
అమ్మమ్మ ఊరికి నా ప్రయాణం, బాలారిష్టాలు
నా నుంచి నా వరకు: 4 (కవి, రచయిత జూకంటి జగన్నాథం జ్ఞాపకాలు)
ఎటువంటి మ పరిస్థితుల్లో నన్ను నన్ను మా అమ్మమ్మ ఊరికి తీసుకుపోయారో చెప్పాను. అదే విధంగానే నేను రోజూ తొడుక్కునే రెండు జతల బట్టలను ఒక ఇనుప ట్రంకు పెట్టెలో సర్ది మా మేనమామ అంటే మా అమ్మ అన్న వెంట"ఎటువంటి స్థితులు దాపురించెరా మనకు" మా అమ్మ హృదయ విదారకంగా ఏడుస్తూ పంపించింది. అప్పటికే మా అమ్మమ్మ ఊరు గురించి చుట్టుపక్కల ఊర్లలో ఒక సామెత వినిపించేది. అది పలుగు రాళ్ల వ్యవసాయ భూములున్న గుండారెడ్డి పల్లెకు ఎడ్లను అమ్మ వద్దు నీళ్ల కరువు ఉండే తంగళ్ళపల్లికి ఆడపిల్లలను ఇవ్వ వద్దనే సామెత ప్రజల నోళ్లలో నానుతుండేది. అదిగో అటువంటి ఊరిలోకి వచ్చి నేను పడ్డాను. తెలవని ఊరిలో మొరగని కుక్కలా నా పరిస్థితి ఆ రోజుల్లో ఉండేది. కొత్త వాతావరణం, కొత్త ఊరు, అప్పుడప్పుడే అవుతున్న కొత్త మిత్రులు.నేను మా ఊరిలో మెదిలిన నా ప్రవర్తనకు ఇక్కడి పరిస్థితులు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. ఇక్కడ మిళితమై నేను సర్దుబాటు కావడానికి కొంచెం ఆలస్యం అయ్యిందని చెప్పాలి.
మా మామ పులిజాల రాజయ్య ఊర్లో పెద్దమనిషి. ఆ ఊరిలో అడుగుపెట్టిన తెల్లారి నన్ను ప్రభుత్వ పాఠశాలకు స్వయంగా వచ్చి మూడవ తరగతిలో చేర్పించాడు. ఆయన చెప్పడం వల్ల సార్లు నాకు ఎలాంటి మౌఖిక పరీక్ష కూడా పెట్టకుండా బడిలో చేర్చుకున్నారు.
నాకేమో సరిగ్గా "అ ఆ" లు కూడా రావు. ఎక్కాలు సరే సరి మొదటి త్రైమాసిక పరీక్షలలో అత్తెసరు మార్కులు వచ్చినయ్. మా క్లాస్ సార్లు నిలబెట్టి ప్రశ్నలు అడిగేవారు రాకుంటే జవాబు చెప్పిన వారితో ముక్కు చెంపదెబ్బలు కొట్టించేవారు. ఇద్దరు ముగ్గురు ఆడ పిల్లలూ ఉండేవారు. వారు సరి అయిన సమాధానం చెప్పినప్పుడు మగ పిల్లలను వారితో కూడా కొట్టించేవారు. నాకు అవమానంగా అనిపించేది. అంతా కొత్త కొత్తగా ఎవరితో పంచుకోరాదు. వేరే వారితో చెప్పుకోరాదు. నాలో నేనే మదనపడి అతికష్టం మీద చదవడం రాయడం నేర్చుకున్నాను. ఇంటికి పోతేనేమో మామది ఊర్లో పేరు ఉన్న కుటుంబం. ఆయన కావాలని నాతో