పశువులు బయటకు పోతానే, దొరగారి పశువుల దొడ్డి బడిగా మారిపోయేది...
x

పశువులు బయటకు పోతానే, దొరగారి పశువుల దొడ్డి బడిగా మారిపోయేది...

నా నుంచి నా వరకు: 3 (కవి, రచయిత జూకంటి జగన్నాథం జ్ఞాపకాలు)


నాకు ఐదేళ్లు వయసు దాటిదాటగానే మా అమ్మ బలవంతంతో అప్పటికే చదువుకుంటున్న మా అన్న సర్కార్ బడిలో మా బాపు నన్ను చేర్పించాడు. అప్పటికిఅన్నా నేను ఇద్దరమే మా ఇంట్లో పిల్లలము. చిన్న బాపులు ముగ్గురు ఉండేవారు. మా నాయనమ్మ లెమ్మంటే లేవాలి కూసోమంటే కూర్చోవాలి అంత భయంలో పెట్టింది. ఎవరైనా చెప్పింది వినకుంటే ఆరోజు ఇంట్లో పెద్ద గొడవ పంచాయతీ అయ్యేది. .మా నాయనమ్మ అంటే మా ఇంటిలోనే కాదు మా వాడలోనే కాదు చుట్టుపక్కల ఊర్లలోనూ పెద్ద హడల్ . ఎప్పుడు ఎవరిని ఎందుకు ఏ విధంగా బండబూతులు తిడుతుందో అని మా నాయనమ్మ నోటికి మొక్కేవారు. ఎవరూ దాని జోలికి పోయేవారు కాదు.

అప్పుడు మాకు రెండు పాలు ఇచ్చే బర్లు ఉండేవి. ఆ పాలను మా నాయనమ్మ పిడకలు కొట్టి నిప్పులతో దాలిని అంటించి పాలు కాగ పెట్టే కుండను అందులో వుంచి పైన సిబ్బిని మూతగా పెట్టేది. ముగ్గురు చిన్న బాపుల మధ్య పెరిగిన మమ్మల్ని బాగా గారాభంగా చూసేవారు.

మా అన్నకు అప్పటికే ఇంట్లో బుద్ధిమంతుడు అనే పేరు ఉండేది. ఎందుకంటే ఆయన రోజూ బడికి పోయి వచ్చి మా అమ్మ చెప్పినట్టు వింటూ వాచకాలు చదువుకునేవాడు రాసుకునేవాడు. ఇక నేను సరే అని చెప్పింది విని నా మిత్రులతో కలిసి స్కూలు ఎగ్గొట్టి బడికి దూరంగా వాగు ఒడ్డున ఉన్న మర్రి చెట్టు కింద గోటీల ఆటలు ఆడుకొని , వ్యవసాయ పెద్ద మోట బాయిలలో ఈతలు కొట్టేవాళ్ళం.

అన్నతో పాటు నన్ను స్నానం చేయించి మా అమ్మ దువ్వెనతో తల దువ్వి ఉతికిన బట్టలు తొడిగి రాత్రి మిగిలిన చల్ది అన్నంలో చింతకాయ తొక్కుతో మంచి నూనె కలిపి తినిపించి బడికి తోలేది. నేను మా అన్న వెంట బడికి పోయేవాడిని. కానీ వెంటనే బయటకు మిత్రులతో కలిసి వచ్చి వాగొడ్డున ఉన్న పెద్ద మర్రి చెట్టు కింద ఆటలాడుకునేవాళ్ళం. ఎప్పుడైనా చెప్రాసి బెస్త పోశాలు మమ్మల్ని బడికి పట్టుక పోవడానికి చింత బరిగె వచ్చేవాడు. మేము దూరం నుంచి చూసి చెట్టు ఎక్కే వాళ్ళం . ఏమీ అన కిందికి దిగమనేవాడు. మేము అస్సలు దిగేవాళ్ళం కాదు. పోశాలు చూసి చూసీ తిరిగి వెళ్లిపోయేవాడు. ఈమధ్య బడి విడిచి పెట్టే మధ్యాహ్న సమయం అయ్యేది. నేను నా సంచి పట్టుకొని ఏమీ ఎరగనట్టు మందిలో కలిసి బడి నుంచే వస్తున్నట్టు మా అన్న వెంట ఎప్పటిలాగా ఇంటికి పోయేవాడిని. తల చెదిరిన నా అవతారాన్ని చూసి మా అమ్మ తమ్ముడు బడికి వచ్చిండారా మా అన్నని అడిగేది. ఆయన నిశ్శబ్దంగా నాతో బడికి వచ్చింది కానీ మధ్యలో చూసేసరికి తరగతి గదిలో కనిపించలేదు అన్నాడు. అరేయ్ జగనూ బడి తప్పించి ఏడ ఆడుకొని పోయినవ్ రా అని గద్దించి అడిగేది. నేను అమాయకంగా ముఖం పెట్టి అమ్మా బడిలోనే ఉన్నాను అనేవాణ్ణి. మా అమ్మ నా గురించి మొత్తం తెలిసినట్టు కోప్పడేది. మా బాపు గానుగ కట్టేవాడు వచ్చి వాడే చదువుకుంటాడు తీయ్ అన్నం పెట్టు మళ్లీ పగటిపూట బడికి పోతరు అంటూ వెనకేసుకొచ్చేవాడు.

