
ముఖ్రా గ్రామంలో ప్రైవేట్ బడులకు నో, ప్రభుత్వ బడికి జై
అదిలాబాద్ జిల్లా ముఖ్రా గ్రామం చారిత్రాత్మక నిర్ణయం. పిల్లలందరికీ ప్రభుత్వ బడిలోనే చదువు. ఇంగ్లీష్ మీడియం, ఆధునిక వసతులతో ఆదర్శంగా నిలిచిన పంచాయతీ.
ఇటీవల తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఒక ప్రభుత్వ ఇంగ్లీషు టీచర్
ప్రైవేట్ స్కూళ్లకు సపోర్ట్‌గా వీడియోల ప్రమోషన్ చేసినందుకు తెలంగాణ
ప్రభుత్వం వెంటనే సస్పెండ్ చేసిన వార్త వైరల్‌గా మారి సోషలో మీడియాలో చర్చలకు దారి తీసింది. ఈ నేపథ్యంలో ఒక గ్రామ సర్పంచ్ ప్రైవేట్ బడులపై
ఒక అరుదైన నిర్ణయం తీసుకున్నారు. అదే ఈ కథనం.
‘ మా పిల్లాడిని కాన్వెంట్?కి పంపాలంటే నెలకోసారి డబ్బుల టెన్షన్. ఆటోలో వెళ్తాడేమో, రోడ్డు మీద ఏం జరుగుతుందోనని భయం. ఇప్పుడు బడి మా ఇంటి దగ్గరే ఉంది. ఫీజు లేదు, భయం లేదు. పిల్లాడు నవ్వుతూ బడికి వెళ్తుంటే... తల్లిగా అంతకన్నా ఆనందం ఏం కావాలి?’ అన్నారు ఆ స్కూల్ పక్క గల్లీలో ఉన్న మహిళ.
తెలంగాణలో కొన్ని గ్రామాలు చదువులో వెనుకబడ్డాయనే మాట మనం తరచూ వింటుంటాం. కానీ అదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని ముఖ్రా (కె) గ్రామం ఆ మాటను తప్పు అని నిరూపిస్తోంది. అడవులు, వ్యవసాయం, సాధారణ రైతు కుటుంబాల మధ్య ఉన్న ఈ గ్రామం ఒక అసాధారణ నిర్ణయంతో ఈరోజు రాష్ట్రానికే కాదు, దేశానికీ ఆదర్శంగా నిలుస్తోంది.
ఆ నిర్ణయం ఏంటంటే ....
ఈ గ్రామంలో పిల్లలను ప్రైవేట్ స్కూల్ లకు పంపకూడదు. వినడానికి కఠినంగా అనిపించినా, దీని వెనుక ఉన్న ఆలోచన చాలా లోతైనది, మానవీయమైనది.
‘ ఒకప్పుడు ముఖ్రా (కె) గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల దాదాపు వెలవెలబోయేది. విశాలమైన భవనం , ఆట స్ధలం ఉన్నా, తరగతి గదుల్లో పిల్లల నవ్వుల శబ్దం వినిపించేది కాదు. 2016 నాటికి అక్కడ చదువుతున్న విద్యార్థుల సంఖ్య కేవలం 20 మందే. దానికి కారణం గ్రామంలోని తల్లిదండ్రులందరూ తమ పిల్లలకు మెరుగైన భవిష్యత్ కావాలనే ఆశతో ప్రైవేట్ కాన్వెంట్ స్కూల్‌ల వైపు మొగ్గు చూపారు.... ’ అన్నారు పంచాయితీ ఆఫీసులో మాతో మాట్లాడుతూ మాజీ సర్పంచ్ మీనాక్షి.
‘ ఫీజులు ఎక్కువైనా, స్కూల్‌లు దూరంగా ఉన్నా, ఆటోలలో ప్రయాణిస్తూ ప్రమాదాలకు గురవుతున్నా ‘ఇంగ్లీష్ వస్తుంది’ అన్న ఆశే కొందరు పేరెంట్స్‌ని ప్రైవేట్ స్కూల్ వైపు చూసేలా చేసింది.’ అన్నారు కొందరు గ్రామస్తులు.
