తుంబురులో కళ్ళెత్తితే చాలు, కనకాభిషేకాలు: నేడు తీర్థ ఉత్సవం
x
తంబురు కోన సౌందర్యం

తుంబురులో కళ్ళెత్తితే చాలు, కనకాభిషేకాలు: నేడు తీర్థ ఉత్సవం

మార్చి 25న తుంబూరు తీర్థముక్కోటి ఉత్సవం. భక్తులను సోమవారం ఉ. 5 గంటల నుంచి 11 గం. వరకు తుంబురు తీర్థంకు అనుమతి. అక్కడ అన్నప్రసాదం, నీళ్లు, మజ్జిగ అందిస్తారు


ఒక పెద్ద రాతి కొండ నిలువెత్తు చీలికలో ఎన్ని రూపాలు..! ఎన్ని వింతలు..! ఎన్ని అందాలు..! ఎన్ని భావనలు..! చీలిన కొండ మధ్యలో పరుచుకున్న రాతి నేలపై నున్న నీటి గుండాల్లో వచ్చిపడుతున్న ప్రవాహం..! అది చేసే సందడి..!

తుంబురు ఒక మహత్తరమైన ప్రకృతి సౌందర్యానందం..! కళ్ళారా చూసి.. మనసారా ఆస్వాదించి.. తన్మయులై పోవాలే కానీ, మాటల కందని మహాద్భుతం ఈ తుంబురు కోన!

తుంబురు కోనను పాతికేళ్ళుగా చూస్తూనే ఉన్నాను. ఎప్పుడు వెళ్ళినా కొత్తగానే కనిపిస్తుంటుంది.
సోమవారం పౌర్ణమి నాడు తుంబురు ఉత్సవం.

“శనివారం తుంబురు వెళుతున్నాం. రాత్రి అక్కడే నిద్ర. ఆదివారం సాయంత్రానికి కానీ తిరిగిరాం. వెళ్ళే టప్పుడు తిరుమల నుంచి, వచ్చేటప్పుడు మామండూరు నుంచి. సిద్ధమా?” అన్నాడు డేర్ డెవిల్ ట్రెక్కర్ మధు. “సిద్ధం” అన్నాను.

తిరుపతి నుంచి శనివారం వాహనాల్లో బయలుదేరాసరికి సాయంత్రం నాలుగైంది. అయిదు గంటలకల్లా తిరుమలలో పాపనాశనం చేరుకున్నాం. సూర్యుడు పడమటికి పయనమయ్యాడు. ఇద్దరు అటవీ
అధికారులు సీసీఎఫ్ నాగేశ్వరరావు గారు, డీఎఫ్ వో సతీష్ గారు, వారి సిబ్బంది, మా ట్రెక్కర్లు సహా అంతా ఇరవైమందిమి. బుజాలకు బ్యాగులు తగిలించుకున్నాం. పాపనాశనం డ్యాం దాటాక అడవిలో మా నడక మొదలైంది.
సాయంత్రమైనా వేసవి వేడి తగ్గలేదు. డ్యాం దాటగానే ఎక్కుడు మొదలైంది. చుట్టూ దట్టమైన అడవి.

కాస్త దూరం నడిచామో లేదో, సనకసనందన తీర్థం. కొండల్లోంచి వచ్చే జలధారతో ఈ చిన్న నీటి చెలమ ఎప్పుడూ జలకళ సంతరించుకునే ఉంటుంది. ఈ చెలమలో చేతికందే ఎత్తులో స్వచ్ఛమైన నీళ్ళు. ఎప్పుడూ నీటి కొరత ఉండదు . సనకసనందన తీర్థం దాటాక తుంబురు, రామకృష్ణ, శక్తికటారి, తాంత్రిక లోయ వంటి తీర్థాలకు వెళ్ళేవరకు మధ్యలో ఎక్కడా నీటి జాడ కనిపించదు. సనకసనందన తీర్థం ఒక ఓ యా సిస్సు.

అడవి మధ్యలో నడుస్తున్నాం. ఆకు రాల్చి ఎండడానికి చెట్లు సిద్ధమవుతున్నాయి. అడవంతా ఇంకా పచ్చగానే ఉంది. ఎక్కడో పక్షుల పలకరింపులు. మాటలతో మా నడక సాగుతోంది. పాపనాశనం వద్దే సెల్ఫోన్లు మూగవోయాయి. నగరానికి, నాగరికతకు దూరంగా సాగిపోతున్నాం. చుట్టూ అడవి, మధ్యలో ఏటవాలుగా మా నడక. నేలంతా రాళ్ళు. జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాం. పాపనాశనం నుంచి ఒక కుక్క మా వెంటే వస్తోంది.