ఉత్తరాలు వాళ్ళ బావ అక్క చెల్లెల్లకు రాయించేవాడు. రాసిన తరువాత కార్డును చూసి తప్పులు ఉంటే ఇష్టం వచ్చినట్టు కోప్పడే వాడు. నేను మౌనం వహించి కోపం రేషం ఎంత వచ్చినా నాలోనే కుక్కుకొని తలకిందుకి వేసుకొని కాళ్లను నేలకు నిరసనగా నేలకు కొట్టుకుంటూ బయటకు నడిచే వాడిని. బహుశా ఆ రేషమే కోపమే నేలకు కొట్టిన బంతిలా పట్టుదలగా మారి నాలుగో తరగతిలోకి వచ్చే సరికి చదువుకునే పిల్లల్లో నేనొక్కడిగా పేరు తెచ్చుకున్నాను.అంటే నా వయస్సు అప్పటికి తొమ్మిది సంవత్సరాలు . ఉదయం బడి వేళ నీళ్ళ కరువు వలన పొద్దున లేసి బిందెలు బొక్కెన శాంతాడు పట్టుకొని నేనూ మా మేనత్త అన్నవ్వ బామాండ్ల జానకిరామయ్య సార్ బాయి కాడికో, కోమట్ల పవిత్రపు లచ్చయ్య చేద బావి దగ్గరికి పోయే వాళ్ళం. అప్పటికే అక్కడ ఉన్న వాళ్లు నీళ్లు చేసుకుని వెళ్లిపోయాక, నేను సీత పాతాళం లోతుల్లో నుంచి ఎగిరెగిరి బొక్కెన తో నీళ్ళు చేది బిందెలు నింపేవాడిని. మా అత్త నేను పిలిచే అన్నక్క బిందెలెత్తుకొని ఇంట్లో పోసి వచ్చేది. ఇంటికి బాయి దగ్గరకి దాదాపు రెండు ఫర్లాంగుల దూరం ఉండేది.. బావిలో నుంచి నీళ్లు చేది చేది నా అరచేతులు ఎర్రబారి పొక్కులు వచ్చేవి. నీళ్లు సరిపోయాక ఇంటికి పోయి స్నానం చేసి రాత్రి గిన్నెలో మిగిలిన అడుగుబొడుగు అన్నం మామిడికాయ తొక్కు తో కలిపి తిని బడికి ప్రార్థనకు అందబోయేవాడిని. సాయంత్రం ఇంటికి రాగానే ఎడ్లకు తౌడు పల్లి పిండి కలిపి చేసిన ముద్దల అంచెను తీసుకొని దూరంగా దొడ్డిలో ఉన్న పశువుల నోటికి ఒక్కటొక్కటిగా తినిపించి చీకటి పడుతుండడంతో భయంతో పరిగెత్తుకు వచ్చేవాడిని. ఇంటికి రాగానే మా మామ ఇంకా అవి చేయలేదు ఇది చేయలేదు అని ఏదో ఒకటి అనేవాడు. పొద్దూకి ఎక్క దీపం వెలుతురులో రాసుకుని చదువుకునేవాడిని. ఇది మా అమ్మమ్మ ఇంటి లో నా రోజువారీ దినచర్య. ఇలా కాలం దొర్లిపోతుండగానే ఆరో తరగతిలోకి వచ్చాను. నా ప్రాథమిక ఉన్నత పాఠశాల క్లాస్ మెట్లు జానకి రామయ్య సార్ చిన్న బిడ్డ రాజ్యలక్ష్మి, అవుసు లొల్ల అన్నయ్య చారి, బండమీది వీరయ్య బావ రాధక్క ఏకైక కొడుకు రాజమౌళి, బుర్ర సత్తయ్య గౌడ్ తదితరులు ఉండేవారు.