1961 ప్రాంతంలో మా బడి దొరగారి పశువుల దొడ్డిలో ఉండేది. పొద్దున పశువులు మేతకు పోయాక పెండ ఉచ్చ గడ్డీ తీసేసేవారు. అనంతరం జనపనార పట్టాలను కింద మూడు నాలుగు వరసలు పరిచేవారు. వాటి పైన విద్యార్థులు కూర్చునేవారు. సార్లకు ఒక కుర్చీ ముందు టేబుల్ ఉండేది వెనుక గోడకు ఒక బ్లాక్ బోర్డు తలిగించేవారు . అంతా పశువుల మూత్రం రొచ్చు పెండా ఒక రకమైన వాసన కలగలిసి వచ్చేది. అప్పుడు మా స్కూల్ హెడ్మాస్టర్గా కొన్ని రోజులు విఠల్ మరికొన్ని రోజులు వెంకట నరసయ్య సార్లు సిరిసిల్ల నుండి వచ్చి పని చేసేవారు. మా ఊరి ఆనందం, జ్ఞానానందం బద్దెనపల్లి నుంచి సైకిల్ పైన వచ్చే నాగభూషణం సార్లు అన్ని తరగతులకు పాఠాలు చెప్పేవారు.

ఆ రోజుల్లో బేసిక్ ఎడ్యుకేషన్ ఉండేది. గోడకు తలిగేసిన కాట్నాలను కింద పెట్టి ప్రతి విద్యార్థికి రాట్నం, పత్తి ఏకు ఇచ్చి దారం వడకమనేవారు. క్రాఫ్ట్ టీచర్ జ్ఞానందం సారు ఈత కమ్మల చీరుకొని తెచ్చి ఆ ముక్కలతో జింకలను వివిధ ఆకారాల పెంపుడు జంతువులను అల్లేవాడు విద్యార్థులకు ఇచ్చి అలా అల్లమని తర్ఫీదు ఇచ్చేవాడు . నాకైతే రత్నం తిప్పుతూ పడికే దారం ఎప్పటికీ తెగిపోతుండేది. ఇక ఈత కమ్మలతో పెంపుడు జంతువులను అస్సలు అల్లక రాకపోయేది. టీచర్ ఈత ముల్లుతో నొప్పి కలిగేలా కుచ్చేవాడు. రాట్నం మీద దారం వడక రాని విద్యార్థులకు మట్టలు మీద చింతబరిగెతో సురుక్కు మనేలా కొట్టేవారు. అటు వాన కాలం చదువు చదివ లేకపోతే, ఇటు క్రాఫ్ట్ అని అస్సలు వచ్చేది కాదు. ఈ దెబ్బల బారి నుంచి బడి తప్పించి నావంటి వారితో కలిసి బయట మామిడి తోటలో చింతతోటలో వివిధ రకాలైన ఆటలు ఆడుకునేవాళ్లం . మొత్తానికి నా ప్రాథమిక విద్యాభ్యాసం అంతా మా ఊరిలో అటసటాలు గానే సాగింది అని చెప్పాలి.

