
చిన్ననాటి చిలిపి చేష్టలు, మార్చివేసిన ఘటనలు
నా నుంచి నా వరకు: 6 (కవి, రచయిత జూకంటి జగన్నాథం 'జ్ఞాపకాలు')
గతంలో కోహెడ మండలం తంగళ్ళపల్లి గ్రామం కరీంనగర్ జిల్లాలో ఉండేది. తెలంగాణ ఏర్పడిన తర్వాత జిల్లాల పునర్విభజనలో ప్రస్తుతం సిద్దిపేట జిల్లా కొహెడ మండలంలో తంగళ్ళపల్లి చిరునామాను మార్చుకొంది. నేను ఆ ఊరిలో ఉన్న అప్పర్ ప్రైమరీ స్కూల్లో ఏడవ తరగతి పూర్తి చేసుకుని శనిగరం హైస్కూల్లో ఎనిమిదో తరగతిలో అడ్మిషన్ తీసుకున్నాను. ఉదయం 9 గంటలకు బయలుదేరి మా సీనియర్లు నడుస్తుంటే మేము పరిగెత్తే వాళ్ళం. అందరమూ ప్రార్థన టైమ్ కు చేరే వాళ్ళం. మేము తొమ్మిదవ తరగతిలో ప్రవేశించి నడుస్తుంటే మా జూనియర్లు అలాగే ఉరికురికి వెంట వచ్చేవారు.
కంకర రోడ్డుకు ఇరువైపులా ఎటు చూస్తే అటు వైపు కనుచూపు మేరా పచ్చని పొలాలు ఉండేవి. వానాకాలం ప్రారంభంలో ప్రాజెక్టు దగ్గర మైసమ్మ పండుగ చేసి పూజలు చేస్తూ డప్పులు కొడుతుంటే భయం లేకుండా నిలిచిన దున్నపోతును మైసమ్మ పోతుగా భావించి ఊరు మీద జన్నకు విడిచి పెట్టేవారు. వాన కాలం ప్రారంభంలో విడిచి పెట్టిన మైసమ్మ పోతు ఎవరి చేనులో పడితే వారి పైరులో కడుపునిండా మేసేది. అలా తిని తినీ ఆ పోతు దిట్టంగా బలిసేది . ఎవరైనా అడ్డు చెప్పినా చెప్పకున్నా కనబడ్డ ప్రతి వారిని పొడవడానికి వచ్చేది. జనం దాన్ని చూసి దూరం నుంచి తప్పించుకు నడిచేవారు. చెరువు నిండి మత్తడి దుంకే సమయానికి ఆ పోతును ఊరి వాళ్లంతా కలిసి చేంతాళ్లు పేలిన దందెడలతో నలు వైపులా బంధించి పెద్ద కట్ట గాడికి తీసుకపోయి కట్ట మైసమ్మకు బలి ఇచ్చేవారు. అదో ఆచారంగా చాలా సంవత్సరాలు కొనసాగింది. విద్యార్థులమైన మేము దాన్ని పర్లాంగు దూరం నుంచి చూసి పొలం ఒడ్ల మీలి నుంచి భయం భయంగా పరిగెత్తే వాళ్ళం.
రోడ్డు మీద అక్కడక్కడ తేలిన కంకర రాళ్లు చెప్పులు లేని నా కాలి వేళ్ళుకు తగిలి రక్తాలు కారి పానం వెళ్ళుక పోయేది. దెబ్బ తగిలిన కాలు వేలికే మళ్లీ మళ్లీ తగిలి కాలి వేలు గోర్లు గిడుస బారి పోయినాయి. దెబ్బలు కాలి వేలుకు పదే పదే తగిలి తడ తడ పెట్టి అప్పుడప్పుడు తీవ్ర జ్వరం వచ్చేది.
