ఆర్‌ఎస్ఎస్ చీఫ్ భగవత్ బెంగాల్ పర్యటన ఎందుకు?
బీజేపీ పనితీరులో మార్పు రాబోతుందా? మోహన్ భగవత్ గేమ్ ఛేంజర్ కాబోతున్నారా? పాత, కొత్త నేతల మధ్య విభేదాలకు ఫుల్‌స్టాప్ పడబోతుందా?
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భగవత్ (Mohan Bhagwat) పశ్చిమ బెంగాల్ (West Bengal) రాష్రంలో పర్యటించనున్నారు. ఫిబ్రవరి నుంచి 10 రోజుల పాటు ఆయన పర్యటన కొనసాగనుంది. వివిధ జిల్లాల్లో పర్యటించి ప్రముఖలు, సామాజిక ప్రభావవంతులు, ఆర్ఎస్ఎస్ ముఖ్య నేతలు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించనున్నారు. రాష్ట్రంలో ఆర్ఎస్ఎస్ ప్రభావం తగ్గిపోవడం, బీజేపీలో అంతర్గత కుమ్ములాటల నేపథ్యంలో భగవత్ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది.
అయితే బీజేపీ(BJP)లో అంతర్గత విభేదాలను ఫుల్‌స్టాఫ్ పెట్టేందుకు భగవత్ మధ్యవర్తిగా వస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తు్న్నారు. ఇంతకుముందు ఏ ఆర్ఎస్ఎస్ చీఫ్ కూడా రాష్ట్రంలో 10 రోజుల పాటు ఉన్న చరిత్ర లేదని బీజేపీ నాయకుడొకరు అన్నారు.
పార్టీలో విభేదాలు..
ఇటీవల కాలంలో కాషాయపార్టీలో అంతర్గత విభేదాలు తీవ్రస్థాయికి చేరాయి. పార్టీ బలోపేతానికి జనవరి 21న నిర్వహించిన కీలక సమావేశానికి పార్టీ ఇన్‌చార్జి సునీల్ బన్‌సాల్, అమిత్ మాల్వియా హాజరయ్యారు. అయితే సువేందు అధికారి గైర్హాజరయ్యారు. దీంతో రాష్ట్ర మాజీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్(Dilip Ghosh), కొంతమంది బీజేపీ నాయకులు సువేందుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.
‘సువేందు ..బిజీ లీడర్..’
సువేందు సమావేశానికి రాకపోవడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్ (Sukanta Mazumdar) స్పందించారు. "ఆయన (అధికారి) ఏ సంస్థాగత సమావేశానికీ హాజరుకారు. సాధారణంగా చాలా సమయం కొనసాగే మా సమావేశాలు ఆయనకు నచ్చకపోవచ్చు. సువేందు ఈజ్ ఎ బిజీ లీడర్..," అని వ్యంగ్యంగా మాట్లాడారు. మజుందార్ వ్యాఖ్యలకు సువేందు కౌంటర్ ఇచ్చారు. "ప్రతిపక్ష నేతగా నా పాత్ర నాకు తెలుసు. నాకు ఎలాంటి సంస్థాగత బాధ్యతలు లేవు," అని బదులిచ్చారు.
అయితే బీజేపీని చాలా దగ్గరి నుంచి పరిశీలిస్తున్న వారికి మాత్రం ఒక విషయం అర్థమైపోయింది. గత సంవత్సరం జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ చతికిల పడింది. దీంతో ఇద్దరి నేతల మధ్య విభేదాలు తలెత్తి, సఖ్యత లోపించిందని సమాచారం.
అధికారి సుపీరియర్‌గా వ్యవహరించారా?
సురేందు(Suvendu Adhikari )కి హోం మంత్రి అమిత్ షాతో సత్సంబంధాలున్నాయి. ఆ కారణంగానే అభ్యర్థులకు పార్టీ టికెట్ల కేటాయింపులో కీలకపాత్ర పోషించారని సమాచారం. 42 మంది అభ్యర్థులలో దాదాపు 30 మంది అభ్యర్థులు సువేందు ఎంపికచేసి వారేనని బీజేపీ నేతలు చెబుతుంటారు.
పరాజయానికి స్థానాల మార్పే కారణమా?
