శనిగరంలో రేయింబగలు ఆటపాటల సందడే ...
x
శనిగరం చెరువు

శనిగరంలో రేయింబగలు ఆటపాటల సందడే ...

నా నుంచి నా వరకు: 5 (కవి, రచయిత జూకంటి జగన్నాథం 'జ్ఞాపకాలు')


బాల్యంపై వేసిన సాంస్కృతిక, సాహిత్య ముద్రలు


సిరిసిల్ల పట్టణానికి దగ్గరగా ఉన్న మా ఊరు వాతావరణానికి పూర్తి భిన్నంమైనది విలక్షణమైనది మా అమ్మమ్మ ఊరు. సంవత్సరం పొడుగునా ఒక సాంస్కృతిక కేంద్రంగా విలసిల్లుతుండేది. ఆ విధం ఎట్లనగా ! శనిగరం మధ్యతరహా వ్యవసాయ నీటిపారుదల ప్రాజెక్టు కింద తంగళ్ళపల్లి తో పాటు ఆరు గ్రామాల వ్యవసాయ భూములు పారుతుండేది.
ఏడాదికి రైతులు మూడు పంటలు తీసేవారు . ముఖ్యంగా వరి పంట ఎక్కువగా పండేది. రేగడి నేలలలో శనిగ, మిరప మరియు కంది పంటలు వేసేవారు. మా బడి వెనుక అట స్థలం పక్కన దొర గారి చింత తోట ఉండేది. ఆ చింత వృక్షాలు ఊరికి సరి పడే చింతపండును సరఫరా చేసేవి. ఊరు చుట్టూరా శనిగరం ప్రాజెక్టు కాలువలు పారుతుండేవి.కానీ ఎత్తు మీద ఉన్న ఊరులో నీటి కరువు తాండవించేది.
తెల్లారి లేస్తే స్త్రీలు పిల్లలు అందరూ వాడకు ఒకరి ఇద్దరి ఇళ్లలో నీళ్లున్న బాయిల వద్దకు పోయి నీళ్లు బిందెలతో మోసుకొని ఇంటికి తెచ్చుకునేవారు. ఊరు ప్రారంభంలో పారే జాలు కాలువ ఒకటి. ఆ కాలువ నుంచే మిగతా ప్రాంతాలకు చిన్న చిన్న పంట కాలువలు ప్రవహించేవి. కాలువలు ముందుకు సాగే కొద్దీ వాటి పేర్లు రకరకాలుగా పిలువబడుతుండేవి. వెంకయ్య కాలువ, మిర్ర కాలువ, పీతిరి కాలువ, దొర గారి కాలువ, ఊర కాలువ... ఇలా ఎన్నో పేర్లతో పిలవ బడేది. అన్ని కాలువల కింద రైతులు పొలాలు సాగు చేసేవారు. ఊరు చుట్టూ మూడు తాటి, ఈతవనాలు ఉండేవి. వీరందరూ వాడికకు కల్లు తాగినా ఇంకా మిగిలిపోయేది. హైదరాబాద్ నుండి లారీలు వచ్చి పెద్ద రబ్బర్ ట్యూబ్ లో సిలకు ఉన్న కల్లు నింపుకొని పోయేవి. చుక్క తెగి పడ్డట్టు వచ్చే లారీల కల్లు వాసన రాగానే ప్రయాణికులు ఎక్కి దూర చుట్టాలు ఉన్న ప్రాంతాలకు, సిద్దిపేటకు, శనిగరం బస్టాండ్కు పోయేవారు.

ఇది ఇలా ఉంటే సాంస్కృతిక రంగంలో ఆ ఊరు సంవత్సరం పొడుగునా మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతుండేది . ముదిరాజు కులస్తులు పాండవుల కతలను భాగోతాలుగా చుట్టుపక్కల దాదాపు 20 కిలోమీటర్ల పెట్టు ఊరూరు తిరుగుకుంటూ ఆడేవారు. పాండకతోళ్లు అని ఊర్లో అందరూ వాళ్ళని పిలిచేవారు. వాళ్లు పొలాల నాట్లు వేసిన తర్వాత బాగోతం పరదాలు నాటేందుకు పాతేకర్రలు, తబలాలు ,హార్మోనియం, పెట్రోమాక్స్లు ఒక బండిలో వేసుకొని పడమర వైపు ఇల్లందకుంట దాకా తూర్పు వైపు హుస్నాబాద్ వరకు దక్షిణం వైపు బద్దిపడిగె దాకా ఉత్తరం వైపు తోటపల్లి వరకు ఇలా ఊర్లు తిరుగుతూ వరి కోతలు పట్టే సమయానికి ఇంటికి చేరేవారు.
మొదటి బాగోతం ఊర్లో వేసేవారు. మంచి శకునం ఎదురు అయిన పిదప మిగతా ఊర్లకు పయనమైపోయేవారు. ఊర్లలో వేసే బాగోతాలకు ఆయా కులాల పెద్దలు కుల సంఘాలు స్పాన్సర్లుగా అంటే వీరి తిండి తిప్పలు చూసేవారు. ఆయా కుల సంఘాల నుంచి చిన్న మొత్తాలు కానుకలు అందేలా వ్యవహరించేవారు. ఇది ప్రతి సంవత్సరం పాండవ కతోళ్లు జరిపే వ్యవహారం.