తంబురు వైపు ఇలా మా యాత్ర మొదలయింది


సూర్యుడు పడమటికి వెళ్ళి పోయాడు. తుంబురు ఉత్సవం రామకృష్ణ, తాంత్రిక లోయ, శక్తి కటారి వెళ్ళే కొండ మలుపు వచ్చింది. కొండ అంచునే తుంబురుకు

నడుస్తున్నాం. అటొక కొండ, ఇటొక కొండ. మధ్యలో దిగువకు ప్రవహించే పాపనాశనం లోయ. సంధ్య చీకట్లు కుమ్ముకుంటున్నాయి. మా నడక వేగం పుంజుకుంది.

అడవంతా అల్లుకు పోయిన ‘గిల్లి తీగ’


ఆకాశాన్ని మహావృక్షాలు కమ్మేశాయి. చీకటి పడితే తుంబురులోకి వెళ్ళలేం. అయిదు కిలోమీటర్ల వరకు పాకే గిల్లి తీగ కనిపించింది. పెద్దపాము పుట్ట దగ్గర మూడుదారుల
కూడలి. కుడివైపున వెంగమాంబ గుహకు వెళ్ళే దారి. రేపు ఆ దారంటే మామండూరు వైపు వెళ్ళాలి. ఎడం వైపున తుంబురులోకి దారి. పూర్తిగా చీకట్లు కమ్మేశాయి. ఆ దట్టమైన అడవిలో, బ్యాటరీ లైట్ల వెలుగులో
నడుస్తున్నాం. రెండు కొండల నడుమ పెద్ద పెద్ద బండ రాళ్ళు ఎక్కుతూ, దిగుతూ సాగుతున్నాం.
తుంబురులోకి ప్రవేవించకముందే, కుడి వైపున కొండను అనుకుని, చదునైన ఒక ఎత్తైన ప్రాంతం. అక్కడే ఒక చిన్న ఆలయం. రాత్రి ఏడైపోయింది. ఆ చదునైన ప్రాంతంలోనే టెంట్లు వేసుకుని, రాత్రికి బస ఏర్పాటు చేసుకున్నాం. రెండు గంటల్లో అయిదున్నర కిలోమీటర్లు నడిచాం. శరీరం అలసిపోయి, బాగా వేడెక్కింది. అక్కడికి దగ్గరలోనే రెండు కొండలను కలుపుతూ నీటి మడుగు. నేను తప్ప అంతా వెళ్ళి
ఆ నీటి గుండంలో సేదదీరారు. కడుపులో ఆహారం పడితే తప్ప శరీరం కదలనంటోంది.

గుడారాలలోనే బస, రాత్రి భోజనం


రాత్రి భోజనాలకు ఉపక్రమించారు. నేను భోజనం చేసి, మరొక ఇద్దరితో కలిసి నీటి మడుగు వైపు బయలు దేరాను. ఆ మడుగులోకి పైనుంచి నీటిప్రవాహం వచ్చి మామండూరు వైపు సాగిపోతోంది. ఆ చిమ్మ చీకట్లో నీటి మడుగులో ఒక్క మునకేశాను. అహ్.. ఏమానందం! అడవిలో, ఆ చిమ్మచీకట్లో, రెండు కొండల నడుమ నీటి మడుగులో మునకేయడం, ఎప్పుడూ పొందని ఒక అనుభూతి! రెండు గంటల నడకతో వేడెక్కిన శరీరం ఒక్క మునకతో చల్లబడింది. తలెత్తి చూస్తే, చీలి, దగ్గరకు చేరిన రెండు కొండల అంచుల నడుమ ఆకాశం చిన్నబోయినట్టు ఉంది.

తిరిగొచ్చేసరికి గుడారాలు సిద్ధమయ్యాయి. రాత్రి పదవుతోంది. ఒకరొకరూ నిద్రలోకి జారు కుంటున్నారు. బాగా అలిసిపోయాను. గుడారాల్లో దూరి గురకపెట్టిమరీ నిద్రపోయాను. రాత్రంతా పైనుంచి
వచ్చిపడుతున్న నీటి ప్రవాహం రొదలతో తన సొదలు వినిపించింది. తెల్లవారు జామున మూడున్నరకే మెలకువ వచ్చేసింది.