ప్రస్తుత ఎంపీ దిలీప్ ఘోష్‌ను మిడ్నాపూర్ నియోజకవర్గం నుంచి బర్ద్వాన్-దుర్గాపూర్‌కు మార్చారు. ఆ స్థానాన్ని మరో పార్టీ సీనియర్ నేత ఎస్.ఎస్. అహ్లువాలియాకు కేటాయించారు. అలాగే దుర్గాపూర్ ఎంపీని ఆసన్సోల్‌కు మార్చారు. ఇలా స్థానాల మార్పుల వల్ల ఆ ఇద్దరు ఎంపీలు ఓడిపోయారు. ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయం ‘కేశవ్ భవన్’ టిక్కెట్ల పంపిణీ కేంద్రంగా మారడం.. పార్టీలో ఒక వ్యక్తి ఆధిపత్యం పెరిగిపోవడంపై పార్టీ నేతల్లో అసహనం, అసంతృప్తికి దారితీసింది. రాష్ట్రంలో బీజేపీ సీట్ల సంఖ్య 19 నుంచి 12కు తగ్గిపోయింది. ఎన్నికల ఫలితాల అనంతరం పార్టీలో విభేదాలు తారాస్థాయికి చేరాయి.
కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేస్తారా?
పార్టీలో అంతర్గత విభేదాలు, కుమ్ములాటలు కొత్త అధ్యక్షుడి ఎంపికకు దారితీసేలా కనిపిస్తున్నాయి. దీంతో పాత సంఘ్ పరివార్ నేతలు తమ వర్గానికి చెందిన వ్యక్తిని అధ్యక్షుడిని చేయాలని పట్టుబడుతున్నారు. మరికొంతమంది సువేందు వర్గానికి మద్దతు ఇస్తున్నారు. పార్టీ ప్రస్తుత అధ్యక్షుడు మజుందార్ ఆర్‌ఎస్‌ఎస్‌లో ఎదిగిన వ్యక్తి. కేంద్ర మంత్రిగా పనిచేశారు కూడా. తమలో ఒకరికి ఆ పదవి కట్టబెట్టాలని ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన పాతతరం నేతలు కోరుతుండగా.. సువేందు శిబిరం మాత్రం.. ఆ పదవి తమ వర్గానికి చెందిన వ్యక్తికే దక్కేలా పావులు కదుపుతోంది.
బన్సాల్ ఏమన్నారు?
మైనార్టీలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పార్టీ పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. ఒక్క బూత్ కమిటీ కూడా ఏర్పాటు కాలేదు. మంగళవారం జరిగిన సమావేశంలో పార్టీ ఇన్‌చార్జి బన్సాల్ మాట్లాడారు. మైనారిటీ ప్రాంతాలను పక్కన పెట్టి ఇతర ప్రాంతాల్లో కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు.
‘అసమర్థతే కారణం..’
"బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో దిలీప్ ఘోష్ ముస్లిం ప్రాబల్యం ఉన్న బూత్‌లలో ఎక్కువ కమిటీలను ఎలా ఏర్పాటు చేశారో ఆలోచించండి. ప్రస్తుత దుస్థితికి రాష్ట్ర నాయకత్వ అసమర్థతే కారణం," అని బీజేపీ రాష్ట్ర మైనారిటీ మోర్చా మాజీ ఉపాధ్యక్షుడు షంసుర్ రెహ్మాన్ మండిపడ్డారు. ఈ నెల మొదట్లో రెహ్మాన్ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు లేఖ కూడా రాశారు. ప్రస్తుత రాష్ట్ర నాయకత్వం సభ్యత్వ సంఖ్యను దాచేస్తూ పార్టీని "మోసం" చేస్తోందని లేఖలో పేర్కొన్నారు.
ఇటీవల బంగ్లాదేశ్‌లో హిందువులపై జరిగిన దాడులు.. బెంగాల్‌లో హిందుత్వ రాజకీయాలకు అనుకూల వాతావరణంగా ఆర్ఎస్ఎస్ భావిస్తోంది. అదే సమయంలో బీజేపీ లబ్ధి పొందాలని ఆశిస్తోంది. ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ భగవత్ ఈ అవకాశాన్ని వదులుకోరని ఒక బీజేపీ సీనియర్ నేత చెప్పారు.