ప్రతి ఎండాకాలం సెలవుల్లో మా ఇంటి నుంచి ఎవరో ఒకరు వచ్చి నన్ను తీసుకుపోయేవారు. మళ్లీ బడి తెరిసే సమయానికి సిరిసిల్లలో తరగతి పుస్తకాలు కొన్ని కాపీలు చార్ నంబర్ అశోక పెన్ను సిరా బుడ్డి కొనిచ్చి మా అమ్మ బాపులు బాధపడుతూ, మా మామ ఊరికి తోలేసేవారు. కర్కషంగా కాలం కొనసాగుతుండగానే సాయంత్రం బడి నుంచి వచ్చి పుస్తకాలు ఇంటి ముందున్న సిమెంట్ అరుగులపై పెట్టి, అలాగే నిద్రపోయే వాన్ని. ఇలా కొన్ని రోజుల తర్వాత మా అమ్మమ్మ రోజూ వీడు ఎందుకిలా పడుకుంటుంన్నాడని అని నన్ను ముట్టి చూసింది. అగ్గోలె జ్వరంతో శరీరం కాలిపోతుంది. రెండు మూడు రోజుల్లో జ్వరం మరింత పెరిగింది. ఏవేవో కలవరిస్తున్నాను. మా చిన్నక్క ఆర్ఎంపీ డాక్టర్ ని తీసుకుని వచ్చింది. ఆయన చూసి జ్వరం గోళీలు ఇచ్చిపోయాడు. ఎట్లుంది అని డాక్టర్ను మా అమ్మమ్మ ఆందోళనతో అడిగితే తగ్గిపోతుందమ్మా అని చెప్పి పోయాడు. మూడు రోజులు మూడు పూటలా ఇచ్చిన గోళీలు వేసుకున్నా జరం ఏమాత్రం తగ్గకపోవడం అటుంచి మరింత పెరిగిపోయింది. అన్నం తినడం లేదు, నీళ్లు కూడా సరిగ్గా తాగడం లేదు. మూత్రం బంద్ అయి పోయింది .చుట్టుపక్కల వాళ్ళు వచ్చి ఈ పిల్లగాని వాళ్ళ ఇంటికి తోలెయ్యిండ్రి. అక్కడ సిరిసిల్ల సర్కార్ దవాఖానలో చూయించుకుంటారు పంపించండి పిల్లగాడు ఆగమైపోతడు సలహా ఇచ్చారు. ఇదంతా చూస్తూ మా మామ నిమ్మకు నీరెత్తినట్లు నిశ్శబ్దంగా ఉన్నాడు. నీళ్లు తాగడం కూడా బంద్ అయి పోయింది. మళ్లీ మా మేనత్త అక్క ఆ ఊరి ఆర్ఎంపి డాక్టర్ ని తీసుకు వచ్చింది. ఆయన జ్వరమానితో చూసి 103 ,104 డిగ్రీల జ్వరం ఉంది ఇక ఇక్కడ తగ్గదు. నా తోటి కాదు. కరీంనగర్ కు తీసుకు పొమ్మన్నాడు . మా మామ యధావిధిగా అస్సలు పట్టించుకోవడం లేదు. ఊర్లో అంతా చూసి పిల్లగాడిని ఎందుకు సాదుకోని తీసుకొచ్చుకున్నారు మీకు పిల్లగాని మీద కొంచెమన్నా ప్రేమ లేదు. తెచ్చుకున్న పిల్లగాన్ని తెర్లు చేస్తున్నారు అంటూ లోపల లోపల తిట్టుకుంటూ, తక్కువ కులపోళ్లు పైకే అంటూ పోయేవారు. ఒకరోజు రాత్రి నా చూపూ, లోతుల్లోంచి మెల్లగా మాట్లాడే నోటి మాట బంద్ అయి పోయినయ్ . మా అమ్మమ్మ, అత్త ఏడుస్తుంటే, అయ్యో అంటూ మంచం లోంచి నన్ను తీసి ఎవరో పరచిన ఎండు గడ్డిలో వేశారు. అరే ఏం మనుషులు ఉన్నారు. పిల్లవానికి జర కోరి పానం ఉన్నట్టుంది. వాళ్ళింటికి చెప్పి పంపుండ్రు. ఊరంతా వచ్చి కోప్పడుతున్నారు. కొందరు తిడుతున్నారు. పెద్ద మనుషులు వచ్చి మా మామ మీదికి ఒక్కసారి గయ్యిన లేచారు. ఆయన విధి లేని పక్షంలో జీతగానికి ఐదు రూపాయలు ఇచ్చి మా ఊరికి పంపించాడు.