గ్రామ సభలో తీర్మానం
ఈ పరిస్థితి గ్రామ పెద్దలను కలచివేసింది.
ప్రభుత్వమే లక్షల రూపాయలు ఖర్చు చేసి బడిని నిర్వహిస్తుంటే, ఆ బడి ఖాళీగా ఉండటం, పేద రైతులు అప్పులు చేసి పిల్లలను ప్రైవేట్ స్కూల్‌లకు పంపడం ఎంతవరకు న్యాయమనే ప్రశ్న గ్రామంలో మొదలైంది. ఈ ప్రశ్నే ఒక రోజు గ్రామసభగా మారింది. గ్రామస్తులంతా ఊరి పెద్దలతో సమావేశమై చర్చించారు. చాలాసేపు వాదనలు జరిగాయి. చివరికి ఒక చారిత్రాత్మక నిర్ణయానికి వచ్చారు. ముఖ్రా గ్రామంలోని ప్రతి పిల్లాడు ప్రభుత్వ పాఠశాలలోనే చదవాలి. ఎవరైనా ప్రైవేట్ స్కూల్?కి పంపితే వెయ్యి రూపాయల జరిమానా విధించాలి అని గ్రామసభ తీర్మానించింది.
బొట్టు పెట్టి ఒప్పించారు
ఈ తీర్మానం కాగితాలకే పరిమితం కాలేదు. సర్పంచ్ , ఉప సర్పంచ్, ఎంపీటీసీలు కలిసి ప్రతి ఇంటికి వెళ్లారు. తల్లిదండ్రులతో మాట్లాడారు. ఆడవారికి బొట్టు పెట్టి, పిల్లలకు కొత్త దుస్తులు, స్కూల్ బ్యాగులు, పుస్తకాలు ఇచ్చారు. “మీ పిల్లలను మన ప్రభుత్వ బడిలోనే చదివించండి. అన్ని వసతులు కల్పిస్తాం” అని నచ్చచెప్పారు. ఇది ఆదేశంలా కాకుండా, ఒక తల్లి తన బిడ్డ భవిష్యత్తు గురించి చెప్పిన మాటలా ఉండేది. మాట వినకపోతే జరిమానా ఉంటుందని చెప్పినా, ఎక్కువ మందిని ఒప్పించింది భయంతో కాదు---నమ్మకంతో.
మార్పు బడిలో మొదలవ్వాలి
అయితే గ్రామస్తులు ఒక విషయం బాగా అర్థం చేసుకున్నారు. పిల్లలను ప్రభుత్వ బడిలో చేర్పించాలంటే ముందు ఆ బడిని మార్చాలి. అందుకే శిధిలావస్థలో ఉన్న పాత స్కూల్ భవనాన్ని పూర్తిగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. విద్యాశాఖ అధికారుల చుట్టూ ఎన్నో సార్లు తిరిగి, సర్వశిక్ష అభియాన్ నిధులు సాధించారు. దాదాపు రూ.26 లక్షల వ్యయంతో సకల వసతులతో కూడిన నూతన పాఠశాల భవనాన్ని నిర్మించారు. మధ్యాహ్న భోజనానికి ఆధునిక వంటశాల, పిల్లల కోసం ఆటస్థలం ఏర్పాటు చేశారు. బడి చూడగానే పిల్లలకు ఇష్టం వచ్చేలా తీర్చిదిద్దారు.
తెలుగుతో పాటు ఇంగ్లీషు
ఇక్కడితో ఆగలేదు. ప్రైవేట్ స్కూల్‌లకు పిల్లలను పంపడానికి ప్రధాన కారణం ఇంగ్లీష్ మీడియమే అని గ్రహించిన గ్రామం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ పంచాయతీ నిధుల నుంచే ముగ్గురు అదనపు టీచర్లను నియమించి, ఇంగ్లీష్ మీడియంలో బోధన ప్రారంభించింది. ఉపాధ్యాయులకు జీతాలు కూడా గ్రామమే చెల్లిస్తోంది. ఫలితంగా పిల్లలు ఇంటి దగ్గరే, ఖర్చు లేకుండా, ప్రైవేట్ స్కూల్?కు ఏమాత్రం తగ్గని విద్యను పొందుతున్నారు.అలాగని తెలుగును తక్కువ చేయలేదు. తెలుగులో కూడా పాఠాలు చెబుతున్నారు.