తంబురు కోన


కచ్చితంగా పదేళ్ళ క్రితం నాటి ఒక పాత జ్ఞాపకం కలుక్కుమంది. పదకొండు, పన్నెండేళ్ళ వయసున్న బుడుగు, పండు అనే నా ఇద్దరు మేనల్లుళ్ళను తీసుకుని, ఒక మిత్రుడితో, అతని నలుగురు
స్నేహితులతో ఇలాగే తుంబురుకు బయలుదేరాం. అది తీర్థ దినం. దారి పొడవునా జనమే. మమ్మల్ని తీసుకొచ్చిన మిత్రుడు మధ్యలోనే వదిలేసి తన పాటికి తాను వెళ్ళిపోయాడు.
అతని నలుగురు స్నేహితులు కూడా అతని వెంటే. అప్పటికే చీకటి పడిపోయింది.
ఆరాత్రి అడవిలో ఇక్కడే వంటరిగా పడుకున్నాం. తెల్లవారుజామున లేచి తుంబురులోకి వెళ్ళి స్నానం చేసి తిరిగి వచ్చేశాం. నేను ఎంత ధైర్యంగా ఉన్నా, పిల్లలు భయపడిపోయారు. మరొక
సారి కూడా శేషతీర్థంలో ఇలాంటి అనుభవమే! మా పండును చూస్తుంటానన్న 'మిత్రుడు నేను స్నానం చేసి వచ్చేలోగా వెళ్ళిపోయాడు.

నాలుగున్నరకు నేను మధు లేచేశాం. మరొక ఇద్దరితో కలిసి మధు ఉప్మా తయారుచేశాడు. అంతా లేచేసరికి వేడి వేడి టీ సిద్దం చేశాడు. తుంబురులోకి బయలు
దేరే సరికి అరైంది. తెలతెలవారుతోంది. రాత్రి మునిగిన నీటి మడుగులోంచి నడుచుకుంటూ తుంబురులోకి ప్రవేశించాం.


తంబురు కోన చివర న ప్రకృతి ప్రియులు


రెండుగా చీలిన రాతి కొండ మధ్యలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాం. కొండ చీలికలోని అందాలను ఆస్వాదిస్తున్నాం. ఆచీలికలో ఎన్ని రూపాలు! ఎన్ని అందాలు! ఎన్ని భావనలు! చీలిన రెండు కొండల
అంచులు ఒకదాన్నొకటి చూసుకుంటూ మురిసిపోతున్నాయి. ఎదురుబొదురుగా ఉండడమే తప్ప ఎప్పుడూ కలవని కొండలు. తుంబురు అందాలతో ఎంత పరవశించిపోతున్నామో!
ఓహ్..ఆకాశాన్ని తాకుతున్న కొండ అంచులు! అప్పుడే ఆ రెండు కొండలను వెలుతురు తాకుతోంది. కళ్ళెత్తితే చాలు, కనకాభిషేకాలు!
పెద్ద పెద్ద బండ రాళ్ళను ఎక్కుతూ, దిగుతూ జాగ్రత్తగా ముందుకు సాగుతున్నాం. ఎన్ని వింతలు! ఒక కొండ అంచుకు, పెద్ద బండ రాయికి మధ్య మరొక పెద్ద రాయి ఇరుక్కుపోయింది. దాని కింద
నుంచి ముందుకు సాగాం. మధ్యలో నీటి గుండాలు. కొండ చీలికలో ఒక్కో చోట ఒక్కో రూపం. దాదాపు కిలోమీటరు వరకు ఆ చీలికలో అలా తన్మయులైపోయాం. కొండ రెండు చీలికలు చివరికి కలిసిపోయాయి. వాటి మధ్య ఇరుక్కుపోయిన పెద్ద పెద్ద బండ రాళ్ళు. పైనున్న వాటి సందుల్లోంచి జాలువారుతున్న జలధార.

ఆ జలధార కింద తడిసి అనందంతో తలమునకలైపోయాం. ఉబ్బి తబ్బిబ్బైపోయాం. మళ్ళీ వస్తామో లేదో, మళ్ళీ చూస్తామో లేదోనన్న

బెంగ. వచ్చిన ప్రతి సారీ ఇదే ఆలోచనతో తిరుగు ముఖం. వచ్చిన దారినే మేం విడిది చేసిన చోటు కు వచ్చే సామ్. తిరుగు ప్రయాణమయ్యేసరికి ఎనిమిదైంది.