మేము ఎండకాలంలో ఒక పూట బడి ఉన్నప్పుడు విడిచి పెట్టిన తర్వాత పగలు నిండిన శనిగరం ప్రాజెక్టులో ఈతలు కొట్టే వాళ్ళం. రోజూ అలా కొడుతూ కొడుతూ నా మిత్రుడు ఒకరు తూములోంచి నీళ్ళ పోయే దగ్గర గుండ్రంగా సుడి తిరుగుతుంటే అక్కడ ఒక్కసారి మాయమైపోయాడు. ఆ ఊరి గజ ఈతగాళ్లు రెండు మూడు రోజులు ఎంత వెతికినా దొరకలేదు. అనంతరం ఒకరోజు తూములోంచి శవం రూపంలో బయటకు వచ్చింది. అప్పటినుంచి ప్రాజెక్టులో ఈత కొట్టడానికి పోవడం పూర్తిగా మానివేశాము.
అప్పుడప్పుడే ఆ ఊరికి కరెంటు వచ్చింది. దొర గారి ఇంటిముందు ఖాళీ స్థలంలో గేటు దగ్గర టికెట్లు 25 పైసలకు ఒకటి ఇచ్చి ఒక్కొక్కరిని నాటకము చూడడానికి లోపలికి తోలుతున్నారు. నా మిత్రుడు రాజమౌళి నేను ఇంకొకరు మాకు ఆ రోజుల్లో 25 పైసలు ఉండడం గగన కుసుమమే. అప్పుడు మానకొండూరుకు చెందిన పోశెట్టి హెల్పర్ గా పనిచేస్తున్నాడు.ఆయన చేసే కరెంటు పనులను ఆశ్చర్యంగా చూస్తూ,వెంట ఉండి స్క్రూ డ్రైవర్ కటింగ్ ప్లేయర్ ట్రాన్స్ఫార్మర్ దగ్గర హ్యాండిల్ కొట్టడం వంటివి నేర్చుకున్నాము . ఎలా అయినా నాటకం చూడాలనే బలమైన నిర్ణయానికి వచ్చాము. మాలో మేము మల్ల గుల్లాలు పడి ఒక ఉపాయానికి వచ్చాము. కరెంటు తీసివేసినప్పుడు చుట్టూ కట్టివున్న చీకట్లో పర్దాల కింది నుంచి లోపలికి పోవాలని మా ప్లాను. దాన్ని ఎలా ఆచరించాలి అనుకొని దొరగారి తోట దగ్గర ఉన్న ట్రాన్స్ఫార్మర్ మెయిన్ స్విచ్ హ్యాండిల్ కొట్టి ఊరికి కరెంట్ బంద్ చేసాము. పరదాల కింద నుంచి లోపలికి ప్రవేశించాము. అయ్యో కరెంటు పోయిందని ఊరి సర్పంచ్ హెల్పర్ కు కబురు చేసి తిరిగి కరెంటు ఇప్పించాడు.
మా పనిని ఎవరు గమనించలేదని అనుకున్నాం కానీ,దొడ్ల దగ్గరికి పోయే పాలేరు ఒకతను చూసి మా పేర్లు సర్పంచ్ కి చెప్పాడు. తెల్లవారి సర్పంచ్ మా ముగ్గురిని పిలిచి బంజరు దొడ్డిలో బంధించాడు. మా మా ఇండ్లకు మామను, రాజమౌళి వాళ్ళ తాత పుప్పాల బలరాం దొరగారి పొలాలను నిగ్రాని చూసే షేర్ దార్ ను సుంకరిని పంపి పిలిపించారు. మా మామ అప్పటికే వార్డ్ మెంబర్ సర్పంచ్ తడిసిన లింగారెడ్డి లోపలికి పిలిచి పెద్ద మనుషుల సమక్షంలో వీళ్ళను ఏం చేద్దామని అడిగాడు. మా మామ అవమానం కలిగించే పని చేసానని అప్పటికే టేబుల్ మీద తెప్పించి ఉంచిన చింత బరిగెలను తీసుకొని తలవంచుకు నిలబడ్డ నన్ను ఇయ్యర మయ్యర కొట్టడంతో చర్మం కమిలి నల్లని వాతలు తేలేటట్టు బాగా కొట్టాడు. నేను ఆ దెబ్బలు తాళలేక ఏడ్చుకుంటూ బయటకురికాను. ఇంకేం చేద్దాం లింగారెడ్డి దీనికి మమ్ములను పిలిచి అడుగుడా పోరగాళ్ళు తప్పే చేసిండ్రు అని చెప్పి ఇంటికి వచ్చాడు చివరికి కరెంటు తీసేసిన చిలిపి చేష్టలపైన పంచాయతీ, చింత బరిగెల దెబ్బలతో అట్లా సమసిపోయింది. అందరూ ఎటోళ్లు అటు లేచిపోయారు . రెండు మూడు రోజుల వరకు బజారులో ముఖాలు కిందికి వేసి మేము తప్పించుకు తిరిగేవారం.
