. చివరికి తాను ఆసుపత్రిలో ఉన్నప్పుడు తనకు చేసిన సేవ వలన ఆమె సహృదయతను అర్థం చేసుకొని ,ఆమెను కోడలుగా స్వీకరిస్తాడు. . మొదట రజని పేరు ఎత్తితే ఆగ్రహ జ్వాలగా నింగికెగసిన అతడు క్రమంగా చల్లారిపోతాడు. అందుకే ఉత్తముల కోపం క్షణికమైనది అని అంటారు మామూలు వాళ్ళు అయితే అలా ఉండరు .జీవితాంతం ఆ కోపాన్ని అలాగే పెంచుకుంటూ పోతారు .
కథాగమనంలో కొంచెం వ్యంగ్యం చురుక్కు మంటుంది .జగన్నాథం రజనిల సంభాషణ ఆసాంతం ఆహ్లాదంగా చదివింప చేస్తుంది. కథాంతానికి జగన్నాథంతోపాటు పాఠకులు కూడా ఆనంద లోకాల్లో విహరిస్తారు.
వీధి దీపాలు -అందమే ప్రమాదం
ఈ సంపుటిలో మరో కథ వీధి దీపాలు. పితృస్వామ్య సమాజంలో స్త్రీలు అంటే- శరీరాలే.అమ్మాయిలు అంటే ఆట బొమ్మలు,అందాలబొమ్మలు. భోగవస్తువులు, మార్కెట్ సరుకులు. వాళ్లకు ఇష్టాలు, అయి ష్టాలు ఉండవు. ఈ కథలో మనోహర్ ఉస్మానియాలో ఎంఏ విద్యార్థి. దమయంతి బ్యాంకు ఉద్యోగిని . మనోహర్ ధనవంతుడు. ఒకసారి దమయంతిని చూసి స్నేహితులతో "ఆమెతో స్నేహం చేస్తానని, మాట్లాడతాన"ని పందెం కాస్తాడు . ఒకరోజు ఆమె వస్తుంటే దారిలో నిలబడి చేతిలో నోట్లని విసనకర్రలా పట్టుకుని ఈల వేస్తాడు. ఆమె దారికి అడ్డంగా నిలబడి "500 రెడీ" అని అంటాడు. పబ్లిక్ గార్డెన్ కి వెళదామా అంటాడు .ఆమె తిరస్కరిస్తుంది. అయినా"నీవు నాతో వచ్చి తీరాలి "అని బలవంతం చేస్తాడు. చివరకు అతని చెంప మీద ఛెళ్ళుమని కొడుతుంది. స్నేహితులు "మనకా దమయంతి ప్రాప్తం లేదు."అని అంటారు. ఒకరోజు దమయంతి బస్సు దిగే టైంకి స్కూటర్ బస్టాండ్ లో ఆపి ఆమె దగ్గరకు వెళ్లి, ఆమె ఒంటి మీద చేయి వేసి" లిఫ్ట్ ఇస్తా రా" అని అంటాడు .ఆమె తిరస్కరించినా పెనుగులాడతాడు. దమయంతి గట్టిగా అరుస్తుంది. అయినా బలవంతంగా ఆమెను స్కూటర్ మీద ఎక్కించుకొని పారిపోవాలని అనుకుంటాడు. స్కూటర్ తూలి దమయంతి మీద పడుతుంది. ఆమె కింద పడిపోతుంది. జనం గుమి గూడి కేకలు ,అరుపులు అరుస్తారు . చివరకు భర్త వచ్చి ఆమెను బండి ఎక్కించుకొని వెళ్ళిపోతాడు .మనోహర్ ఒళ్లంతా గాయాలే. మొహం నిండా దెబ్బలే .అయినా బుద్ధి రాదు .ఎలా అయినా దమయంతిని లొంగ తీసుకుంటాను అంటాడు. పోలీసులు వచ్చి అతన్ని స్టేషన్ కు తీసుకెళ్తారు. గొడవ జరిగిన రోజు వివరాలు అడుగుతారు. మనోహర్ అన్నీ అబద్ధాలు చెప్తాడు. ఆ రాత్రి పోలీస్ స్టేషనే అతనికి పడకగది అవుతుంది. అయినా అతడు తప్పు ఒప్పుకోడు. చివరకు మర్నాడు నేరస్థులు అందరూ వరుసగా నిలబడతారు. ఆమె వస్తుంది .