
ఇస్తార్ల కట్టలు - నూకల పరం
నా నుంచి నా వరకు 10(కవి, రచయిత జూకంటి జగన్నాథ జ్ఞాపకాలు)
వానాకాలం మొదలుకాగానే ఎండాకాలంలో నిలువ చేసిన మోదుగ ఆకు తోరణాలను ఒక్కటొక్కటిగా తీసి మా అమ్మ రాత్రి ఆ ఎండిన ఆకుల పైన నీళ్లు చిలకరించి సాపు చేసి ఆకు మడతలను ఇస్తర్లు కుట్టడానికి ఇసుర్రాయి కింద అణుగ పెట్టేది. ముందే చీరి పెట్టుకున్న చొప్ప పుల్లలతో రోజూ 100 ఇస్తార్లు కుట్టి, జనప దారంతో కట్ట కట్టి పెట్టేది.
అలా కుట్టన ఇస్తార్ల కట్టలు నాలుగు ఐదు కాగానే మా బాపుతో అమ్మడానికి సిరిసిల్లకు పంపించేది. ఆయన సిరిసిల్లలోని ప్రతి వాడ వాడ తిరుక్కుంటూ "ఇస్తారు కట్టలూ" అంటూ తిరిగి అమ్మేవాడు. రూపాయి పావులకు ఒక కట్ట చొప్పున అమ్మమని మా అమ్మ చెప్పేది. కానీ ఎవరు కానీ ఎవరూ కొనకపోయే సరికి విసిగిపోయి చివరికి పెద్ద బజార్లో ఉన్న హనుమాన్ గుడి దగ్గరి దుకాణం వారితో కోసీజ్ చేసి చేసి రూపాయికి ఒక కట్ట చొప్పున అమ్మేవాడు. అమ్మగా వచ్చిన ఐదు రూపాయలు తీసుకొని మార్కెట్లోని గ్రామపంచాయతీ దుకాణాలలో అమ్మే చిన్నచిన్న రేగడి మట్టి పెల్లలు ఉన్న నూకల పరాన్ని రూపాయికి ఒక కిలో చొప్పున 5 కిలోల నూకలను తీసుకువచ్చేవాడు. మా అమ్మ రాగానే ఎంతకు అమ్మినవని ప్రశ్నించేది.
ఆయన నిశ్శబ్దంగా బాయి మీద బొక్కెనతో నీళ్లు చేదుకొని, స్నానం చేయడానికి నడిచేవాడు . వచ్చి అన్ని అన్నీ తయారు పెట్టగానే పూజ చేసుకొని , పీట వేసుకొని అన్నం పెట్టమని కూర్చునేవాడు. మా అమ్మ అప్పటికే కట్టెల పొయ్యిమీద వండిన అన్నం పళ్లెంలో పెట్టి, సప్పటి పప్పు పచ్చి పులుసు పోసేది. పక్కకు చింతకాయ తొక్కు పెట్టేది. మొదటి వాయి పప్పు చింతకాయ తొక్కు కలుపుకొని అందులో గాండ్ల కులానికి మొదటి నుండి ఉన్న అలవాటు వలన రెండుమూడు గంటెల నువ్వుల నూనె వేసుకొని ఇష్టంగా తినేవాడు. మా అమ్మ ఉబలాటం ఆపుకోలేక మళ్ళీ ఇస్తారు కట్ట ఎంతకు ఒకటి అమ్మినావని అడిగేది. తినే దాకా ఓపిక లేదా చెప్త తీయ్ అని మా అమ్మ వైపు కోపంగా చూసేవాడు.
మా అమ్మ తినే వరకు చూసి, మళ్లీ అడిగింది. ఆయన చెప్పాడు. మా అమ్మ నేను చెప్పిందేంది నువ్వు చేసుకొచ్చింది ఏంది అని కోపంగా అడిగింది. తిరిగి తిరిగి కాళ్లు నొప్పి పెట్టాయి. నువ్వు చెప్పిన ధరకు ఎవరూ తీసుకోలేదు. అందుకే పావులా తక్కువకు అమ్మాను అని చెప్పాడు . ఇంకో కిలో నూకలు వచ్చేది పిల్లలు ఒకరోజు తినేవారు. ఏ పని చేసుకురమ్మన్నా నీ తరీఖ ఇలాగే ఉంటంది మా అమ్మ అనేసరికి, మాటకు మాట అంటే పెద్ద పంచాయతీ అవుతుంది. చేయి కడుక్కొని విసురుగా పోయి మా బాపు పెద్దపీట మీద పడుతున్నాడు . మా బాపుకు తిన్న తర్వాత రోజూ ఒక గంట నిద్ర పోయే అలవాటు ఉండేది. కానీ మా అమ్మ ఎంత నిద్ర వచ్చినా ఆపుకొని రెండు వేయించిన చింత గింజలు నోట్లో వేసుకొని విస్తర్లు కుట్టుకుంటూ ఉండేది.