నేను మధ్యలో ప్రస్తావించలేకపోయాను. కానీ ఆ ఊరిలో ఏడవ తరగతి చదువు పూర్తి అయ్యాక మా క్లాస్మేట్లు చాలామంది పై చదువులకు తలో దారిపట్టారు .కొందరు కరీంనగర్ లో చుట్టాల ఇంట్లో ఉండి చదువుకుంటే, మరికొందరు సిద్దిపేటలో రూమ్ కిరాయి తీసుకొని వండుకొని తింటూ చదువుకునేవారు. నన్ను మా మామ శనిగరం రోజూ నడిచిపోయి చదువుకోమన్నాడు. కాదు కూడదు అంటే చదువు బంద్ చేయమన్నాడు. గత్యంతరం లేక నేను పై చదువులు చదువుకోవడానికి శనిగరం నడచి పోవడానికి నిశ్చయించుకున్నాను . అలా మూడేళ్లు అంటే టెన్త్ ఎస్ .ఎస్ .సి .అయిపోయే వరకు, ప్రతి దినం రానుపోను సుమారు పది కిలోమీటర్లు నడిచి పోయి రావడానికే నిర్ణయించుకున్నాను . లేకుంటే చదువు పూర్తిగా ఆగిపోయేది.
ఆ రోజుల్లో ఎగ్జామినేషన్ సెంటర్ కరీంనగర్ పట్టణంలో ఉండేది. మేము కొందరం విద్యార్థులం ఆ ఊరి దొర రాంభూపాల్ రెడ్డి ఇంట్లో ఒక రూమ్ లో వండుకొని తింటూ పరీక్షలకు తయారు అయ్యేవాళ్ళం. ఆ సంవత్సరం వార్షిక బోర్డు పరీక్షలు అందాజ నాలుగు నెలలు వాయిదా పడుతూ వచ్చాయి. పరీక్షలకు పుస్తకాలు చదువుకోవడం రెండు మూడు సార్లు అప్పటికే పూర్తి అయిపోయాయి. ఆ రోజుల్లో రాంభూపాల్ రెడ్డి గారికి కరీంనగర్లో భారత్ సినిమా టాకీస్ ఉండేది. అందులో దసరా బుల్లోడు సినిమా 100 రోజులు ఆడింది. మాది తంగళ్ళపల్లి కాబట్టి మేనేజర్ ఒకసారి విశ్రాంతి తర్వాత చూడమని తోలేవాడు. అయ్యో మొదటినుంచీ సినిమా చూడలేదు అని అడిగితే మళ్లీ రెండు మూడు రోజులకు రాండ్రి ప్రారంభం మంచి సినిమాకు తోలిస్తాననేవారు.. అట్లా మేము దసరా బుల్లోడు సినిమాను 8 సార్లు చూసాము. ఆ సినిమా చూసి చూసి ఆఖరికి ఎంత వరకు వచ్చిందంటే ఎప్పుడు ఏ సీన్ వస్తుందో, ఏ సందర్భంలో ఏ పాట వస్తుందో హీరో హీరోయిన్లు స్టెప్పులు ఎలా వేస్తారో అనే విషయాన్ని పొందిన అనుభవంతో చాలా ముందుస్తుగా చెప్పేవాళ్లం అక్కడికి కొంచెం దూరంలో ఉన్న తిరందాజ్ టాకీస్ లో ఇద్దరు అక్కచెల్లెళ్లు సినిమా నడిచేది. ఇటు భారత్ టాకీస్ లో దసరా బుల్లోడు అటు తిరందాజ్ థియేటర్లో ఇద్దరు అక్క చెల్లెలు సినిమాలు మా పరీక్షలు అయిపోయే వరకు నడిచాయి. చూసిన సినిమాలనే మళ్లీ మళ్లీ చూసేవాళ్లం.