పాపనాశనం వద్ద తెల్లవారు జామున ఆరుగంటలకు వదలడం వల్ల పెద్ద ఎత్తున తీర్థ జనం వచ్చేశారు. వాళ్ళను దాటుకుంటూ, వెంగమాంబ గుహవద్దకు వెళ్ళాం. మామండూరు

వైపునుంచి కూడా కొందరు తీర్థజనం వస్తున్నారు. తరిగొండ వెంగమాంబ ధ్యానం చేసిన గుహ ఇది. దాని ఎదురుగా రాళ్ళునిండిన ఏరు. ఆ ఏటిలో ముందుకు సాగుతున్నాం. కొన్ని చోట్ల రాళ్ళ కింద నుంచే ఏరు ప్రవహిస్తోంది. అటు పాపనాశనం నుంచి, ఇటు తుంబురు నుంచి వచ్చే నీరు ఈ ఏటిలో కలిసి ముందుకు సాగుతోంది


వెంగమాంబ గుహ


ఏటి పక్కనే కొండ అంచున అడవిలో సన్నని కాలిబాట. ఇవతల నుంచి అవతలకి, అవతలినుంచి ఇవతలకి ఏటిని దాటుకుంటూ వెళుతున్నాం. ఎడమ మైపున
కొండ అంచున సన్యాసి గుహ. ఒకప్పుడు సన్యాసులు అందులో నివసిచేవారని ప్రతీతి. ఇప్పుడు ఎలుగు బంట్లకు ఆవాసం. ఒక చెట్టుకు కొబ్బరికాయలకంటే పెద్ద
కాయలు కనిపించాయి. దాన్ని ఎలిఫెంట్ యాపిల్ అంటారు. ఏనుగులకు ఇవి మహాప్రీతిపాత్రం.


దారిలో కనిపించిన సన్యాసి గుహ


తుంబురు నుంచిఏటి పక్కనే నడుస్తున్నాం. ఏటిలో నడక చాలా ఇబ్బంది గా ఉంది. ఏ రాయి కదులుతుందో తెలియదు. జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాము.
ఎండ పెరుగుతోంది. బండిరుసుదగ్గరకు వచ్చేసరికి పదకొండున్నరైంది. వెనకటి రోజుల్లో మా మండూరు వైపునుంచి ఎద్దు బండ్లలో తీర్థ జనం తంబురుకు వచ్చే వారు. ఈ రాళ్ళ నిండిన ఏరు దాటేటప్పుడు ఎద్దుల
బండ్ల ఇరుసు విరిగిపోయేవి. దాన్ని 'బండిరుసు ఏరు' అంటారు. మామండూరు వైపు నుంచి అక్కడివరకే వాహనాలు రాగలుగుతాయి.


కొంత దూరం ఇలా ఏటిలో గులక రాళ్ళ మీద నడక


మా వాహనాలు బండిరుసు దా టాక కనిపించాయి. అక్కడినుంచి మామండూరు అటవీ గెస్ట్ హౌస్ కు వెళ్ళి, భోజనంచేసుకుని తిరుగు ప్రయాణం అయ్యాము. తిరుపతికి చేరే సరికి మధ్యహ్నం రెండుగంటలు. ఎండలో నడక వల్ల శరీరం బాగా అలిసిపోయింది.

తిరుపతి నుంచి తిరుమలకు 18 కిలోమీటర్లు. తిరుమల నుంచి పాపనాశనం వరకు 5 కిలో మీటర్లు. అక్కడి నుంచి తుంబురు ప్రవేశ ప్రాంతానికి అయిదున్నర కిలోమీటర్ల నడక. తుంబురులో
కొండ చీలికే దాదాపు కిలో మీటరు వరకు ఉంటుంది. తుంబురునుంచి మామండూరువరకు 12 కిలోమీటర్లు ఉంటుంది. అందులో ఎనిమిది కిలోమీటర్ల నడక. మామండూరు నుంచి తిరుపతికి 20 కిలోమీటర్ల
దూరం. ఈ విధంగా తుంబురు చూసి రావాలంటే దాదాపు 15 కిలోమీటర్ల నడక సాగించా లి.


తంబురు కోనలో రాళ్ళ పై నడక


అడవిలో, కొండల్లో నడక గొప్ప అనుభూతినిస్తుంది. ప్రకృతితో మమేకం చేస్తుంది. నాగరికత నుంచి, కాంక్రీటు వనాల నుంచి,
అప్పుడప్పుడూ ఇలా దూరం జరిగితే, శరీరం, మనసు శక్తిని పుంజుకుంటుంది. శరీర కష్టం ఏమిటో అనుభవపూర్వకంగా తెలుస్తుంది. కులాలను, మతాలను, హెూదాలను వదిలేసి కలిసి నడిచి, కలిసి భోజనం
చేసే సంస్కారాన్ని అందిస్తుంది. అందుకే తీర్థ రాజమైన తుంబురు కు ఒక వందనం.


Read More
Next Story