అతను పోయి మా ఇంట్లో మా అమ్మకు బాపుకు జ్వరం వచ్చి నేను బాగా లేనని చెప్పాడు. వాళ్లు బాధపడితే ఏం కాదని వచ్చినతను చెప్పి మా అమ్మను వెంట తీసుకొని వచ్చాడు. గడ్డిలో వేసివున్న నన్ను చూసి
మా అమ్మ కడుపు అవిసిపోయేలా ఏడ్చింది. కొంచెం పానం ఉందని తెలిసి మా అమ్మ నన్ను మంచం మీదకి చేర్చింది.
మా అమ్మ మనసులో ఏమనుకుందో కానీ సిరిసిల్ల నుండి వెంట తెచ్చిన గ్లూకోజ్ పొడిని గ్లాసులో కలిపి నాలుగు ఐదు చెంచాల నీళ్లు తాగించింది . కొంచెం సేపటికి కళ్ళు తెరిచి అమ్మను చూశాను. నా తల వెంట్రుకలన్నీ మొత్తం రాలిపోయాయి. ఆకారం కట్టెపుల్ల లెక్క అయింది. రాత్రి అంతా మా అమ్మ నా దగ్గర కూర్చొని గ్లూకోజు నీళ్లు అప్పుడప్పుడు పెదవుల తడి ఆరకుండా తాగించింది. తల్లి ప్రేమ ముందు మృత్యువు కూడా తలవొగ్గాల్సిందే అని చెప్పడానికి నేనే ఒక ఉదాహరణ. తెల్లారి నన్ను మెల్లగా గోడకు కూర్చో పెట్టింది. తెల్లారి చుట్టుపక్కల ఉన్న అమ్మలక్కలంతా వచ్చి సుశీలక్కా నీ కొడుకును మీ ఇంటికి తీసుకుపో వీళ్లు చూడరు. అది కాదు ఇది పోదు. పిల్లగానికి ఇంకా ఆవుసు గట్టిగుంది జెర్రల చచ్చి పోతుండేది. మనిషికో మాట మా అమ్మతో అన్నారు. మర్నాడు మా అమ్మ ఉదయం లేచి మా ఇంటికి తీసుకుపోతా నా కొడుకుని ఆని చెప్పింది. మా అమ్మమ్మ మామ అత్త ఉంచమని గానీ తీసుకుపొమ్మని గానీ ఒక్క మాట మాట్లాడలేదు .
ఎడ్ల బండి మీద నన్ను తీసుకొని మా అమ్మ శనిగరం స్టేజి దగ్గర కరీంనగర్కు నన్ను తీసుకొని బస్సు ఎక్కింది . మళ్లీ కరీంనగర్ సిరిసిల్ల బస్సు ఎక్కించింది. ఆ రోజుల్లో రూపాయి ఇరవై అయిదు పైసలు చదివి నుంచి కరీంనగర్ కరీంనగర్ నుండి సిరిసిల్ల కి మరొక రూపాయి ఇరవై ఐదు పైసలు బస్సు ఛార్జీ ఉండేది. చివరికి పగటి పూట వరకు మా అమ్మ సిరిసిల్ల బస్టాండ్లో నన్ను దించుకొని తంగళ్ళపల్లి సంకకు ఎత్తుకొని వాగు దగ్గర దాకా వచ్చింది. తంగళ్ళపల్లి కి చెందిన బాల గౌరమ్మ సుశీలవ్వా ఎటునుంచి వస్తున్నవ్ కొడుక్కు ఏమైంది అని కుశల ప్రశ్నలు అడిగి నేను ఇంటిదాకా నీ కొడుకుని ఎత్తుకొని వస్తానని చంకకు ఎత్తుకుంది. నట్టనడి ఎండల్లో వాగు ఇసుకలో నడిచి ఇంటికి చేరాము. నన్ను చూసి మా బాపు నాయనమ్మా చిన్నబాపులు దుక్కించారు. కొడుకు చచ్చి మల్లా పుట్టిండని బాధపడ్డారు. మా ఊరి వైద్యుడు గాజుల భూపతి ఆర్.