హుస్నాబాద్ దగ్గర పోతారం గ్రామంలో గానుగులు సరిగ్గా నడవక దివాళా తీసి దూరం వరుస చుట్టం అయ్యే మా వీరయ్య తాత తన ఇద్దరు కుమారులను వెంటపెట్టుకొని ఆ ఊరికి వచ్చి ఒక రూమ్ లో చాయ్ హోటల్ నడిపాడు . ఆయన మహా గడుసరి సాయంత్రం అయితే ఇద్దరు ముగ్గురు కూర్చుని అర చేతుల్లో బంతి ఆకుల్లా కనిపించే గంజాయి ఆకును మెత్తగా నలిచి ఆ పొడిని మట్టి చిలుం లో దట్టించేవారు. అనంతరం దాని చివర పైపుకు ఒక బట్ట ను చుట్టి దానిలో నుంచి గంజాయి పొగని పంతులవారీగా పిల్చేవారు. అలా తాగడం రెండు రౌండ్లు పూర్తికాగానే గుండారెడ్డిపల్లె కు చెందిన కుమ్మరి సిద్ధప్ప తత్వాలు, కవి చౌడప్ప బూతు పద్యాలు గొంతెత్తి పాడేవారు. నీళ్లు అడిగితే ఇచ్చి, నేను వాళ్ల దగ్గర కూర్చొని ఆ పద్యాలని శ్రద్ధగా వినేవాడిని.
అప్పట్లో ఎందుకో ఏమో కానీ నా పసి హృదయంలో ఒక ప్రశ్న తరుచుగా తలెత్తేది . దానికి కారణం బహుశా ఆ ఊరి సాంస్కృతిక వారసత్వం కావచ్చు లేక మా అమ్మమ్మ విపరీతమైన భక్తి ప్రభావం కావచ్చు కానీ, నాలో ఇది అని ఖచ్చితంగా చెప్పలేని దేవుడు ఉన్నాడా లేడా అనే ప్రశ్న నన్ను అటకాయించేది. ఆరోజుల్లో దీపావళి పండుగకు కెదారేశ్వరి మరియు సత్యానారాయణ స్వామి నోములు జరుగుతుండేవి . ఈ నోములకు మా అమ్మ వరంగల్ నుంచి చిన్నమ్మ అమృతమ్మ ,ఇద్దరు పెద్దమ్మలు హుస్నాబాద్ నుంచి లక్ష్మి తరిగొప్పుల నుంచి....... తప్పకుండా ప్రతీ సంవత్సరం వచ్చేవారు.
దీపావళి నోములు వచ్చినవంటే వారం రోజుల పాటు ఇంట్లో పండుగ వాతావరణం ఉండేది.నేను పొద్దంతా ఇంటి దర్వాజలకు మామిడి తోరణాలు కట్టేవాడిని .మిగతా పనులు చేసి నోములకు అన్నీ సర్దిపెట్టిన తరువాత నోములు చెప్పే అయ్యగారిని పిలుచుకురావడం నా వంతే అయ్యేది. సత్యనారాయణ స్వామి నోము పూర్తి కాగానే ఆడబిడ్డలు మంగళ హారతి పట్టేవారు. మా మామ తోచిన కట్నకానుకలు వారికి పెట్టేవాడు. సత్యనారాయణ స్వామి వ్రతంలో ఐదు కథలు అయ్యగారు చెప్పేవారు. అది వింటుంటే అవి వింటుంటే ఆ కథల నిర్మాణం విషయం భక్తులను నోము దగ్గర నుండి కదలకుండా ఆ కథల నిర్మాణం విషయం పకడ్బందీగా ఉండేవి. తీర్థ ప్రసాదాలు అందరికీ పెట్టేవాడు. అంతవరకు ఉన్న నాకు వాటి పట్ల పెద్దగా పట్టించుకుండేది కాదు. దగ్గరలో ఉన్న గాంధీ విగ్రహం పెద్దగా ఆసక్తి ఉండేది కాదు . మా మామ జీతగానితో నన్ను పిలిపించి