ఎండకాలం వచ్చిందంటే ఒంటి పూట బడులు ఉండేవి. బడి తర్వాత ఇంటికొచ్చి మధ్యాహ్నం తిని బయటపడి సోపతి గాళ్ళతో చెరువులకో రాయి మోట బాయికో ఈత కొట్టడానికి వెళ్లే వాళ్లం . అసలు సమయం తెలిసేది కాదు. రెండు మూడు గంటల వరకు ఈత కొట్టేవాళ్లం. గడ్డ మీదికి వచ్చి పొడి బట్టలు వేసుకొని ఒకరి ముఖాలు ఒకరం చూసుకొని నీ కళ్ళు ఎర్రగున్నయ్ అంటే నీ కళ్ళు ఎర్రబడ్డాయి అనుకునేవాళ్లం. తల మీద జుట్టు రాగి వెంట్రుకల్లా నిక్కబొడుచుకొని తలంతా చిందరవందరగా ఉండేది . ఇంట్లో వాళ్ళు మమ్మల్ని ఈతకు పోయినట్టు అసలు ఏర్పాటు చేయకుండా అప్పటికే ఒక ఉపాయం కనిపెట్టాము .

అది మా ఇంట్లో గానుగ కొట్టం లోకి పోయి గానుగలో అడుక్కు అప్పటికే ఊరిన మంచి నూనెను తలకు రుద్దుకొని, మా ఇంటి వెనుక పెరట్లోని గడ్డివాములో దాచుకున్న విరిగిన అద్దంముక్క, దువ్వెనతో ముఖం చూసుకుంటూ దువ్వుకునేవాళ్లం .కాళ్లకు చేయిలకు నూనె చమురును బూడిద బూడిదైన చర్మంపై ఏర్పడకుండా రాసుకొని మంచిగున్ననా అంటే నేను మంచిగా ఉన్నానా అనుకొని ఎవరి ఇళ్లళ్లకు వాళ్లం ఏమి తెలియనట్టు పూర్తి అమాయకంగా ముఖం పెట్టి పోయేవారం.

ఇంట్లోకి అడుగుపెడుతున్నమో లేదో మా అమ్మ అరేయ్ ఇంతసేపు ఎటు పోయినవ్ రా అడిగేది. ఎటు పోలేదు ఇంట్లోనే ఉన్నా అని చెప్పేది. ఈత కొట్టడానికి పోయినట్టున్నారు కదరా అని ప్రశ్నించేది .నేను ఏది తలకు నూనె అట్లనే ఉన్నది ఇంకా చూడు అమ్మా అనే వాడిని. మా అమ్మా ,బాపు చిన్నబాపులు తమలో తాము నవ్వుకుంటూ ఆ మా తెలిసింది తియ్యిరా ముఖమంతా నూనె కారి, కండ్లు ఎర్రగా అయిపోయాయి. మరి ఎటు పోయిండ్రురా ఎర్రటి ఎండలో ఏమి మాముల చేయబోయార్రా అనేది. ఇంత మంచిగా తయారైన ఈతకు పోయినట్టు ఎట్లా తెలిసింది వీళ్ళకి అని తెల్లారి మిత్రులందరం కలిసి అమాయకంగా చర్చించుకునే వాళ్లం.