అంతేగాక ‘చిరుతల రామాయణం’ 45 రోజులు వేసేవారు. కథను చెప్పే నాయకుడు పాటగా చెప్తుంటే మిగతా వాళ్ళు ఇప్పుడు వాటి చిరుతలు ధరించి లయబద్ధంగా చుట్టూ ఎగురుతూ కోరస్ అందుకునేవారు. చల్తీ పాట సాగుతున్నప్పుడు చిరుతలు వాయించడం కాకుండా చుట్టూ తిరుగుతూ దుమ్ము దుమ్ము ఎగిరేవారు. రాత్రి చిరుతల రామాయణం పల్లెటూర్లోని సబ్బండ కులాలకు ఒక చూడముచ్చటైన ఉత్సవ సంరంభం . ఇవి కాక ఎండాకాలం పార్టీ పూట చెప్పే పటం కథలను ఒకతను మేదరి పుల్లతో అటెంలోని బొమ్మలను చూపిస్తూ కథ చెప్తుంటే వంతలు సామూహిక గానం ప్రజలను ఆకట్టుకునేలా చేసేవారు.

ఇవన్నీ ఒక ఎత్తు అయితే చలికాలం ఊరి చావడిలో సుమారు మూడు నెలల పాటు రాత్రి పూట ఎక్కడి నుంచో సుదూర ప్రాంతాల నుంచి వచ్చి హరిదాసులు హరికథలు చెప్పేవారు. హరికథ చెప్పే అయ్యగారి ప్రత్యేక వేషధారణతో కథ చెప్తుంటే, వాళ్ల గ్రూప్లోని వారే హార్మోనియం తబలా ఆయా సందర్భానికి అనుకూలంగా వాయించేవారు. ఆ రోజటి కథ ముగిసే ముందు ఈ రోజు ఫలానా అతను మాకు వంట చేసుకోవడానికి బియ్యం ఉప్పు పప్పు కూరగాయలు పాలు పెరుగు నెయ్యి సమకూర్చారు. రేపటి కోసం ఎవరు మా ఆహార దాతలు వారి పేరు చెప్పండి అయ్యలారా అనేవాడు. ఊరి మోతే బరి రైతులు మిగతా కులాల వాళ్లు నేనంటే నేను అని పోటీపడేవారు. చివరికి అయ్యగారే ఒక పేరు ఖాయం చేసేవారు.బహిరంగంగా ప్రకటించిన అతను తెల్లవారి హరిదాసు ట్రూపునకు భోజన సదుపాయాలు చేసేవారు. ఇది హరికథ సాగినన్ని రోజులు ప్రతి దినం ఉదారంగా జరిగే కార్యక్రమం.

అయితే నేను, మా అమ్మమ్మ రాత్రి తిని చినిగిన జోరబొంత అంటే జనుపనారతో చేసిన సంచి తీసుకొని బాగోతల దగ్గర, హరికథల వద్ద, చింతల రామాయణం పటంకతల సమీపంలో వేసి ఇద్దరం కూర్చుని వినే వారం. ఆ ఊర్లో సంవత్సర కాలం పొడుగునా వివిధ సాంస్కృతిక ఉత్సవాలు కొనసాగేవి . వీటి ప్రభావం నా పసి హృదయం చెరగని సంతకం చేసిందంటే ఏ మాత్రం అతిశయోక్తి కానేరదు.