ఒక పైస ఇచ్చి అయ్యగారి కాళ్లు మొక్కుమనేవాడు. ఎందుకో ఏమో కానీ నేను ఆయన మాటలను అసలే పట్టించుకునే వాడిని కాదు. ఆయన కోపంగా లొల్లి పెట్టుకునే వాడు. ఈ గొడవను చూసి మా వీరయ్య తాతా మధ్యే మార్గంగా ఒక సలహా ఇచ్చాడు. అరేయ్ దేవున్ని మొక్క రాదు రా ఏముందిరా అండ్ల నేను ఎన్నోసార్లు మొక్కి ఎగ్గొట్టిన. పాత బాకీలోని లెక్క దేవుడు ఏమైనా అడుగుతాడారా ఏ మొక్కనైతే మొక్కు ఏం గొడవ తర్వాత ఎగ కొట్టు అనేవాడు. బహుశా మా వీరయ్య తాత దేవుని గురించి చెప్పిన ఆ భావజాలమే నా వయస్సు పెరిగుతున్న కొద్దీ, ఆధ్యాత్మిక చింతనకన్నా ఎక్కువ శ్రమ సౌందర్యాన్ని ప్రేమించడం గౌరవించడం నేర్పాయేమో నని విశ్వాసం నాలో కలుగుచున్నది .
అదో వింతైన అనుభవం మా వీరయ్య తాత మబ్బుల లేసి కవి చౌడప్ప పద్యాలు గొంతెత్తి నిర్మొహమాటంగా పాడేవాడు. అనంతరం హోటల్ రూము ఊడ్చి, కట్టెల పొయ్యి అంటించి పాలు కాగ పెట్టేవాడు . ఆయనకు ఇద్దరు కొడుకులు పెద్ద కొడుకు యాదగిరి అయితే రెండో అతను చంద్రమౌళి వాళ్ళిద్దరినీ నేను మామ అని పిలిచేవాడిని. ఎప్పుడైనా ఇంట్లో తినక శనిగరం చదువుకోను పోతుంటే. మా యాదగిరి మామ చిన్న కాగితంలో
లో అటుకుల చుడువా వాళ్ల నా బాపు చాటుకు నాకు కట్టిచ్చేవాడు. మా యాదగిరి మామకు అక్కాచెల్లెండ్రు లేరు కాబట్టి మా అమ్మని ఆత్మీయంగా నోరారా అక్కా అని పిలిచేవాడు. నన్ను చాలా ప్రేమగా చూసేవాడు. ఆయన చనిపోయే వరకూ హైదరాబాదు నుండి రెండు మూడు రోజులకు ఒకసారి పోన్ చేసి మాట్లాడేవాడు. అనంతరం కొన్నాళ్లకు మా వీరయ్య తాత కుటుంబం వాళ్ళు ముగ్గురు మనిషికో దిక్కు చెల్లాచెదురై పోయారు. వీరయ్య తాత అవసాన దశలో సికింద్రాబాద్ లోని మహంకాళి అమ్మవారి గుడిలో ఉంటూ దుర్భర పరిస్థితులలో మరణించాడు. ఆ మతలబు మా యాదగిరి మామ చెప్పగా విన్నాను . ఏడ పుట్టి ఎక్కడికి వచ్చి ఎక్కడ చనిపోయాడు మా తాత నా చిన్నతనంలో నేర్పిన జీవిత సత్యాలు జ్ఞాపకం వస్తే బాధ అనిపిస్తుంది.
మా వీరయ్య తాత ఆ రోజుల్లో తనకు వరుసైన స్త్రీలతో చిలిపి కృష్ణుడులా ప్రవర్తించేవాడు. భార్య ఎప్పుడో చనిపోయిన తరువాత మా అమ్మమ్మ ఊర్లోకి వచ్చిన ఆయన ఆ రోజుల్లో పెద్ద గ్రంధసాంగుడనే అని చెప్పాలి. అంతేగాక ఆయన నుంచే జీవిత సత్యాన్వేషణకు సరిపడా దినుసు నాకు లభించిందని ,ఇప్పుడు స్పష్టంగా దృగ్గోచరమవుతున్నది .