ఎం.పి ని మా బాపు తీసుకువచ్చి నన్ను చూపించాడు. ఎల్లిపాయకారం కలిపి ప్రతి దినం అన్నం పెట్టమని, పొద్దు మాపు వచ్చి ఐదు రోజులు ఇంజక్షన్ ఇచ్చాడు. టైఫాయిడ్ (మదన ) జ్వరం వచ్చింది గంతే తగ్గిపోతుంది. నేను మెల్ల మెల్లగా కోలుకుంటున్నాను. మా బాపు ఎక్కడి నుంచో తీసుకువచ్చి పది రూపాయల నోటు భూపతి డాక్టర్ చేతుల్లో పెట్టాడు. మా బాపు సరిపోతాయా భూపతి అని అడిగాడు. చాలు తియ్యే దుర్గన్నా బహారాల్ నీ కొడుకు అయితే బతికిండు పో అన్నాడు.
నెల రోజులు తర్వాత మా చిన్నక్క నన్ను చూడడానికి వచ్చింది. పైగా మా మేనత్త మా ఇంటి ఆడబిడ్డ అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి ఆడబిడ్డ .ఆ రోజుల్లో పరిమిత సంఖ్యలో ఉన్న మా దేవ గాండ్ల కులం లో ఆడపిల్లల కొరత తీవ్రంగా ఉండటం వలన అదలుబదులు పెళ్లిళ్లు జరిగాయి. మా నలుగురు బాపులకు చిన్న చెల్లి మా మేనత్త. అందుకని ఒక పల్లెత్తు మాట కూడా ఆమెను అనలేదు. పైగా చెల్లె వచ్చిందని ఉన్నన్ని రోజులు మంచిగా చూసుకునేవారు. నేను కొంచెం నడుస్తూ మంచిగా అవుతున్నాను. ఏమనుకుందో ఏమో గాని వచ్చిన పది రోజుల తర్వాత మా చిన్నక్క జగన్నాథమును మా ఇంటికి తీసుకుపోత వదినా ఏమంటావ్ అని అడిగింది. ముందు మా అమ్మ మాతో వాడు అందరం చస్తే చస్తాం బతికితే బతుకుతం ఆఖరికి బిచ్చం ఎత్తి అయినా నా పిల్లలను సాదుకుంట తప్ప ఇక తోలియ్యనని కరాకండిగా చెప్పింది. మా చిన్నక్క నాకు పిల్లగాళ్లు లేరనే కదా అంటూ శోకం పెట్టింది. చిన్న చెల్లి ఏడ్చేసరికి మా బాపుల మనసు కరిగి, రెండు రోజులు ఆగు తీసుకపోదువు గానీ అని ఏడుపును తాత్కాలికంగా ఆపించారు.
రాంగా ఎన్ని పైసలు తెచ్చుకుందో కానీ సిరిసిల్లకు పోయి డక్కు పాయింటు తెల్లంగి పాలిస్టర్ బట్ట కొనుకొచ్చి సలాకల భూమయ్య పెద్ద కొడుకు నరసయ్య దగ్గరకు నన్ను తీసుకుపోయి కొలతలు ఇచ్చి కుట్టించింది. ఇంట్లో అందరికీ మా మేనత్త మీద జెర నమ్మకం కుదిరింది.
మా అమ్మ కూడా ఆడబిడ్డ ఏడుపు ఇంటికి మంచిది కాదని అయిష్టంగానే సరే అన్నది. అదిగో అట్లా దాదాపు నాలుగు నెలల తర్వాత మా అమ్మమ్మ ఇంటికి నా
ప్రమేయం లేకుండానే మళ్లీ కొనసాగింది.