‘ప్రభుత్వ బడి అంటే ఒకప్పుడు మాకు నమ్మకం లేదు. కానీ ఊరంతా కలిసి ఈ బడిని మార్చినాకే అర్థమైంది. డబ్బుతో కాదు... మన నిర్ణయంతో పిల్లల భవిష్యత్తు మారుతుందని. ఇప్పుడు నా కొడుకు ఇంగ్లీష్ మాట్లాడుతుంటే, అప్పు చేయకుండా చదివిస్తున్నానన్న గర్వం కలుగుతుంది.’ అదే గ్రామానికి చెందిన రైతు కూలీ.
విద్యార్ధుల సంఖ్య పెరిగింది
ఈ మార్పు ఫలితం త్వరలోనే కనిపించింది. విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఒకప్పుడు వెలవెలబోయిన బడిలో ఇప్పుడు పిల్లల సందడి వినిపిస్తోంది. ‘ ఒకప్పుడు ఈ స్కూల్ వైపు ఎవరూ చూడలేదు, ఇప్పుడు మాత్రం తల్లిదండ్రులే ఆసక్తిగా పిల్లలను చేర్పిస్తున్నారు. ఈ ప్రయత్నాల వల్ల పీజీ చదివినా ఉద్యోగం లేని ప్రమోద్‌తో పాటు మరో ఇద్దరికి విద్యా వాలంటీర్లుగా ఉపాధి కూడా లభించింది. ఒక బడి చదువుతో పాటు జీవనోపాధినీ అందిస్తోంది.’ అన్నారుఉ హెడ్మాస్టర్ సురేఖ .
ముఖ్రా గ్రామం ప్రైవేట్ స్కూల్‌లకు వ్యతిరేకం కాదు. కానీ తమకు ఉన్న ప్రభుత్వ వ్యవస్థను బలోపేతం చేసి, పేద పిల్లలకు నాణ్యమైన విద్యను అందుబాటులోకి తెచ్చింది. తల్లిదండ్రులు ఫీజుల కోసం అప్పుల పాలవకుండా కాపాడింది. పిల్లల ప్రతిభలో వచ్చిన మార్పు చూసి తల్లిదండ్రులే సంతోషిస్తున్నారు.
విద్యతో పాటు ఈ గ్రామం పరిశుభ్రత, పచ్చదనంలోనూ ముందుంది. మూడు వందల గడపలున్న ఈ గ్రామంలో ప్రతి ఇంటికి మరుగుదొడ్డి, ఇంకుడుగుంత ఉంది. తడి--పొడి చెత్త సేకరణ ద్వారా సేంద్రియ ఎరువు తయారీ జరుగుతోంది. ఈ కృషికి ఓడీఎఫ్ ప్లస్ గుర్తింపు లభించి, జాతీయ స్థాయికి ఎంపికైన ఏకైక పంచాయతీగా నిలిచింది. హరిత హారం, మియావాకీ అడవి, 30 వేల మొక్కలతో ముఖ్రా (కె) నిజమైన హరిత గ్రామంగా రూపాంతరం చెందింది. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి నెల గ్రామ పంచాయతీ ఆదాయం నుంచీ, ప్రజాప్రతినిధుల గౌరవ వేతనాల నుంచీ హరిత నిధికి విరాళం ఇవ్వడం ఇక్కడ ప్రత్యేకత.
ముఖ్రా (కె) గ్రామం చూపిన దారి చాలా స్పష్టం. మంచి నిర్ణయాలు ప్రభుత్వాల నుంచే రావాలన్న నియమం లేదు. గ్రామం ఒక్కటై ఆలోచిస్తే, చదువు కూడా మారుతుంది, భవిష్యత్తు కూడా మారుతుంది. అన్న నమ్మకమే ఈ గ్రామాన్ని దేశానికి ఆదర్శంగా నిలిపింది.