ఆమె వరుసగా అందరినీ చూస్తూ ముందుకు కదులుతుంది. అతడి గుండెలు భయంతో కొట్టుకుంటాయి. చివరకు ఆమె అతన్ని గుర్తుపట్టదు.బతుకుజీవుడా అని అనుకుంటాడు. మర్నాడు ఆ అమ్మాయిని కలిసి "నన్ను ఎందుకు పట్టించలేదు "అని అడుగుతాడు. అప్పుడు ఆమె " మీ ముఖంలో పశ్చాత్తాపం కనిపించింది. పశ్చాత్తాపానికి మించిన శిక్ష ఏమీ లేదు. అందుకే మిమ్మల్ని వదిలేసాను." అంటుంది . ఇక్కడ దమయంతి క్షమాగుణాన్ని రచయిత వర్ణిస్తారు. శతృవైనా క్షమించే స్త్రీ హృదయాన్ని ఆవిష్కరించి స్త్రీల పట్ల తన పక్షపాతాన్ని వెల్లడించారు. అందమైన అమ్మాయిల వెనుక ఎందుకు పడతారు. అందంగా ఉండటమే మా నేరమా?" అని దమయంతి అనుకొంటుంది.
పితృస్వామ్య సమాజంలో అమ్మాయిలు రెండవ తరగతి పౌరులు. ఆడపిల్లలంటేనే చులకన భావం. ముఖ్యంగా వాళ్లు కాస్త అందంగా ఉంటే చాలు వాళ్ళ వెంట పడతారు .వేధిస్తారు. సమాజంలో ఉన్న దురాచార మిది. ఎంతోమంది అందమైనఅమ్మాయిలు ఈ గొడవలు తట్టుకోలేక అందంగా ఉండటమే నేరంగా భావించి చదువులు , ఉద్యోగాలు మానేస్తున్నారు .వారి మనసులోని బాధను, వారి జీవితాల్లోని దుఃఖాన్నీ చిత్రీకరించిన కథ ఇది . ఈ కథ చదివాక చాలా రోజులు మనను వెంటాడుతూనే ఉంటుంది. గుండెల్లో ముల్లులా గుచ్చుకొంటూనే ఉంటుంది .
ఈ సంపుటిలోని కథలన్నీ వైవిధ్యభరితం. కథలన్నీ చదివింప చేస్తాయి. మొదలుపెట్టిన దగ్గర్నుంచి చివరి వరకు ఆపకుండా చదివించే సరళమైన శైలి. సునిశితమైన వ్యంగ్యం శార్వరి గారి రచనలకు అలంకారం .కథల్లో సందర్భాను సారంగా చేసిన వర్ణనలు కథాగమనానికి దోహదపడతాయి. ఎక్కడా రొడ్డ కొట్టుడు మాటలు, దుష్కర సమాసాలు ,అర్థం కాని పదాలు కానీ ఉండవు .
కథలన్నీ సమాజంలోని సమకాలీన సమస్యలను ప్రతిబింబించేవే. ముఖ్యంగా మధ్యతరగతి జీవుల ఆశలు ,కలలు, తీరీతీరని కోరికలు, ఆ కోరికలు తీర్చుకోవడంలో పడే ప్రయాసలు, స్త్రీ పురుషుల అంతరంగ విశ్లేషణ ఈ కథల్లో కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. మధ్యతరగతి మనస్తత్వం ఈకథలన్నిటిలో అంతర్లీనంగా ప్రవహిస్తుంది.
ప్రవాహశైలి
"నిరాశా, నిస్పృహలు చుట్టూ ఆవరించాయి. కాఫీ తాగడానికి కనీసం రెండణాలు లేవు.సిగరెట్టు లేదు.కార్పొరేషన్ పైపులో చల్లటి నీళ్లు కడుపు నిండా తాగి, పార్క్ కు చేరాను"(పేజీ నం.181). " ఆ మాట వినగానే రమణమ్మ చూచిన చూపుకు అంత తలనొప్పి ఎగిరి చక్కా పోయింది. కాఫీ తాగి బయలుదేరాడు. సెంటర్ కు వెళ్లి రిక్షా ఎక్కగానే మళ్లీ తలనొప్పి పట్టుకుంది."44వ పేజీ పుస్తకం అంతా ఇలాంటి ప్రవాహశైలే.