పొద్దున నాలుగు గంటలకు లేచి మా అమ్మ దగ్గర దగ్గర ఎకరం వాకిలి ఊడ్చీ మా బాపు నీళ్లు చేదుకొచ్చి బకేట్లో పోస్తుంటే, పెండతో కలిపి పచ్చగా వాకిలి చల్లేది. ఇంటి ఇరువైపులా ఉన్న గద్దెలను ఎర్ర మన్నుతో అలికేది. వాకిట్లో, గద్దెల మీద చిటికెల సుద్ద ముగ్గు చూడ చక్కగా వేసేది. గోడలకు సున్నం నీళ్లు పాలు కలిపి ఇనుప దువ్వెనతో వరుసగా తెల్లని చుక్కల తీగెలు పెట్టేది. అలుకు పూతలు చేసిన తర్వాత అదో రుచికరమైన కమ్మనిమట్టి వాసన వచ్చేది. చూడముచ్చటైన ముగ్గుల చుక్కలను వచ్చి పోయావారు చూసి సుశీలవ్వతొనే గాండ్ల దుర్గయ్య ఇంటికి లక్ష్మీ కళ వచ్చిందని మెచ్చుకుంటూ పోయేవారు.
మక్క బూరు తీయడానికి పోయేవాళ్లం. పనికి పోయిన మా ముగ్గురికి ఒక్కొక్కరికి రెండు చేతుల ఎండిన కంకులు కైకలి వేసేవారు. సాయంత్రం వచ్చి మా అమ్మ నిన్న తీసుకొచ్చిన నూకల పరాన్ని చిన్న చిన్న రాళ్లు మట్టి పెల్లలు లేకుండా గాలించింది. కట్టెలతో పొయ్యి రాజేసి నూకలను వండింది. కొత్త చింత పండు నానపెట్టి నిప్పుల మీద ఎండు మిరపకాయలను కాల్చి పిసికి చేసి పెట్టుకున్న పులుసులో కలిపేది. వేడివేడి నూకల అన్నం లో పులుసు పోసుకొని కలిపి ఎంతో ఇష్టంగా తినేవాళ్ళం. అనే బదులు తాగేవాళ్ళం అనడం సబబుగా ఉంటుంది.
రాత్రి తిన్న తర్వాత అమ్మ కంకులు ఒల్చి మక్కలను గంపలో పోసి పెట్టింది. మబ్బుల లేసి అమ్మా బాపు కలిసి రోకళ్లతో దంచారు. దంచిన తర్వాత చాటతో కోడి మక్కగటుకను, పిండినీ రెండుగా వేరు చేసింది.
మా అమ్మ ఇగురంతో సాయంత్రం ముట్టిచ్చిన పొయ్యి మీద పెనం పెట్టి మక్కపిండిలో నానపెట్టిన పెసరపప్పు వేసి కారం రొట్టెలు రుచికరంగా చేసింది. వంటింట్లో గ్యాస్ నూనె దీపం వెలుగులో ఆరుగురు పిల్లలకు మా బాపుకు మనిషికీ ఒక రొట్టె తినడానికి ఇచ్చింది. బాపు అమ్మను తినమంటే, మీరు తినుండ్రి. తరువాత నేను తింటాను అని సున్నితంగా చెప్పింది .
మేమంతా ఎంతో ఇష్టంగా రొట్టెలు తిని పడుకున్నాము. తెల్లవారితే పని తొందరగా తీరదని, మా అమ్మ బోళ్లను జారాట్లో వేసి తోమి పెట్టుకునేది.
మేము నిద్ర లేచే సరికి మా అమ్మ పెద్ద శోకం పెట్టి ఏడుస్తుంది. మేము బీరిపోయి ఏమైందని చూస్తున్నాము. ఇంతలో చుట్టుపక్కల వాళ్ళు వచ్చి ఏమైంది అని అడిగారు. మా అమ్మ దుఃఖిస్తూనే రాత్రి నేను తినక, పిల్లల కోసం మూడు రొట్టెలు ఉంచితే కుక్క వంటింటి తలుపు సందుల నుంచి వచ్చి ఎత్తుకపోయింది అక్కా నా పిల్లల ఆకలి తీరేదని తలుచుకుని తలుచుకుని ఏడ్చింది. మా అమ్మ ఉప్పిడి ఉపాసం ఉండి, మమ్ముల్ని తన కడుపు కట్టుకొని పెంచి పోషించింది .
మా అమ్మ జీవితకాలం అంతా తన పిల్లలు పెరిగి పెద్ద వారై నలుగురిలో అవుననిపించుకునేలా బతకాలని ప్రయోజకత్వం పొందాలని పగలు రాత్రీ కష్టపడిన రోజులు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా, ఇప్పటికీ 70 ఏళ్ల వయస్సు వచ్చినప్పటికీ నా కళ్ళు సముద్రాలవుతాయి.