పిల్లలను పెద్దలు చూసే తీరు గురించి ఒక ముఖ్య సంఘటన మీతో పంచుకోవాలని అనిపిస్తుంది. ఇక నా మిత్రులతో కలిసి ఫక్తు బడి తప్పించి నా ఇష్టం వచ్చినట్టు ఆయా కాలాల్లో ఆడే తీరొక్క ఆటపాటలు ఆడుకునే వాళ్లం . అందులో భాగంగానే ఆ సంవత్సరం కాముని పున్నం వచ్చింది. మా బాపుతో నేను కోలలు కావాలి అని జాజిరి ఆడుకోను అడిగాను. ఆయన మా అమ్మకి తెలియకుండా పోయి వడ్ల లక్ష్మీపతి తాత దగ్గర కోలలు చేసి తీసుకొచ్చి నాకు ఎవరికి చెప్పకు రా అంటూ ఇచ్చెవాడు . నేను అంతే రహస్యంగా కోలలను మా ఇంటి వెనుక గడ్డివాములో దాచుకునేవాడిని. కాముని పున్నానికి రెండు రోజుల ముందు ఆడోళ్ళు చప్పట్లు కొడుతూ కాముని పాటలు, పిల్లలు జాజిరి ఆటపాటలతో ఇల్లల్లూ తిరుగుతూ ఆడుకొనేవారు.పొద్దు గూట్లో పడగానే ఊరంతా మారుమోగిపోయేది. నేను నా మిత్రులు సరే మా ఇంట్లో మా అమ్మకు చిన్న బాపులకు తెలయకుండా మా ఇంటికి దూరంగా ఉన్న వాడల్లో తిరుగుతూ జాజిరి ఆటలు ఆడుతున్నాము. అప్పటికే జాజిరి ఆడగా వచ్చిన బియ్యాన్ని బుస్స సోమయ్య దుకాణంలో అమ్మి పుట్నాలు బెల్లం కొనుక్కోవాలని, మిగతా ఎవరైనా ఇచ్చిన పైసలు పంచుకొని గోటీలు ఆడుకోవాలని ప్రణాళికలు రచించుకున్నాం . అప్పుడు మా ఊర్లో కరెంటు లేదు. పిండి ఆరబోసినట్టు వెన్నెలలో ఆడుకుంటూ ఆడుకుంటూ నేను అలసిపోయి నాకు తెలియకుండానే ఎవరి గద్దె మీదనో నిద్ర వచ్చి పడుకున్నాను. ఊరంతా సద్దుమణిగింది. రాత్రి బాగా పొద్దుపోయింది.

ఇంత అద్మ రాత్రి దాటినా ఇంటికి రాకుండా నేను ఎటు పోయానో అని మా అమ్మ ఏడుపు అందుకుంది. ఇక మా బాపూ ముగ్గులు చిన్న బాపులు మా నాయనమ్మతో సహా అందరూ నాకోసం ఊరంతా వెతుకసాగారు అనే బదులు గాలించసాగారు అంటే సబబుగా ఉంటుంది. ఎన్నీల బాగా కాస్తుంది. నడిపి చిన్న బాపు వ్యవసాయ బావులు , చెరువు దిక్కు పోతే, మిగతా వారు వాగు వైపు పోయి నాకోసం చూడసాగారు. అర్ధరాత్రి దాటిపోయింది మా బాపు బాగా ఆందోళన చెందాడు . చివరికి వెతుకగ వెతికగా ఒకరి ఇంటి ముందు గద్దె అరుగు మీద పడుకొని గాడ నిద్రలో ఉన్నాను . మా బాపు బాగా విసిగిపోయి నన్ను లేపి ఎంత సేపాయరా నీకోసం వెతకబట్టి అంటూ కోపంగా గట్టిగా చెయ్యితో రెండు దెబ్బలు కొట్టాడు. నేను ఏడుపు ఎత్తుకున్నాను. మళ్లీ మా బాపు నన్ను దగ్గర తీసుకొని ఊకించి భుజం మీద ఎత్తుకొని ఇంటికి తీసుకుపోయాడు. చిన్న బాపులు మా నాయనమ్మా ఒక్కరు ఒక్కరు గా ఇంటికి వస్తున్నారు. మా అమ్మ నన్ను దగ్గర తీసుకొని వెక్కి వెక్కి దుఃఖించింది.

తెల్లారిన తర్వాత మా బాపు రాత్రి నన్ను కొట్టినందుకు ఏమనుకున్నాడో ఏమో కానీ తెల్లారి మార్కెట్లో ఉన్న మల్లమ్మ హోటల్లో తీసుకపోయి నాకు బాద్ షా తినిపించాడు. అప్పుడు మా బాపు నన్ను చూసి నీళ్లు నిండిన కండ్లను ఎర్ర గీతల దుబ్బాక రుమాలతో ముఖం పక్కకు తుడుచుకున్నాడు .

Read More
Next Story