వర్ణనలు
" వర్షంలో ముద్దగా తడిసిపోయింది .ప్రచండంగా వీచే గాలికి గాలిపటం లా అటు ఇటు ఊగుతుంది చెట్లు పెళ పెళ విరిగి నేలకూలుతున్నాయి. దూరంగా ఎక్కడో ఒకటి రెండు దీపాలు మిణుకు మిణుకు మంటున్నాయి. ఆకాశం విరిగి మీద పడుతుందా అనిపిస్తుంది. చీకటి గుహలో నుండి, చూసినట్లు మెరుపు వెలుగులో చెట్లు, పొదలు అగుపిస్తున్నాయి "పేజీ నం.181; "రాధమ్మ ది సొగసైన ముఖం, ఆ కోల ముఖాన్ని అలంకారంగా సన్నగా పొడుగ్గా ఉన్న ముక్కు, విశాలమైన కళ్ళు ఎత్తైన కనుబొమలు, చాలా పచ్చటి పల్చటి శరీరం. (పేజీ.నం 116). ఇలాంటి సహజమైన వర్ణనలతో శార్వరి గారి కథలు హృదయాలను పరవశింప చేస్తాయి.
ఈ కథా సంపుటి పేరు మంజరీ ద్విపద .మంజరీద్విపద అనగానే ఛందస్సులో మంజరీ ద్విపద గుర్తుకు వస్తుంది . ఛందస్సులో ఉత్పలమాల ,శార్దూలము, మత్తేభము ముఖ్యమైన వృత్తాలు.ఈ వృత్తాలకు ఛందో
నియమాలు చాలా ఉంటాయి. గణాలు,యతిప్రాసలు ఉంటాయి .ప్రతిపద్యానికీ నాలుగు పాదాలు ఉంటాయి. ప్రాస నియమం ఉంటుంది. ప్రతిపాదానికీ నియమితమైన అక్షరాలు ఉంటాయి .ఏది సరిగ్గా లేకపోయినా ఛందో భంగం అవుతుంది .భారత, భాగవత, రామాయణాలు, ప్రబంధాలలో ఎక్కువగా వృత్తాలే ఉంటాయి. వీటిని మార్గ ఛందస్సు అంటారు .
దేశీ ఛందస్సు ఇంకొక రకం.ద్విపద ,మంజరీ ద్విపద ఇలాంటి దేశీ ఛందస్సుకుసంబంధించినవి. వృత్తాలకు నాలుగు పాదాలు ఉంటే, ద్విపద, మంజరీ ద్విపదకు రెండు పాదాలు ఉంటాయి. అసలు ద్విపద అంటేనే రెండు పాదాలు కలది ".ద్వి పద యస్య సః ద్విపద"అని అర్థం. ద్విపదకు మూడు ఇంద్ర గణాలు, ఒక సూర్య గణం ఉంటాయి . ప్రాస నియమం ఉంటుంది. నాలుగో గణం మొదటి అక్షరం యతి .కానీ మంజరీ ద్విపదకు ప్రాస నియమం అక్కర్లేదు ప్రాసయతి ఉంటే చాలు . ద్విపద పామరులకు కూడా అర్థమయ్యేలా ఉంటుంది. ఇక మంజరీ ద్విపద మరింత సరళంగా ఉంటుంది .
శార్వరి గారి కథలు కూడా మైదానంలో కదిలేనదిలా హాయిగా సాగిపోతాయి. పాఠక హృదయాలను పరవశింపచేస్తాయి. అందుకే ఈ సంపుటానికి మంజరీ ద్విపద అనే పేరు స్వార్ధకమయింది.
శార్వరి పద్యాలు,వచన కవిత, నాటకాలు రాసినా ఈ మంజరీ ద్విపద కథా సంపుటితో ప్రముఖ కథకులుగా అశేష పాఠక హృదయాలలో ఎప్పటికీ గుర్తుండిపోతారు.
Next Story