ఇవి గాక ఏడాదికి ఏడు రోజులు జరిగే కిష్ట స్వామి జాతర ,ఒకరోజు పొద్దటి నుండి సాయంత్రం వరకు చుట్టు గుట్టల మధ్య తూర్పు నుంచి పడమరకు ప్రవహించే పెద్దవాగు ప్రవాహం గుండాలలో స్నానాలు చేసి వంటలు వండుకొని పెద్ద గుట్ట కింద ఉన్న సొరంగంలోని నరసింహ స్వామిని ప్రజలు దర్శించుకునేవారు.
సమీపంలో ఉన్న బెజ్జంకి జాతరకు బండ్లు కట్టుకొని పోయేవారు. నాలుగుగీరెల బండ్ల మీద పెట్టుకొని రకరకాల మిఠాయిలు తినుబండారాలు అమ్మే దుకాణాలు రాత్రికి రాత్రి ఎక్కడి నుంచి వచ్చే వారో కానీ తెల్లారే వరకు పెట్టుకోమాక్స్ ల వెలుగుల కింద చూడచక్కగా చుట్టుపక్కల ఉన్న ఊర్ల నుంచి వచ్చిన జనంతో కిక్కిరిసి జాతర సాగుతుండేది. ఇలా ప్రశాంతంగా సాగుకుండగానే జాతర బెదిరిందంటూ ఒక ఆకతాయి యువకుల గుంపు దుకాణాలను కూల దోస్తూ పరిగులు పెట్టేవారు. ఇంతలో ఎవరికి అందిన కాడికి వారు దుకాన్లను లూటీ చేసేవారు. ఆవారా యువకులకు అదొక వేడుక. గుట్టల మీద రాత్రిపూట జరిగే జాతర ఉత్సవాలు కాబట్టి ఆడపిల్లలను ఎవరు ఎత్తుకపోకుండా పెద్దలు కర్రలు పట్టుకొని జాగ్రత్త వహించేవారు . ఈ విషయంలో అప్పుడప్పుడు ఇరు వర్గాల మధ్య తన్నులాటలు జరిగేవి.

ఒకవైపు ఊర్లో జరిగే సాంస్కృతిక ఉత్సవాలు అనబడే భాగోతాలు హరికతలు బుర్రకథలు చిరుతల రామాయణాలు మరోవైపు గొప్పసాంస్కృతిక కేంద్రాలైన ప్రత్యేకమైన రోజులలో ఏటేటా జరిగే జాతర పండుగలు. నేను ఎదుగుతున్నా కొద్దీ నా హృదయం మీద మాసిపోని ముద్ర వేసాయి. మిక్కిలి చెరిగిపోని ప్రభావం చూపాయి.

మా అమ్మమ్మ పాలి వారితో కలిపి ఆ ఊరిలో మూడు కుటుంబాలు నివసించేవి . నేను అక్కడికి పోయేసరికే ఆయా కుటుంబాలు పూర్తిగా గానుగ కట్టే కులవృత్తిని మానివేసి కేవలం భూమిని నమ్ముకునే వ్యవసాయ దారులుగా బతుకుతున్నారు. కర్నాల మామిడి తోట దగ్గర ప్రవహించే పిల్లి వాగులో మబ్బుల చలికాలం చన్నీళ్ల కార్తీక స్నానం నేనూ, మా అమ్మమ్మ చేసేవారము. అనంతరం ఆ తోటలో ఉన్న ఉసిరి చెట్టు కింద మా అమ్మమ్మ శివ భక్తితో పూజలు చేసేది. మా అమ్మమ్మ బిడ్డ కొడుకునైన నామీద చూపే నెనరు జ్ఞాపకం వస్తే గుండె గూడు పట్లు కదిలిపోతాయి. బిడ్డ కొడుకు అయిన నన్ను ఒక్కనాడూ అరేయ్ అని అసలు పిలిచేది కాదు . మా అమ్మమ్మ పూజ పునస్కారాలు నిష్ఠ ఉపవాసాలు సాంస్కృతిక శైవ వారసత్వాలు నా బాల్యంలో మరిచిపోలేని ఉగాది యాదులు.

సాంస్కృతిక ధార అనితర సాధ్యంగా కొనసాగితే, సాహిత్య విభాగం మరో చిరు తేట నీటి ఊట పాయగా నా జీవితంలో సమాంతరంగా కొనసాగింది.

ఆ రోజుల్లో శనిగరం ఉన్నత పాఠశాలలో తెలుగు పండితునిగా పనిచేసే జానకి రామయ్య సార్ ఇంటికి సిద్దిపేట నుంచి ఆంధ్రప్రభ వార పత్రిక, మాస, పిల్లల పత్రికలు, చందమామ ,బాలమిత్ర వస్తుండేవి. వాళ్లు చదివిన తర్వాత వాళ్ల చిన్న కూతురు నా క్లాస్మేట్ రాజ్యలక్ష్మి అట్టిపత్రికలు చదువుకొమని ఇచ్చేవారు. అంతేగాక ఆంధ్రప్రభ లో వచ్చే సీరియల్స్ పూర్తి అయిన తర్వాత చింపి నవలగా కుట్టి చదువుకునేవాళ్లం. అలా మా అమ్మమ్మ ఊరిలో బాల్యంలోని నా ఎదల మీద బీజప్రాయంగా సాహిత్య విత్తనాలు నాటపడ్డాయి. (సశేషం)


Read More
Next Story